శరీరం ఇంకా మనసు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడం
సద్గురు మనసుపై నియంత్రణ ఎలా సాధించాలి అనే ప్రశ్నకు సమాధానం ఇస్తున్నారు, అలాగే శరీరం ఇంకా మనసు పనితీరును తెలుసుకోవడంలో ఆసనాలు ఎలా సహాయపడతాయో వివరిస్తున్నారు.
ప్రశ్న: నమస్కారం సద్గురు. నేను కోపం వంటి ప్రతికూల భావోద్వేగాలను ఆపడానికి ప్రయత్నించినప్పుడల్లా, అది మరింత బలంగా మారుతుంది. నా మనస్సు పని చేసే తీరుపై నేను ఎలా పట్టు సాధించగలను?
సద్గురు: మీరు వద్దనుకున్న దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తే, అది మాత్రమే జరుగుతుంది. మానవ మనస్సు స్వభావం ఎల్లప్పుడూ అలానే ఉంటుంది. యోగ వ్యవస్థ మొత్తం మీ శరీరం ఇంకా మీ మనస్సు స్వభావాన్ని అనుభవపూర్వకంగా అన్వేషించడం గురించే. మీరు ఉదయాన్నే లేచి ఆసనాలను చేసినప్పుడు - భూమి మీద ఉన్న చాలా మంది బుద్ధి తక్కువ వాళ్ళు దీనిని వివరించినట్టు, అది శరీరాన్ని సాగదీయడం కాదు - అవును, అది చేయడానికి మీరు సాగదీయాలి, కానీ ప్రాథమికంగా, ఇది మీ శరీరం ఇంకా మీ మనస్సులను అన్వేషించడం. ఎందుకంటే మీ జీవితంలో అతిపెద్ద సమస్య ఏమిటంటే, మీరు జీవించడానికి ఆవశ్యకమైన - శరీరం ఇంకా మనస్సు అనే రెండు ప్రాథమిక అంశాలపై అవగాహన లేకుండానే జీవించే ప్రయత్నం చేస్తున్నారు.మీరు జీవితంలో ఎంత హాయిగా ప్రయాణిస్తారు అనేది మీరు మీ శరీరం ఇంకా మీ మనస్సుల పనితీరును ఎంత లోతుగా గ్రహించారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రయాణం సుఖంగా ఉండాలంటే వాహనం బాగుండాలి; అలాగే ఆ వాహనం ఎలా ప్రవర్తిస్తుంది, ఏమి చేస్తుంది, అలా ఎందుకు చేస్తుంది అన్నది మీరు అర్థం చేసుకోవాలి. ఇది జ్ఞానోదయం కాదు - మీరు అజ్ఞానంతో జీవించాలనుకున్నప్పటికీ ఇది అవసరం. "అజ్ఞానమే పరమానందం" అని చెప్పేవారు. ఒకవేళ అది నిజమైతే, ఇప్పటికే ప్రపంచం ఆనందంగా ఉండి ఉండాలి.
అజ్ఞానమే ఆనందంమని అనుకుని, మీరు ఆ విధంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ, ఈ ప్రపంచంలో బ్రతకడానికి, మీకు ఈ శరీరం ఇంకా మనస్సుపై పట్టు ఉండాలి. లేకపోతే, ఏది చెయ్యాలన్నా సమస్యే అవుతుంది. నేను దీనిని లోతుగా వివరించే ప్రయత్నం చెయ్యను, ఎందుకంటే అలా చేస్తే అది మీకు మరీ క్లిష్టంగా అవుతుంది. అందుకే యోగ వ్యవస్థ అనేది అనుభవపూర్వకమైన అన్వేషణే తప్ప మేధోపరంగా వెళ్ళడానికి ప్రయత్నించదు.
ఆసనాలు - శరీరం ఇంకా మనస్సు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడం
మీరు ఆసనాలు చేసినప్పుడు, మీ శరీరం ఇంకా మనసు స్వభావాన్ని గ్రహిస్తారు. మీ వేళ్ళను ఒక విధంగా కదిల్చినప్పుడు, మీ మనసు కూడా దానికి అనుగుణంగా పనిచేస్తుంది. మీ శరీరంతో చేసే ఏ పనైనా మీ మనసుపై ప్రభావం చూపుతుంది. పుస్తకాల ద్వారా మీకు ఇది అర్ధం కాదు. ఇది మీరు అనుభువపూర్వకంగా గ్రహించినప్పుడే తెలుస్తుంది. మీరు కళ్ళు మూసుకుని బలవంతంగా దేన్నైనా తీసేయ్యాలి అనుకుంటే, అందులో మీరు ఎప్పటికీ సఫలం కాలేరు.
ఇది ప్రతి ఒక్కరూ అవగాహనలోకి తెచ్చుకోవాల్సిన ఎంతో ప్రాధమికమైన అలాగే ఎంతో ముఖ్యమైన విషయం. ఈ అవగాహన లేకపోతే, మీరు పూర్తిగా గందరగోళంలో పడిపోతారు. మీ మెదడుకు అంత పదును లేకున్నట్లైతే, అప్పుడు పరవాలేదు. కానీ మీ మెదడు పదునుగా ఉంటేనే ప్రమాదం. మిమల్ని ఎవరైనా కాపడేలోపు గాయాలు చేసుకుంటారు. ప్రతి రోజు, నా దగ్గరకి అలాంటి గాయపడిన వ్యక్తులు వచ్చి, “సద్గురు, నాకు జ్ఞానోదయం పట్ల ఆశక్తి ఉంది” అంటారు. ముందు అయ్యిన గాయాలను మాననివ్వండి, లేదా కనీసం కొత్త గాయాలు చేసుకోవడం ఆపండి, ఎందుకంటే, మీ దగ్గర చాలా పదునైన కత్తి ఉంది.
ఆఖరికి గడ్డం చేసుకుంటూ కూడా చాలా మంది మొహానికి గాట్లు పెట్టుకుంటారు. నేను అలా రక్తంతో చాలా మందిని చూసాను, ఎందుకంటే వాళ్ళు దగ్గరగా కట్ చేయ్యలనుకుంటారు; అది అనుకున్న దానికంటే ఇంకా దగ్గరగా కట్ అవుతుంది. ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవడం, మీ మనస్సు ఎలా పనిచేస్తుందో గ్రహించడం అనేది మేధో విశ్లేషణ నుండి రాదు - అది ఒక పరిశీలన. మీరు చెయ్యాల్సింది ఏంటంటే, మీ శరీరాన్ని ఒక భంగిమలో ఉంచి, మీ మనసు ఏ విధంగా పనిచేస్తుందో గమనించండి. మరో భంగిమలో ఉంచి, మీ మనసు వేరే విధంగా పని చేయడం గమనించండి.
ఆసనంలో ఉండి సరిగ్గా శ్వాస తీసుకుంటే, మీరు ఈ ప్రక్రియ చేస్తున్నప్పుడు, మనస్సు వివిధ స్థితుల్లోకి వెళుతుంది. ఈ పరిశీలన యోగాలోని అత్యంత ప్రాథమిక అంశం. హఠ యోగా శిఖరం కాదు - ఇదొక సన్నాహక ప్రక్రియ. ఆ సన్నాహక దశ లేకుండా శిఖరానికి వెళ్లడానికి ప్రయత్నిస్తే, మీరు కూలిపోయే అవకాశం ఉంది. మానవాళిలో కనీసం 80% మంది తమ జీవితంలో శరీరాన్ని సిద్ధపరచకుండా ఎలాంటి ధ్యానం చేయలేరు. వారు కూర్చునే తీరు, శరీరాన్ని కదిలించే విధానం చూస్తే, ఎంత ప్రయత్నించినా ధ్యానం చేయలేరని స్పష్టంగా తెలుసిపోతుంది. శరీరాన్ని కొంత సిద్ధపరచడం అవసరం, ఎందుకంటే శరీరం ఇంకా మనస్సు రెండు వేర్వేరు విషయాలు కావు - మరోలా చెప్పాలంటే, మీ మెదడు మీ శరీరం బైట ఉందా?
మీ చిటికెన వేలికి ఏమి జరుగుతుందో, అది మెదడుకూ జరుగుతుంది. మెదడుకు ఏమి జరుగుతుందో, అది చిటికెన వేలుకూ జరుగుతుంది. ఇది రెండు విధాలుగానూ పనిచేస్తుంది. మెదడు దానికదే ఒక ప్రత్యేక వ్యవస్థ కాదు. మృతదేహాలను కట్ చేయడం ద్వారా వైద్యులు శరీరం గురించి తెలుసుకున్నారు - మీరు మృతదేహాన్ని తెరిచి, వేర్వేరు అవయవాలను కత్తిరించి వేర్వేరు ప్రదేశాల్లో ఉంచినట్లయితే, అదంతా విడిగా ఉంటుంది. కానీ మీ శరీరం అలా కాదు - అంతా ఒక్కటే. వేరు చేసే కత్తికి మాత్రమే అవన్నీ వేరు వేరు విషయాలు, కానీ బ్రతికున్న మనిషికి అదంతా ఒకటే. అందుకే యోగ పధ్ధతి ఆ విధంగా రూపొందించబడింది.
