నాయకుడు – నిర్వాహకుడు
నాయకుడు ఏమిటి అనే విషయంపై అనేక అభిప్రాయాలున్నాయి. నిర్వాహకుడి(manager)తో పోలుస్తూ నాయకుడు అంటే - స్ఫూర్తినిచ్చేవాడేగాని నిర్దేశకుడు కాదని; ప్రేరేపించేవాడు కాని ఆజ్ఞాపించువాడు కాదని ఇలా అనేక అభిప్రాయాలు ఉన్నాయి. మరి సద్గురు ఏమంటారు? చదివి తెలుసుకోండి.
ఆదర్శంగా ఉండడం
సద్గురు::మన జీవితంలో మనం ఎటువంటి కార్యకలాపాలు ఎంచుకున్నా, ఆయా పరిస్థితులలో మనం నాయకత్వం వహించాలంటే, మొదట చేయవలసింది ఒక ఆదర్శంగా మనమే దారి చూపగలగాలి, మాటలతో కాదు, ఉపాయాలతో కాదు, జిత్తులతో కాదు, ఆదర్శ ప్రాయంగానే.మౌలికంగా, నాయకత్వమంటే మీరు అనుకున్నదిశలో నిర్దిష్ఠ గమ్యం వైపుగా ప్రజలను నడిపించడమే. అలా జరగాలంటే వాళ్ళు తమంతట తామే ఆ మార్గంలొ నడిచేలా మీరు ప్రేరణ గలిగించాలి. అలాంటి ఆసక్తి కల్పించ గలిగినప్పుడే మీరు వారిని నడిపించగలరు, వారు మీరనుకున్న దాని కంటే ఎక్కువ సాధించగలరు. అలా కాక, పని పూర్తి కావాలని నిరంతరం మీరు వారి వెంట పడవలసి వస్తే, నాయకత్వం అనేది చాల కష్టతరమవుతుంది.
ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తూ, నిర్వహిస్తూ మీరు ఇతరులకు నాయకత్వం వహించలేరు. ప్రేరణ కల్పించకపోతే, వ్యక్తిగతమైన పరిచయానికి మించి, మీ జట్టులోని వారి సంఖ్య పెరుగుతున్నకొద్దీ మీరు నాయకత్వం వహించడం మరింత సంక్లిష్టమౌతుంది. ఎప్పుడు ఏది అవసరమో అది చేసే ఉత్తేజం మన జట్టులో ఉండాలంటే, అవసరమైన పనులు స్వతహాగా వారంతట వారే చేయాలంటే, మీ మనుగడే వారికి స్ఫూర్తి నివ్వాలి. అప్పుడే నాయకత్వ ప్రక్రియ సునాయాసంగా జరుగుతుంది.
నాయకుడు మీరు ఊహించని స్థాయికి మిమ్మల్ని తీసుకు వెళతాడు
ప్రస్తుతం "నాయకుల" నే వారితో పెద్ద సమస్య ఏమిటంటే, మనం నిజమైన నాయకులను తయారు చేయటం లేదు, కేవలం పర్యవేక్షకులను, నిర్వాహకులను తయారుచేస్తున్నాము. నాయకులై, ఆపై తమ జీవితంలో వాళ్ళే క్షణ క్షణమూ బాధ పడుతున్నారు. వారికి ఏవో చిన్న చిన్న ఆశలుంటాయి : వారికి ఈ భూమిపై ఏదో ఒక చిన్న భాగం కావాలి, కొందరికి ఇంకాస్త పెద్ద భాగం, కొందరికి చిన్న భాగం. క్రమంగా దాని పరిమాణం పెద్దదవుతూ ఉంటుంది, వారు ఎంత పెద్ద భాగం కోరుకున్నా, నిజానికి వారి ఆశ ఇంకా చిన్నదే. ఎందువల్లనంటే, ఇదివరకే చూచిన దానినే ప్రస్తుతం ఇంకా కాస్త పెద్దదిగా కావాలని వారు కోరుకుంటున్నారు. అంతేగాని, మీరు ఎప్పుడూ చూడనిదానిని మీరు కోరుకోలేరు, చూచిన దాని గురించి మాత్రమే ఆశ పడగలరు; దానినే మీరున్న స్థితిని బట్టి కొద్దో గొప్పో పెంచుకుంటారు, అంతే.
కాని నాయకత్వమంటే, కొందరు వ్యక్తులను, ఒక దేశాన్ని, లేక ప్రపంచమంతటినీ ఒక దిశలొ, వారి ఊహకందని, సాధ్యపడని ఒక గమ్యానికి తీసుకొని వెళ్ళడం. ఆ గమ్యం సాధ్యమని ఆ ప్రజలే అనుకుంటే, మీ అవసరం వారికి లేదు. తమ ఊహకందని స్థాయిలోని గమ్యానికి చేర్చగలిగిన నాయకుడే వారికి అవసరం.
ఆలా జరరగాలంటే, నాయకుడికి కావలసింది లోతైన అంతర్దృష్టి, ఇతరులకు చూడ శక్యం కానిది అతడు చూడగలగాలి. నాయకుడంటే ఒక విధంగా ఒక ఎత్తైన కొమ్మ మీద కూర్చున్నట్లు. ఎత్తైన ఒక కొమ్మ మీద మీరు కూర్చుని వేరే వాళ్ళ కంటే బాగా చూడలేకపోతే, మీ పని నవ్వులపాలేగా. అలా స్పష్టంగా చూడగలిగితేనే మీరు సహజంగా నాయకులు, లేకపోతే నాయకత్వం మీపై రుద్దబడినట్లు; అలా ఉంటే, మీ చుట్టూ ఉన్నవారు బాధ పడతారు, మీరూ బాధ పడతారు. అది అంతంలేని బాధ.
మీరు చేస్తున్నది ముఖ్యమైనది అని మీరు నమ్మితే, మీ జీవితంలో అతిముఖ్యమైన విషయం, ముందు మీ మీదనే మీరు కృషి చేయడం: మీ అవగాహన మెరుగు పరచు కోవడం, ఇతరులు చూడలేని దానిని చూడగలగడం, చేయదలచిన పనికి కావలసిన అంతర్దృష్టిని పెంపొందించు కొనడం.