మీ లోపలి పర్యావరణం, మీ బాహ్య పర్యావరణం - రెంటినీ అదుపులో ఉంచాలి
ఈనాటి ప్రపంచంలో చాలామంది తమకూ, తమ చుట్టూ ఉన్న జగత్తుకూ మధ్య ఉన్న సంబంధమేమిటో పూర్తిగా మర్చిపోయారు అని అంటున్నారు సద్గురు. ఈ బ్రహ్మాండంలో ప్రతి వ్యక్తికీ బ్రహ్మాండంతో ఉన్న పరస్పర - ఆధార సంబంధం ఎలాంటిదో సరిగా అర్థంచేసుకొన్న జాగరూకులు, మన భూగోళం అతి త్వరలో ఎదుర్కోబోతున్న వినాశనాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టకుండా ఉండలేరు.
సద్గురు: మీరు మీ చుట్టూ ఉన్న బ్రహ్మాండంలో ఒక విడదీయలేని భాగం. మీరూ పంచ భూతాల సమ్మేళనంతో ఏర్పడిన వారే, ఈ బ్రహ్మాండమూ అంతే. యోగశాస్త్రానుసారం, మీ లోపలి ఈ పంచభూతాలు మీకు పూర్తిగా వశమైతే, మీరు మీ ఆంతరికమైన పర్యావరణ వ్యవస్థనూ, బాహ్య పర్యావరణ వ్యవస్థనూ (inner and outer ecology) రెంటినీ అదుపు చేయగలరు. ఈ రెండూ వేరు వేరు కాదు. కానీ మనుషుల విషయావగాహన ఖండ ఖండాలై పోవటం చేత, లోకంలో చాలా మంది ఈ పరస్పర ఆధార స్థితీ, ఈ అభిన్నత్వమూ కేవలం ఒక సిద్ధాంతం కాదనీ, పరమ సత్యమనీ మరచిపోయారు. స్వానుభూతి పూర్వకమైన యోగ సమాధి స్థితిలో, మన చేతి చిటికెన వేలు గురించి మనకెలాంటి అనుభూతి ఉంటుందో, ఈ భూగోళం అంతటి గురించి కూడా అలాంటి అనుభూతే ఉంటుంది. అది కూడా మీలో విడదీయలేని భాగమే.
భూమి మీది ప్రతివ్యక్తికీ భూగోళంతో ఉన్న బంధం విడదీయ రానిది అన్న ఈ మూల సూత్రం నుంచే ఈశా సంస్థ వారి 'నదుల పరిరక్షణకు నడుం కట్టండి!' (Rally for Rivers) అన్నఉద్యమం ఆరంభమైంది. ఈ భూతలం మీద నీటి వనరులూ, భూసారమూ నానాటికీ క్షీణించి పోవటం గురించిన ఆందోళనకు కారణం అత్యాధునిక భావజలాలేవో ప్రదర్శించాలన్న తాపత్రయం కాదు, రాజకీయ విషయాలలో విశేషమైన అవగాహన ఉందనిపించుకోవాలన్న వెంపర్లాటా కాదు. ఇది కేవలం మన పర్యావరణ భవిత గురించిన చింతమాత్రమే కాదు, మన జీవన్మరణ సమస్య కూడా. మన్నూ, నీరూ అంగటి వస్తువులలాంటివి కావు. అవి ప్రాణాధారమైన వనరులు. పంచభూతాల సమ్మేళనమైన మానవ శరీరంలో నీరు 72 శాతం, మన్ను 12 శాతం.
సుస్థిరమైన పునాది
పర్యావరణంతో మనకున్న అత్యంత మౌలికమైన సంబంధాన్ని సరిగా గ్రహించగలిగితేనే, మనకంటూ ఒక సుస్థిరమైన పునాది ఏర్పరచుకోగలం. ఆ పునాదే మనకు మానవ జీవిత శిఖరాలను అన్వేషించేందుకు అవసరమైన శక్తినిస్తుంది. మానవ సూక్ష్మ శరీర నిర్మాణంలో మూలాధార చక్రం ప్రాముఖ్యత వహించటానికి కారణం ఇదే. సుస్థిరమైన పునాది లేకుండా, భౌతికాతీతమైన స్థితులను చేరుకోవడం సాధ్యం కాదు. మనం ఈ సత్యాన్ని వదిలేసి మనోకల్పితమైన ఊహా జగత్తులో ఉండిపోతుంటాం. ఆ ఊహాజగత్తుకు మన భౌతిక ప్రపంచంతో గానీ, మన అస్తిత్వపు యథార్థాలతో గానీ సంబంధమనేదే ఉండదు. ప్రకృతి మానవుడిని అత్యుత్తమ స్వీయ అవగాహన కలిగిన జీవిగా వికసింపచేసినా మనము దీనిని తిరస్కరిస్తున్నాము.