ఒక ప్రయోగంగా, దేన్నైనా నిరోధించడానికి ప్రయత్నించి చూడండి. మీలో అదే బలంగా వ్యక్తమవ్వడాన్ని మీరే చూస్తారు. మీరు ఏదైనా జరగాలని కోరుకుంటే, అది జరగకుండా ఉండేలా బలవంతం చేయడానికి ప్రయత్నించి చూడండి. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మీరు - మీ మనస్సును మొదటి గేర్‌లో ఉంచాలనుకున్నప్పుడు, అది రివర్స్ గేర్‌లోకి వెళ్లే స్థితిలో మీరు ఉన్నారు. ఇది ఉత్తమమైన మార్గం కాదు, కానీ ప్రస్తుతం అది ఈ విధంగానే ఉందని అర్థం చేసుకోవడానికి మీరు దీన్ని ప్రయత్నించవచ్చు - మీరు దేనినైనా ప్రతిఘటిస్తే, అది మాత్రమే జరుగుతుంది.
మీ సాధన చేయండి- అది పనిచేస్తుంది
రేపటి నుండి, ఉదయం ఐదు గంటలకు లేచి, చన్నీటి స్నానం చేసి, ప్రతిరోజూ 5:30కి మీ సాధన ప్రారంభించండి. కొంత సమయం తరువాత, మీ మనస్సులో సమస్యగా ఉన్న చాలా విషయాలు తొలగిపోతాయి. రోజుకు ఒక గంట పాటు మీ హఠా యోగా చేయండి - ఇది పని చేస్తుంది. కానీ అది ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోవాలంటే, ఆ ప్రక్రియ ఏమిటో తెలుసుకోవడానికి చాలా కృషి ఇంకా సమయం పడుతుంది. కాని దాన్ని మీరు వినియోగించుకోడానికి ఎంతో సమయం పట్టదు. కానీ ఏమి జరుగుతుంది, అలా ఎందుకు జరుగుతుంది, నిర్దిష్ట ఆసనం ఎందుకు నిర్దిష్ట ప్రభావాన్ని చూపుతుంది అనే మొత్తం సంక్లిష్టతను తెలుసుకోవాలంటే, అందుకు కొన్ని జన్మల అధ్యయనం అవసరం.
సాంకేతికత నుండి ప్రయోజనం పొందాలనుకునే వారు దానిని ఉపయోగించుకోవడం నేర్చుకుంటే సరిపోతుంది. సాంకేతికత వెనుక ఉన్న ఆధారం ఇంకా సైన్స్ తెలుసుకోవాలంటే, ఇది కొన్ని జన్మల పాటు సాగే పని. అది ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోవడానికి నాకు మూడు జన్మలు పట్టింది. మీరు నా దగ్గరకు వచ్చారు కాబట్టి మీరు నా కంటే తెలివైనవారని నేను అనుకుంటున్నాను - మాధుర్యం లేదు, స్వర్గం గురించి వాగ్దానం లేదు, అద్భుతాలు లేవు, తియ్యని మాటలు కూడా లేవు, కౌగిలింత లేదు – అయినా సరే మీరు ఇప్పటికీ ఇక్కడ ఉన్నారు. కాబట్టి, మీరు నేర్పరులు అని లెక్కించుకున్నా, అందుకు కొన్ని జన్మలు పడుతుంది.
Isha Hatha Yoga programs are an extensive exploration of classical hatha yoga, which revive various dimensions of this ancient science that are largely absent in the world today. These programs offer an unparalleled opportunity to explore Upa-yoga, Angamardana, Surya Kriya, Surya Shakti, Yogasanas and Bhuta Shuddhi, among other potent yogic practices.
Find Hatha Yoga Program Near You
Explore the most sophisticated machine on the planet - the human body - and discover ways to enhance it to greater levels of perception and capability. Watch 'Body: The Greatest Gadget' only on Sadhguru Exclusive.