భూసారాన్ని పరిరక్షించుకోవాలంటే, వ్యవసాయ పద్ధతులు మెరుగుపరుచుకోవాలి
బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా భారతీయ వస్త్ర పరిశ్రమని నాశనం చేసి, చేనేత కార్మికులు జీవనోపాధి కోసం వ్యవసాయం వైపు బలవంతపు అడుగులు వేసేలా చేసారో సద్గురు వివరించారు. ఈ తప్పటడుగు అసమర్థమై వ్యవ్యసాయమే కాక మన భూసారాన్ని నాశనం చేసింది. ఈ సమస్యకి మనకున్న పరిష్కార మల్లా చెట్లని నాటడం
కానీ 1800 - 1860 సంవత్సరాల మధ్య మన దేశంలో వస్త్రోత్పత్తుల ఎగుమతులు 94 శాతం పడిపోయాయి. ఇది ప్రమాద వశాత్తూ జరగలేదు. ప్రయత్నపూర్వకంగానే జరిగింది. ఆంగ్లేయులు ఇక్కడి నేత మగ్గాలను విరగ్గొట్టి , మార్కెట్లు ధ్వంసం చేశారు. ప్రతి దానికీ దాని ధర మీద 300 శాతం పన్నులు వేశారు. పెద్ద ఎత్తున వస్త్రాలు దిగుమతి చేశారు. ఆ రోజుల్లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ విలియం బెన్టింక్, ‘ఈ దేశపు నేత కార్మికుల ఎముకలతోనే, ఈ దేశపు మైదానాలన్నీ తెల్లనైపోయాయి!’ అని అన్నాడట. వాళ్ళ జీవనోపాధి నాశనమవటంతో లక్షలాది ప్రజలు ఆకలి చావులకు గురయ్యారు. మిగతా వాళ్ళు అరకొర వ్యవసాయాలతో ఎలాగో పొట్టపోసుకొనేందుకు ప్రయత్నించారు. దేశమంతా, కూటి కోసం వ్యవసాయ ఉపాధిలోకి దిగవలసి వచ్చింది. ఈ వ్యవసాయదారులు వంశ పారంపర్యంగా పంటలు పండిస్తూ వచ్చిన వాళ్ళు కాదు. గతి లేక వ్యవసాయంలోకి దిగవలసి వచ్చిన చేనేత కళాకారులు.
1947 లో మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, తొంభై శాతం పై చిలుకు జనాభా వ్యవసాయదారులుగా ఉండేవారు. ఇప్పుడా శాతం డెబ్భయికి తగ్గింది. అంటే దేశంలో ప్రతి పదిమంది జనాభాలో, ఆ పదిమందికి అన్నం వండి పెట్టే పనితోనే ఏడుగురు పొట్ట పోసుకోవాలన్న మాట. ఇది గిట్టుబాటయ్యే వ్యవహారం కాదు కదా! కనిపించిన ప్రతి అంగుళం నేలనూ ఎలాగో చేతయినట్టు గీకి వేసి, తృణమో పణమో పండించేందుకు అందరూ శ్రమిస్తున్నారన్న మాట. మనం ఈ వ్యవసాయ విధానంలో ఏదో విధంగా విప్లవాత్మకమైన మార్పులు తేకపోతే, ఇక ఈ సమస్యకు పరిష్కారమే దొరకదు.
మన దేశంలో, ఒకే చిన్న వ్యవసాయ క్షేత్రంలో తరతరాలపాటు రైతు కుటుంబాలు పంటలు పండించుకోవటం కనిపిస్తుంది. కానీ గడిచిన తరంలో మాత్రం భూసారం అత్యంత శోచనీయమైన స్థాయికి పడిపోయింది. మన పొలాలన్నీ మరుభూములుగా మారటానికి చేరువలో ఉన్నాయి. కారణం? వాటిలో చెట్లన్నిటినీ నరికేశారు. కోట్లాది సంఖ్యలో పశువులు ఎగుమతి అయిపోతున్నాయి. ఈ పశువులు కేవలం జంతువులు కాదు. మన భూసారాన్నే మనం వీటి రూపంలో ఎగుమతి చేసేస్తున్నాం. మరిక భూసారాన్ని పరిరక్షించుకోవటం మాటెక్కడ?
భూమిలో భూసారం పెరగాలంటే, అందులో సేంద్రియ (organic) పదార్థాలు పడాలి. వృక్ష సంబంధ మైన , పశు సంబంధమైన వ్యర్థాల (waste) నుంచి తప్ప ఈ సేంద్రియ పదార్థాలు లభించేందుకు మరో మార్గం లేదు. పూర్వం వ్యవసాయదారుల కుటుంబాలలో అందరికీ ‘పొలం ఇంత ఉంటే, చెట్టూ చేమా ఎంత ఉండాలి, పశువులు ఎన్ని ఉండాలి’ అన్నపాటి సాధారణ జ్ఞానం ఉంటూ ఉండేది.
