సద్గురు:కొంతకాలం క్రితం, ఎవరో ఒక వ్యక్తిని నా దగ్గరకు తీసుకువచ్చారు. అతను నిరాశా, నిస్పృహలతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఎందుకు? ఎందుకంటే సుమారు ఐదేళ్ల క్రితం ఆయన విలువ మూడు వేల కోట్లు. అప్పుడు అతను స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు. విషయాలు కొంచెం గాడి తప్పి, అతని విలువ కొద్దిగా తగ్గుముఖం పట్టింది. అతను నా వద్దకు వచ్చినప్పుడు, అతని విలువ కేవలం రెండు వందల యాభై కోట్లు మాత్రమే. కాబట్టి అతను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. భారతదేశంలో చాలా మంది ప్రజలు, మీరు వారికి అంత డబ్బు ఇచ్చి, “మీకు డబ్బు కావాలా లేదా మీరు స్వర్గానికి వెళతారా” అని అడిగితే, వారు డబ్బునే అడుగుతారు. కానీ ఈ మనిషి కృంగిపోయాడు! మీరు డబ్బును మీ జేబులో ఉంచుకుంటే అది గొప్ప విషయమే. కానీ అది మీ తలలోకి పాకితే, అది విచారంగా మారుతుంది, ఎందుకంటే దాని స్థలం అది కాదు.

సంపద అనేది, మానవ శ్రేయస్సు కోసం ఉన్న సాధనాల్లో ఒకటి మాత్రమె, అదే శ్రేయస్సు కాదు.

ప్రపంచంలో మనకు కావలసింది కేవలం సంపదని సృష్టించడం మాత్రమె కాదు. మనం శ్రేయస్సుని సృష్టించాలి. సంపద అనేది, మానవ శ్రేయస్సు కోసం ఉన్న సాధనాల్లో ఒకటి మాత్రమె, అదే శ్రేయస్సు కాదు. సంపద అంటే బయటి పరిస్థితులను మనకు ఆహ్లాదకరంగా ఉండేలా చేసుకోవడం. కానీ ప్రస్తుతం, ప్రజలు అదేదో ఒక మతం అయినట్లుగా, దాని వెనుక పడుతున్నారు. డబ్బు కేవలం ఒక సాధనం మాత్రమె; అదే ఫలితం కాదు. అనవసరంగా మనం దాన్ని చాలా పెద్దదిగా చేస్తున్నాము. అది చెడ్డదా ? అది మంచిదా? రెంటిలో ఏదీ కాదు; అది మనం సృష్టించిన ఒక సాధనం అంతే.

ఎవరూ కూడా డబ్బును ఆకాంక్షించడం లేదని మనం అర్థం చేసుకోవాలి. వినడానికి ఇది హాస్యాస్పదంగా అనిపించవచ్చు, కాని నేను చెబుతున్నాను, వారు కోరుకుంటున్నది డబ్బుని కాదు. విషయం ఏంటంటే, వారు దేనినైతే ‘మంచి జీవితం’ అని భావిస్తున్నారో, దాన్ని పొందడానికి డబ్బు ఒక మార్గంగా మారింది.

కాకపోతే, డబ్బు మీ జేబులో ఉండకుండా, మీ బుర్రలోకి పాకినప్పుడే, కష్టాలు మొదలవుతాయి

ప్రతి ఒక్కరూ తమ జీవితం ఆహ్లాదకరంగా ఉండాలని కోరుకుంటారు. ఆహ్లాదకరంగా అని మేము అన్నప్పుడు, ఆహ్లాదం అనేది ఐదు రకాలుగా జరుగుతుంది. మీ శరీరం చాలా ఆహ్లాదకరంగా మారితే దాన్ని సుఖం అని పిలుస్తాము. మీ మనస్సు ఆహ్లాదకరంగా మారితే, మనం దానిని శాంతి అని పిలుస్తాము; అది చాలా ఆహ్లాదకరంగా మారితే దాన్ని ఆనందం అని పిలుస్తాము. మీ మనోభావాలు ఆహ్లాదకరంగా మారితే మనం దానిని ప్రేమ అని పిలుస్తాము; అవి చాలా ఆహ్లాదకరంగా మారితే మనం దానిని కరుణ అని పిలుస్తాము. మీ జీవ శక్తులు ఆహ్లాదకరంగా మారితే మనం దానిని పారవశ్యం అని పిలుస్తాము, అవి చాలా ఆహ్లాదకరంగా మారితే, దాన్ని పరమానందం అని పిలుస్తాము. మీ పరిసరాలు ఆహ్లాదకరంగా మారితే, మీరు దానినే విజయం అని పిలుస్తారు. మీకు కావలసిందల్లా ఇదే, అవునా ? "లేదు, నేను స్వర్గానికి వెళ్లాలనుకుంటున్నాను."అని అంటారా? మీరు స్వర్గానికి ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు - ఎందుకంటే "ప్రకటనలు" ఎప్పుడూ, అది చాలా ఆహ్లాదకరమైన ప్రదేశమని చెప్తూ ఉన్నాయి కాబట్టి. మీకు కావలసిందల్లా ఆహ్లాదం. అలాగే మీరు, ఈ ప్రపంచంలో, డబ్బు మీ కోసం దానిని కొనగలదని మీరు నమ్ముతారు, కొంతవరకు అది వాస్తవమే.

కానీ డబ్బు బయటి ఆహ్లాదాన్ని మాత్రమే సృష్టించగలదు, అది అంతర్గత ఆనందాన్ని సృష్టించలేదు. మీకు చాలా డబ్బు ఉంటే, మీరు ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉండవచ్చు, కానీ మీ శరీరం, మనస్సు, భావోద్వేగాలు ఇంకా శక్తి ఆహ్లాదకరంగా లేకపోతే, మీరు మీ ఫైవ్ స్టార్ హోటల్‌ను ఆస్వాదించగలరా? లేదు. ఈ నాలుగు గనుక చాలా ఆహ్లాదకరంగా ఉంటే, మీరు ఒక చెట్టు క్రింద కూడా అనందంగా ఉండవచ్చు. దానర్థం మీ దగ్గర డబ్బు ఉండకూడదనా ? కాదు, కానీ ఏది మొదట రావాలి? అన్న ప్రాధాన్యతను పరిగణించాలి. మీలోని ఈ నాలుగు విషయాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటే, అలాగే మీకు కొంత డబ్బు కూడా ఉంటే, మీరు బయటి పరిస్థితులను కూడా ఆహ్లాదకరంగా చేయవచ్చు. కాబట్టి డబ్బులో మంచి చెడు అంటూ ఏమీ లేదు. అది ఒక సాధనం అంతే. కాకపోతే, డబ్బు మీ జేబులో ఉండకుండా, మీ బుర్రలోకి పాకినప్పుడే, కష్టాలు మొదలవుతాయి.

ప్రేమాశీస్సులతో,

సద్గురు


Editor’s Note: Follow INSIGHT on Twitter and LinkedIn.