మీలో ఉన్న పంచభూతాలు మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చగలవు
మనలో ఉన్న మూలకాలను శుద్ధి చేసుకోవటం ద్వారా పరిసలరాలలో మార్పు సాధ్యమేనా? ఈ అంశం గురించిన సాధ్యాసాధ్యాలను వివరిస్తున్నారు సద్గురు.
ప్రశ్న: ఈ విశాల ప్రపంచానికి ఓ సూక్ష్మ నమూనాయే మన శరీరం. యోగా ద్వారా మానవ శరీరంలోని పంచభూతాలను శుద్ధి చేసుకుంటే, దాని ప్రభావం పరిసరాలపై లేదా వాతావరణంలో ఉంటుందా?.
సద్గురు: ప్రభావం తప్పకుండా ఉంటుంది. మూలకాల విషయానికొస్తే, పరిపూర్ణమైన శరీరం అంటూ ఏదీ ఉండదు. మూలకాలు లేదా పంచభూతాలు మీ శరీరమనే సరిహద్దును పాటించవు. అవి బయటికీ, లోపలికీ మారుతూ ఉంటాయి. మీరు ఎవరు అనే ఒక మూల తత్వాన్ని మీరు మార్చుకుంటే, మీ చుట్టూ ఉన్న వాటిపై కూడా దాని ప్రభావం ఉంటుంది.
కొందరు యోగులు అడవుల వెంట నడుస్తూ ఉంటే, కాలంగానీ కాలంలో - చెట్లు, మోళ్ళూ చిగురించి పూలు పూశాయంటూ ఎన్నో కధలు మనం వినలేదా చెప్పండి! కొన్ని విషయాలు మన జీవితాలలో కూడా జరిగి ఉంటాయి. మనం కొన్ని పన్లు చేసినప్పుడు మనం ఊహించని చోట్ల పువ్వులు విరిసి కనిపిస్తాయి. అంటే, కాలంగాని కాలంలో కూడా అవి విచ్చుకుని కనిపిస్తాయనమాట. దీన్ని మనం ఎన్నో విషయాలకు ఆపాదించవచ్చు. బహుశా అదొక అరుదైన పూత అయ్యుండచ్చు లేదా వేరే కారణమేదైనా ఉండి ఉండవచ్చు. కానీ అవే నిరంతరం మళ్ళీ మళ్ళీ జరిగితే?
నేటి ఆధునిక విజ్ఞానం కూడా, కొంత మంది ఇళ్ళల్లో మొక్కలూ, పూలూ బాగా పెరుగుతాయని గుర్తిస్తోంది. ఒక తత్వం గల మనుషుల చుట్టూ ఉండే వాతావరణం మరొక చోటి కంటే అనువుగా ఉండటం, తద్వారా మొక్కలు బాగా పెరగటం అతిశయోక్తి కాదు. ఈరోజుల్లో ఆవులకు సంగీతాన్ని కూడా వినిపిస్తున్నారు. ప్రేమతో కాదు లెండి, అవి బాగా ఎక్కువగా పాలిస్తాయని. అది పనిచేస్తోంది మరి. అంటే, మీరు లోపల ఎలా ఉంటారు అనే లక్షణ ప్రభావం మీ చుట్టూ ఉన్నవాటిపై ఉంటుందనమాటే కదా!
మన లోపలి మూలకాలను లేదా పంచాభూతాలను శుద్ధి చెయ్యటం ద్వారా వాతావరణాన్ని మార్చగలమా? నూరుశాతం ఔననేదే సమాధానం. ఈ పర్యావరణాన్ని మనం శుద్ధి చెయ్యవలసిన అవసరం మనకి ఎందుకు వచ్చిందంటే, దానికి కూడా కారణం మన మస్తిష్కాల్లో, పన్లలో మారిన తత్వమే. ఈ సృష్టిని మనం అనుభవించే, చూసే విధానంలో మార్పు తీసుకువస్తే, పంచభూతాల స్థాయిలో జరిగే మార్పు మనకి అర్ధం అవుతుంది. మీకు అది అర్ధమైనప్పుడు మీరు ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళచ్చు లేదా అక్కడే ఉండి, మీ తత్త్వం ద్వారా పరిసరాన్ని మార్చవచ్చు. మనకి ఈ మూలకాల పట్ల అవగాహన గనుక ఉండి ఉంటే, మనం మన వాతావరణాన్ని ఈ స్థాయిలో దిగాజార్చుకొనే వాళ్ళం కాదు. ఇప్పుడు మీ ప్రశ్న ఏంటి? మన శారీరిక మూలక తత్వంలో మార్పు ద్వారా, మొత్తం వాతావరణాన్ని మార్చవచ్చా? అనేదే కదా?.మారుతుంది. కానీ అతి సూక్ష్మంగా.
మనం గుర్తించగలిగెంత కాకపోవచ్చు, కానీ అది మీరు సరైన దారిలో వెళ్లేందుకు మార్గం సుగమం చేస్తుంది. అలాంటి ఒక వ్యక్తి చుట్టూ సరైన పనులూ, జీవితం సహజంగా బాగుంటాయి. మన ఋషులు, యోగుల విషయంలో ఇది జరిగింది. వారు ప్రయాణం చేసే క్రమంలో ఎక్కడికి వెళ్ళినా అక్కడి వాతావరణం, మనుషులూ అన్నీ వాతావరణానికి అనుగుణంగా అమరిపోయేవి. అదే, మానవజాతంతా ఈ విధంగా మన శారీరిక మూలకతత్వంపై లేదా మార్పిడి అవుతున్న పంచభూతాలపై పట్టు సాధిస్తే? నూటికి నూరు శాతం అంతా మారిపోతుంది. కానీ మానవాళి ఆ విధంగా మార్పు చెందేలా చెయ్యాలంటే, ఎంతో పని జరగాలి.