విషయ పట్టిక
1. ఏకాదశి అంటే ఏమిటి?
2. ఏకాదశి ఉపవాసం ప్రాముఖ్యత
3. ఏకాదశి ఉపవాసానికి సంసిద్ధం కావడం
4. ఏకాదశి రోజున ఏం తినాలి
   4.1 ఉసిరికాయ ఆరోగ్య ప్రయోజనాలు
   4.2 రెండు తేలికపాటి వంటకాల తయారీ విధానం:
5. ఏకాదశి ఉపవాసాన్ని ఉపసంహరించుకోవడానికి తేలికైన ఆహార పదార్థాలు- వాటి తయారీ విధానం.

ఏకాదశి అంటే ఏమిటి?

సద్గురు: ఏకాదశి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 11వ రోజు మరియు అమావాస్య తర్వాత వచ్చే 11వ రోజు. మానవ శరీర ధర్మం ఒక మండల కాలచక్రంలో సాగుతుంది. మండల కాలమంటే సుమారు 40 నుంచి 48 రోజులు ఉంటుంది. ఈ చక్రంలో మూడు ప్రత్యేకమైన రోజుల్లో శరీరానికి ఆహారం అవసరం ఉండదు. ఇది మనిషి మనిషికీ వేరుగా ఉండవచ్చు, అలాగే ఈ మూడు రోజులూ ఎన్ని రోజులకొకసారి వస్తాయి అని చెప్పలేము. ఆ రోజులేవో మీరు గుర్తించగలిగి, ఆ రోజుల్లో శరీరం అడగడం లేదు కనుక ఆహారం అందివ్వకపోతే – ఎన్నో ఆరోగ్య సమస్యలు ఈ సులువైన పద్ధతి ద్వారా వాటంతట అవే సద్దుమణుగుతాయి. 

ఏకాదశి ఉపవాసం ప్రాముఖ్యత

“ఎన్ని కాలరీలు, ఎంత ప్రోటీన్, ఎన్ని మినరల్స్ తినాలి” అనే అనవసరమైన లెక్కలు మానేస్తే, శరీర ధర్మానికి సంబంధించిన ఈ ప్రక్రియను మనలో చాలా మంది గుర్తించగలుగుతారు. వారి శరీరం చెబుతున్నది వింటే గనక, చాలా మంది మనుషులు ఈ మూడు రోజుల్ని సులువుగానే తెలుసుకోగలుగుతారు. ఫలానా రోజుల్లో తినకూడదు అని ఎవరో వారి శరీర ధర్మాన్ని గమనించి చెప్పి ఉండవచ్చు. ఆ రోజుల గురించి జనానికి అవగాహన లోపించడం వల్ల ఏకాదశి రోజు తినకూడదు అని నిర్ణయించుకున్నారు. 48 రోజుల్లో మూడు ఏకాదశులు వస్తాయి కదా మరి.

ఏకాదశి రోజున భూగ్రహం ప్రత్యేక స్థితిలో ఉంటుంది. అందువల్ల మనం మన శరీరాన్ని తేలికగా, అనుకూలంగా ఉంచుకుంటే మన చైతన్యం అంతర్ముఖంగా పయనిస్తుంది.

ఏకాదశి రోజున భూగ్రహం ప్రత్యేక స్థితిలో ఉంటుంది. అందువల్ల మనం మన శరీరాన్ని తేలికగా, అనుకూలంగా ఉంచుకుంటే మన చైతన్యం అంతర్ముఖంగా పయనిస్తుంది. మనలోని అంతర్గత ద్వారాలు తెరుచుకునే అవకాశం ఈ రోజున ఎక్కువగా ఉంటుంది. మీ కడుపు నిండుగా ఉంటే మీరు అచేతనంగా, స్తబ్ధుగా ఉంటారు. మీరు ఈ మార్పులు గమనించలేరు. కనుక అప్రమత్తంగా ఉండటానికి, శరీరాన్ని శుద్ధి చేయడానికి ఈ రోజు ఆహారం తీసుకోకూడదు – మీరు ముందు రోజు రాత్రి భోజనం చేస్తే మళ్ళీ తర్వాత రోజు అంటే ఏకాదశి రోజున రాత్రి భోజనం చేస్తారు.

ఏకాదశి ఉపవాసానికి సంసిద్ధం కావడం

ఎవరైనా కొద్ది కాలం పాటు ఉపవాసం చేయాలనుకుంటే, ముందు సరైన ఆధ్యాత్మిక సాధన చేయడం అవసరం. శరీరాన్ని, మనసును సిద్ధం చేయకుండా బలవంతంగా ఉపవసించినట్లైతే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. శరీరాన్ని సిద్ధం చేసి మనసును సరైన స్థితిలో ఉంచుకుని, అవసరమైన శక్తిని పొందుపరచుకొని ఉపవాసం చేసినట్లయితే అనేక లాభాలను పొందవచ్చు.

