డబ్బులు సంపాదిస్తున్న యువతలో అసంతృప్తి ఇంతగా ఎందుకు పెరుగుతోంది?
ఈ తరం యువతకు ఇదివరలో కంటే సంపాదనలు గణనీయంగా పెరిగాయి. దాంతో పాటు అసంతృప్తి కూడా పెరిగి పోతున్నది. ఈ విషయంలో కొన్ని ప్రశ్నలకు సద్గురు సమాధానాలు:
ప్రశ్న: కొందరు చాలా తక్కువ వయస్సులోనే సంపాదన మొదలు పెట్టేస్తున్నారు. ఇరవై, ఇరవయ్యొక్క సంవత్సరాలకే పెద్ద కంపెనీలలో పెద్ద మొత్తాలు ఆర్జించేసుకొంటున్నారు. కానీ, అలా కొద్ది కాలం గడిచేసరికే, వాళ్ళకు జీవితంలో ఏదో లోపిస్తున్నదన్న భావన కలుగుతున్నది. ఒక శూన్యతనూ, వెలితినీ అనుభవిస్తున్నారు.
సద్గురు: మామూలుగా మనుషులకు అరవయ్యేళ్ళ వయసులో ఏం జరుగుతూ వచ్చేదో, అది ఇప్పుడు ఇరవయి నాలుగేళ్లకే జరుగుతున్నది.. అది వాళ్ళు సంతోషపడాల్సిన విషయమే. జీవిత సత్యాలు తొందరగా బోధపడుతున్నాయి..లేకపోతే, జీవితమంతా వ్యర్థం చేసుకొన్న తరవాతే, యథార్థాలు తెలిసి వస్తూ ఉండేవి.
వెనకటి తరాల వాళ్లకు ఈ విషయాలు త్వరగా బోధ పడక పోవటానికి కారణం ఉంది. పద్ధెనిమిదేళ్ళకే వాళ్లకు పెళ్లి అయిపోయేది. ఇరవై నాలుగేళ్లు వచ్చేసరికి వాళ్ళకు నలుగురు పిల్లలుండే వాళ్లు. మొత్తం జీవితమంతా ఒక సంఘర్షణే - నలుగురు పిల్లలకు చదువులు చెప్పించటం, పెళ్లిళ్లు చేయటం. అంతలో, మనమలూ మనమరాళ్లూ వచ్చేవాళ్లు. అసలు ఏం జరుగుతున్నదో అర్థమయ్యే లోపు గానే మట్టిలో కలిసిపోయే సమయం వచ్చేసేది. అంతిమ యాత్రకు వేళయ్యేది.
ఇప్పుడో? మీ వయసు ఇరవయ్యయిదు. ఇంకా పెళ్లి కాలేదు. చేతిలో డబ్బు ఉంది. ప్రపంచమంతా చూసి వచ్చారు. వీటికేమీ అర్థం లేదని కూడా మీకు అర్థమైపోయింది.. మనుషులకు ఇదంతా తొందరగా తెలిసిరావటం మంచిదే!
ప్రశ్న: మరి, ఆ పరిస్థితిలో వాళ్లు ఏం చేయాలి? ఏ మార్గం అనుసరించాలి?
సద్గురు: అనుసరించేందుకు రెండు మార్గాలుంటే కదా ! ఉన్నది జీవితమొక్కటే. జీవితం ఏ లోతూపాతూ లేని పై పై వ్యవహారం మాత్రమే అని మీకనిపిస్తున్నదంటే, మీరు పై పైన మాత్రమే జీవిస్తున్నారని అర్థం. మీరు జీవితంలోకి ఇంకా కాస్త లోతుగా వెళ్ళి చూడాలి. జీవితాన్ని జీవించటం తప్ప మరొక మార్గం ఉందా ? 'వద్దు, నేను చావాలనుకొంటున్నాను!' , 'ఉంటే మంచిదా, లేకుంటే మంచిదా?' (ఇలాంటి తర్కంలోకి వస్తే,) మరణం కూడా మీ జీవితంలో భాగమే. కనక ఇక్కడ చేయగలిగిందల్లా జీవితాన్ని జీవించటమే. ఆ జీవించటం పై పైన జీవించటమేనా, లేక జీవితపు లోతులు అన్వేషించటమా అన్నదొక్కటే తేల్చుకోవాల్సిన విషయం. మరో వికల్పం ఏముంది?
ప్రశ్న: ఇక్కడ మరో ప్రశ్న వస్తున్నది. సరయిన గురువుని ఎంచుకోవటం ఎలా? ఇప్పుడు చాలామందికి ఎవరిని నమ్మవచ్చో తెలియటం లేదు.
సద్గురు : ఎవరినీ నమ్మకండి! మీరు ఈశాకి వచ్చేట్టయితే, నేను మీకు ముందొక తేలికయిన సాధన చెప్తాను. దాన్ని ఆచరించి చూడండి. దానివల్ల మీకు ఏ సత్ఫలితమూ కలగకపోతే, వెళ్లిపోండి. అది పని చేస్తే, తరవాతి అడుగు వేయండి. లేదా దాని వల్ల మీ అంతరంగంలో ఏదయినా రగులుకొన్నదంటే , ఇక నేను మీకు ఏమీ చెప్పనక్కరలేదు. మీరు చేయవలసిందేదో మీరే ఎలాగూ చేసేస్తారు. అప్పటివరకూ ఒక్కొక్క అడుగే వేస్తూ వెళ్ళండి. ఏదయినా ఫలితం ఉంటే, ఇక్కడే ఉండిపోయి, మరిన్ని అడుగులు వేయండి.
ప్రశ్న: కానీ, గమ్యం ఏమిటో తెలుసుకోవటం ఎలా?
సద్గురు: మీరు కొన్ని పరిమితులకు లోబడి జీవిస్తున్నారన్న విషయం మీరు గమనించారా? మీకు ఉండే ఒకే ఒక లక్ష్యం ఆ పరిమితులను తొలగించేయటం. ఆ లక్ష్య సాధన మార్గంలో మీరు ఏం చేయాల్సి వస్తుంది అన్నది మీ సమర్థత మీద ఆధారపడి ఉంటుంది. ఇల్లు ఊడుస్తారో, లేక ఏదయినా బృహత్కార్యం నిర్వహిస్తారో, లేదంటే ఒక దేశాన్నే నడిపిస్తారో, లేక మరేదయినా చేస్తారో ! ఇదంతా త్రోవలో జరిగే వ్యవహారం.
భారతదేశంలో జీవించటంలో ఉన్న ప్రత్యేక విశిష్టత ఇదే. మీరు ఒక మహారాజయినా, అక్షరాస్యత కూడా లేని రైతు అయినా, మహా పండితులయినా, అందరూ పొందాలని ఆశించే గమ్యం ఒక్కటే - అది ముక్తి ! ఒకడు రాజు అయినంత మాత్రాన గొప్పేమీ లేదు. అందరం ఒక గమ్యం చేరటానికే వెళ్తున్నాం. ఎవరు ముందు చేరతారు అన్నదొక్కటే ప్రశ్న!