ఆత్మలూ, దయ్యాలూ మిమ్మల్ని భయపెడుతున్నాయా?
ఆత్మలూ, దయ్యాల బారినుండి తప్పించుకోవడం ఎలా అని సద్గురుని ఒక యువ విద్యార్ధి ప్రశ్నించాడు. సద్గురు అందించిన సమాధానాన్ని చదివి తెలుసుకోండి.
ప్రశ్న: సద్గురూ !..మనకి దేని గురించైనా భయం కలిగితే, దానిని ఎలా అధిగమించాలి? నాకు వ్యక్తిగతంగా మానవాతీతమైన విషయాలన్నా,ఆత్మలు-దయ్యాలన్నా చాలా భయం.
సద్గురు: అంటే, మీ భయమంతా, మీరు ఎన్నడూ చూడని దానిని గురించే...! దీని అర్ధం ఏమిటంటే, మానవుడికున్న స్వాభావిక లక్షణంలో ఒక ముఖ్యమైన అంశం మీ అదుపు తప్పుతోందని. ఇతర జీవ రాశులతో పోల్చి చూస్తే, మానవుడికి మాత్రమే "స్పష్టమైన జ్ఞాపక శక్తి" ఉంది. మనకి, నిన్న జరిగిన ప్రతీ సంఘటనా గుర్తుంటుంది. మనం ఈ రోజుని ఎలా నిర్వహించాలన్న అవగాహన మనకు ఈ జ్ఞాపక శక్తి వల్లే ఉంది. దీనినే మనం "జ్ఞానం" అంటున్నాం. నిన్న మనం దేనినైతే అర్ధం చేసుకున్నామో, గ్రహించగలిగామో,లేదా అనుభూతి చెందామో, అదే ఈ రోజున మనకున్న "జ్ఞానం".
మన మనస్సుకు ఉన్న రెండూ అంశాలైన 1) స్పష్టమైన జ్ఞాపకశక్తి ఇంకా 2) అద్భుతమైన ఊహాశక్తి మనకు ఓ వానపామో ఓ మిడతో లేదా మరే ఇతర జీవరాశులకన్నా ఓ ప్రత్యేకతను కల్పిస్తుంది. కానీ, ఈ రెండు అంశాల వల్లే ఎంతోమంది మానవులు బాధలని అనుభవిస్తున్నారు.
ప్రజలు పదేళ్ల కింద జరిగిన వాటి గురించీ బాధ పడతారు, రేపో-ఎల్లుండో జరగబోయే వాటిని గురించి కూడా దిగులు పడుతూనే ఉంటారు. లేదా, అసలు "ఉనికే" లేని వాటి గురించి కూడా బాధ చెందుతూనే ఉంటారు. వారికి ఉన్న జ్ఞాపకశక్తి ఇంకా ఊహాశక్తులను వారు ఓ బాధగా మలచుకుంటున్నారు. ఈ రెండు శక్తులే మనల్ని మనవులుగా తీర్చిదిద్దుతున్నది. అంటే పరిణామక్రమంలో ఎదగడం కూడా మనకో బాధగా మారింది.
అసలు ఏం జరుగుతోందంటే, మీ ఊహాశక్తిని మీరు బాధగా అనుభూతి చెందుతున్నారు. అదొక భయానక చిత్రంలా చేసుకుని చూస్తున్నారు. కానీ దానిని ఎందుకు ఆస్వాదించడం లేదు? సమస్య ఏమిటంటే, దాని దర్శకత్వం అస్సలు బాలేదు. మీ స్మృతులు, కల్పనలు మీ అదుపులో లేవు. ఆ నాటకం అంతా దానంతట అదే సాగిపోతోంది.
ప్రజలు దీనిని "మానవ స్వభావం" అంటారు. కానీ, ఇది మానవ స్వభావం కాదు. మానవ స్వభావాన్ని గురించిన బాధ్యతని తీసుకోని వ్యక్తుల స్వభావం. మీ మనో నాటకాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో మీకు తెలిసి ఉంటే, మీరు పారవశ్యంలో మునిగిపోయేవారు, భయపడే వారు కాదు. ఈ నాటకాని పట్ల మీకు కొంత అవగాహన కలిగించి, మీ మనో నాటకానికి మీరే దర్శకులై తీర్చిదిద్దుకోనేలా చేయడమే, నేను చేస్తున్న పనిలో సారం అంతా..!