జీవితం కలా?...నిజమా??
జీవితంలోని ఇంద్రజాలాన్ని తెలుసుకోవడానికి ఈ సంస్కృతి, ఇక్కడి మనుషులు పాటుపడిన విధంగా మరెక్కడా లేదని, స్వయంగా ఆదియోగి శివుడే దీనికి ఒక ఉదాహరణ అని సద్గురు చెబుతున్నారు.
జీవితంలోని ఇంద్రజాలాన్ని తెలుసుకోవడానికి ఈ సంస్కృతి, ఇక్కడి మనుషులు పాటుపడిన విధంగా మరెక్కడా లేదని, స్వయంగా ఆదియోగి శివుడే దీనికి ఒక ఉదాహరణ అని సద్గురు చెబుతున్నారు.
ఒకసారి ఒక చిన్నపిల్ల నన్ను ఇలా అడిగింది,"జీవితం కలా? నిజమా?" అని. దానికి నేను "జీవితం కలే, కానీ నిజమైన కల," అని సమధానం ఇచ్చాను.
జీవితాన్ని ఏకకాలంలోనే కలగానూ, నిజంగానూ చూడగలగడం ఈ ఉపఖండం చేసిన మహత్తరమైన సేవలలో ఒకటి. అందరూ మాయ గూర్చిన అవగాహనతో పెరిగి పెద్దవాళ్లవుతారు. వాళ్ళకి ఆధిభౌతికమైన విషయాల గురించి సునిశితమైన పరిజ్ఞానం ఉండకపోవచ్చు గాని, వాళ్ళు జీవిస్తున్న ప్రపంచం ఏకకాలంలో నిజమూ భ్రమా అనీ, సత్యమూ, సాపేక్షమూ అనీ కూడా తెలుసు.
ఈ రకమైన దృక్కోణం పౌరాణిక విషయాల్ని చక్కగా అవగాహన చేసుకోగల సామర్థ్యాన్ని కల్పిస్తుంది. ఈ ఉపఖండంలో పౌరాణిక విషయాలెన్నడూ కల్పనలు కావు. అలాగని అవి నిష్ఫలమైన వాస్తవాలూ కాదు. అవి నమ్మబలకడానికి చేసిన కల్పనలూ కావు, లేదా నిష్ఠురమైన గణాంక వివరాలూ కాదు. అక్కడ ఇదా- అదా అని తేల్చుకునే మీమాంశ లేదు. అది రెండూను. ఏకకాలంలో అది కాలాతీతమూ, తక్షణమూను. ప్రగాఢమైన సత్యాన్ని రూపుకట్టగల ఆలోచన - అంతర్దృష్టిల అమూల్యమైన సమాహారం. అది “కేవలం చరిత్ర” పరిమితులను దాటిన లోతైన సత్యం.
ఇంద్రజాలాన్ని తెలుసుకోడానికి ఉదాహరణ ఆదియోగే
నేను యోగాకి మూలమైన శివుణ్ణి ఆదియోగిగా సంబోధిస్తున్నప్పుడు అతన్ని చారిత్రక పురుషుడిగా భావిస్తున్నానా, కాల్పనా వ్యక్తిగా భావిస్తున్నానా, గతానికి గాని, వర్తమానానికి గాని చెందిన సత్యంగా భావిస్తున్నానా అని చాలా మంది అడుగుతుంటారు. నేను, "అతను రెండూను. ఏ ఆకారం కావలస్తే ఆ ఆకారాన్ని సంతరించగల ధూమము వంటివాడు అతను. కానీ ఆ పొగ వెనుక నిశ్చలంగా కాలుతున్న అగ్ని ఉంది. అతను పురాణపురుషుడే. కానీ, అదే సమయంలో అతను ఈ నేలమీద నడిచాడు.
మీరు జీవితాన్ని పై పైనే చూస్తే, మీకు అనేక రకాలైన పొగలు కనిపిస్తాయి. కానీ మీరు మరికొంచెం తీక్షణంగా, ఏకాగ్రతతో చూస్తే, ఆ పొగను సృష్టించిన అగ్ని మీకు బోధపడుతుంది. పొగ అనేక రూపాలు సంతరించుకుంటూ మనల్ని అలరిస్తుంది. నిప్పు మనకి వెచ్చదనాన్నిస్తుంది, కానీ నిజంగా అదేమిటో తెలుసుకోవాలంటే, మీరు బూడిదగా మారడానికి సిద్ధపడాలి.
