సంబంధ బాంధవ్యాలను సరిచేసుకునే పద్దతి ఇదే..!!
ఇంట్లోకాని, ఆఫీసులో కాని లేక మరెక్కడైనా మన వ్యవహారం మరొక మనిషితో ఉన్నప్పుడు, వారిని మనం అవగాహన చేసుకోవడం ఎంతో ముఖ్యమని సద్గురు చెబుతున్నారు.
ప్రశ్న: నేను అనుభవించే ఆందోళనలో అధిక శాతం నా సంబంధ బాంధవ్యాల వల్లే వస్తోంది. ఇతరులు మనల్ని అర్ధం చేసుకోవాలని ఆశించడం తప్పంటారా?
సద్గురు: మీరు ఈ ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు అనేక రకాల సంక్లిష్ట సంబంధాలుంటాయి. మీ వ్యవహార రంగం విస్తరించేకొద్దీ వ్యక్తుల మధ్య వ్యవహారంలో కూడా సంక్లిష్టత పెరుగుతుంది. మీరు మీ చిన్నగదిలో మీ కంప్యూటరులో పనిచేసుకుంటూ మీతో మరో మనిషి ఒక్కడే కనుక ఉంటే మీకు కాస్త అవగాహన ఉంటే చాలు. కాని మీరు ఒక వెయ్యి మందితో పనిచేయిస్తూ ఉంటే మీకు ప్రతి ఒక్కరి గురించీ విస్తృతమైన అవగాహన ఉండాలి. మీరు ఒక వెయ్యి మందితో పనిచేయించవలసి వస్తుందనుకోండి, వాళ్ళందరూ మిమ్మల్ని అర్థం చేసుకోవాలని ఆశిస్తే మీరు ఏమీ చేయలేరు. అదే మీరు ఆ వెయ్యిమంది వ్యక్తుల పరిమితులనూ, సామర్థ్యాలనూ అర్థం చేసుకొని తగిన విధంగా వ్యవహరించడం అవసరం. అప్పుడు మాత్రమే మీరు పరిస్థితిని మీరు కోరిన రీతిలో నడిపించగలుగుతారు. ఈ వెయ్యిమంది మిమ్మల్ని అర్థం చేసుకొనేవరకు ఎదురుచూసి పనిచేయాలనుకుంటే అదొక స్వప్నమే. అదెప్పటికీ జరిగే పని కాదు.
ప్రశ్న: నాతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నవారు, నాకు చాలా ముఖ్యమైన వారు - వాళ్ళు నన్ను మెరుగ్గా అర్ధం చేసుకోవాలని నేను కోరుకోకూడదా?
సద్గురు: మీకు వారితో ఎంత సన్నిహితమైన సంబంధం ఉంటే, వాళ్లను అర్థం చేసుకోవడానికి మీరు అంత ఎక్కువగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇలా జరిగింది, ఒక వ్యక్తి కొన్ని నెలల పాటు కోమాలో ఉన్నాడు. అప్పుడప్పుడు కోమాలో నుంచి బయటికి వస్తున్నాడు, మళ్లీ కోమాలోకి వెళుతున్నాడు. ఆయన భార్య రాత్రింబవళ్లు ఆయన పక్కనే కనిపెట్టుకొని ఉంటోంది. ఆయనకు కొన్ని క్షణాలు తెలివి వచ్చినప్పుడు భార్యను దగ్గరకు రమ్మని సైగ చేశాడు. ఆమె వచ్చి పక్కన కూర్చుంది, ఆయన ‘‘నేను ఆలోచిస్తూ ఉన్నాను... నాజీవితంలో అన్ని చెడ్డ సమయాల్లోనూ నువ్వు నా పక్కనే ఉన్నావు. నా ఉద్యోగం పోయినప్పుడు నాకు తోడుగా నీవు నిలబడ్డావు. వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు నీవే ఎక్కువ పని చేశావు. రాత్రింబవళ్లు పనిచేశావు. నామీద కాల్పులు జరిగినప్పుడు నా పక్కనే ఉన్నావు. కోర్టు కేసులో మనం మన ఇల్లు పోగొట్టుకున్నప్పుడు నీవు నాపక్కనే ఉన్నావు. ఇప్పుడు నా ఆరోగ్యం పాడైపోయింది, నీవు నా పక్కనే ఉన్నావు. ఇదంతా చూసినప్పుడు ఏమనిపిస్తున్నదంటే "నువ్వు ఎప్పుడూ నా పక్కనే ఉండడం దురదృష్టం అనుకుంటా ’’ అన్నాడు.
మీరు మీ విషయంలోనూ, మీ సంబంధాల విషయంలోనూ చేస్తున్నది ఖచ్చితంగా ఇదే. ఒకరు మీకు దగ్గరగా ఎప్పుడు వస్తారు..? మీ ప్రేమకు పాత్రులెప్పుడు అవుతారు? మీరు వాళ్లను చక్కగా అర్థం చేసుకున్నప్పుడు. వాళ్లు మిమ్మల్ని అర్థం చేసుకున్నప్పుడు మీతో అనుబంధంలోని సాన్నిహిత్యాన్ని వారు అనుభవిస్తారు. మీరు వాళ్లను బాగా అర్థం చేసుకుంటే వాళ్లతో సాన్నిహిత్యాన్ని మీరు ఆనందిస్తారు.
