లాక్డౌన్ కాలంలో చేయతగ్గ పది పనులు - సద్గురు
మూడు వారాలపాటు ఇంట్లోనే కాలం గడపవలసిన ఈ కాలం, మనం మన అంతరంగంలోకి చూసుకోవడానికి ఎంతో తగిన సమయం. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవటానికి పది మంచి మార్గాలను సద్గురు సూచిస్తున్నారు.
1. కృతజ్ఞతను చూపడానికి బలమైన ఒక భావాన్ని పెంచుకోండి.
సద్గురు: అర్హులకు మన కృతజ్ఞాతాభావాన్ని తెలియజేయడం, మనదేశంలో కొంచెం తక్కువే! దురదృష్ట వశాత్తూ, మనం అన్ని విషయాలను విమర్శతోనే సరిపెట్టవచ్చు అనుకుంటాము. అలా ఉండకూడదు. మనచుట్టూ ఉండే వారు చేసే అద్భుతమైన పనులను మనం గుర్తించాలి.
బస్సు ఎక్కేటప్పుడు డ్రైవర్ కు , కండక్టరుకు ధన్యవాదాలు గాని, నమస్కారం గాని చెప్పేవారు ఎందరు ఉంటారు? చాలామందిలో అది లేదు. పూర్వం మన సంస్కృతిలో ప్రతి చిన్న విషయానికి ఒకరికొకరం నమస్కరించుకొనే పద్దతి ఉండేది. మనం ఒకరికి ఒకరు వంగి మరీ నమస్కారం చేసుకునేవాళ్ళం. కాని దురదృష్ట వశాత్తు అది కాలంలో కలిసిపోయింది. ప్రస్తుతం వైద్య రంగం, రక్షణ రంగాల వారు, అనేక ఇతర అత్యవసర వస్తువులను సరఫరా చేసేవారు, సేవలను అందించే వారు, తమ ప్రాణాలను, తమ కుటుంబసభ్యుల ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు. ఎందుకంటే వారు వైద్యశాలల్లో పనిచేసి ఇంటికి వెళుతున్నారు, వారు ఇంటికి మరణాన్నే తీసుకొని వెళుతున్నారేమో! వారు అంత గొప్ప సేవ చేస్తున్నప్పుడు వారికి కృతజ్ఞతలను తెలియజేయక పోవటం దారుణం.
ప్రతిరోజూ నిద్రలేవగానే, కనీసం ఇదంతా గడిచి పోయే దాకా, ఒక ఆరునెలలపాటు మనకోసం ప్రాణాలు పణంగా పెట్టి శ్రమిస్తున్న వారికి కృతజ్ఞతలను తెలియచేసే ఆలోచన చేద్దాం.
2.మీ ఊపిరి తిత్తుల ఆరోగ్యాన్ని పరీక్షించే సింహక్రియను ప్రతిరోజూ చెయ్యండి.
మీ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పరీక్షించి చూసుకునేందుకు ప్రతిరోజూ సింహక్రియను చెయ్యండి. శక్తి చలన క్రియవంటి శక్తి మంతమైన ఇతర క్రియలు తెలియనివారికి, ఇదెంతో మేలు చేస్తుంది. ఇది మీ ఊపిరితిత్తుల శక్తిని పెంచి మీ రోగనిరోధక శక్తిని వృద్ధిచేస్తుంది. నాలుగు రోజులుగా సింహక్రియను చేయగలిగి, హఠాత్తుగా ఒకరోజు చెయ్యలేక పోయారంటే, దాని అర్థం మీ శ్వాస క్రియా వ్యవస్థలో ఏదో సమస్య తలెత్తిందని మీరు తెలుసుకోవాలి. అది ఈ కరోనా సమస్యే కానక్కరలేదు. అదేదైనా కానివ్వండి, మీరు హఠాత్తుగా సింహక్రియను చెయ్యలేకపోయారంటే, ఒకసారి వైద్యపరీక్ష చేయించుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా, వైద్య సిబ్బంది, పోలీసులు, ఇన్ఫెక్షన్ గురి అయిన వారికోసం పని చేసేవారు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇది మీకెంతో మేలు చేస్తుంది.
3. మృత్యువు మీది పుస్తకాన్ని(Death book) కూర్చున్న చోటునుండి లేవకుండా చదివెయ్యండి.