బూడిద పూసుకున్న ఆదియోగి విగ్రహం సరిగ్గా అదే సూచిస్తుంది. "నేను, నాది" అన్న స్థూల, సూక్ష్మ స్వరూపాలనీ అతను అగ్నికి అర్పించాడు. అందుకే శివ అన్నమాటకి "అస్థిత్వం లేనిది" అని అర్థం. అది హద్దులనన్నీ దహించుకుంటూ పోవడం వల్ల "ఎల్లలు లేనితనం"ని సంభావ్యం చేస్తుంది. మీరు ఏది వాస్తవం, ఏది అవాస్తవం అన్న ప్రాథమిక భావనల వలల తర్కంలో పడిపోతే, జీవితంలోని ఇంద్రజాలాన్ని మీరు గ్రహించలేరు. మీకు తగినంత ఏకాగ్రత ఉంటే, మీకు ఈ ఇంద్రజాలం అన్నింటా కనిపిస్తుంది. ఒక గింజ చెట్టైయ్యింది, పువ్వు పండు అయ్యింది; మీ పుట్టుక విషయానికి వస్తే, రెండు కణాలు మీరుగా(ఒక్కరు) ఆవిర్భవించలేదా? సంకుచితమైన తర్క పరిథులలో తమని తాము బంధించుకున్న వారు ఈ ఇంద్రజాలంతో నిండిన ప్రపంచాన్ని గుర్తించలేరు.
తర్కం మనకు నిలబడడానికి తగిన బలమైన ఆథారాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. కానీ, ఆ ఆధారం ఉన్న స్థావరమే ఈ సమస్త సృష్టికీ మూలమైన ఇంద్రజాలానికి ఆటపట్టు. మనం ఉన్న గ్రహమే ఈ సృష్టికి మూలమైన అనంత విశ్వంలో తేలుతోంది. (అటువంటి అస్థిరమైన) నేలమీద స్థిరంగా నిలబడి ఆకాశానికి(ఉన్నతమైన దానికి) చేతులు జాచి అందుకోగలగడమే ఆధ్యాత్మికత ప్రక్రియలోని అసలు విషయం. .
భారతదేశం కేవలం భూగోళం మీద ఒక ప్రదేశం కాదు; సంక్లిష్టమైన తార్కిక సిద్ధాంతాలూ, వాటి విశ్లేషణలు చేస్తూనే, ఆ భావనల సంకుచిత పరిమితికి పరిమితమవడానికి ఎంతమాత్రం అంగీకరించని మహామహుల ఆలోచనలు, ఇప్పటికీ ప్రతిధ్వనిస్తున్న చైతన్యవంతమైన నేల ఇది. ఇక్కడి మహానుభావులు తర్కాన్ని ఎంతవరకు తీసుకెళ్ళారంటే, తర్కం ద్వారా ఈ సృష్టి ఆస్థిత్వంలోని మార్మిక, ఇంద్రజాలిక రహస్యాలన్నీ తెలుసుకునేంతగా.
పైకి విరుద్ధంగా కనిపించే రెండు ప్రమాణాలు ఏ వైరుధ్యమూ లేకుండా సమిష్టిగా కొనసాగగల అత్యున్నత భావనకి ప్రతీక "ఆదియోగి". ఈ తర్కాన్ని అర్థం చేసుకుని దానికి విస్తుపోవడమా, లేక దాన్ని ఒక సాధనంగా చేసుకుని మనకు అందని, సరికొత్త ప్రమాణాలని అందుకోవడానికి ప్రయత్నించడమా అన్నది మనం నిర్ణయించుకోవలసినది. మీరు ఈ తర్కాన్ని ఎంత గొప్పగానైనా వినియోగించుకో వచ్చు. కానీ, చివరకు అందరూ అగ్ని సమీపానికి రాక తప్పదు. అది శరీరాన్ని దహనం చేసే అగ్ని కావచ్చు; లేదా మన చైతన్య జ్వాల కావచ్చు.