మీరు నిరంతరాయంగా కాఫీ, టీ పుచ్చుకుంటే ఉపవాసం మీకు చేటు చేస్తుంది. మీరు ఉపవాసం చేయదలిస్తే సరైన ఆహారాన్ని స్వీకరించి శరీరాన్ని ముందుగా సిద్ధం చేయాలి. ఆకలిని అదుపు చేయడం శరీరానికి నష్టం కలిగిస్తుంది. మూడు రోజులు తినకుండా సాహసకృత్యం చేసి ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటే ఎటువంటి లాభం ఉండదు. మీరు బలహీనులవుతారు. శరీరాన్ని సరిగ్గా అర్థం చేసుకొని, శరీర ధర్మాన్ని లోతుగా తెలుసుకుని సరైన పద్ధతులు పాటించడం చాలా ముఖ్యం.

ఉపవాసం అనేది అందరికీ ఉపయోగపడకపోవచ్చు. కానీ సరైన అవగాహనతో ఉపవాసం చేస్తే ఎన్నో లాభాలు పొందవచ్చు. సరైన పరిస్థితుల్లో ఉపవాసం చేయడం ఉత్తమం. పూర్తిగా ఆహారాన్ని స్వీకరించకుండా ఉండలేనప్పుడు, శరీర అవసరాలకు అనుకూలంగా సాధన చేయలేనప్పుడు ఫలహారం స్వీకరించవచ్చు. పండ్లు తేలికైన ఆహారం కనుక మీ అంతర్గత ద్వారాలు తెరుచుకుంటాయి. బలవంతంగా ఆహారాన్ని నిషేధించడం సరికాదు. విషయం ఏంటంటే మీరు చేసే ప్రతిదీ స్పృహతో కూడినదై ఉండాలి. నిర్బంధంలో మనం ఇలా తినకూడదు అనుకుంటాము, స్పృహతో తినాలి అనుకుంటాము.

ఏకాదశి రోజున ఏం తినాలి

ఉసిరికాయ ఆరోగ్య ప్రయోజనాలు

benefits-amla-indian-gooseberry-fasting

మీరు ఎవరింటికైనా విందు చేయడానికి వెళ్ళినప్పుడు, భోజనానికి ముందు నిమ్మరసం లేదా నిమ్మకాయ షర్బత్ ఇచ్చినట్లయితే అది మీ ఆకలిని తగ్గించడానికేనని తెలుసుకోవాలి. నిమ్మరసం ఆకలిని నియంత్రిస్తుంది. సనాతన ధర్మం పదివేల సంవత్సరాల నాటిది. ఇక్కడి ప్రజలు మర్మములెరిగిన వారు. కొన్ని సమాజాలలో మొదట తీపి వడ్డిస్తారు. అది కూడా ఆకలిని సగానికి పైగా హరించి వేస్తుంది. భారతదేశంలో అతిథులకు ఆతిథ్యం ఇవ్వడం తప్పని ఆచారం కనుక ఇటువంటి ఉపాయాలను కనుగొనవలసి వచ్చేది. మన తెలివిని మన ఆర్థిక ప్రయోజనాల కోసమే కాకుండా అతిథుల ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వాడుకోవాలి. ఎందుకంటే ఉచితంగా లభించేది ఏదైనా కాస్త ఎక్కువే లాగిస్తారు కదా. మితిమీరిన ఆహారం తిని కొందరు ప్రాణం మీదికి తెచ్చుకుంటూ ఉంటారు.

ఏకాదశి అంటే ఉపవాసం. ఉపవాసం చేసేటప్పుడు నోట్లో ఒక ఉసిరికాయ వేసుకొని చప్పరిస్తుంటే ఆకలి అదుపులో ఉంటుంది. లేదంటే కడుపులో ఊరిన జీర్ణరసాలు వికారం కలుగజేస్తాయి, దానివల్ల వాంతులు కలగవచ్చు. పుల్లటి పదార్థాలు ఈ ప్రక్రియను నివారిస్తాయి. దీనికి ఉసిరిని మించిన పదార్థం లేనే లేదు. మానవ శరీర ధర్మాన్ని లోతుగా అర్థం చేసుకోవడం వల్ల తెలిసిన విషయాలివి. నోట్లో ఒకే ఒక్క ఉసిరికాయ వేసుకోవడం వల్ల మూడు నాలుగు గంటలు ఆకలిని నియంత్రించవచ్చు. ఉసిరి జీర్ణరసాలను అదుపు చేస్తుంది. వేవిళ్ళు నివారించడానికి ఉసిరికాయ చక్కటి ఔషధం.

రెండు తేలికపాటి వంటకాల తయారీ విధానం:

మీరు రోజంతా ఉపవాసం చేయలేకపోతే ఈ రెండు తేలికపాటి వంటలు మీకోసమే.

