చనిపోయిన వారి అస్థికలను మనం గంగలో ఎందుకు కలుపుతాం?
భారతీయ సంస్కృతిలో మనం అస్థికలను నదుల్లో ఎందుకు కలుపుతాము? ఒకవేళ అస్థికలు వేరే వారి చేతుల్లోకి చేరితే ఏమవుతుందో, సద్గురు వివరిస్తున్నారు.
ప్రశ్న: నమస్కారం సద్గురూ! ఒక శవాన్ని తగలబెట్టినప్పుడు, ఆ అస్థికలను మనం గంగలోనో, దగ్గరలో ఉన్న మరో నదిలోనో కలుపుతాము. దీనికి ఏమన్నా ప్రాధాన్యత ఉందా?
సద్గురు : మీకు ప్రియమైన వారు చనిపోతే, వారు చనిపోయారని మీకు తెలిసినా, మీ బుర్రలో ఎక్కడో ఒక అనుమానం ఉంటుంది. ఏమో అతను నిద్రపోతున్నాడేమో, ఏమో కాసేపాగి లేచి కూర్చుంటాడేమో, అతను అస్థికల్లో నుంచి తిరిగి వస్తాడేమో, అంటూ పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తుంటుంది. కానీ మీరు అస్థికలను నదిలో కలిపేస్తే, ‘ఇక అంతా అయిపోయింది’ అని మీకు తెలుస్తుంది. ఇటు బ్రతికి ఉన్న వారికి, అటు చనిపోయినవారికి, ఖచ్చితమైన నిర్ధారణ వస్తుంది.చనిపోయిన వారు వెళ్లిపోవాలి
ఆ జీవికి, ఆ శరీరం నుంచి పూర్తిగా బయటకు వెళ్ళడానికి చనిపోయిన తరువాత 40 రోజుల దాకా పడుతుంది. మీరు శరీరాన్ని తగులపెట్టినా సరే, ఆ జీవి, తన గత శరీరంలోని కొన్ని కొన్ని భాగాలు, అస్థికలు, బట్టలు లాంటి వాటికోసం చూస్తుంది. అందుకే హిందూ కుటుంబాలలో, మనిషి చనిపోయిన వెంటనే, మనిషి వాడిన బట్టలన్నీ, ముఖ్యంగా అతని శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండే లోదుస్తుల లాంటి వాటిని కాల్చేస్తారు. ఎందుకంటే ఇంకా ఆ శరీరంలోని కొన్ని ధాతువుల కోసం, చెమట లేక శరీరం నుంచి వచ్చే వాసనవంటి వాటి కోసం చూస్తుంది. ఎందుకంటే ‘అంతా అయిపోయింది’ అని వాస్తవం ఇంకా వారికి అందలేదు.
మీరు అస్థికలను ఒక చోట పెట్టేస్తే ఆ జీవికి వాటి వైపు చూసే అవకాశం ఉంటుంది. అందువల్లనే అస్థికలను నదిలో కలిపేస్తే, దానివల్ల అస్థికలు దూరంగా వెదజల్ల బడతాయి లేక మునిగిపోతాయి. ఆ విధంగా వాటిని కనుగొనటం కష్టం. ‘అంతా అయిపోయింది’ అని ఆ జీవికి అర్థమయ్యేలా అన్ని రకాలుగా మనం చేస్తాము.
రుణానుబంధాన్ని తెంచుకోవడం
ఇందులో మరొక విషయం ఏమిటంటే, రక్త సంబంధం వలన, లైంగిక సంబంధం వలన, కేవలం మరొకరి చేతిని పట్టుకోవడం వల్ల లేక బట్టలు మార్చుకుని ఉండడం వల్ల, మీరు మరొకరి శరీరంతో రుణానుబంధాన్ని తయారుచేసుకుంటారు. అంటే ఒక రకమైన పంచుకోవడం, భౌతికంగా ఏదో ఒక ఏకత్వం ఏర్పడుతుంది.
ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, సంప్రదాయకంగా, మీరు ఈ రుణానుబంధాన్ని పూర్తిగా తొలగించుకోవాలనుకుంటారు. మరి ఈ అస్థికలను గంగలోనో, సముద్రంలోనో వీలైనంత దూరంగా వాటిని విసర్జించారంటే దానికి కారణం, మీరు మరణించిన వారితో రుణానుబంధాన్ని పెంచుకోవడం ఇష్టంలేదని. మీరు మీ జీవితాన్ని కొనసాగించడానికి రుణానుబంధం పరిపూర్ణంగా తెంచుకోవాలి. లేకపోతే ఈనాటి ఆధునిక సమాజాల్లో జరుగుతున్నట్టు, అది మీ భౌతిక, మానసిక వ్యవస్థలపై ప్రభావం చూపుతుంది. అది మీ మానసిక, శారీరక వ్యవస్థను బలహీనపరుస్తుంది. దాని మూలంగా మీ ఇద్దరి మధ్యా జరిగిన మంచిని ఆస్వాదించండానికి బదులు, మీరు బాధపడతారు. అది మీ జీవితంలో ఒక రకమైన అస్తవ్యస్తతకు దారితీస్తుంది.
ఇలా జరగకుండా ఉండటానికి మనం భౌతిక జ్ఞాపకాలనే నాశనం చేసే ప్రయత్నం చేస్తాము, అంతేగాని మానసికమైన జ్ఞాపకాలను కాదు. మీరు మానసికమైన, భావపరమైన జ్ఞాపకాలను పోగొట్టుకోకూడదు. మీకు ఎంతో ప్రియమైన వారిని, మీరు ఎందుకు మర్చిపోవాలి? మీరు ఆ బాంధవ్యాన్ని మనసులో ఉంచుకోవాలి, ఎప్పటికీ ఆస్వాదించాలి, కానీ ఈ భౌతిక జ్ఞాపకాలను నాశనం చేయాలి.
క్షుద్ర విద్యలచే వచ్చే నష్టం
ఇలా అస్థికలను విసర్జించడానికి మరో కారణం ఉంది. మనిషి లక్షణాలు మరణం తర్వాత అస్థికలలో ఇంకా ఉండిపోతాయి. మీరు శరీరాన్ని తగలబెట్టినా సరే, వారికి అస్థికల డిఎన్ఏ విశ్లేషణ ద్వారా మనిషిని గుర్తించగలము. అలాగే మీరు అస్థికల పాత్రను అలాగే ఉంచితే, ఈ జీవి ఆ చుట్టుప్రక్కల తిరుగుతూనే ఉంటుంది. అందువల్లనే క్షుద్ర విద్యలు సాధన చేసేవారు మరుభూముల దగ్గర అస్థికలను సేకరించడం ద్వారా, ఆ ప్రాణిని తమ వంకకు ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తారు. వారు ఆ ప్రాణిని పట్టుకొని వేరొక విధంగా వాడుకోవడం ద్వారా, వారు క్షుద్ర ప్రక్రియలు చేసే ప్రయత్నం చేస్తారు.
మీకు ప్రియమైన వారు చనిపోతే, వారి అస్థికలు ఇటువంటి వారి చేతుల్లో పడటం మీరు భరించలేరు. మీ పూర్వీకులో, మీ బంధువులో, అస్థికల ద్వారా వశపరచుకోబడి ఎంతోకాలం వారిచేత దుర్వినియోగం చేయబడటం మీకు ఒప్పుకోరు. మీరు అస్థికలను నదిలో విసర్జనం చేసినప్పుడు, దానిని ఇక ఎవ్వరూ అందుకోలేరు. అస్థికలను విసర్జించడానికి మరొక రకమైన విధానం, బాగా గాలి వీస్తున్న పర్వతం మీదికి ఎక్కి అక్కడ గాలిలో వెదజల్లతారు. దీని ఉద్దేశం ఏమిటంటే, ఎవరూ ఒక గుప్పెడు అస్థికలను కూడా పొందకుండా చూడటం.
ఎడిటర్ వ్యాఖ్య: ఈశాలో అంత్యక్రియలు నిర్వహించే కాయంతస్థానంలో, ప్రాచీన విధానంలో అంత్యక్రియలు శక్తివంతమైన మూలాధారంతో చేస్తారు. అవి వ్యాపార భావంతో కాక, సేవా భావంతో నిర్వహించబడతాయి. ఈ సేవలు మరిందరికి అందించడానికి మీ నుంచి సహాయ, సహకారాలు కోరుకుంటున్నాము. మరింత సమాచారం కోసం చూడండి: Kayantha Sthanam – Isha’s Cremation Services.