భిక్షాటన - వికాసానికి మార్గం !
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో భిక్షాటనకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? దీన్ని తెలియజెప్పేందుకు బుద్ధిశాలి అయిన ఒక భిక్షుకుడి కథ చెప్తున్నారు సద్గురు.
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో భిక్షాటనకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? దీన్ని తెలియ జెప్పేందుకు బుద్ధిశాలి అయిన ఒక భిక్షుకుడి కథ చెప్తున్నారు సద్గురు. దాంతోపాటు గౌతమ బుద్ధుడి జీవితంలో జరిగిన ఒక సంఘటనను వివరిస్తున్నారు. మీ జీవితావసరాలన్నీమీరు సంపాదించుకున్న కొద్దీ, మీకు (మీ అహంకారానికి) బలం చేకూరుతుంది. కానీ స్వచ్ఛందంగా భిక్షాటన చేయటం మిమ్మల్ని మీరు కుంచింపచేసుకునేందుకు సాధనం, అంటారు సద్గురు.
సద్గురు: అనగనగా, ఒకప్పుడు, ఒక బిచ్చగాడు ఉండేవాడు. అతడు తనకు కావలసినవన్నీ అడుక్కొని తెచ్చుకునేవాడు. ఆ బిచ్చగాడు దాదాపు తన జీవిత కాలమంతా ఒకే ఒక్క చిరుగుల కోటుతో నెట్టుకొచ్చాడు. క్రమంగా ఆయనకు కొంచెం పేరు ప్రతిష్ఠలు ఏర్పడ్డాయి. చాలామంది ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆయన దగ్గరకు వెళ్ళటం మొదలైంది. ఆయన చాలా బుద్ధిశాలీ అని లోకమంతా చెప్పుకోసాగింది. ఈ వార్త రాజుగారి దాకా వెళ్లింది. రాజుగారు కూడా భిక్షకుడి దగ్గరికి సలహాల కోసం రావటం ఆరంభించాడు.
ఒక రోజు రాజు, ‘అయ్యా, మీరిలా బిచ్చం ఎత్తడం మానేయాలి. మీరు నాకు మంత్రిగా ఉండాలి!” అన్నాడు.
‘మీరు ఇవ్వబోతున్న పదవి వల్ల నాకు ఒరిగేదేమీ లేదు. కానీ నా వల్ల ప్రజలకేదయినా మంచి జరుగుతుందంటే, నేను మీ మంత్రి పదవి స్వీకరిస్తాను. అయితే ఒక్క షరతు. మీరు నాకు మీ రాజ భవనంలో ఒక గది ప్రత్యేకంగా కేటాయించాలి. ఆ గదిలోకి ఎట్టి పరిస్థితిలోనూ ఎవ్వరూ రాకూడదు. మీరు కూడా రావటానికి వీల్లేదు. ఎవరయినా ఆ గదిలోకి రావటంగానీ, తనిఖీలు చేయటంగానీ జరిగితే మాత్రం నేనిక ఆ తరవాత ఒక్క క్షణం గూడా మీకు మంత్రిగా ఉండను!’ అని బదులిచ్చాడు భిక్షకుడు.
‘అలాగే కానివ్వండి. రాజ భవనంలో మీకొక గది ఇచ్చేస్తాను. ఆ గదిని మీరు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. ఆ గదిలోకి నాతో సహా ఎవ్వరూ, ఎప్పుడూ అడుగుపెట్టరు' అని అంగీకరించాడు రాజు.
