వికలాంగులైన పిల్లలు బాధపడతారా...?
భిన్నవిధమైన సామర్థ్యాలు కలిగిన పిల్లలు బాధపడతారా.. అన్న ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తున్నారు..
ప్రశ్న : కొంతమంది పిల్లలు వైకల్యాలతో ఎందుకు పుడతారు? వాళ్లెందుకు బాధపడాలి?
వాళ్లు బాధపడరు, తల్లిదండ్రులే బాధపడతారు. వాళ్లు భిన్నంగా ఉన్నరంతే. వాళ్లు వికలులని మీరనుకుంటారు - అది మీ భావన. వాళ్లు మరొకరిలాగా లేకపోతే మీరిటువంటి అభిప్రాయాలకు వచ్చేస్తారు. మీరు వాళ్లని వికలాంగులనండి లేదా సామాజికంగా సరైన పరిభాషలో భిన్నసామర్థ్యాలు కలిగిన పిల్లలనండి, మీరేం పేరు పెట్టినా వాళ్లు కేవలం భిన్నమైనవాళ్లు. తక్కిన పిల్లల్లో చాలామంది చేసే పనులు వాళ్లు చేయలేకపోవచ్చు. కాని, వాళ్లు బాధపడరు. వాళ్లను ఇతరులతో పోల్చి బాధపెడుతున్న వాళ్లు మీరు. లేకపోతే వాళ్లంతట వాళ్లు బాగానే ఉంటారు. తల్లిదండ్రులెందుకు బాధపడతారు? వాళ్లు మరొకరి పిల్లలతో పోల్చి చూస్తున్నారు, ‘‘మా పిల్లవాడు అట్లాలేడు, మా పిల్లవాడికి మొదటి ర్యాంకు రాలేదు’’ అని ఏడుస్తుంటారు. ఇదంతా కేవలం సామాజిక పరమైన అర్థరహిత విషయం.
మీరు దీనితో సహజీవనం చేయలేకపోతే దాన్ని ప్రకృతికే వదిలేసే ధైర్యం ఉండాలి. మీరు ప్రకృతికే వదిలేస్తే ఎవరికి సామర్థ్యం ఉంటే వారే బతికి బయటపడతారనే సిద్ధాంతం ప్రకారం జరుగుతుంది. మీకా ధైర్యం ఉందా? లేదు. వాళ్లు చనిపోతే మీరు ఏడుస్తారు; వాళ్లు బ్రతికుంటే - కూడా మీరు ఏడుస్తారు - మరిదేమిటి? ఒక వేళ, వాళ్ల అవయవాలన్నీ చక్కగా ఉన్నా, వాళ్లు మీ ఆశలు నెరవేర్చలేదనుకోండి, మీరు వాళ్లు ఎలా జీవించాలని అనుకుంటున్నారో, వాళ్లలా జీవించలేదనుకోండి - అప్పుడూ మీరు ఏడుస్తారు. ఏమిటి ఇదంతా? ఎట్లా అయినా మీరు ఏడుస్తారు. సరే. కొంచెం నవ్వడం నేర్చుకోండి. జీవితంలో మార్పు ఉంటుంది.
ఒక లోపం వల్ల ఎవరూ దుఃఖంలో ఉండరు. ఒక జబ్బు లేదా ఒక వైకల్యం ప్రాథమికంగా, విచారాన్ని కలిగించలేదు. అది కేవలం ఒక భౌతిక స్థితిని మాత్రమే కల్పిస్తుంది. దుఃఖం మీరు కల్పించికునేదే, మరెవరో చేసేది కాదు, మీరు కల్పించుకున్నది మాత్రమే, కాకపోతే మీరు దీనిని స్పృహతో చేయడం లేదు. మీ ప్రాథమిక అంగాలు - మీ బుద్ధి, మీ శరీరం – ఇవి మీ నియంత్రణలో లేవు. మీకు విచారం ఇందువల్ల కలుగుతోంది.
పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి, కొన్ని మీరు ఇష్టపడ్డవి, మరి కొన్ని మీకు ఇష్టంలేనివీ. కొన్ని పరిస్థితులను మీరు నిర్వహించగలిగినవైతే, మరి కొన్నిటిని నిర్వహించలేకపోవచ్చు. జీవితం ఈ విధంగానే ఉంటుంది. కాని విచారమనేది మీరు సృష్టించిందే, పరిస్థితులు కల్పించింది కాదు. పరిస్థితి మీ చేతిలో లేకపోతే, మీకై మీరు విచారంలో మునిగిపోవడానికి ఉన్న అవకాశం బోలెడంత.
సరే, ఎదో కొద్ది శాతం ఉన్న వికలాంగుల సంగతి పక్కన పెట్టండి. కాళ్లూ, చేతులూ బాగుండి, విచారంగా ఉండేవాళ్ల సంగతేమిటి? మీ జీవితాన్ని పరిశీలించుకోండి. మీ కాళ్లూ చేతులూ సరిగ్గానే ఉన్నాయి, అంతా సరిగ్గానే ఉంది. కాని 24 గంటల్లో ఎన్ని క్షణాలు మీరు నిజంగా ఆనందంగా ఉన్నారు? ఒకవేళ మీరు ఆనందంగా ఉంటే ఆ క్షణాలు మరీ కొద్దిపాటివి, కదూ! ఇది చాలా దురదృష్టకరమైన జీవన విధానం.
మీరు ఇది పరిశీలించి చూడండి, తెలుస్తుంది. కొందరు రెండు చేతులతో పుడతారు, కొందరు ఒక చేత్తో. కొందరికి తెలివితేటలు ఎక్కువ, మరి కొందరికి తక్కువ. ఇదంతా ప్రకృతిలో భాగం. మనకున్న వాటిని మనం సరిగ్గా ఉపయోగిస్తే, వైకల్యంలో దీనత్వం ఉండదు. మీ అపోహను పక్కకు పెట్టి, మీ మానవతను పనిచేయనిచ్చారనుకోండి, వైకల్యంలో దీనత ఉండదు.