సద్గురు తాచు పాము విషాన్ని ఎందుకు తాగవలసి వచ్చింది??
సద్గురు తాచు పాము విషం తాగడానికి గల కారణం ఏంటో, అసలు యోగులు పాము లేక తేలు విషాన్ని ఎందుకు వాడతారు అనేవాటి గురించి ఈ వ్యాసంలో తెలియజేస్తున్నారు.
ప్రశ్న: ఆదియోగి ఆలయాన్ని ప్రతిష్టించేటప్పుడు మీరు పాలలో తాచు పాము విషం కలిపి ఎందుకు తాగారు??
సద్గురు: అది పాము విషం, మామూలు విషం కాదు. పాము విషం సరాసరి రక్తంలో చేరితేనే హాని చేస్తుంది. అది కడుపులోకి వెళితే హానిచేయదు. సామాన్యంగా ఆహార నాళంలో ఎక్కడో ఒక చిన్న గాటు, కోత, పుండు(ulcer)లాంటివి ఉంటే దాని ద్వారా పాము విషం రక్తంలోకి వెళ్ళి హాని కలిగించవచ్చు, లేకపోతే అది హాని కలిగించలేదు. అది తాగాక నా కళ్ళు మత్తుగా వాలిపోయాయి, దానికి మించి నాకు ఇంక ఏ హానీ జరగలేదు. ఆయనకు(ఆదియోగి) ఏమి అర్పించాలన్నా ముందు నేను తీసుకోకుండా ఎలా అర్పించగలను? నాకు ఇంతకు ముందు పాము విషం బాగా పనిచేసింది. అది నా ప్రాణం తీసేసింది కాని దానికి మించిన విలువైనదేదో ఇచ్చింది. అందుకనే పాము విషం నాకు హాని కలిగించలేదు, అది నాకు అనుకూలంగా పనిచేసింది, ఇంకా పనిచేస్తూనే ఉంది.
దానిలో ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. పాము విషం చిన్న మోతాదుల్లో చాలా మత్తు కలిగిస్తుంది. ఎక్కువగా ఏది తీసుకున్నాసరే, అది మిమ్మల్ని చంపుతుంది. చివరకు ఆక్సిజన్ కూడా చంపుతుంది, మీకు ఈ విషయం తెలుసా? మీరు ప్రొద్దున్నే తినే పొంగలి అయినా సరే, అతిగా తింటే అది కూడా మిమ్మల్ని చంపుతుంది. అవును..నిజమే..! బహశా తాచుపాము కన్నా, పొంగలే ఎక్కువ మందిని చంపుతుందేమో కూడా. ఘనీభవింపజేసిన పాదరసం మూడు పదార్ధాలనే స్వీకరిస్తుంది. కావాలంటే, మీరు దీనిని పరీక్షించి చూడవచ్చు, కాని ఇప్పుడు నేను అలాంటివి చేయదలచుకోలేదు. మీరు పరీక్షంచి చూడవచ్చు. అది బంగారం, వెండి, తాచుపాము విషాన్ని ఇముడ్చుకుంటుంది. మరో పాము విషాన్ని ఇచ్చి చూడండి, అది స్వికరించదు. దానికి ఎన్నో ఇష్టాయిష్టాలు ఉన్నాయి. దానికి తాచు పాము విషమే కావాలి. అది ఈ మూడు పదార్ధాలనే తీసుకుంటుంది, మిగతా వేటినీ అది ముట్టుకోదు. దానికి కారణం ఏదో ఉండకపోదు, దానికి అసలు కారణమేదో ఉంటుంది. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే.... ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తున్నాడు, దానికి సరైన శాస్త్రీయ కారణ మేదైనా ఉందా? లేదా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దానికి సరైన శాస్త్రీయ కారణ మేదైనా ఉందా?
ప్రశ్నకారుడు: కోడి కూస్తోంది.
సద్గురు: దానిలో శాస్త్రీయత ఏముంది? సూర్యుని ఉదయించమని కోడి కూస్తోందా? ఆధునిక విజ్ఞానం ప్రకారం, అన్నింటికీ ఎవరూ కారణం చెప్పలేరు. మీరు అన్నిటి గురించి తెలుసుకోవాలంటే విజ్ఞానశాస్త్రంపై మీకున్న అభిప్రాయం మార్చుకోవాలి.... మీరు మరికొన్ని కోణాలలో అర్థంచేసుకోవాలన్నా, అనుభూతి చెందాలన్నా విజ్ఞానశాస్త్రంపై మీకున్న అభిప్రాయం విభిన్న స్ధాయి ఆలోచనకూ, అనుభూతికీ మారాలి. పాము ఒక విలక్షణ జీవి, ముఖ్యంగా త్రాచుపాము. శివుని తలపై ఆభరణంగా ఉన్న పాము పడగకు అర్థం ఏమిటంటే, శివుని త్రినేత్రునిగా వర్ణిస్తారు, అంటే మూడవ నేత్రం తెరుచుకున్నవాడు, దాని అర్థం ఆయన గ్రహణ శక్తి అగ్రస్థాయికి చేరిందని. గ్రహించగలిగింది అంతా ఆయన గ్రహించారని. ఆయన త్రాచుపాముని సంకేతంగా వాడుతున్నారంటే ఆయనకు త్రాచుపాముకున్నంత గ్రహణ శక్తి ఉందని అర్ధం.
త్రాచు పాముకు అంతా తెలుసు
త్రాచుపాముకున్న అంత గ్రహణ శక్తి ఏమిటి? ఉదాహరణకు వెల్లంగిరి పర్వతాలలోని త్రాచుపాముకు ఆధ్యాత్మిక విజ్ఞానం గురించి మీకన్నా ఖచ్చితంగా ఎక్కువ తెలుసు. మీరు భూమి మీదున్న ఏ ఆధ్యాత్మిక గ్రంధం అయినా తీసుకోండి, దానికి మీకన్నా ఎక్కువ తెలుసు, ప్రజ్ఞా పరంగా కాదు, శక్తి పరంగా. దానికి తెలుసు. ఈ ప్రాంతంలో జరిగినదేదైనా, నిజానికి ఈ ప్రాంతంలో ఎన్నో గొప్ప సంఘటనలు జరిగాయి. ఉదాహరణకు మీకు ధ్యానలింగాన్ని సృష్టించడం ఎలాగో తెలుసుకోవాలనుకుంటే, వాటికి తెలుసు. ప్రజ్ఞాపరంగా కాదు, శక్తి పరంగా. మీకు శక్తిపరంగా తెలిస్తే, మానవులు కాబట్టి మీరు దానిని ప్రజ్ఞాపరంగా తెలుసుకోవచ్చు. మీ అనుభవాలన్నింటినీ మీరు ప్రజ్ఞాపరంగా తెలుపుకుంటున్నారు కదా? మీకేదన్నా అనుభూతి అయితే మీరు దానిని ప్రజ్ఞాపరంగా మీకు తెలిసినంతవరకు అర్థం చేసుకుంటున్నారు. అది మానవ లక్షణం. కాని దానికి తెలుసు, శక్తిపరంగా అనుభవంతో.