హింసకు కారణం, ఇంకా దాన్ని ఆపటానికి పరిష్కార మార్గం
వార్తల నిండా హింసాత్మక సంఘటనలు ఉండడం వల్ల, “మానవజాతి ఇలాంటి ఘర్షణలతో జీవించక తప్పదా?” అని ఆశ్చర్యం కలుగుతుంది. ఈ హింసా తత్వాన్ని పూర్తిగా అంతం చేయడానికి పరిష్కారం ఏమిటి? దీనికి సద్గురు మార్గాన్ని చూపుతున్నారు.
ప్రశ్నకర్త: హింసను పూర్తిగా అంతమొందించటానికి మీరేమి పరిష్కారం చెబుతారు?
సద్గురు: కొన్ని సంవత్సరాల క్రితం నేను కాలిఫోర్నియాలో ఉన్నప్పుడు, "మా గవర్నర్ మీ గవర్నర్‌ను కొట్టగలడు" అని వ్రాసిన బంపర్ స్టిక్కర్ చూశాను. మనం సంస్కృతిని ఎక్కడికి తీసుకువెళుతున్నామో అది తెలుపుతుంది. నేటి సినిమాలన్నీ ఒకరినొకరు కాల్చి చంపుకోవడం గురించే. వీడియో గేమ్‌లలో చాలా వరకూ ఇతరులను కాల్చే గేములే. బొమ్మల దుకాణానికి వెళితే, సగం బొమ్మలు తుపాకీలే. యుద్దాలని ఇంకా కిటికీల గుండా వెళ్లిమరీ చంపగల స్మార్ట్ బాంబులను మనం ప్రశంసిస్తాము. నేటి ప్రపంచంలో దాదాపు ప్రతిదీ హింసాత్మకంగా మారుతోంది. మన సంగీతం, మన నృత్యం, మన సంస్కృతి, జీవితంలో మనం మసలే పద్ధతి, ఇంకా పని చేసే విధానం ప్రతీది హింసాత్మకంగా మారుతోంది. కాబట్టి అప్పుడప్పుడు అది వీధిలో అభివ్యక్తం అయితే అందుకు మనం ఆశ్చర్యపోనక్కర్లేదు.ఒక వ్యక్తిగా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఒక రోజులో, మీ పక్కన కూర్చున్న వ్యక్తిని సహించలేకపోతున్నారని ఎన్ని సార్లు అనుకొని ఉంటారు? మిమ్మల్ని మీరు నిగ్రహించుకోవడం అనేది కొంత సమయం వరకు మాత్రమే పని చేస్తుంది. ఆ తరవాత ఎప్పుడో ఒకప్పుడు, పరిస్థితులు అనుకూలించినప్పుడు, అది బయటికి పేలుతుంది, ఎందుకంటే ఈ హింస అనేది మనిషిలోనే ఉంది. మనం సరిచేయాల్సినది మనిషిలోని ఈ హింసాత్మక ధోరణిని. మనం, మనిషిలో ఉన్న ఈ మంటలను ఆర్పకపోతే, వీధిలో రగిలే మంటలను ఆర్పలేము. కచ్చితంగా అది ఇవాళో రేపో బయటకు వ్యక్తం అవుతుంది.
మానవుడిగా ఉండడంలో అపారమైన శక్తి ఇంకా అద్భుతమైన సామర్థ్యం ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. అతను తన శక్తియుక్తులకు ఒక వ్యక్తీకరణను కనుగొని, వాటికి సరియైన మార్గ నిర్దేశం చేయకపోతే, ఖచ్చితంగా తను హింసాత్మక చర్యలే చేస్తాడు.హింస అంటే మీరు వీధిలోకి వెళ్లి ఎవరినో చంపాలనేమీ లేదు. మీరు కోపంగా ఉన్నా, చిరాకుగా ఉన్నా, నిమ్మళంగా కూర్చోలేకపోతున్నా - అది హింసే. అంతరంగంలో నుండి మనం దాన్ని పెరికివేస్తే తప్ప, నిజంగా శాంతి అనేది కలగదు. యోగ శాస్త్రం, మీ శక్తులను పెంపొందించుకుని, వాటిని సరైన దిశలో వినియోగించడం గురించే, తద్వారా మీరు మీ శిఖర స్థాయి వ్యక్తీకరణను పొందగలుగుతారు. మీరు "జీవం" అని పిలిచే ఈ శక్తి, ఒక వ్యక్తీకరణను పొందేలా మీరు చేయకపోతే, సహజసిద్ధంగానే అది హింసాత్మక మార్గాలలో వ్యక్తీకరణ పొందే ప్రయత్నం చేస్తుంది.
వ్యక్తి స్థాయిలో పరివర్తన తీసుకురావడం కోసం ఉద్యమాలు వస్తే తప్ప, శాంతి చేకూరదు. ఇది వీధిలో గుంపుతో చేసే పని కాదు. వ్యక్తిగత పరివర్తన దిశగా ఒక నిబద్ధతతో కృషి అవసరం. ప్రపంచానికి శాంతిని చేకూర్చేది, నినాదాలో లేకా ప్రకటనలో కాదు, మానవ సమాజంలోని అన్ని స్థాయిలలో శాంతియుతమైన మానవులను ఉత్పత్తి చేయడానికి జీవితమంతా కృషి చెయ్యడం వల్లనే ప్రపంచానికి శాంతి చేకూరుతుంది. అలాంటిది అసలు సాధ్యమేనా? ప్రస్తుతం ఉన్న వాస్తవికతల ఆధారంగా భవిష్యత్తు గురించి ఆలోచించవద్దు. ప్రపంచంలోని ప్రస్తుత వాస్తవికతలు ఒక్క క్షణంలో మారగలవు, ఎందుకంటే ప్రస్తుత వాస్తవికతలు ప్రజల ఆకాంక్షలని, నిబద్ధతను ఇంకా మానవ హృదయంలో ఉన్న శక్తిని పరిగణనలోకి తీసుకోవు. మనం వాటిని ప్రేరేపించగలిగితే, మానవ హృదయాలను తట్టగలిగితే , శాంతి ఖచ్చితంగా సాధ్యమే. ఇది మన చుట్టూ జరిగేలా చేయడానికి మనల్ని మనం అంకితం చేసుకుంటే, మన జీవితకాలంలోనే ఈ ప్రపంచంలో అద్భుతమైన ఇంకా నాటకీయమైనదేదో జరగడాన్ని మనం చూడవచ్చు.