మధుమేహాన్ని యోగం తగ్గిస్తుందా?
భారతదేశంలో అంటువ్యాధిలా వ్యాపిస్తున్న మధుమేహాన్ని యోగం తగ్గిస్తుందా అన్న ప్రశ్నకు సద్గురు జవాబిస్తున్నారు.
ప్రశ్న: యోగ నా చక్కెర వ్యాధికి ఉపశమనాన్ని ఇస్తుందా?
సద్గురు: దీర్ఘవ్యాధి విషయానికి వస్తే దాని మూలకారణం శక్తిశరీరంలో ఉంటుంది. మీ శక్తి శరీరం ఒక విధంగా పనిచేస్తోందంటే దానికి పలుకారణాలు ఉంటాయి. మీరు నివసించే వాతావరణాలు, మీరు ఏరకం ఆహారం తింటున్నారు, మీరు ఏ రకం అనుబంధాలను కలిగి ఉన్నారు, ఇవన్ని కాకుంటే, మీరు ఏ రకం ఉద్వేగాలను,దృక్పథాలను,ఆలోచనలను,అభిప్రాయాలను కలిగి ఉన్నారు అన్న వాటిమీద ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కసారి ఏదో బాహ్యమైన శక్తి మీ అంతరశక్తి పై ప్రభావాన్ని చూపవచ్చు. ఏదో రకంగా ప్రభావితమైన మీ అంతర శక్తి శరీరం, శరీరం పైన మనసు పైన ప్రభావాన్ని చూపుతుంది.
ఒకసారి ఈ శరీరపు ఒక పొర, శక్తి శరీరం భగ్నం అయిందంటే - మానసిక, భౌతిక శరీరాలు భగ్నం కాక తప్పదు. అది వైద్యపరమైన అంశంగా మారాకమాత్రమే అది వైద్యుల పని అవుతుంది. అప్పటి దాకా అది వైద్యుల పనికాదు, ఎందుకంటే అందుకు సంబంధించిన ఏ విధమైన భౌతిక ఆవిష్కరణ లేదు కాబట్టి.
దురదృష్టవశాత్తు, వైద్య శాస్త్రానికి జబ్బు మాత్రమే అర్థం అవుతుంది. దానికి ఆరోగ్యపు మూల కారణాలు అర్థం కావు. ఆరోగ్యం ఎక్కడనుండి వస్తుంది-ఆరోగ్యానికి ఆధారమైనది ఏమిటి- వంటి విషయాలు దానికి తెలియవు. మీకు చక్కెర వ్యాధి ఉంటె మీ సమస్య చక్కెర కాదు. మీ పెంక్రియాస్ సరిగా పనిచెయ్యటం లేదని అర్థం. అత్యవసర చర్యగా మిమ్మల్ని చక్కెర మానేయమని చెపుతారు, ఎందుకంటే అలోపతి వైద్యవిధానాన్ని అవలంబించే వారికి మీ పెంక్రియాలను ఎలా క్రియాశీలం చెయ్యాలో తెలియదు. అందుకని వారు ఈ ఒక్క విధానాన్నే చెపుతారు. “ప్రతిరోజూ మీ రక్తాన్ని పరీక్షించుకొని ఇంకొంచెం ఇన్సులిన్ తీసుకోండి.” అలోపతి వైద్యులు మీ రోగ లక్షణాలను చూచి వైద్యం చేస్తారు.
అలోపతి వైద్యవిధానం అన్ని రకాల ఇన్ఫెక్షన్లను ఎంతో సమర్థవంతంగా నయం చేస్తుంది. మీ శరీరంలోకి బయట నుండి ఏదైనా ప్రవేశించినప్పుడు అలోపతి వైద్యం కంటే మెరుగైన వైద్యాన్ని నేను చూడలేదు. కాని, మానవుడు తనకు తానే లోపలనుండి సృష్టించుకుంటున్న మధుమేహం, రక్తపోటు, పార్శ్వనొప్పి వంటి సమస్యలకు అది మార్గం చూపలేకపోతోంది. ఆధునిక వైద్యం ఆ సమస్యలను ఎలా అదుపులో ఉంచుకోవాలో చెపుతుంది, కాని ఎలా పరిహరించుకోవాలో తెలుపదు. కొన్ని పరిమితుల్లో వాటిని అదుపులో ఉంచటానికి ఎన్నో ఔషధ వ్యవస్థలు, ప్రత్యేక వైద్య బృందాలు మాత్రం ఉన్నాయి. ఆ జబ్బులను కేవలం అదుపులో ఉంచటానికి ఎంతో సమయం, ధనం ఖర్చు అవుతున్నాయి. ఇప్పుడు ప్రజలంతా తమ జీవితాల్లో వత్తిడిని, తమ దేహాలలో జబ్బులను నియంత్రించాలని చూస్తున్నారు. వాటిని పరిహరించాలని అనుకోవటం లేదు, ఇది పరిహాసాస్పదం. వారికి తమ జీవశక్తులు ఎలా పనిచేస్తాయో తెలియకపోవటం వల్ల ఇలాటి మూర్ఖత్వం వచ్చింది.
యోగంలో వారికి చక్కర వ్యాధి ఉంటే మేము దాన్ని వారిలో ప్రాథమికమైన శారీరక గందరగోళం ఉన్నదని అర్థం చేసుకుంటాం. దాన్ని ఒక వ్యాధిగా తేలికగా తీసుకోము. శరీరంలోని ప్రాథమికమైన నిర్మాణం భగ్నం అయినట్లుగా భావిస్తాం. ఒక్కొక్క వ్యక్తిలో, శరీర వ్యవస్థలో ఆ భగ్నత ఒక్కొక్క స్థాయిలో, ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందువల్ల ప్రతి వ్యక్తికి వేరు వేరుగా వైద్యం చెయ్యవలసి ఉంటుంది. మొత్తం మీద యోగ శరీరాన్ని సమతుల్యం చేసి శక్తిశరీరాన్ని క్రియాశీలం చెయ్యటం మీద దృష్టిని నిలుపుతుంది. మీ శక్తి శరీరం చక్కని ప్రవాహశీలతను కలిగి, చక్కగా సమతుల్యతను కలిగి ఉన్నప్పుడు మీ శరీరంలో కాని, మనసులో కానీ ఏ విధమైన దీర్ఘవ్యాధి పొడచూపదు. మేము వ్యాధిని వ్యాధి లాగా కాక, శక్తిశరీరపు భగ్నతగా, దాని భౌతిక ఆవిష్కరణగా వైద్యం చేస్తాం. కొంత సాధన చేయడానికి సుముఖత చూపి, శక్తి శరీరపు సమతుల్యతను క్రియాశీలం చేసుకున్నప్పుడు ఎవరైనా అన్ని దీర్ఘవ్యాధుల నుండి విముక్తులవుతారు.
ప్రేమాశీస్సులతో,