ఎవరికైనా అత్తగారంటే అంత మంచి అభిప్రాయం ఉండదు. ఎంతో మంది మనసుల్లో ఇది ఇలానే ఉంటుంది.  ఆవిడకెందుకు ఇటువంటి అప్రతిష్ఠ కలిగింది..? సద్గురు అత్తగారి గురించి చెబుతూ, దానికి సంబంధించిన ఎన్నో జన్యుపరమైన, మానసికపరమైన అంశాలను మనకు వివరిస్తున్నారు.

ప్రశ్న: తమిళంలో ఒక నానుడి ఉంది, అది ఏమిటంటే ఏ మానవుడూ కూడా తన పొలానికి తగినటువంటి పశువులను తేలేడు. అలానే ఏ మనిషీ కూడా తన తల్లికి సరి అయినది అనిపించేటటువంటి భార్యను తీసుకొని రాలేడు. దీని గురించి మీరేమి చెప్తారు సద్గురూ..?

సద్గురు: మానవుల్లో, మౌలికమైన సమస్య ఇదే. జీవితంలో, వారు ఎప్పుడూ ఒక ఉన్నతమమైన మనిషి కోసమో, ఉత్తమమైన వస్తువు కోసమో వెతుకుతూ ఉంటారు. నిజానికి ఉన్నతమైన మనిషి గానీ, ఉత్తమమైన వస్తువుగానీ, ఈ భూమండలం మీద లేవు. మీరు ఏమి చేసినా సరే, మీరు కనుక అందులో మిమ్మల్ని మీరు పూర్తిగా నిమగ్నం చేసుకున్నట్లైతే, అదే ఎంతో గొప్ప విషయం అయిపోతుంది. మీ పక్కన ఎవరున్నా సరే, వారితో మీరు పూర్తిగా నిమగ్నులై ఉంటే, వారి పట్ల మీరు పూర్తి నిమగ్నత చూపిస్తే, మీరు ఎవరిని చూసినప్పటికీ, వారు మీకు బాగున్నట్లే అనిపిస్తుంది. ఈ క్షణం మీ పక్కన ఎవరున్నా సరే, మీరు వారిపట్ల పూర్తి శ్రద్ధను వహిస్తే, వారితో మీకు ఎంతో గొప్ప అనుభూతి మిగులుతుంది.

మీరు, “ఇతను అందరికంటే ఉన్నతమైన మనిషా..?” అని ఆలోచించడం మొదలుపెడితే, ఈ ప్రపంచంలో ఎవరూ కూడా ఉన్నతమైన మనిషి కారు. భగవంతుడే వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా సరే మీ అమ్మగారికే  కాదు, మీకు కూడా నచ్చని ఎన్నో విషయాలు ఉంటాయి. ప్రతీ తల్లీ, ముందు ఒక స్త్రీ. మీరు, మీ అమ్మని సంతృప్తి పరచాలి అని ఆలోచించినప్పుడు - ఆవిడ ముందు ఒక స్త్రీ, ఆ తరువాతే ఆవిడ ఒక తల్లిగా మారింది అని తెలుసుకోవాలి. మీరు భార్య అన్నప్పుడు, ఆవిడ కూడా ఒక స్త్రీయే, ఆ తరువాత ఆవిడ భార్యగా మారింది. ఇది, ఆవిడ చేస్తున్న రెండో పని. తన ప్రాధమికమైన గుర్తింపు ఏమిటంటే, ఆవిడ ఒక స్త్రీ. ఆ తరువాత గుర్తింపు ఒక భార్యగా, ఆ తరువాత ఒక తల్లిగా. ఇది ఈ క్రమంలో ఇలా జరుగుతుంది.

మీరు, మీ అమ్మని సంతృప్తి పరచాలి అని ఆలోచించినప్పుడు - ఆవిడ ముందు ఒక స్త్రీ, ఆ తరువాతే ఆవిడ ఒక తల్లిగా మారింది అని తెలుసుకోవాలి.