ఈ ఏర్పాటు కొన్ని సంవత్సరాలపాటు సాగింది. భిక్షువు ఇప్పుడు రాజుగారి ప్రధాన మంత్రి అయ్యాడు. ప్రధాన మంత్రి ఒక బిచ్చగాడిలా చిరుగుల కోటు వేసుకుని తిరిగితే బాగుండదు కదా! అందుకని తన పదవికి తగ్గ దుస్తులు ధరించ సాగాడు. కాలక్రమంలో ఆయన ఎన్నో ప్రశంసలు పొందాడు. రాజుకూ, ప్రజలకూ కూడా అభిమాన పాత్రుడయ్యాడు. ఆయనకున్న ప్రజాభిమానాన్నీ, ఆయన అసాధారణ మేధా శక్తినీ చూసి ఇతర మంత్రులకు చాలా అసూయ కలిగింది. వాళ్ళలో కొందరికి, ‘ఈ భిక్షుకుడు తనకిచ్చిన గదిలో ఏదో అనుమానాస్పదమైన వస్తువు దాచిపెట్టాడు. అందుకే ఆ గదిలోకి మాత్రం ఎవ్వరినీ రానివ్వటం లేదు. బహుశా రాజుగారి మీదో, దేశం మీదో ఏదో కుట్ర పన్ని ఉంటాడు. లేకపోతే, ఆ గదిని అంత రహస్యంగా ఉంచుకోవటం ఎందుకు?' అని కూడా ఆలోచన కలిగింది.
పుకార్లు వ్యాపించాయి. అవి రాజుగారిదాకా వెళ్ళాయి. రాజుగారిలో కూడా అనుమానం రేకెత్తింది. ఒక రోజు ఆయన, ప్రధాన మంత్రిని పిలిచి, 'మీకిచ్చిన ఆ గదిలో ఏముందో నేను చూడాలి!' అన్నాడు.
'కావాలంటే చూసుకోండి. కానీ మీరు ఆ గదిలోకి ప్రవేశించిన తక్షణమే నేనిక్కడినించి వెళ్లిపోతాను. ఇక మీ మంత్రిగా ఉండను' అన్నాడు ప్రధాన మంత్రి. ఆయన మేధా శక్తి గురించి రాజుకు బాగా తెలుసు కనక, అలాంటి ప్రధాన మంత్రిని వదులుకోలేక, అప్పటికి తనని తను నిగ్రహించుకున్నాడు.
కానీ, కాలం గడిచిన కొద్దీ రాజు గారిలో అనుమానం పెనుభూతమైంది. ఆయన చుట్టూ ఉన్నవాళ్లు ఆయన చెవులు కొరుకుతూనే ఉన్నారు, 'మీరు మహారాజులు. మీ నుంచి ఎవరూ ఎప్పటికీ మీ రాజభవనం గురించిన ఏ రహస్యాలూ దాచకూడదు' అంటూ. అందుకే, కొన్నాళ్ల తరవాత రాజు మళ్ళీ 'ఆ గదిని నేను చూసి తీరాల్సిందే!' అని పట్టు బట్టాడు. ప్రధాన మంత్రి 'సరే' అన్నాడు.
రాజు ఆ గది లోకి ప్రవేశించి చూశాడు. ఆ గదిలో ఏమీ లేదు! గదంతా సాదాగా, శూన్యంగా ఉంది. భిక్షుకుడిగా ఉన్న రోజులలో మంత్రి ధరించిన పాత చిరుగుల కోటు మాత్రం ఒక మూల గోడకు వేలాడుతున్నది. ఇదంతా చూసి రాజు,' ఇక్కడేమీ లేదు కదా? మరి ఇదేదో పెద్ద రహస్యమైనట్టు మీరు ఇన్నాళ్లూ ఎందుకు దాస్తూ వస్తునారు?' అని అడిగాడు.
'పగలయితే నేను ప్రధాన మంత్రిని. రాత్రి పూట మాత్రం నేను ఆ కోటు తొడుక్కొని ఈ నేల మీద పడుకుంటాను. ఇలా చేస్తున్నంత కాలం, నాకు మీ మంత్రి పదవితో ఉంటూ దానితో చిక్కుకుపోను. అయినా ఇప్పుడు మీరు మన ఒప్పందాన్ని భంగం చేశారు కనక నా పదవీకాలం ముగిసింది!' అన్నాడు భిక్షుకుడు. అని, ఆ వెంటనే తన పాత కోటు తొడుక్కొని తన దారిన వెళ్లిపోయాడు.