#1 బూడిద గుమ్మడి జ్యూస్

ash-gourd-juice

ముగ్గురికి సరిపడా

కావలసిన పదార్థాలు

  • బూడిద గుమ్మడి- 5 ఇంచుల ముక్క
  • నిమ్మరసం--- 6 టీస్పూన్లు
  • మిరియాల పొడి---- 3 టీస్పూన్లు
  • ఉప్పు---- 3 టీస్పూన్లు

తయారీ విధానం:

  • తొక్క, గింజలు తీసేసి బూడిద గుమ్మడికాయను చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
  • మిక్సీలో వేసి మెత్తని గుజ్జులా చేసుకుని వడకట్టుకోవాలి.
  • ఉప్పు, నిమ్మరసం, మిరియాల పొడి కలుపుకోవాలి.

#2 మిశ్రమ ధాన్యాల అంబలి

isha-multigrain-health-mix

ముగ్గురికి సరిపడా

కావలసిన పదార్థాలు

  • ఈశా మల్టి గ్రైన్ హెల్త్ మిక్స్ ---- 6 టీస్పూన్లు
  • బెల్లం/ బ్రౌన్ షుగర్---- 6 టీస్పూన్లు
  • నీళ్లు ---- 3 1/2 కప్పులు

తయారీ విధానం:

  • హెల్త్ మిక్స్ లో అరకప్పు నీళ్లు కలిపి చిక్కటి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి..
  • మిగిలిన 3 కప్పుల నీళ్లను మరిగించి బెల్లాన్ని కలుపుకోవాలి.
  • బెల్లం కరిగిన తర్వాత హెల్త్ మిక్స్ మిశ్రమాన్ని అందులో కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా కాసేపు తిప్పుతూ కలుపుకోవాలి.
  • 3-5 నిమిషాల పాటు ఉడికించి దించేసుకోవాలి.
  • వేడిగా వడ్డించుకోవాలి.

ఏకాదశి ఉపవాసాన్ని ఉపసంహరించుకోవడానికి తేలికైన ఆహార పదార్థాలు--వాటి తయారీ విధానం.

#1 ముడి బియ్యంతో చేసిన అంబలి

brown-rice-poridge

ముగ్గురికి సరిపడా

కావలసిన పదార్థాలు

  • ముడి బియ్యం ---- 1 కప్పు
  • పొత్తు పెసరపప్పు--- 1/3 కప్పు
  • ఉప్పు----- 1 టీ స్పూన్
  • నీళ్లు ------- 3.5 కప్పులు

తయారీ విధానం:

  • పదార్థాలన్నీ కుక్కర్ లో వేసి మెత్తబడేవరకు ఉడికించుకోవాలి.
  • కాస్త పల్చగా కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు కలుపుకొని ఉడికించుకోవచ్చు.

#2 సాతాళించిన శనగలు

black-chana-sundal

ముగ్గురికి సరిపడా

కావలసిన పదార్థాలు

  • రాత్రంతా నానబెట్టిన శనగలు----- 2 కప్పులు
  • పోపు మిశ్రమం---- 4 స్పూన్లు
  • ఉప్పు----- 1 టీ స్పూన్
  • నీళ్లు------ 4 కప్పులు
  • తాజా పచ్చి కొబ్బరి తురుము ------ 3 టీ స్పూన్లు

తయారీ విధానం:

  • కుక్కర్ లో శనగలు, నీళ్లు, ఉప్పు చేర్చి మెత్తగా ఉడికించుకోవాలి.
  • పైన పోపు, కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకోవాలి.

#3 బీన్స్ క్యారెట్ క్యాబేజ్ వేపుడు é/Stir-fry

green-beans-carrot-cabbage

ముగ్గురికి సరిపడా

కావలసిన పదార్థాలు

  • బీన్స్ ముక్కలు---- అర కప్పు
  • క్యారెట్ ముక్కలు--- అర కప్పు
  • క్యాబేజ్ ముక్కలు---- అర కప్పు
  • పోపు---- 4 స్పూన్లు – 4 tsp
  • ఉప్పు---- 1 స్పూను
  • తాజా పచ్చి కొబ్బరి తురుము ------ 4 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం:

  • కూరగాయ ముక్కలను ఉడికించుకోవాలి.
  • పైన పోపు, కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకోవాలి.

#4 తాజా బొప్పాయి ముక్కలు ---- 2 పెద్దవి

papaya

#5 కందిపప్పు పచ్చడి/Lentils Chutney

toor-dal-chutney

ముగ్గురికి సరిపడా

కావలసిన పదార్థాలు

  • కందిపప్పు-----ఒక కప్పు
  • ఆవాలు ------2 టీస్పూన్లు
  • చింతపండు గుజ్జు----- 3 టీస్పూన్లు
  • ఎండు మిర్చి ------- 4
  • అల్లం --------- అంగుళం ముక్క
  • వేరుశనగ నూనె ------ పావు కప్పు
  • ఉప్పు----------- 1.5 టీస్పూన్లు

తయారీ విధానం:

  • మూకుడులో నూనె వేడి చేసి కందిపప్పు, ఆవాలు, ఎండు మిర్చి వేసి 5 నిమిషాలు బాగా వేయించుకోవాలి.
  • వేయించిన పదార్థాలు చల్లబడ్డాక మిక్సీలో వేసి, మిగిలిన పదార్థాలన్నీ కలిపి మెత్తగా నూరుకోవాలి.