మన ‘అనిత్య’తను ఎన్నో విధాలుగా ప్రపంచ జనాభాకంతటికీ బలంగా ఈనాటి పరిస్థితి గుర్తు చేస్తున్నది. నిజానికి అనిత్యత అనేది మన నిరంతర సహచరి. అందుకే, ఈ పుస్తకం మరణించే వారందరికీ సంబంధించినది. మన జీవితంలో చాలా ముఖ్యమైన ఈ కోణానికి సంబంధించిన స్వచ్ఛమైన అవగాహనను కల్గిస్తుంది ఈ పుస్తకం. సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు, వారు స్వర్గస్తులు అయ్యారు అని అంటారు. ఇది కల్తీ మాట. మరణం జీవితంలో భాగం అనే పూర్తి స్పృహతో మరణించాలి, అంతేకాని స్వర్గానికి వెళుతున్నామని కాదు. ఒకవేళ అలా అనుకుంటే, మృత్యువు మీద మీకు మక్కువ కలగవచ్చు. అది మంచిది కాదు. జీవితంతలో మక్కువతో ఉండాలి. మనం మరణం పట్ల రాగద్వేష రహితంగా ఉంటేనే, దానిని చక్కగా నిర్వహించగలం.
ఈ పుస్తకాన్ని ఎలా తీర్చిదిద్దామంటే ‘మరణం’ ఎలా ఉందో అలా, దాని అన్ని కోణాలనుండి చూపుతుంది. ఈ పుస్తకం చివరి పేజీ దగ్గరకు వచ్చే సరికి, మీకు మృత్యువు పట్ల కూడా కాస్త నిర్మోహత్వం కల్గుతుంది.
ముప్ప్ఫై రోజుల పాటు, ముక్కలు ముక్కలుగా, అప్పుడప్పుడూ చదివితే, అర్థం అయ్యే పుస్తకం కాదిది. ఒకసారి మొదలు పెడితే వీలైనంత ఎక్కువ చదవాలి. అప్పుడది మీలో చేరి నిలబడుతుంది. అప్పుడు నెమ్మదిగా మీరు హరాయించుకో గలుగుతారు. రెండు మూడు వారాల పాటు కూర్చుని చదివే సమయం, ఇప్పుడు కాక పొతే మరెప్పుడు దొరుకుతుంది మీకు? అందువల్ల ఆ పనిచెయ్యటానికి ఇదే మంచి సమయం. అనిత్యత మనవైపే చూస్తోంది.
4. సామాజిక మాధ్యమాలను బాధ్యతా యుతంగా ఉపయోగించండి.
ఒకరిపై ఒకరు విషాన్ని చిమ్ముకోకుండా, సామాజిక మాద్యమాలను లాక్ డౌన్ సమయంలో బాధ్యతా యుతంగా ఉపయోగించడం నేర్చుకోండి. మనకు ఎలాగూ వైరస్ మరణాన్ని అందిస్తోంది. మళ్ళీ మీరు ఒకరిపై ఒకరు కత్తులు విసురుకోనక్కరలేదు. ఈ రోజుల్లో, భౌతికంగా కాకుండా, ఎవరితో ఎంత అవసరమో అంతగా ఒకరితో ఒకరం సంభాషించుకుంటూ ఉందాము. మనం మన ప్రేమను, కారుణ్యాన్ని, కృతజ్ఞతను, మృదుత్వాన్ని, మానవత్వాన్ని తెలుపుకుందాం. దేశంలో చాలా మంది, ప్రభుత్వాన్ని, పాలనను, వైద్య వ్యవస్థను తప్పులు పట్టడాన్ని చూస్తున్నాను. అలా చెయ్యటం అవసరమే! కాని దానికి ఇది సమయం కాదు. జరుగుతున్నదాన్ని చూసి అభినందిం చాల్సిన సమయం ఇది.
5. ఇంట్లో కూడా దూరాన్ని పాటించండి.
మానవ సమాజాలు బాధ్యతా యుతంగా వ్యక్తుల మధ్య భౌతిక దూరాన్ని పాటించాల్సిన సమయమిది. దాని అర్థం, సామాజిక దూరాన్ని ఇంటి బయట పాటించడం, ఇంట్లో, మన గదిలో పార్టీ చేసుకోవడం కాదు. మన సమాజంలో, కుటుంబాల్లో ఉన్న బలహీనులైన వ్యక్తులనుంచి—ముఖ్యంగా మన తల్లిదండ్రులు, తాత, అవ్వ, వీరి నుండి కనీసం రెండు మీటర్ల దూరాన్ని పాటించవలసి ఉంది. ఇలా మీరు చెయ్య గలిగితే, ఈ పరిస్థితినుండి చాలాకొద్ది నష్టంతో బయట పడగలం.
6. మీ రోగ నిరోధక శక్తిని పెంచుకోండి.
ఇది మీరు రోగ నిరోధక శక్తిని పెంచుకో వలసిన సమయం. ఎందుకంటే అదే ఈ వైరాస్ మీకు ప్రాణాంతక మౌతుందా, మీకు బాగా నష్టం కలుగ చేస్తుందా, లేక ఏదో కొద్ది లక్షణాలను చూపి వెళ్లి పోతుందా అనే విషయాన్ని నిర్ణయిస్తుంది. ఇలా రోగ నిరోధక శక్తిని పెంచుకోవటానికి మీరు చేయగలిగిన ఎన్నో మార్గాలున్నాయి.
ఇక్కడ మీ రోగ నిరోధక శక్తిని పెంచుకోవటానికి 8 చిట్కాలున్నాయి.
7. ఇలా ఉండటం నేర్చుకోండి.
ఈ వైరస్ కు మనమే వాహకులం. మరి, ఇదే సమస్య. కానీ ఇందులోనే గొప్ప లాభం ఉంది. ఎందుకంటే మనం మనుష్యులం. ఇప్పుడు మనం మన మనసుల్లో గట్టి నిర్ణయాన్ని తీసుకోవాలి. మనం మానవులమా, కేవలం మానవులనే ప్రాణులమా! మనం మనుషులమే అయితే ఎలా మసలుకోవాలో మనకు తెలిసి ఉంటుంది. మనం మసలుకో వలసిన విధానాన్ని తెలిసి ఉన్నప్పుడు, కొన్ని సులువైన నియమాలను పాటించటం ద్వారా మనం దాన్ని ఇతరులకు అందించకుండా ఉండటం సాధ్యమే! అది మీకు తెలిసే ఉంటే, సామాజిక పరమైన కలయికలు కావాలంటేనే జరుగుతాయి. అది అవసరం లేనప్పుడు మీరు మీరుగా ఉంటారు, ఎక్కడకీ వెళ్ళరు. ఏమీ చెయ్యకుండానే, ప్రపంచం కోసం ఏదో చేసినట్లు తృప్తి చెందవచ్చు.
యోగాలోని వివిధ అంగాల్లో ప్రత్యహారం ఒకటి. దానికి అర్థం ఏమిటంటే ఇంద్రియాలను ఈ ప్రపంచం నుండి వెనక్కు తిప్పుకుని, అంతర్ముఖం కావటం. అది ఆచరించటానికి ఇది సరైన సమయం. ఇందుకు మీకు ఏ విధమైన శిక్షణా అవసరం లేదు. మీరు కళ్ళు మూసుకొని కూర్చోండి. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండండి. ఎన్ని గంటలు అలా కూర్చో గలిగితే అన్ని గంటలు అలా కూర్చోండి. మొదట్లో మీ మనసు దాని ఇష్టం వచ్చినట్లు తిరుగుతుంది. దాన్ని నిగ్రహించాలని చూడకండి. ఎటువైపూ చూడకుండా మీ కళ్ళు మూసుకుని ఉండండి. ఒక గంటతో ప్రారంభించండి, రోజుకు ఆరు నుండి పన్నెండు గంటల వరకు పెంచండి. మీ శక్తి ఆకాశాలు తాకుతుంది.
8. రోజు రోజుకు కొద్దిగా మిమ్మల్ని మీరు మెరుగు పరచుకోండి.
వచ్చే కొద్ది వారాలకు మీరు భౌతికంగా కొన్ని లక్ష్యాలను సాధించాలనుకోండి. మీకు పద్దెనిమిది స్సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మీరు ఎంతగా వంగ గలిగారు, అప్పుడు మీ చేతులు నేలను తాకేవేమో! ఇప్పుడు బహుశా మీ చేతులు మీ మోకాళ్ళ వరకే వంగుతాయేమో! ఇంకా ఓ ఆరు అంగుళాలు క్రిందకు వెళతాయేమో ప్రయత్నించండి.
మీకు పద్దెనిమిది ఏళ్ళు ఉన్నప్పుడు ఎలా మెట్లు ఎక్కగాలిగారో, ఇప్పుడు ఎలా ఈడ్చుకుంటూ వెళుతున్నారో గమనించండి. వచ్చే రెండు వారాల్లో దాన్ని ఏమైనా మెరుగు పరచుకో గలరేమో చూడండి. పద్దెనిమిదేళ్ళ వయసులో మీరు కూర్చునే భంగిమ ఎంత నిటారుగా ఉండేదో గుర్తు తెచ్చుకోండి, ఒకవేళ ఇప్పుడు మీకు కుంగినట్లుగా ఉంటే, దాన్ని కొంచెం మెరుగు పరచుకోవటానికి ప్రయత్నించండి. మీకు ఆరు, ఏడూ, పది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, మీ నవ్వు ఎలా ఉండేదో గుర్తు తెచ్చుకోండి. అందులో సగమైనా ఎప్పుడూ మీ ముఖం పైకి తెచ్చుకోవటానికి ప్రయత్నించండి. అలా గని ఎదో ఒక నవ్వును పెదవులపై అతికించు కోవటం కాదు. ఆనాటి స్వచ్ఛతను సాధించాలి.
మీరు గొప్ప పని ఏమీ చెయ్యకపోయినా, మీకుగా మీరొక అద్భుతమైన వ్యక్తిగా ఈ ప్రపంచంలో ఉండండి. మీరు సంతోషంగా ఉండటమే కాక మీ చుట్టూ ప్రక్కవారికి కూడా దాన్ని అందించ వలసి ఉంది. మీ లక్ష్యాలను మీరే నిర్ణయించు కోవచ్చు. అదేమీ కష్టం కాదు, మీరు దానిపై కొంచెం దృష్టి పెట్టాలి. అంతే!
9. మీ పరిసరాల్లో కనీసం ఇద్దరు బీదవారికి సహాయం చెయ్యండి.
భారత దేశంలో ఈ వైరస్ ప్రభావం వల్ల బాధపడుతున్నవారిలో, దినసరి వేతనాలపై జీవించే పేదలు ఎక్కువ మంది ఉన్నారు. అదృష్టవశాత్తు మన కేంద్ర ప్రభుత్వం రైతులు, కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, మూడునెలల పాటు జీవించటానికి ఒక కార్యక్రమాన్ని తీసుకు వచ్చింది. ఇందు వల్ల వారు కనీసం ఆకలికి మరణించ కుండా ఉంటారు.
కానీ ఇప్పటికీ, ఏ కార్యక్రమంలో కవర్ చేయబడని వారు చాలా మందే ఉన్నారు. సమాజమే కల్పించుకొని వారికి సహాయం చెయ్య వలసి ఉంది. అందువల్ల నేను మీ అందరిని కోరేది ఏమిటంటే మీ చుట్టూ పక్కల ఎవరూ ఆకలితో మరణించ కుండా చూడండి. ఒకవేళ అలాంటి వారు మీ దృష్టికి వస్తే మీ శక్తి కొద్దీ గాని, కాకపొతే సహాయపడే వారి దృష్టికి తీసుకొని వెళ్లి గాని, వారికి దోహదం చేయాలి. ప్రతి వాలంటీరూ అటువంటి ఇద్దరికైనా సహాయపడాలని నా విజ్ఞప్తి. మొదటి రెండువారాలు కాస్త పర్వాలేదేమో. మూడో వారం వచ్చేసరికి బాధలు మొదలౌతాయి. మనం వారికి సహాయ పడవలసి ఉంది.
10. నిరాశతో కాక, ఉత్సాహంగా ఉండండి
ఒక చిన్న, కంటికి కనపడని వైరస్ మానవ జీవితాన్ని ఇంతగా ప్రభావితం చేసి, వారు నిర్మించుకున్న ప్రతిదాన్ని భగ్నం చేసి, అతడి జీవితం ఎంత అల్పమైనదో తెలియజేసింది. బయట కావలసినంత సమస్య ఉంది. మనం మన జీవితాలను ఇంకా దుఃఖ భాజనం చేసుకోవద్దు. మనమే సమస్యకు మూలం కావద్దు. మనం సంతోషంగా ఉత్సాహంగా ఉండి, మనచుట్టూ పక్కలవాళ్ళను సుఖ సంతోషాలతో ఉంచటం ఈ సమయంలో చాలా ముఖ్యం.