పౌర్ణమి - నిండు చంద్రుడు ఉన్న రాత్రి
బుద్ధ పౌర్ణమి: సద్గురు ఇలా అన్నారు, "సుమారు 2500 సంవత్సరాల క్రితం ఈ పౌర్ణమి నాడు, ప్రపంచం ఇంక ఎన్నడూ అలాగే ఉండని ఒక అద్భుతమైన సంఘటన జరిగింది..."
దాదాపు 2500 సంవత్సరాల క్రితం ఈ పౌర్ణమి నాడు, ప్రపంచం ఇంక ఎన్నడూ అలాగే ఉండని ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. దాదాపు శరీరం అంతా నాశనం అయ్యేంత, ఎనిమిది సంవత్సరాల ప్రయత్నాల తర్వాత, గౌతమ సిద్ధార్థ చాలా బలహీనపడ్డాడు. అతని శరీరం, దాదాపు చనిపోయే స్థితికి చేరుకునేంత నాశనం అయ్యింది. ఈ సమయంలో, అతను నిరంజన నదికి వచ్చాడు. ఇది వాస్తవానికి మోకాళ్ల ఎత్తులో నీరు వేగంగా ప్రవహించే పెద్ద ప్రవాహం. అతను నదిని దాటడానికి ప్రయత్నించాడు. కానీ సగం దాటేసరికి, అతను శారీరకంగా బలహీనంగా ఉండడం వల్ల, మరో అడుగు వేయలేకపోయాడు. కానీ అతను దేన్ని వదిలేసే వ్యక్తి కాదు కాబట్టి అతను అక్కడ ఉన్న ఒక చనిపోయిన కొమ్మను పట్టుకుని నిలబడ్డాడు.
అతను అక్కడ గంటల తరబడి నిల్చున్నాడు. అతను నిజంగా చాలా గంటలు అక్కడ నిలబడ్డాడా లేదా ఆ బలహీన స్థితిలో కొన్ని క్షణాలు కొన్ని గంటల్లా అనిపించిందా అనేది మనకు తెలియదు. కానీ ఆ క్షణంలో అతను వెతుకుతున్నది తనలోనే ఉందని గ్రహించాడు, కాబట్టి ఇక ఈ పోరాటం ఎందుకు? "ఇప్పుడు కావలసిందల్లా పరిపూర్ణమైన సంకల్పం. నాకు కావాల్సింది ఇక్కడే ఉంది. నేను ప్రపంచమంతా ఎందుకు వెతుకుతున్నాను?" అనుకున్నాడు. అతను ఈ విషయాన్ని గ్రహించినప్పుడు, ఆ ఒక్క అడుగు వేయడానికి, నది మీదుగా నడిచి, ఇప్పుడు ప్రసిద్ధి చెందిన బోధి వృక్షం క్రింద కూర్చోవడానికి అతనికి కొంచెం అదనపు శక్తి వచ్చింది. అంతిమమైనది ఎదో నాకు తెలిస్తే తప్ప నేను ఇక్కడ నుండి కదలను అని నిశ్చయించుకుని కూర్చున్నాడు. నేను జ్ఞానోదయం పొందిన వాడిగా లేస్తాను లేదా ఇదే భంగిమలో చనిపోతాను అని అనుకున్నాడు. ఒక్క క్షణంలో అతను జ్ఞానోదయాన్ని పొందాడు, ఎందుకంటే దానికి కావాల్సింది అదే. దానికి కావలసిందల్లా అది మాత్రమే ప్రాధాన్యతగా మారాలి. అప్పుడు అది ఒక్క క్షణం మాత్రమే.
గౌతముడు లోకంలో చెరిగిపోని ముద్ర వేసాడు. తనదైన నిశ్శబ్ద మార్గంలో, అతను ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చేసాడు. అతను ప్రపంచంలోని ఆధ్యాత్మిక మార్గంలో మార్పు తెచ్చాడు; అతను ఉన్నతమైనదాన్ని కోరుకునే మనిషి ఆకాంక్షలో భిన్నమైన గుణాన్ని తీసుకువచ్చాడు. 2500 సంవత్సరాల క్రితం ఆ పౌర్ణమి రోజున గౌతముడు జ్ఞానోదయం పొందడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఆధ్యాత్మిక అన్వేషకుడిలో, అది ఎవరైనా సరే, గణనీయమైన మార్పును తీసుకువచ్చింది. అతని ఉనికి ఆధిపత్యంగా మారింది. ఆధ్యాత్మిక మార్గంలో ఎదిగే వ్యక్తి గౌతముడిని విస్మరించలేడు.
ఏ పౌర్ణమి అయినా ముఖ్యమైనదే ఎందుకంటే దానిలో ఒక నిశ్చిత సౌందర్యాత్మకమైన గుణం ఉంటుంది. ఆ రోజు, మీరు దేనిని చూసినా, ఒకవేళ అది అందంగా ఉంటే, ఆ వస్తువు పట్ల మీ గ్రహణశక్తి అకస్మాత్తుగా కొంచెం ఎక్కువ అవుతుంది, కాదా? మీరు దేన్నైనా అసహ్యంగా ఉందని భావించినట్లయితే, మీరు దానిని చూసిన క్షణం, దానిపట్ల మీ గ్రహణశక్తి తగ్గుతుంది. కాబట్టి ఒక విషయం ఏమిటంటే పౌర్ణమి గురించి ఒక నిశ్చిత రసవత్తరమైన గుణం ఉంది, ఇది ఖచ్చితంగా మీ గ్రహణశక్తిని మెరుగుపరుస్తుంది. మరో విషయం ఏమిటంటే, భూమి చంద్రుడితో ఒక నిర్దిష్టమైన స్థితిలో ఉంటుంది. చంద్రుని స్పందన ఇంకా అనుభూతి ఇతర దశల కంటే పూర్తిగా నిండు చంద్రుడిగా ఉన్నపుడు చాలా భిన్నంగా ఉంటుంది. ఇంకా చంద్రుడి ఆకర్షణ కూడా భిన్నంగా ఉంటుంది; చంద్రుని ఆకర్షణ శక్తి, చంద్రునికి బహిర్గతంగా ఉన్న భూమి ఉపరితలంపై పని చేస్తుంది. మీ వెన్నెముక నిటారుగా ఉన్నందున, ఈ విధమైన సహజమైన ఆకర్షణ ఉన్నప్పుడు, శక్తి కదలిక సహజంగానే పైకి పెరిగుతుంది. ప్రకంపనలు మారినందున, మీలో ప్రాథమిక జీవ శక్తులైన - రక్తం ఇంకా ప్రాణం, వేరే విధంగా ప్రవహిస్తాయి. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి ఇతర రాత్రుల కంటే నీటిపై ఎక్కువగా పని చేయడం వలన ఆ రాత్రి శరీరంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి, మీ రక్తం కూడా లాగబడుతుంది ఇంకా మీ మెదడులో రక్త ప్రసరణ పెరుగుతుంది.
ఇలా ఈ శక్తి పైకి వెళ్తున్నప్పుడు, మీ గుణం ఏదైనప్పటికీ, అది మెరుగుపరచబడుతుంది. శక్తి పెరుగుదల మీ గుణాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి, మానసిక సమతుల్యత కొద్దిగా తక్కువగా ఉన్న వ్యక్తులు ఆ రోజుల్లో మరింత అసమతుల్యత చెందుతారని మీరు వినుంటారు. మీరు కొద్దిగా అసమతుల్యతతో ఉంటే, అది మీలో మరింత అసమతుల్యతను కలిగిస్తుంది. మీలోని ఇతర లక్షణాలకు కూడా ఇదే జరుగుతోంది, కానీ చాలా మంది వ్యక్తులు దీనిని గమనించేంత సున్నితంగా ఉండకపోవచ్చు. మీరు ధ్యానంలో ఉంటే, అది మిమ్మల్ని మరింత ధ్యానపరుల్ని చేస్తుంది. మీరు ప్రేమగా ఉంటే, అది మిమ్మల్ని మరింత ప్రేమగా మారుస్తుంది. మీరు భయపడితే, అది మిమ్మల్ని మరింత భయపెడుతుంది. మీ గుణం ఏదైనప్పటికీ, అది దానిని పెంచుతుంది.
కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వ్యక్తులు, ప్రత్యేకంగా ధ్యాన మార్గంలో ఉన్నట్లయితే, ఆ రాత్రులలో ధ్యానం చేయడం మరింత అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే శక్తి యొక్క పెరుగుదల లేకుండా, శక్తి యొక్క ఉన్నతమైన భావన లేకుండా, అవగాహన రావడం అనే ప్రశ్న ఉండదు. మీ వ్యవస్థలో శక్తి అధికంగా ఉన్నప్పుడు, అవగాహన అనేది మీకు సహజంగానే వస్తుంది. కాబట్టి మేము ఆ రాత్రి సంభవించే సహజ దృగ్విషయాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాము. ఈ రోజున మీకు శక్తి ఇంకా అవగాహనల ఉచిత సవారీ దొరికినట్లే.