ఇప్పుడు మన పర్యావరణం అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉందనే చెప్పాలి. లక్షలాది సంవత్సరాల సమయం తీసుకొని ప్రకృతి సృష్టించి ఇచ్చిన వనరులను మనం ఇప్పుడు ఒకే ఒక్క తరంలో సర్వనాశనం చేయగల స్థితిలో ఉన్నాము. 2030 సంవత్సరం నాటికి మానవజాతి మనుగడకి అవసరమైన నీటి వనరులలో సగం మాత్రమే మనకు అందుబాటులో ఉండవచ్చని అంచనా.
చేరువలో ఘోర విపత్తు
మనకున్న నదులలో ఎక్కువ భాగం అటవీ సంపద మీద ఆధార పడ్డవి. ఆ నదులను పునరుజ్జీవింపజేయాలంటే, చెట్టూ చేమా, పచ్చదనమూ అవసరం. నేలలో సేంద్రియ పదార్థాల పరిమాణాలు నానాటికీ దారుణంగా క్షీణించి పోతున్నాయి. సుక్షేత్రాలు అతివేగంగా ఎడారులుగా మారిపోతున్నాయి. మన భూసార క్షీణత కూడా ఎంతో తీవ్ర స్థాయిలో ఉన్నది. భారతదేశంలో ఇప్పుడున్న వ్యవసాయక్షేత్రాలలో సుమారు ఇరవై అయిదు శాతం, వచ్చే నాలుగయిదు సంవత్సరాలలోనే వ్యవసాయానికి పనికిరాకుండా పోవచ్చు, రాబోయే నలభయి సంవత్సరాల కాలంలో మన వ్యవసాయ భూములలో 60 శాతం వ్యవసాయానికి పనికి రాకుండా పోతాయి.
సేంద్రియ పదార్థం మోతాదు పెంచేందుకు రెండే మార్గాలు. చెట్లని పెంచటం, పశుసంబంధమైన వ్యర్థాల వాడకం పెంచటం. మన ఆహార ధాన్యాల ఉత్పత్తి శక్తి పడి పోయిందంటే, మనకు అదొక ఘోరమైన విపత్తే అవుతుంది. చెట్టు చేమలూ, పచ్చదనమూ అంతరించటం వల్లా, పూర్వ ప్రణాళిక లేకుండా విచ్చలవిడిగా జరుగుతున్న పట్టణ ప్రాంతాల విస్తరణ వల్లా, మనం తరచూ వరదలనూ, కరువు కాటకాల వంటి వికల్పాలను ఎదుర్కోవాల్సివస్తున్నది. గత పన్నెండు సంవత్సరాలలో దాదాపు మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. వ్యవసాయ రంగం పరిస్థితి నిజంగా హృదయ విదారకంగా తయారైంది.
మేలుకోవలసిన సమయం
ఇప్పటికయినా ఆశ వదులుకోవాల్సిన అవసరమేమీ లేదు. విపత్సమయాలలో ఈ గడ్డ అద్భుతంగా స్పందిస్తుంది. నమ్మ శక్యం కాని ఇక్కడి జీవ వైవిధ్యం పుణ్యమా అని, ఈ దేశం అవసర సమయాలలో అద్భుతమైన ప్రాణ శక్తినీ, జీవ శక్తినీ ప్రదర్శిస్తుంది. ప్రాచీన మహర్షులు ఈ గడ్డను 'పుణ్య భూమి' అనటం అతిశయోక్తిగా చెప్పిన మాట కాదు. కొంచెం శ్రద్ధతో, సరయిన సమయంలో సరయిన చర్యలు తీసుకోగలిగితే, ఈ గడ్డ ఈ భూతలం మీద ఏ ఇతర ప్రాంతంకన్నా కూడా వేగంగా పునరుజ్జీవితమౌతుంది.
మనం సంకుచితమైన అభిప్రాయాల అడ్డుగోడలను పడదోసుకొంటూ వెళ్ళవలసి ఉంది. మన శరీరం లోని ప్రతి పరమాణువుకూ, ఈ విశాల విశ్వపు పర్యావరణంతో ఉన్న నిత్య సంపర్కాన్ని మనం నిజంగా గ్రహించగలిగితే మనకు కనువిప్పు కలిగి జాగరూకులం కాగలం. మన నదులు మనకు జీవనాధారాలు. వాటికి ఆసన్నమౌతున్న ముప్పు సమిష్టిగా మనందరికీ ఒక తుది గడువు. మన బాధ్యతల నిర్వహణ మనం వాయిదా వేసేందుకు ఇక వ్యవధే లేదు. బాధ్యతాయుతమైన చర్యలు చేపడితే ఇప్పటికయినా ప్రమాదకరమైన పరిస్థితి నుండి వెనకకు మళ్ళగలం.
ప్రేమాశీస్సులతో,