ఒకసారి అమెరికాలో ఎం జరిగిందంటే, ఒక యువకుడు ఒక అమ్మాయిని  పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఈ విషయం అతను తన తల్లితో చెప్పి, ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురావాలని అనుకున్నాడు. అతని తల్లి దగ్గర ఆశీర్వచనం తీసుకొని, ఆవిడకు చూపించి, ఇంట్లో పెద్దగా గొడవలు జరగకుండా ఉండడం కోసం ఇలా  చెయ్యాలనుకున్నాడు. అదే సమయంలో, అతనికి తన తల్లి అంటే కూడా ఎంతో ఇష్టం. ఇందులో కొద్దిగా హాస్యాన్ని జోడించి, ఆవిడకి చిన్న పరీక్ష పెట్టాలనుకున్నాడు. అందుకని, అతను ఆఫీసు నుండి - తనతో పని చేసే మరో  ముగ్గురు స్త్రీలను (వీరందరూ కూడా యువతులే) కూడా తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో పాటు, ఇంటికి తీసుకొని వచ్చాడు. వీళ్ళందరూ అతని ఇంటికి రాత్రి భోజనానికి వచ్చారు. ఇతని ఆలోచన ఏమిటంటే వాళ్ళ అమ్మ ఇతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో.. కనుక్కోవాలని..! ఇతను, అందరితో ఒకే విధంగా ప్రవర్తించాడు.  అలా చేస్తే అతని ప్రయసిని  కనిపెట్టడం కష్టమని...!

వాళ్ళందరూ వెళ్ళిపోయిన తరువాత, అతను, “అమ్మా.. నీకు నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా..?" అని అడగ్గానే , వెంటనే ఆవిడ దానికి, “నాకు తెలుసు. ఆ ఎర్ర జాకెట్ వేసుకుని కూర్చున్న అమ్మాయే..!” అంది. అతను, “నువ్వెలా తెలుసుకున్నావు..? నేను ఆ అమ్మాయిని చూడను కూడా లేదు. నేను, వేరే వాళ్లతోనే మాట్లాడుతున్నాను...నువ్వు ఈ విషయం కనిపెట్టకూడదని” అన్నాడు. దానికావిడ “ ఆ అమ్మాయి వచ్చిన క్షణమే నాకు ఆ అమ్మాయి నచ్చలేదు. అందుకని,  అది ఆ అమ్మాయే అయ్యి ఉండాలి” అని అంది.

మీ సొంతం అనేది పంచుకోవాల్సి వస్తుంది కాబట్టి   

ఒక స్త్రీ కొత్తగా ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆవిడని తిరస్కరించడమో లేదా ప్రతిఘటించడమో ఎందుకు జరుగుతుందంటే,  ఇప్పటి వరకు మీకు చెందినది అనుకున్నదానిని మీరు మరొకరితో పంచుకోవలసి వస్తుంది కాబట్టి. ఇది కేవలం సమానంగా పంచుకోవడం కూడా కాదు, ఎంతో అసమానంగా పంచుకోవాలి. ఒక తల్లి, తన కొడుకుకి వివాహం జరిగి ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది. మరో స్థాయిలో..ఆ తల్లి ఒక స్త్రీ కూడానూ..! మీకు చెందినది, అనుకునేదానిని మరొకరితో పంచుకోవాల్సివస్తుంది. ఇది, కొంచెం కష్టంగా అనిపిస్తుంది.

దురదృష్టవశాత్తూ ఇవే బంధుత్వానికి సంబంధించిన మూర్ఖమైన సమస్యలు..! మనకి, శతాబ్దాలకొద్దీ నడుస్తూనే ఉన్నాయి. ఇవి, అంతులేకుండా సాగుతూనే ఉన్నాయి. దీనిని మనం మార్చవచ్చు. కానీ ప్రజలు దీనిని మార్చాలి అని నిర్ణయించుకోలేదు. ఇదంతా కూడా కొంత జన్యుపరమైనది. ఇదంతా పునరుత్పత్తికీ, స్వయం సంరక్షణకీ  సంబంధించిన ప్రక్రియ. ఒక స్త్రీ కనక తనకు చెందిన వస్తువుల పట్ల తనది అన్న భావన కలిగి ఉండకపోతే, ఆవిడ తన పిల్లల్ని సంరక్షించుకోలేదు. ఆవిడ, కేవలం పిల్లల్ని కనేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోయి ఉండేది. ఇది జన్యు పరమైనది. ఇది జీవితంలో అన్ని విషయాల్లోనూ ఒక విధంగానో, మరో విధంగానో చోటు చేసుకుంటుంది. కానీ వ్యక్తి పరిణతి చెంది కొంత ఎరుకతో ఉంటే, ఇలాంటి సమస్యల నుంచి బయటకు రాగలుగుతారు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు