పళ్ళున్న చెట్టుకే రాళ్లు విసురుతారు...!!
ప్రశ్న: ఏ చెట్లైతే ఫలాలని ఇస్తాయో వాటి మీదే రాళ్లు పడుతూ ఉంటాయి. మనకి తెలుగులో “పళ్ళు ఉన్న చెట్టు మీదే రాళ్లు” అని ఒక నానుడి ఉంది కదా...
దీని గురించి నాకంటే బాగా ఎవరికీ తెలీదు. అందరూ రాళ్లు విసురుతూ ఉంటారు. ఎవరో ఒకరు ఒక రాయి తీసుకుని మీ మీద విసరాలంటే దానికి కొంత శ్రమ అవసరం. మీలో కొంత విలువ ఉంది కాబట్టే, మీ మీద ఒక రాయి విసురుతున్నారు. మీరు ఎంతో విలువైన గమ్యం కాబట్టి. ఎవరైన విలువ లేని వారి పట్ల ఎందుకు రాయి విసరాలనుకుంటున్నారు? ఎక్కడో అజ్ఞానంలో, ఎఱుకలేని తనంలో కూడా ప్రజలకు ఈ ఫలం ఎంతో విలువైనది అన్న విషయం తెలుసు. అందుకని నా మీద కూడా ఎన్నో రాళ్లు పడ్డాయి. కానీ సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ వీళ్లల్లో ఎంతోమంది మారిపోయారు. వారు ఇప్పుడు ఈ చెట్టుకింద నించుంటున్నారు, పండు వచ్చి వాళ్ళ నోట్లో పడుతుందని. ఇది ఎప్పుడూ ఇలానే జరుగుతుంది. ఎవరో మనమీద రాళ్లు విసురుతున్నారు కదా అని మన జీవితాలు ఫలవంతం చేసుకోకుండా మనం ఉంటామా ? అలా కనక జరిగితే అంతకంటే విషాదం మరోకటి ఉండదు.
ప్రజలు మీ మీద రాళ్లు విసిరినా ఫర్వాలేదు, మీ మీద రాళ్లు పడ్డం కంటే కూడా, మీరు ఫలవంతమవ్వడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. మీ జీవితం ఫలవంతమైనప్పుడు అది ఎంతో ప్రాముఖ్యత కలిగింది అవుతుంది. రాళ్లు పడితే ఏంటి, పడకపోతే ఏవిటి? వారు మీ మీద రాళ్లు ఎందుకు విసురుతారంటే, వారు కేవలం మీ మీద రాళ్లు మాత్రమే విసరగలరు. కానీ మిమ్మల్ని ఎప్పుడు నరికేయరు. ఎందుకంటే మీరు ఫలాలని ఇస్తున్నారు కాబట్టి. ఎవరికైతే ఫలం యొక్క విలువ తెలుసో, ఫలంలోని మాధుర్యాన్ని అనుభూతి చెందారో, వారు మీ మీద రాళ్లు విసురుతారు, కానీ వారు మిమ్మల్ని ఎప్పటికి కోసివేయరు. ఒకవేళ మీ దగ్గర కనక ఫలం లేదనుకోండి మిమ్మల్ని నరికేసేవారేమో కూడా. నరికేసి, దానితో వారు ఫర్నిచర్ తయారు చేసుకునేవారు. కానీ ఇప్పుడు వాళ్ళు రాళ్లు విసిరితే, వారు ఆ పండును తినచ్చు.
ఇది మీరు గమనించి చూడండి. ఎక్కడైతే పళ్ళు ఉంటాయో, ఎక్కడైతే పూలు ఉంటాయో, అక్కడ కేవలం రాళ్లు మాత్రమే కాదు పడేది, అక్కడికి కందిరీగలు వస్తాయి, పక్షులు వస్తాయి, జంతువులు వస్తాయి, ప్రజలు వస్తారు. ఒకసారి మీరు కనక ఫలాలని ఇవ్వడం మొదలుపెడితే, మొదలుపెట్టిన తరువాత ఎవ్వరూ దానిని రుచి చూడకపోతే, అప్పుడు మీ ఫలానికి ఉన్న విలువ ఏమిటి? ఒక మామిడి చెట్టు ఉందనుకుందాం, చిన్న పిల్లలు వచ్చారనుకోండి వాళ్ళు రాళ్ల కోసం వెతుకుతారు. అక్కడ వాళ్ళు రాళ్ళ కోసం వెతికినప్పుడు కింద పడ్డ మామిడిపళ్ళు కనిపిస్తే, వాళ్ళు ఆ మామిడిపళ్ళను తీసుకుని తింటారు. వారి కడుపు నిండిపోతే, వాళ్ళు అసలు ఆ చెట్టు మీద రాళ్లే విసరరు. అందుకని ఎవరో మన మీద రాళ్లు విసిరక ముందరే మనం మన ఫలాన్నికిందకు వదిలేశామనుకోండి, మనం ఇష్ట పూర్వకంగా మన ఫలాన్ని కిందకు వదిలేస్తే, అప్పుడు మన మీద పడే రాళ్లు కూడా తగ్గుతాయి. ఎందుకంటే ప్రతివారు ఈ ఫలాల కోసమే ఎదురు చూస్తున్నారు.