కుటుంబ సంబంధాలలో మనం స్వార్థంగా ఉన్నామా?
సినిమా డైరెక్టర్ కునాల్ కోహ్లి ఇంకా సద్గురు భోపాల్ లో ప్రేమ, బంధాలు ఇంకా కుటుంబాల మీద జరిపిన సంభాషణ.
కునాల్ కోహ్లీ: నేను అతి సామాన్య మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చాను. డెబ్భైవ దశకం మొదట్లో చాలా మంది స్త్రీలు ఉద్యోగాలు చేయని సమయంలో మా అమ్మ మా కోసం ఉద్యోగం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మా నాన్నకి బయటకెళ్ళి ఉద్యోగం చేసే ఆసక్తి లేదు. అమ్మ నన్ను నా సోదరిని పెంచి పోషించి, దేశంలో పేరుగాంచిన ఒక స్కూల్లో చదివించింది. మా సోదరి పెళ్ళి చేసింది. ఆర్థికంగానే కాదు, భావోద్వేగంలోనూ మా నాన్న మాకు తోడు లేరు.
కొద్ది కాలం క్రితం ఆయన ఆసుపత్రిలో ఉన్నాడు, డాక్టర్ ఇంక "ఆశలేదు" అని అతని విషయంలో చెప్పినప్పుడు కూడా నాకేమీ అనిపించలేదు, ఎందుకంటే మా ఇద్దరి మధ్య అంత అనుబంధం లేదు. ఇక నన్ను నేను ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాను. నేను మంచి వ్యక్తిని కానా? నేను మా నాన్నలా అవుతున్నానా? అంతలో ఆయన కోలుకున్నారు, ఇంటికి వెళ్ళగలిగారు. అయినా నాకు ఏమీ అనిపించలేదు. ఒక వేళ మా అమ్మకి జ్వరమొచ్చినా, ఏదైనా అయితే నేను ఆమె దగ్గరకు పరుగెత్తుకొని వెళ్తాను, కానీ ఇక్కడ నా తండ్రి విషయంలో నాకెలాంటి భావన లేదు. ఇది ఆయన మాకు ఏమి చేయనందుకా? తల్లిదండ్రుల విషయంలో కూడా మన భావాలు స్వార్థపూరితమైనవిగా ఉంటున్నాయా?
సద్గురు: నిస్వార్థం అనేది అంటూ ఏమీలేదు. ప్రతిదీ స్వ-లాభం కోసమే. మరో మార్గం లేదు. మీ ఆలోచనలు, భావనలు అన్నీ ఖచ్చితంగా మీ అంతరంగంలోనివే కాబట్టి అవి తప్పనిసరిగా స్వంతానికే అయ్యుంటాయి. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే మీ స్వార్థంలో మీరు ఉదారంగా ఉన్నారా లేక ఔదార్యం లోపించి ఉన్నారా అని. మీ స్వార్థం మీతో శారీరక అనుబంధం ఉన్న మీ భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులకు సంబంధించినదేనా, అంటే మీ స్వార్థం కేవలం మీ కుటుంబంతోనేనా? ఇంకా పెద్దదిగా మొత్తం మానవాళి తోనా లేదా అన్ని జీవరాశులతోనా?
ఇక్కడ ప్రశ్న స్వార్థం అని కాదు. మీ లోభత్వం (కంజూస్ హిందీలో, అంటే కమ్ - జూస్ తక్కువ రసం) మీలో మీ చుట్టూ ఉన్న జీవులపై తగినంత మమకారం, భావుకత లేదని అర్థం. కాబట్టి మీరు మీ జీవితంలో కొంత మంది కోసమే స్పందిస్తారు.
శారీరక లేదా ఆర్ధికపరమైన అంశాలకొస్తే మీరు కొంతమంది గురించే చూసుకోగలరు. కానీ మీ ఆలోచనలు, భావనల విషయానికొస్తే ఈ లోటు లేదు. మీరు విశ్వంలోని ప్రతి జీవికీ స్పందించవచ్చు. సమస్య తగినంత సారం లేకపోవడమే, తగినంత జీవం లేకపోవడమే. మీలో సరైన జీవం ఉంటే మీ చుట్టూ ఉన్న ప్రతి జీవి, కీటకం, పురుగు, మొక్క, పక్షి, పశువు అన్నింటికీ స్పందించగలరు. ఈ విధంగా మీరు మీ జీవితాన్ని సాఫల్యం చేసుకోవచ్చు. జీవితం చాలా పరిమితమైనది.
కునాల్ కోహ్లి: మీ ఈ "కమ్ జూస్" తో పూర్తిగా ఏకీభవించలేకపోతున్నాను. ఎందుకంటే నాకు తెలిసి చాలా ప్రేమను పంచగలను, నేను ఇప్పుడు ఒక వివాదాస్పద అంశాన్ని ప్రస్తావించబోతున్నాను - ప్రతి ఒక్కరి దగ్గర ఎంతో ప్రేమ ఉన్నప్పుడు ఏకపత్నీ వ్రతం సరైనది కాదేమో అనిపిస్తుంది.