ప్రశ్న: చెప్పడం తేలికే. ఆచరణలో ఇదెప్పుడూ కష్టమే...
సద్గురు: ఎదుటి మనిషికి ఏమాత్రం అవగాహన లేదని మీరనుకోకండి. వారి పట్ల మీకున్న అవగాహన ద్వారా వారు మిమ్మల్ని మరింత మెరుగ్గా అర్థం చేసుకొనేటట్లు మీరు చేయగలరు. మీరు వాళ్ల పరిమితులూ, అవసరాలు, సామర్థ్యాలూ, సంభావ్యతలూ అర్థం చేసుకోకుండా, వాళ్లు మిమ్మల్ని అర్థం చేసుకొని మీ మాటలు వినాలని మీరు ఆశిస్తుంటే, అప్పుడు ఇరువురి మధ్య ఏర్పడేది ఘర్షణే. ఘర్షణ తప్పదు.
దురదృష్టవశాత్తు ప్రపంచంలో అతి సన్నిహితమైన అనుబంధాలలోనే భారత్-పాకిస్తాన్ సంబంధాలలో కంటే ఎక్కువ ఘర్షణ కనిపిస్తూ ఉంది. మీ అనుబంధాలలో ఆ రెండు దేశాల మధ్య యుద్ధాలకంటే ఎక్కువ యుద్ధాలు జరిగి ఉంటాయి. అందుకు కారణం మీ అవగాహన పద్ధతీ, వారి అవగాహనా వేరు కావడమే. మీరు నియంత్రణ రేఖను అతిక్రమిస్తే వాళ్లకు కోపం వస్తుంది. వాళ్లు అధిగమిస్తే మీకు కోపం వస్తుంది.
వాళ్ళ అవగాహనను దాటి మీ అవగాహనను తీసికొని వెళ్లగలిగితే, వాళ్ల అవగాహన కూడా మీ అవగాహనలో భాగమవుతుంది. మీరు వారి పరిమితుల్నీ, సామర్థ్యాలనూ అర్ధం చేసుకోగలుగుతారు. ప్రతి ఒక్కరిలోనూ కొన్ని అనుకూలాంశాలు, కొన్ని ప్రతికూలాంశాలు ఉంటాయి. మీ అవగాహనలో మీరు వీటన్నిటినీ అంగీకరించగలిగితే మీరు మీ బాంధవ్యాలను మీరు కోరిన విధంగా చేసుకోగలరు. మీరు దీన్ని వాళ్ల అవగాహనకు వదిలేస్తే, అది యాదృచ్ఛికమవుతుంది. వాళ్లు చాలా ఉదారులైనట్లయితే మీకు అంతా బాగానే జరగవచ్చు. లేకపోయినట్లయితే మీ సంబంధం తెగిపోతుంది.
నేను కోరేదేమిటంటే: మీ జీవితంలో మీకు ఏం జరుగుతుందన్నది అనేది మీరే నిర్ణయించుకోవాలని మీరనుకుంటున్నారా? అవి సన్నిహిత బాంధవ్యాలు కావచ్చు, వృత్తిపరమైన, రాజకీయమైన, లౌకిక సంబంధాలు కావచ్చు, మరో సంబంధాలు కావచ్చు, మీ జీవితంలో జరిగే వాటిని మీరు నిర్ణయించుకోవాలనుకుంటున్నారా, లేదా? మీరలా కోరుకున్నట్లయితే మీరు ప్రతివారినీ, ప్రతిదాన్నీ మీ అవగాహనలో చేర్చుకోవాలి. మీ అవగాహనను మీరెంతగా పెంచుకోవాలంటే దాంట్లో ఎదుటివారి కోపాన్ని కూడా దాటిపోవాలి. మీ చుట్టూ అద్భుతమైన మనుషులున్నారు. కాని వాళ్లకు కొన్నిసార్లు కొద్ది నిమిషాలపాటు తిక్కరేగవచ్చు. మీరు దాన్ని అర్థం చేసుకోకపోతే మీకు వారితో సంబంధం చెడుతుంది. మీరు అర్థం చేసుకుంటే వాళ్లతో ఎట్లా వ్యవహరించాలో మీకు తెలుస్తుంది.
జీవితం ఎప్పుడూ ఒక సరళరేఖ కాదు. దానిపై నడవడానికి మీరెన్నో పనులు చేయాలి. మీరు మీ అవగాహనను వదిలిపెడితే మీ సామర్థ్యాన్ని కూడా కోల్పోతారు. అది వ్యక్తిగత సంబంధమైనా, వృత్తిపరమైన కార్యనిర్వహణ అయినా మీకు అవగాహన అవసరం. లేనట్లయితే మీకు ఫలవంతమైన సంబంధాలుండవు.