మీ జీవితాన్నంతా ప్లాన్ చేసేయకండి
తమ జీవితం అంతా అనుకున్నట్టు ప్లాన్ ప్రకారం జరగాలని చాలా మంది కోరుకుంటారు కాని మీరు ప్లాన్ చేసేది ఇదివరకే ఉన్న సమాచారాన్ని ఉపయోగించి చేయగలరని, దీనివల్ల కొత్తదేమే మీ జీవితంలో జరగదని సద్గురు చెబుతున్నారు.
సద్గురు: ప్లాన్ అన్నది మీ మనస్సులో ఉంటుంది. కాని మీరు మీ చేతిలో ఉన్నదానితోనే పనిచేయగలరు. మీరు ప్రణాళికలు వేయడంలో ఎంత సమయం తీసుకుంటారు, వాటిని ఆచరణలో పెట్టడానికి ఎంత సమయం తీసుకుంటారు, అన్నది మీ జీవిత స్వభావంపై ఆధారపడి మీరు నిర్ణయించుకోవాలి. మీరు ప్రణాళికా సంఘంలో సభ్యులైతే మీరు కేవలం ప్రణాళికలే రచిస్తారు, అదే మీ పని. వాటిని అమలుచేయడం ఇతరుల పని. మీ పని స్వభావం ఏదైనప్పటికీ, మీ జీవిత స్వభావం మాత్రం మీరు ఇప్పుడు మాత్రమే తినగలరు, ఇప్పుడు మాత్రమే శ్వాసించగలరు, ఇప్పుడు మాత్రమే జీవించగలరు. ప్రణాళిక రచించడం కూడా ఇప్పుడు మాత్రమే. రేపటి గురించి మీరు ప్లాన్ వేయవచ్చు, కాని రేపటిని ప్లాన్ చేయలేరు.
జీవితం ఒక ప్లాన్ ప్రకారమే నడవాలా?
ప్లాన్ అన్నది ఒక ఆలోచన మాత్రమే. మన ప్లాన్ లన్నీ మనకు తెలిసిన విషయాల నుండే వస్తాయి. మన ప్రణాళికలని ‘గతానికి సొబగులు’ అందించిన రూపం అనవచ్చు. గతం నుండి ఒక ముక్కను తీసికొని దానికి పై పూతలు పూసి అలంకరించినవే ప్లాన్ లు. ఇది చాలా తక్కువ స్థాయిలో జీవించే పద్ధతి. అవును, నిజమే మనకో ప్రణాళిక కావాలి. కాని మీ జీవితం మీ ప్రణాళిక ప్రకారం నడిచిందంటే అది చాలా తక్కువ స్థాయి జీవితం. మీ జీవితం మీరు ఊహించలేని పద్ధతిలో నడవాలి. జీవిత సంభావ్యత ఎంత విస్తృతమైనదంటే ఎవరూ దాన్ని ఆ స్థాయిలో ప్లాన్ చేయలేరు. ప్రత్యామ్నాయంగా ఒక ప్రణాళిక ఉంచుకోండి కాని, జీవితాన్ని నడవనీయండి. జీవిత సంభావ్యతలను ఉన్నవున్నట్లుగా అన్వేషించండి. ఏది తెరచుకుంటుందో మీకు తెలియదు. ఇంతవరకూ ఏ మనిషికీ జరగనిదేదో మీకు జరగవచ్చు. కాని మీ జీవితం మీ ప్రణాళిక ప్రకారమే నడిచినట్లయితే ఈ లోకంలో ఇప్పటిదాకా మీకు జరుగుతున్న చత్తే మళ్లీ మీకు జరుగుతుంది. కొత్తదేమీ జరగదు. ఎందుకంటే మీ ప్రణాళిక ఇప్పటివరకూ మీకు తెలిసినదాని నుంచే వస్తుంది, మీ గత అనుభవాలూ, సమాచారం నుంచే వస్తుంది కాబట్టి.