సద్గురు : జూస్ అంటే నేనిక్కడ శారీరకమైన హార్మోన్ల గురించి మాట్లాడడంలేదు. నేను అతి ముఖ్యమైన జీవరసం గురించి మాట్లాడుతున్నా. భౌతికమైనవి పరిమితంగా ఉండడమే మంచిది, ఎందుకంటే భౌతికమైన విషయాలకు ఎప్పుడూ పర్యవసానం ఉంటుంది. అభౌతికమైస విషయాలకు పర్యవసానం ఉండదు, వాటికి మూల్యం ఉండదు. మీకు తెలియని ఒక వ్యక్తిని ప్రేమించడానికి మీరు చెల్లించాల్సిన మూల్యం ఏముంటుంది? వారి వైపు ఆప్యాయంగా చూసేందుకు మీకు ఏమి సమస్య. అతను అర్థం చేసుకోగలడో లేదో అతని సమస్య. మీరు ప్రేమిస్తే మీ జీవితం అందంగా మారుతుంది. మీ అంతరంగ మాధుర్యం వేరొకరి గురించి కాదు.
కునాల్ కోహ్లి: ఇది ఏకీభవిస్తాను.
సద్గురు: ఇంకా ఇది ఇంకొకరు ప్రేరేపించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మీ సమస్యేంటంటే మీ ఆనందం, ప్రేమ ఇంకా అన్ని భావోద్వేగాలు మీకు సంబంధించిన అందమైన విషయాలు పుష్ స్టార్ట్ లో ఉన్నాయి. వేరొకరు నెట్టాలి, అప్పుడే అది మొదలవుతుంది. కానీ సెల్ఫ్ స్టార్ట్ కి ఒక విధానం ఉంది. మీరు సెల్ఫ్ స్టార్ట్ లో మీరు ప్రేమతో, ఆనందంతో, పారవశ్యంతో మీ ఉదయాన్నే ప్రారంభించవచ్చు. లేదంటే మీలో ఉత్సుకత నింపాలంటే వేరెవరో ఏదో చేయాలి.
భౌతిక, విషయ సౌకర్యాలకు వస్తే మీకు పరిమితులుంటాయి - ఇది చెయ్యగూడదు, ఇది చెయ్యవచ్చు అని, ఇది మీరు ఎంపిక చేసుకున్నది కాదు. ఇది ఉనికి యొక్క స్వభావం. భౌతిక విషయాలు ఎప్పుడూ పరిమితులతో కూడుకున్నవి. మీరు మిమ్మల్ని భౌతిక పరిమితులతో అనుసంధానించుకున్నంత వరకు మీకు అన్నిటికీ పరిమితులుంటాయి లేదంటే అభౌతిక విషయాలకు పరిమితులుండవు. ప్రస్తుతం ప్రపంచంలో ఇదే జరుగుతుంది, అందువల్లే ఈ కుటుంబ సమస్య, నేను కుటుంబానికి వ్యతిరేకం కాదు, మిమ్మల్ని కుటుంబ పరిధిని పెంచుకొమ్మంటున్నాను.
కునాల్ కోహ్లి: ఈ మాత్రం కుటుంబానికే ఇన్ని సమస్యలు, ఇంక పెంచుతూపోతే ఇంకెన్ని సమస్యలు తలెత్తుతాయో?
సద్గురు: నేను బహుభార్యత్వంతో కుటుంబాన్ని పెంచమనడంలేదు. నేను చెప్పేదేంటంటే మీలో కలిగే భావోద్వేగాలకు పరిమితుల్లేవు, నేను ఈ హాలులో ఉన్న అందరినీ సరిగ్గా చూడలేకపోతున్నాను, ఈ అస్పష్టమైన ముఖాలను నేను ఆప్యాయంగా ఎందుకు చూడకూడదు? దీనికి నేను చెల్లించే మూల్యం ఏమీలేదు కానీ నా జీవితం అందంగా మారుతుంది, వారిని నేను అనుమానాస్పదంగా చూస్తే నా జీవితం మోసపూరితంగా తోస్తుంది, వారిని ద్వేషపూరితంగా చూస్తే అసహ్యంగా అనిపిస్తుంది. వారికేమీకాదు వారు అక్కడ బాల్కనిలో ఉన్నారు.
కునాల్ కోహ్లి: మీరు అనేది మనము మన ఆలోచనలు, భావాలపై ఇతరులకు అధికారం ఇస్తున్నామనేనా? నిజానికి మనం ఎలా ఆలోచిస్తున్నాము, అనుభూతి చెందుతున్నామనేది మనలోనే ఉందా?
సద్గురు: అది మీరు జీవితం అని దేన్నంటున్నారో దానిపై ఆధారపడి ఉంటుంది. అది మీ పని, బంధాలు, కుటుంబం, సమాజం, మీ ఆస్తులు, సంపద, మీ ఆలోచనలు, భావాలు ఇవన్నీ మీ ప్రాధమిక జీవితానికి ఉపకరణాలు. మీరు జీవించి ఉండడంవల్ల ఈ ఉపకరణాలు సమీకరించుకున్నారు, జీవం మీలో ఉంది, నిరంతరం స్పందిస్తూ ఉంటుంది మీరు నిద్రాణంగా ఉన్నా లేక జాగృతంగా ఉన్నా కూడా.
ప్రేమాశీస్సులతో,