ఇచ్ఛాపూర్వకమైన భిక్షాటన
భారత దేశంలో భిక్షాటన అనేది ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఒక ముఖ్యమైన అంశం. మీరు తినే ఆహారం మీరు కోరి ఎంచుకున్నది కాదు. మీరు బిచ్చం అడుగుతారు, ప్రజలు ఏది భిక్షగా వేస్తే అదే తింటారు. ఆధ్యాత్మిక సాధనలలో ఉన్న వ్యక్తి ఎవరయినా మీ ఇంటి ముందు నిలబడి తినేందుకు భిక్ష వేయమని అడగటంగానీ, మీరు ఆయనకు భిక్ష సమర్పించటం గానీ జరిగితే అదొక సువర్ణావకాశంగా భావించే వాళ్ళు. నేటి కాలానికయితే, అలాంటి సంప్రదాయాలన్నీ దుర్వినియోగం అయిపోయాయి. ఇప్పుడు భిక్షువుల వేష భాషలతో తిరిగే వారిలో చాలామంది మామూలు బిచ్చగాళ్ళు. వాళ్ళకు కావలసింది డబ్బూ, తిండీ - అంతే! కానీ కావాలని స్వచ్ఛందంగా భిక్షుకులు భిక్షాటన చేసిన రోజులలో, దాని అర్థమూ, పరమార్థమూ పూర్తిగా భిన్నంగా ఉండేవి.
మీ ముందు ఎవరయినా చేయి చాచి నిలబడితే, అది దుర్వినియోగం కోసం అని మీకు అనిపిస్తే, వాళ్ళని వదిలేసి మీరు మీ దోవన వెళ్లిపోవచ్చు. నిజంగా మానవీయమైన కనీసావసరాలకోసం వాళ్ళు యాచిస్తున్నారనిపిస్తే, మీరు మానవతా భావంతోనే స్పందించాలి. నడి వీధిలో ఒకరి ముందు అలా చేయి చాచి దీనంగా యాచించటం, మీకయితే ఎంత కష్టంగా ఉంటుందో కాస్త ఆలోచించండి. పాపం ఆ యాచకుడు అలాంటి దుస్స్థితిలో ఉన్నాడు.
బిచ్చగాడయితే, నిస్సహాయ స్థితిలో ఉండి యాచన చేస్తాడు. కానీ సన్యాసి చేసే యాచన తన ఆధ్యాత్మిక వికాసం కోసం చేసే యాచన. తన అహంకారాన్ని అదుపులో ఉంచుకోవటం కోసం చేసే యాచన. బిచ్చగాడికి అలాంటి ఉన్నత లక్ష్యాలు ఉండవు. కేవలం తన పొట్ట నింపుకోవాలని మాత్రమే అతని కోరిక. అది తను స్వయంగా చేసుకునే సమర్థత లేక ఇతరులను యాచిస్తున్నాడు.
సమర్థత లేకపోవటమంటే, ఒక కాలో ఒక చెయ్యో కోల్పోవటం వల్ల అనే కాదు. జీవితాన్ని గురించి మీరేమనుకొంటున్నారో, ఎలా ఆలోచిస్తున్నారో, అది కూడా ఒక వైకల్యం గానే పరిణమించచ్చు. నిజం చెప్పాలంటే, జీవితాన్ని గురించిన భావనలలో, ఆలోచనా సరళిలో ఈ ప్రపంచ జనాభాలో ప్రతి ఒక్కరూ, ఎంతో కొంత వైకల్యం ఉన్నవాళ్లే. అలాంటి ఒక వైకల్యం వల్లే బిచ్చగాడు తన ప్రస్తుత దుస్స్థితికి చేరాడు. జీవించటానికి అతి సులభమైన మార్గం బిచ్చమెత్తుకోవటమేనని అతని నమ్మకం.
కిందికి తగ్గటం
ఆధ్యాత్మిక సాధకుడు బిచ్చమెత్తటానికి కారణం తనను తను కిందికి కుదించుకోవటానికి. 'నాకు కావలసిందంతా నేనే సమకూర్చుకుంటాను! నా డబ్బు నేనే ఆర్జించుకుంటాను! నా ఆహారం నేను సంపాదించుకోగలను! నా ఇల్లు నేనే ఏర్పరుచుకోగలను!' అన్న భావనలు మీ అహంకారంలో అతి పెద్ద భాగం. ఒక రోజు గౌతమ బుద్ధుడి దగ్గరకు ఒక అతిధి వచ్చాడు. వచ్చేటప్పుడు కొన్ని పూలు తీసుకొచ్చాడు. గురువును కలిసేందుకు వెళ్ళేటప్పుడు ఆయనకు సమర్పించేందుకు పూలు తీసుకెళ్లటం మన సంస్కృతిలో ఒక ఆనవాయితీ కదా!
ఆయన రాగానే, గౌతముడు ఆయనను చూస్తూ 'వదిలేసేయి!' అన్నాడు. ఆ వచ్చిన మనిషికి అర్థం కాలేదు. అటూ ఇటూ చూశాడు. దేన్ని వదిలేసేయాలి? పూలను వదిలేయాలి కాబోలు అనుకున్నాడు. కొంచెం సందేహిస్తూ, '..కానీ ఇవి నేను మీ కోసం కానుకగా తెచ్చినవి..' అన్నాడు. గౌతముడు మళ్ళీ వదిలేసేయి!' అన్నాడు. సరే, ఆ శిష్యుడు పూలు కింద వదిలేశాడు. గౌతముడు ఆయన వైపు చూస్తూ మళ్ళీ, 'వదిలేసేయి!' అన్నాడు. శిష్యుడు, 'పూలను కిందనే వదిలేశాను కదా? నిజానికి అవి మీకు కానుకగా సమర్పించేందుకు తెచ్చినవి. కానీ వాటిని మీరు కింద పారెయ్యమన్నారు. అలాగే చేశాను. ఇంకా వదిలేసేందుకు ఏముంది?' అన్నాడు.
'ముందు నిన్ను నువ్వు వదిలేసేయి. పూలతో సమస్య ఏమీ లేదు. అవి నువ్వు నా కోసం కోసి తెచ్చావు. మంచిదే. నేను వాటిని స్వీకరిస్తాను. కానీ నిన్ను మాత్రం నువ్వు వదిలేసుకో (Drop yourself!)' అన్నాడు గౌతముడు.
మనల్ని మనం వదిలేసుకోవటానికీ, ఒదిగి ఉండటానికీ భిక్షాటనను ఒక సాధనంగా వాడేవారు. మీ జీవితావసరాలన్నీమీరు సంపాదించుకొన్న కొద్దీ, మీకు (మీ అహంకారానికి) బలం చేకూరుతుంది. కానీ మీ అవసరాలన్నీ మీరే సంపాదించుకోగల శక్తి మీకున్నదని పూర్తిగా తెలిసికూడా, మీరు భిక్షాటనను ఎంచుకుని మరొకరి ముందు చేయి చాస్తున్నారంటే, మిమ్మల్ని మీరు కిందకు కుంచింపజేసుకుంటున్నారన్నమాట. మనిషిలో ఇదొక మహత్తరమైన మార్పు. లోకులు మీకు భిక్ష వేస్తే వేస్తారు, లేకపోతే పొమ్మనచ్చు. కానీ భిక్షుకుడిగా ఉండటమనేది చిన్న విషయమేమీ కాదు.
ప్రేమాశీస్సులతో,