ప్రేమ అన్నమాటకు సంబంధించి మనలో చాలా మనోభావం ఉంటుంది. దాన్ని గురించి రకరకాల ఊహలూ, నిర్వచనాలూ చేస్తూ ఉంటాం. కాని నేనిప్పుడు ప్రేమ పనిచేసే విధానం(mechanics of love) గురించి మాట్లాడుతాను. ఉదాహరణకు ప్రజలు ‘దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు’ అంటారు, కాని దేవుడు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తాడో, లేదో ఎవరికైనా తెలుసా? ప్రేమ అన్నది మనిషికి సంబంధించిన మనోభావం. మనిషి సుముఖంగా ఉంటే ప్రేమించే సామర్థ్యం కలవాడే. కాని దురదృష్టవశాత్తూ, మన జీవితంలో సుందరమైన ప్రతిదాన్నీ స్వర్గానికి ఎగుమతి చేసి, ఇక్కడ పేదరికంతో జీవించడం మనం నేర్చుకున్నాం. ప్రేమ, సంతోషం, పారవశ్యం - అన్నీ మానవులు చేయగలిగినవే. అందువల్ల దైవప్రేమ గురించి మాట్లాడడం మానేద్దాం, మానవ ప్రేమ గురించి మాట్లాడదాం.

ప్రేమ అనేది మీరు చేసే పని కాదు. అది మీరున్న తీరు.

సాధారణంగా హార్మోన్లు మీ తెలివిని హైజాక్ చేస్తూ ఉంటాయి. అప్పుడు ప్రజలు ప్రేమలో పడ్డామనుకుంటారు - అదొక కోణం. మీరు ‘నేను’ అంటున్నప్పుడు దేన్ని గురించి మాట్లాడుతున్నారు? ఒకటి మీ దేహం, రెండోది మీ మనస్సు - మీరు ఆలోచించే పద్ధతి, మూడోది మీ భావోద్వేగం - మీరెలా అనుభూతి చెందుతున్నారన్నది, ఈ మూడింటినీ నడిపించే శక్తి నాల్గవది. వీటినే మీరు ‘నేను’ అంటున్నారు. ఈ ‘నేను’ సంతోషాన్ని భిన్న స్థాయిలలో అనుభూతి చెందినప్పుడు, దాన్ని వేరు వేరు పేర్లతో పిలుస్తాం. మీ భావాలు చాలా ప్రసన్నమైనప్పుడు మనం దాన్ని ప్రేమ అని పిలుస్తాం. ప్రేమ జీవితంలో ఒక కోణం మాత్రమే. చాలాకాలంగా, చాలామందిలో వారి మనోభావాలే అన్నిటికంటే బలమైన అంశంగా ఉన్నది కాబట్టి మనం దానికి చాలా ప్రాధాన్యం ఇచ్చాం.

ఇవ్వాళ కూడా ప్రజలు తమని మేధావులుగా భావించుకుంటున్నప్పటికీ, వాళ్ళల్లో చాలామందిలో వాళ్ల మేధస్సు కానీ, శరీరం కానీ, శక్తి కానీ ప్రధాన అంశం కాదు. అందువల్ల ప్రేమను మంచి స్థితిలో ఉంచడమన్నది చాలా ముఖ్యం. లేకపోతే అది బాధాకరంగా వ్యక్తమవుతుంది. మీరు చాలా సంతోషంగా ఉంటే వెంటనే ఒక పుష్పం లాగా అయిపోతారు. ఎవరైనా ప్రేమలో ఉంటే, మీరు వాళ్ల ముఖం చూస్తే అదొక పుష్పంలా కనిపిస్తుంది. వాళ్లు తమ లోపల ఎంతో సంతోషంగా, ప్రసన్నమైన అనుభూతిని పొందుతున్నారు కాబట్టి వారి ముఖం పుష్పంలా వికసిస్తుంది. మీరెవరిపైనైనా ప్రేమతో ఉండవచ్చు - ఆ విషయం వాళ్లకు తెలియకపోవచ్చు కూడా, అయినా పర్వాలేదు. మీరు ప్రేమలో ఉన్నారు, అది చాలు. అది మీ భావోద్వేగం. మీరు ఉన్న తీరు అది.

ప్రేమ అనేది మీరు చేసే పని కాదు. అది మీరున్న తీరు.

ప్రేమ అనేది మీరు చేసే పని కాదు. అది మీరున్న తీరు. దీనికి ప్రేరకంగా మీరొక వ్యక్తిని ఉపయోగించవచ్చు, లేదా మీ అంతట మీరే ప్రేమమూర్తులు కావచ్చు. అది ఎవరి గుణమో కాదు, మీ గుణమే. మీలోని ఈ గుణాన్ని తెరవడానికి ఎదుటి వ్యక్తిని తాళం చెవిగా ఉపయోగిస్తున్నారంతే. ఆ వ్యక్తి లేకుండా కూడా మీరు ప్రేమలో ఉండవచ్చు. అదింకా ఎక్కువ కాలం మన్నుతుంది, మీలోని ప్రేమను ఎదుటి వ్యక్తి సహాయంతోనే తెరవాలంటే - ఈ లోకంలో ఎవరూ 100% ఆధారపడదగిన వారు కాదు కదా.

మీరు ఎవరి నుండి అయినా ఆనందాన్ని, ప్రేమను, ప్రసన్నతను బయటికి లాగాలని ప్రయత్నించినట్లయితే అది ఇద్దరికీ ఘోరమైన పరిణామాన్ని తెస్తుంది. ఒంటరిగా ఉండడం మంచిదని నేనడం లేదు. మీరెలా ఉండాలన్నది మీరే నిర్ణయించుకోవాలంటున్నాను. మీరు ఎలా ఉండాలో నిర్ణయించుకొండి, అలా ఉండడం మీకు అద్భుతంగా ఉన్నందువల్ల, మీలోని ఆ ప్రేమను ఇతరులతో పంచుకోవాలనుకుంటే, అది చాలా మంచిది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు