గోపాల గోపాలా గోపీ వల్లభ గోపాలా

గోవింద గోవింద రాస లీలా గోవిందా

గోపాల గోపాలా గోపీ వల్లభ గోపాలా

గోవింద గోవింద యదుకుల శూరా గోవిందా

గోపాల గోపాలా గోపీ వల్లభ గోపాలా

గోవింద గోవింద మురళీ లోలా గోవిందా

గోపాల గోపాలా గోపీ వల్లభ గోపాలా

గోవింద గోవింద రాధే మోహన గోవిందా

గోపాల గోపాలా గోపీ వల్లభ గోపాలా

గోవింద గోవింద శ్యామ సుందర గోవిందా

సద్గురు: గోపాల అంటే ఏమిటి? దాని అర్థం ఏమిటి? గో అంటే గోవు. పాల అంటే దానిని పోషించే(కాచే) వాడు. కృష్ణుని గోపాలునిగా చూశారు. సామాన్యంగా దైవాన్ని ఎప్పుడూ గొప్ప యోగులుగానో, చక్రవర్తులుగానో గుర్తించారు.... కాని గోవులను కాచే వానిగా...సామాజికంగా అది చాలా తక్కువ స్థాయి. అందుకే గోపాలుడు. కేవలం గోవులు కాచే వాడు - కాని మీరు ఆయనను ఉపేక్షించలేరు. మొదటనుంచీ ఆయన అందం, వివేకం, బలం, పరాక్రమం వీటిని మీరు ఉపేక్షించలేరు. పసివానిగా కూడా ‘ఆయన ఎవరో’ అన్నది ఎవరూ ఉపేక్షించలేకపోయారు. ఎందరో ఆయనను ‘‘ఓ గొల్లవాడు’’ అంటూ తృణీకరించే ప్రయత్నం చేశారు. కాని అదే మిగతా అందరికీ ఓ గొప్ప వరం అయింది. ‘‘అతనో గోపాలుడు’’ మనం ఆయనను గోపాలునిగా ప్రస్తావించినప్పుడు, ఎంతో ప్రేమ పూర్వకంగా సంబోధిస్తున్నాము. మనం ఆయనను ‘‘గోవింద’’ అన్నప్పుడు, ఆయన ఒక దేవునిగా శిరస్సువంచి నమస్కరిస్తున్నాము. ఒక క్షణం ఆయన దేవుడు, మరుక్షణం ఒక బాలుడు, మరో క్షణం కేవలం ఒక మనిషి- ఒకే సమయంలో అనేకం.

‘‘లీల’’ అంటే ఆట లేక క్రీడ. జీవం యొక్క ఎంతో గాఢమైన ప్రమాణాలను, సృష్టి యొక్క పరమోత్తమ తత్వాన్ని ఒక క్రీడగా చూపవచ్చు. ‘‘రాస’’ అంటే జీవితసారం, తియ్యదనం. ‘‘రాసలీల గోవింద’’ అంటే ఆయన జీవిత సారాన్ని అనుభవించి(ఆనందించి)న వాడుగా మనం సూచిస్తున్నాము. నెలలోని కొన్ని రోజుల్లో, లేక పని అయ్యాక సాయం సమయాల్లో, ఆ సమాజంలోని వారితో ఆయన జరిపిన నృత్య క్రీడలను మనం ‘‘రాసలీలలు’’ అంటాము. అంటే ‘‘జీవిత సారంతో క్రీడించడం.’’ అదే కాలక్రమేణా ‘కామ, క్రోధాలకు’ అతీతమైన జీవం, కేవలం జీవంగా గుర్తించబడింది. జీవసారం ప్రసరించింది, ఎందువల్లనంటే అక్కడ కామ క్రోధాలు లేవు కాబట్టి. అందుకే ఆ నృత్యం కేవలం నృత్యం కాదు, అది భావాలకు అందని మరోకోణం.

ఈ అంశం అనేక విధాలుగా ప్రస్తావించబడింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో, ఈ కృష్ణ సంస్కృతి వివిధ రకాలుగా వృద్ధిపొందింది. కారణం భారతదేశం, భిన్న సంస్కృతుల దేశం. తమిళనాడులో ‘‘ఆశయుం, కోపముం ఇల్లా నగరం’’ అని పాడతారు. అంటే ‘కోరిక, కోపము లేని తావు’ అని అర్థం. ఎప్పుడైతే మనిషికి కోపావేశాలు లేవో, అతనిక ‘స్వార్థ ప్రయోజనాలంటూ’ ఏమీ లేనివాడు, అతనిక ‘ప్రేమానందాల’ తో నిండి ఉన్నవాడు.

‘యదుకుల శూర’ అంటే యదుకులానికి చెందిన శూరుడు, ధీరుడు అని. యదుకులం అంటే అదో రాజుల వంశం. రాజవంశాలు కొన్ని సూర్యవంశాలు, మరికొన్ని చంద్రవంశాలు. ఈ యాదవులు చంద్ర వంశానికి చెందిన వారు. మరి యదుకుల అంటే యదువంశానికి చెందిన వాడని. శూర అంటే ధైర్య సాహసాలు గల వ్యక్తి అని. అదే సమయంలో అది ఆయన పుట్టిన తెగ పేరు కూడా. ఆయన తండ్రి వాసుదేవుడు ‘శూర’ వంశస్థుడు. అది రెండు రకాలుగానూ ప్రస్థావించబడింది.

తరువాత వచ్చేమాట ‘మురళీ లోల’ అంటే మురళిని వాయించడానికి ఇష్టపడేవాడు. మురళి అంటే వేణువు. ప్రజలను తన మురళీ వాదనతో మైమరపింప చేసేవాడు అని. తరువాతి మాట ‘రాథే మోహన’ అంటే రాధను ప్రేమించిన వాడు. లేక రాధను మోహానికి గురి చేసినవాడు. రాధ వల్ల మోహపరవశుడైన వాడు లేక రాధను మోహపరవశం చేసినవాడు, రెండు విధాలుగా అనుకోవచ్చు.

ఆఖరిది ‘శ్యామ సుందర’ సుందర అంటే మనకు తెలుసు, అందమైన అని. శ్యామ అంటే ’సాయం కాలం‘ ‘సంధ్యాకాలం’. కృష్ణుడు నీలమేఘ శ్యాముడు, సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు, నీలం రంగులోని ఆకాశం, నలుపు రంగులోకి మారుతుంది, దాదాపు నల్లని నీలిరంగు కనబడుతుంది, అదే ఆయన మేని ఛాయ. అందుకే ఆయనను శ్యామ సుందరుడు అంటారు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు