జీవితంలో సాహసం పాత్ర ఎటువంటిది?
సాహసం లేని జీవితం అర్థం లేనిదని, కానీ సాహసం అంటే నిజంగా ఏమిటో ఈ వ్యాసం ద్వారా తెలుసుకోండి.
అసలు సాహసం అంటే అర్థం ఏమిటి?
సద్గురు: మీ జీవితంలో, మీకు తెగువతో కూడిన కార్యాలు ఉంటాయి లేదా సాహసాలు ఉంటాయి. సాహసం అంటే మీ తరువాతి అడుగు ఎక్కడ వేయబోతున్నారో మీకు తెలీదని అర్థం. అంటే అర్థం అందులో ప్రమాదం ఉందని. ఒకవేళ ప్రమాదం లేకుండా అంతా సురక్షితంగా ఉందంటే అందులో సాహసం ఉండదు. సాహసం అంటే మీకు తెలియని దానిలోకి మీరు అడుగు పెట్టాలనుకుంటున్నారు. మీరు ఊహకు అందే దానిలోకి అడుగుపెడితే అది సాహసం కాదు, అది ఒక చర్య మాత్రమే అవుతుంది.అత్యుత్తమమైన సాహసం
సాహసం అంటే మీరు బయటకు వెళ్లి ప్రపంచాన్ని జయించవలసిన అవసరమేమీ లేదు. వాస్తవానికి సాహసం అంటే, మీ ఇష్టాలను, అయిష్టాలను, ఇది “నాది”, ఇది “నాది కాదు” అనే భావన మీరు వదిలి పెట్టారని అర్థం. సాహసం అంటే, తమకు అతీతమైన వాటికి తమను తాము సమర్పించుకోవడం. ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించడం ఒక గొప్ప సాహసంలా అనిపించొచ్చు, కానీ చైతన్యపు శిఖరాన్ని స్వారీ చేయడం అంత కంటే పెద్ద సాహసం. అన్నింటికంటే గొప్ప సాహసాన్ని మీ కళ్ళు మూసుకుని మీరు చేయగలరు. మీరెవరో నిరూపించుకోవాలనే ఒక వెర్రికోరిక సాహసం అనిపించుకోదు.
జీవితంలో, అత్యుత్తమమైన సాహసం అంటే పర్వాతాన్ని అధిరోహించడమో, మోటార్ సైకిల్ నడపడమో లేదా పర్వతంపై నుండి దూకడమో కాదు. జీవితంలో అత్యుత్తమమైన సాహసం అంటే, ప్రతి రోజూ మీ బుర్రలో ఉన్న ఒక్క మూసనైనా మీరు పగులగొట్టడం. ఒకవేళ మీరు స్వారీ చేస్తున్నా, ఎగురుతున్నా, లేదా ఇంకేదైనా చేస్తున్నా, మీ పరిమితులను అధిగమించి ముందుకు సాగడంలోనే సాహసం ఉంది. ఇలా చేసేందుకు మీకు ఎవరూ అడ్డు చెప్పరు. మీరు ఆఫీస్ లో 9 నుండి 5 వరకు పని చేస్తున్నా లేదా ఇంకేదైనా చేస్తున్నా, దీనికి ఎవరూ అడ్డు పడలేరు. ప్రతి రోజూ మీరు ఒక బంధనాన్ని చేధిస్తే, మీలో ఎన్ని రాశుల పరిమితులు ఉన్నాయి అన్న దాని బట్టి, ఏదో ఒక రోజు మీరు తప్పక విముక్తులౌతారు. ఇది తప్పక జరుగుతుంది.
సాహసోపేతమైన జీవితాన్ని జీవించడం ఎలా?
Question: నమస్కారం సద్గురు, నా పేరు అభిమన్యు, నేను రెండవ తరగతి చదువుతున్నాను. మీరు అమెరికాలో చేసిన బైక్ రైడ్ వీడియోని చూశాను. మీరు నిజంగా చాలా సరదాగా ఉన్నారు, చాలా వేగంగా బైక్ ని నడిపారు, నాకది ఎంతో నచ్చింది. నాకు మీతో బైక్ రైడ్ చేయాలనే కోరిక ఎంతగానో ఉంది. నా ప్రశ్నేమిటంటే, చిన్న పిల్లలు బైక్ పై మీ వెనుక కూర్చోవడం మీకు సమ్మతమేనా?
సద్గురు:: చూడు అభిమన్యు, అర్జునుడి కొడుకైన, ఎంతో ప్రఖ్యాతి గాంచిన అభిమన్యుడి పేరే మీరు పెట్టుకున్నావని మీకు తెలుసుగా. అతనొక తెలివైన యువకుడు, ఎంతో ధైర్యసాహసాలు కలవాడు. దురదృష్టవశాత్తూ, అతను కొంచెం తొందరలో ఉండడం వల్ల అతని జీవితం త్వరగా ముగిసింది. యుద్ధరంగంలో వ్యుహంలోకి ఎలా చోచ్చుకుపోవాలో గ్రహించాడు, కానీ అందులో నుండి ఎలా బయటకు రావాలో తెలుసుకునేంత సహనం అతనికి లేదు. అందువలన చిన్న వయసులోనే అతను చంపబడ్డాడు - ధైర్యం గల యువకుడు, ఇప్పటికీ అతనికి ప్రఖ్యాతి ఉంది - కానీ దురదృష్టవశాత్తూ, అతని సాహసం సరైన ఫలితం ఇవ్వలేదు.
మిమ్మల్ని ఉత్తేజపరిచేదేంటో మీరు అర్థం చేసుకావాలని నేను అనుకుంటున్నాను. నేను మోటార్ సైకిల్ ని నడుపుతున్నాను, అది మిమ్మల్ని ఉత్తేజపరిస్తుంది, కానీ సాహసం మోటార్ సైకిల్ పైన మాత్రమే లేదు. మీకున్నభౌతికపరమైన, మానసిక పరమైన, భావోద్వేగ పరమైన ఇంకా గ్రహణశక్తి పరమైన పరిమితులను అధిగమించాలని ప్రయత్నం మొదలుపెట్టినపుడు - అప్పుడు మీరు సాహసం చేసే క్రమంలో ఉన్నట్టు. సాహసంగా పిలువబడే ప్రత్యేకమైన చర్యలు అంటూ ఏమీ లేవు. సాహసమనేది మీరు చర్యను నిర్వర్తించే విధానం.
చాలా మంది వారికి కొత్త ఉద్యోగం వచ్చినపుడు ఎంతో ఉత్తేజితమౌతారు. కానీ కొంత కాలం తర్వాత, వారికి ఉద్యోగం కూడా బాధే. ప్రజలు కొత్త ప్రదేశానికి వెళ్ళినపుడు చాలా ఉత్తేజితమౌతారు, కానీ కొంత కాలం గడిచాక, కానీ మళ్ళి అదే అంటే, అది బోర్ కొడుతుంది. ఎప్పుడూ కూడా ఉత్తేజాన్నిచ్చే పని కోసం చూడకండి. ఏ చర్యనైనా ఉత్తేజభరితంగా చేసే విధానం ఒకటుంటుంది, దాని కోసం మీరు చూడాలి. మీ జీవితంలోని అతి చిన్న విషయాలను కూడా మీరు ఎంతో హుషారుగా చేయొచ్చు. ఇందుకు కావల్సిందల్లా, మీరు చేసే ప్రతి చిన్న పనిలోనైనా సరే మీ శరీరం, మనసు, భావోద్వేగాలు, మీ గ్రహణశీలత మీపై మోపే నిర్దిష్ట పరిమితులను ఎలా దాటాలో చూడడం.
నాకు మీ వయసున్నపుడు నన్ను అబ్బురపరచినదేంటంటే, నేనొక చెట్టుని చూస్తే, 'దాని వెనుకున్న దాన్ని నేనెందుకు చూడలేకపోతున్నాను', లేదా నా వేలిని చూసినపుడు 'దాని అవతలి వైపు నేనెందుకు చూడలేకపోతున్నాను' అన్న విషయం. నాకప్పుడు కాంతి సిద్దాంతాల గురించి, అది పరావర్తనం చెందడం వల్ల ఎలా మనం చూడగలం అనేది తెలీదు. కానీ నేను ఎలాగోలా నా కళ్ళను తిప్పి చూడాలనుకునేవాణ్ని. నా కనుగుడ్లు బయటకొచ్చి అలా చూడలేవు. కానీ అప్పుడు నేను, దేనినైనా చూసే ప్రక్రియలో మీరు చూసే దానిలో 50శాతంకు పైగా మీ బుర్రలోనే ఉంటుందని గమనించాను. దేనినైనా చూసేది మీ బుర్ర, మీ కళ్ళు కావు. మీ కళ్ళు ఒక రూపాన్ని లోనికి తీసుకుంటాయి, కానీ చూడడం జరిగేది బుర్రలో. ఈ ప్రక్రియను మీరు శుద్ధి చేస్తే, మీ కళ్ళు చూడలేని దానిలో కనీసం మీరు 50శాతం చూడగలరు. నేను ధ్యాస పెట్టడం వల్ల నాకదొక పెద్ద సాహసంగా మారింది, అలా ఊరికే కూర్చుని దేనివైపైనా కళ్ళప్పగించి చూడడం ఒక పెద్ద సాహసంగా మారింది. బయటి నుండి నన్ను చూసే వాళ్ళకు నేనేదో నిస్తేజమైనది చేస్తున్నానని అనిపించుండొచ్చు, కానీ అదొక అత్యున్నతమైన సాహసం, ఎందుకంటే నన్ను నేను పెంపొందించు కుంటున్నాను.
ఒక విధంగా, యోగా అంటే అర్థం ఇదే. ప్రజలు ప్రతీ ఉదయం శరీరాన్ని సాగదీస్తున్నారు. మీరు కనుక రోజు కంటే మరి కొంచెం సాగదీస్తే , అదొక పెద్ద సాహసం, ఎందుకంటే ఆ ప్రక్రియలో ఉత్తేజభరితమైనది, అద్భుతమైనది ఏదో జరుగుతుంది కనుక.
మీ సాహసాన్ని ఈ సరళమైన ప్రక్రియ ద్వారా ఇప్పుడే ప్రారంభించండి
ఈ సాహసాన్ని మీరు ఈ క్షణమే మొదలుపెట్టాలని నేననుకుంటున్నాను. ఈ రోజిది ప్రయత్నం చెయ్యండి. మీ అమ్మను ఎంత ఆప్యాయతతో చూస్తారో, వీధిలో నడిచే ప్రతి ఒక్కరినీ అంతే ఆప్యాయతతో చూడండి. ఒక్కసారి మీరు, నిరంతరంగా, ఇప్పుడు ఉన్న స్థితి నుండి దాటి ఎలా వెళ్ళాలి అనే క్రమంలోకి వస్తే, మీరు వంతెన లేకుండా నదులను దాటుతారు, ఓడ లేకుండా సముద్రాలు దాటుతారు. అన్నింటికీ మించి, మీకు బంధాలకు మించిన స్నేహం లభిస్తుంది. దురదృష్టవశాత్తూ, చాలా మంది ప్రజలు వారికి సంబంధించిన వారితోనే స్నేహబంధాన్ని ఏర్పరచుకోగలుగుతున్నారు. దేనితోనైనా సంబంధం ఎందుకు ఏర్పరచుకోలేపోతున్నారో చూడడం లేదు. మీరు ఒక దానితో సంబందం ఏర్పరచుకుని మరొక దానితో సంబంధం ఏర్పరచుకోలేకపోవడానికి కారణం ఏమిటి? మీరు నిరంతరం మీ భౌతిక పరమైన, మానసిక పరమైన, భావోద్వేగ పరమైన, ఇంకా గ్రహణశీలత పరమైన పరిమితులను ఎలా విస్తరించాలో చూస్తే, మీ జీవితం ఒక పెద్ద సాహసమౌతుంది.
జేన్ గుడ్ఆల్ - సాహసోపేతమైన స్పూర్తి
నేను జేన్ గుడ్ఆల్ ను కొంత కాలం క్రితం కలిశాను. తను చిన్న పాపగా ఉన్నపుడు, తన సాహసపు తృష్ణ తనని కోళ్ళ గంపలో నిద్ర పోయేలా చేసింది, ఎందుకంటే తను, కోళ్ళు గుడ్లు ఎలా పెడతాయో, గుడ్లను ఎలా పొదుగుతాయో చూడాలనుకుంది. కోళ్ళ గంపలో నిద్రపోవడమనేది వెర్రితో కూడిన చెత్త పనిలా కనిపించొచ్చు, కానీ మీ గ్రహణశీలతను పెంపొందించుకోవడానికి, మీరిప్పుడున్న పరిమితుల ఆవల ఉన్న దాన్ని సృశించడానికి ఏది అవసరమో అది చేయడానికి ఉన్న సుముఖతే సాహసానికి మూలం.
మీరు దేని పట్లైనా ఎంతో గాఢమైన ప్రేమానుభూతిని పెంపొందించుకున్నపుడు, మీరు సహంజగానే మీ పరిధులన్నింటికీ అతీతంగా విస్తరిస్తారు. ఆది మానవుడి గురించిన ఏ విషయాలనైనా తెలుసుకున్న మొట్టమొదటి అధికారుల్లో జేన్ గుడ్ ఆల్ ఒకరు. ఆది మానవుల గురించి, అంటే వారి సామర్థ్యం, వారు ఎలా జీవించారు అనే అంశాలు, వారేమి తిన్నారు, ఒకరికొకరు ఎలా స్పందిస్తారు అనే అవగాహన ఆవిడ కృషి వలనే మనకు తెలిసింది.
సాహసోపేతమైన క్రీడల గురించి సద్గురు - అంత రిస్క్ చేయడం సరైనదా
జీవితపు ప్రతి అంశంలోనూ సాహసానికి తావు ఉంది. సాహసం అంటే మీ సామర్థ్యాన్ని, సమర్ధతను నమ్మి దానికి మించి మరో అడుగు వేయడం. అందులో రిస్క్ ఉంటుంది కూడా. రిస్క్ లేకుండా సాహసం లేదు. దురదృష్టవశాత్తూ, కొన్నిసార్లు యువకులు చనిపోతారు. నాకు 35 ఏళ్ళు వచ్చే లోపే, కనీసం నా స్నేహితుల్లో 12 - 13 మంది ఇలా చనిపోయారు - కొందరు మోటార్ సైకిల్ యాక్సిడెంట్లలో, కొందరు హాంగ్ గ్లైడింగ్ చేస్తూ, మరి కొందరు వేరేవేవో చేస్తూ….అవన్నీ మేమందరం కలిసి చేసే సాహసాలే. అయితే, వీటి వల్ల నేను చనిపోలేదు... కానీ అవన్నీ చేయకుండా నేను బ్రతకలేకపోయేవాడిని. ఒకవేళ అందులో ఏ ఒక్కటైనా నన్ను అంతం చేసేదైనప్పటికీ అది నేను చేసే తీరే వాడిని. అది, అహంతో కూడిన దూకుడుతనంతో, మిగతా వారు చేయలేనిదేదో నేను చేయాలనే ఉద్దేశం వల్ల కాదు, కానీ అలా చేయడం పరిమితులకు అతీతంగా విస్తరించడం గురించి.
అది నూరు శాతం సురక్షితమా అంటే, కాదు. ఏదీ నూరు శాతం సురక్షితం కాదు, ఎందుకంటే మనందరం చనిపోయేవాళ్ళమే, కాదంటారా? రిస్క్ లేని సాహసం అంటూ ఏదీ లేదు, కానీ సాహసం చేయాలనుకోని యువత యువతే కాదు. వాళ్ళను మీరు ముసలివాళ్ళలా కప్పేట్టేయొచ్చు. వారు ఏదైనా చేయాలి. అంటే వాళ్ళు వీధుల్లో ఏవో మొరటు పనులు చేయాలని కాదు. వారు ఇలాంటి వాటిని తగినంత భద్రతతో చేయడానికి అవసరమైన పరిస్థితులను, ప్రదేశాలను సృష్టించగలం. కొంతమంది తల్లిదండ్రులు దీనికి సమ్మతించరు, కానీ ఇలా చేయకపోతే వారు మరెక్కడైనా, మీరు చూడని చోట చేస్తారు.
నేను అమెరికాలో గమనించింది ఇదే. నేనొక మోటార్ సైకిల్ దుకాణానికి వెళ్లాను, అక్కడ వాళ్ళు మూడేళ్ళ పిల్లల కోసం నిజంగా మోటార్ సైకిల్ ని చేయడం నేను చూశాను. మూడేళ్ళ పిల్లలు హెల్మెట్ పెట్టుకుని, రక్షణ కవచం వేసుకుని బైక్స్ నడుపుతున్నారు, వారి తల్లిదండ్రులు అది చూస్తూ అక్కడ నిలుచున్నారు. ఇది గొప్ప విషయం. ఇలాంటివి లేకపోతే వాళ్లకు పదహారేళ్ళపుడు సాహసం ఏదైనా చేస్తారు, శిక్షణ లేకుండా, భద్రత సన్నాహాలు లేకుండా. అప్పుడు అది ఎలా పరిణమిస్తుందో మనకు తెలీదు.
'సాహసం' పై సద్గురు కవిత
కొంతమంది అంటారు, 'సద్గురు, మీకు సాహసాలంటే వ్యసనం' అని. నేను దేనికీ బానిసను కాదు. వ్యసనం అంటే పునరావృతం, ఎక్కడైతే పునరావృతమవడం జరుగుతుందో, అక్కడ సాహసం ఎక్కడుంటుంది?
ఈ కవితను 'సాహసం' అంటాం:
స్వార్ధం లేని పార్శ్వాల కొరకై
ఉత్సాహపు కెరటాలు ఎగసినపుడు
మొదలౌతుంది జీవితపు సాహసం
మీరెంత దిక్కుమాలిన
పరాన్న జీవి అయి ఉండాలి,
జీవితాన్ని మారకపు లావాదేవీలలో
పెట్టుబడిగా పెట్టే సాహసం చేయడానికి !
సాహసం అంటే గెలవడం కాదు,
ఒక లాభంలేని పెట్టుబడికి తనకు తానే
స్వయంగా లొంగిపోవడం.
జీవితమనే పెట్టుబడిపై రాబడి ఏమీ ఉండదు, ఎందుకంటే మీ జీవితానికి ఏమి రాబడి కావాలి? అనంత విశ్వంలో జరిగే ఎన్నో అద్భుతాలలో, జీవం అనేది అన్నింటికంటే క్లిష్టమైన, అధునాతనమైన, అద్భుతమైన దృగ్విషయం. అది మీ వద్దకు బహుమతిగా వచ్చినపుడు, ఇంక ఏ పెట్టుబడిపైన రాబడి మీకు కావాలి?