మన దేశం ఒక లక్ష్యం నిర్దేశించుకొన్నది, ఇది ప్రణాళిక సంఘం (planning commission) వారు కూడా ఆమోదించిన లక్ష్యం. దేశపు భూభాగంలో కనీసం మూడో వంతు వృక్షచ్ఛాయా ప్రదేశంగా ఉండాలని. ఎందుకంటే, భూసారం పరిరక్షించాలంటే, అదొక్కటే మార్గం! నా మటుకు నేను పొలం ఉన్న ప్రతివారికీ, కనీసం ప్రతి హెక్టేరుకూ అయిదు పశువుల చొప్పునన్నా ఉండి తీరాలి అని ఒక చట్టం రూపొందించేందుకు ఒత్తిడి తేవాలని ప్రయత్నిస్తున్నాను. లేకపోతే ఆ పొలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసేసుకోవాలి. మీ పొలాన్ని మీరే ధ్వంసం చేస్తుంటే, మరేం చెయ్యాలి చెప్పండి!
మన దేశంలో పంట పొలాల గురించి ఒక అద్భుతమైన విశేషం ఉంది. ఈ విశేషం నిజమే అనేందుకు శాస్త్రీయ ఆధారాలున్నాయి కానీ, దీనికి కారణమేమిటోమాత్రం ఇప్పటి వరకూ శాస్త్రజ్ఞులు చెప్పలేక పోతున్నారు. ఈ దేశంలో మంచి భూసారం ఉన్న ఏ ప్రాంతం నుంచయినా ఒక క్యూబిక్ మీటరు పరిమాణం గల మట్టిని తెచ్చి పరీక్షిస్తే, అందులో 10,000 విభిన్న రకాల ప్రాణి జాతులు కనిపిస్తాయట. భూగోళంలో మరే దేశంలోనూ ఇలాంటి ప్రాణి సాంద్రత కనిపించదు. కారణం ఏమిటో మనకు ఇప్పటికీ తెలియదు.
మరిప్పుడు ఇంతటి సారవంతమైన భూమికి కావలసిందల్లా కొంచెం పోషణ. ఆ పోషణ మీరు సమకూరిస్తే భూసారం మళ్ళీ పుంజుకొంటుంది. కనీసం ఆ కొంచెం పోషణ అన్నా అందించే బుద్ధీ, జ్ఞానం ఈ తరంలో వారికి ఉన్నాయా, లేక, భూసారం నశించిపోతూ ఉంటే అందరం అలా చూస్తూ ఊరుకొంటామా ? ఒక ఉదాహరణ. కావేరీ నది పరీవాహక ప్రాంతం వైశాల్యం 83000 చదరపు కిలోమీటర్లు. గత యాభై సంవత్సరాలలో, ఈ ప్రదేశంలో హరిత కవచం (green cover) లో 87 శాతం అంతరించి పోయింది. అందుకే కావేరీ నదిని పునరుజ్జీవితం చేసేందుకు నేను ‘ కావేరీ పిలుపు’ (Cauvery Calling) అనే ఉద్యమం చేపడుతున్నాను. కావేరీ పరీవాహక ప్రాంతంలో కనీసం మూడో వంతు భాగాన్ని వృక్షచ్ఛాయా ప్రదేశం చెయ్యాలంటే, మొత్తం 242 కోట్ల వృక్షాలు కావాలి. 2.42 బిలియన్లన్న మాట. ఈ చెట్లన్నింటినీ ఈశా ఫౌండేషన్ వారే నాటుతారని కాదు. మేము వన-వ్యవసాయ (agro forestry) ఉద్యమం నిర్వహించాలనుకొంటున్నాం. ఇది వ్యవసాయ దారులకు లాభసాటి అయిన అదనపు ఆర్థిక వనరులలో అత్యుత్తమమైంది.
కర్ణాటకలో రైతుల సగటు వార్షిక ఆదాయం హెక్టారుకు 42000 రూపాయలు. తమిళ నాడులో వార్షికాదాయం దాదాపు హెక్టారుకు 46000 రూపాయలు. కేవలం అయిదు సంవత్సరాలలో ఈ సగటు ఆదాయాన్ని మూడు నుండి ఐదు రెట్లు పెంచవచ్చు. ఈ ఆర్థిక లాభాన్ని ప్రజలు ఒక్క సారి ప్రత్యక్షంగా చూశారంటే, ఇక వారికి ఎవరూ ఏమీ బోధించాల్సిన పనీ, నచ్చజెప్పాల్సిన పనీ ఉండదు. ఆ పథకమేదో వాళ్ళే అమలు చేసుకొంటారు. రైతులందరూ తమ పొలాలలో మూడో వంతు భాగంలో వన-వ్యవసాయం చేస్తే, వాళ్ళ ఆదాయాలు గణనీయంగా పెరిగిపోతాయి. భూసారమూ సమృద్ధమౌతుంది!