ప్రశ్న: పెద్ద నిర్ణయాలు తీసుకోనే ముందు నేను వేటిని పరిశీలించుకోవాలి?

సద్గురు: మీరు ముఖ్యంగా అడుగుతోంది ఏంటంటే, నా జీవితాన్ని దేనికి ఉపయోగించాలి? అని. “నేను ఏ ఉద్యోగం చెయ్యాలి? ఏ చదువు చదవాలి? అన్న ధోరణిలో ఆలోచించకండి. ముఖ్యమైన విషయమేమిటంటే ఇది జీవితం. అందరికీ వారి జీవితమంటే ఎంతో అమూల్యం. ఇంత విలువైన జీవితాన్ని తీసుకెళ్ళి దేనిలో పెడతారు? ఇలా గనుక మీరు ఆలోచిస్తే, మీకు  చేయతగ్గవి తప్పకుండా కనిపిస్తాయ్. మీరు గనుక ఎలా డబ్బులు సంపాదించాలి? ఎలా ఇది కొనాలి? అది పొందాలి? అనుకుంటే, మీరేదో పనికిరాని పనులు చేసి జీవితాంతం బాధకు లోనౌతారు.

చాలా మంది ఇలాగే ఉన్నారు, అందుకే వాళ్ళు సంతోషం లేకుండా తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే, వాళ్ళు చెయ్యాలనుకున్నది వాళ్ళు చెయ్యటంలేదు. వాళ్ళకు ఏది ముఖ్యమో అది సృష్టించటానికి ప్రయత్నించకుండా, బతకడం కోసం ఏదో ఒకటి చేస్తున్నారు. ప్రతి జీవి, పురుగు, పక్షులు, జంతువులూ, ఇవన్నీ వాటి బతుకు అవి బతుకుతున్నాయి. మనిషికి బతకటానికి సంపాదించటం పెద్ద విషయమేమీ కాదు. దుదృష్టవశాత్తూ ఒక పది, పదిహేను తరాల వరకూ ఈ దేశం పేదరికం అనుభవించటం వల్ల మనుషులంతా ఈ రకమైన దోరణికి అలవాటు పడిపోయారు. తల్లిదండ్రులు పిల్లల్ని “ఎలా సంపాదిస్తారని” ఎల్లవేళలా రుబ్బేస్తున్నారు, ఒక వానపాము తన ఆహారాన్ని తాను సంపాదించుకో గలిగినప్పుడు, ఇంత పెద్ద బ్రెయిన్ ఉన్న మనకి సంపాదించటం అంత కష్టమా?.

ప్రశ్న ఏమిటంటే, మీరు ఏమి సృష్టించబోతున్నరనే. ఎందుకంటే మీరు జీవితం అని దేన్నయితే అంటున్నారో అది కేవలం కొంత సమయం ఇంకా ఎనర్జీ. కాబట్టి, నా జీవితం అని మీరు పిలిచే ఈ ఎనర్జీని మీరు ఎందులో ఉపయోగించాలనుకుంటున్నారు? మీరేదైనా విలువైనది చేస్తుంటే, మీరు అదేంటో తెలుసుకునే లోపే చటుక్కున టైమ్ అయిపోతుంది. మీరు పనికిరాని పనులు చేసినప్పుడే, ఇది ఎంతో పెద్ద జీవితంగా అనిపిస్తుంది. మీరు గమనించారా, మీరు సంతోషంగా ఉన్న రోజు 24 గంటలు ఊరికే గడిచిపోతాయ్, ఒక క్షణంలా. మీరు విచారంలో ఉన్న రోజు 24 గంటలు, పది సంవత్సరాలుగా అనిపిస్తుంది.  

మీరేదైనా విలువైనది చేస్తుంటే, మీరు అదేంటో తెలుసుకునే లోపే చటుక్కున టైమ్ అయిపోతుంది. మీరు పనికిరాని పనులు చేసినప్పుడే, ఇది ఎంతో పెద్ద జీవితంగా అనిపిస్తుంది.

ప్రతి యువకుడు లేదా యువతి చెయ్యవలసిన పని ఏంటంటే, మీ స్నేహితులు, తల్లిదండ్రులు, ప్రొఫెసర్స్ ప్రభావం లేకుండా, మీకు మీరుగా, కనీసం రెండు మూడు రోజులైనా మీతోనే గడిపి,  మీ విలువైన జీవితాన్ని దేంట్లో ఉపయోగించాలనుకుంటున్నారనేది చూడండి. ఎంత చిన్నదైనా, పెద్దదైనా, పరవాలేదు. మీకు గనుక ఒక దానిలో మీ జీవితాన్ని ఉంచటం నిజంగా సరైనదనిపిస్తే, మీరు అదే పని చెయ్యండి. అప్పుడే ఆ జీవితం నిండుగా ఉంటుంది.

 

ప్రేమాశిస్సులతో,
సద్గురు