సద్గురు: మనం శివుని లయకారుడు అంటాము. అంటే, ఆయన ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాడని కాదు, అది మీ ప్రపంచాన్ని నాశనం చేయటం గురించి. మీ ప్రపంచం, మీ లోకం అనేది అంతా, మీ అనుభూతులు, గత అనుభవాలు సంకలనం. మీ లోకం మీ గతంతో తయారయింది. గతం అనేది మరణించినది. అది మీ వర్తమానంలోకి చొరబడడానికి కారణం మీ ఆలోచనా ప్రక్రియ. అదే ఆశయాలు లేక కోరికలు గా మీ భవిష్యత్తులోకి విక్షేపణ చెందుతాయి.

మీరు సృష్టి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలనుకుంటే, కేవలం వర్తమానంలోని ఈ క్షణం ద్వారానే అది తెలుసుకునే అవకాశం ఉన్నది.

ఆలోచన అనేది లేకపోతే, వర్తమానంలో, గతానికి అసలు మనుగడ ఉండదు. ఆలోచన ఒక భ్రమ, ఇక కోరిక అనేది రెట్టింపు భ్రమ. ఎందువలనంటే కోరిక అనేది సదా, గతాన్ని భవిష్యత్తులో చూపుతోంది. గతంలో మీకు తెలిసినదాని నంతటినీ, భవిష్యత్తులో అంతకన్నా మంచిది జరగాలని మీరు కోరుకుంటారు. కానీ మీరు సృష్టి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలనుకుంటే, అది కేవలం వర్తమానంలోని ఈ క్షణం ద్వారానే తెలుసుకునే అవకాశం ఉన్నది. ఇదొక్కటే దారి. అలాకాక మీరు మీ గతాన్ని తీసుకువస్తే మీరు ఊహా లోకంలోకి వెళ్లిపోతారు. మీరు భవిష్యత్తును గురించి మరో ఊహని తయారు చేసుకుంటే, అంటే లేనిదానిని ఆధారం చేసుకుంటే, అప్పుడు మీ ఊహ ఇక ఎంత పరిపూర్ణం అవుతుందంటే, మీ జీవితంలో వాస్తవం అనేది పూర్తిగా మరుగున పడిపోతుంది.

పూర్తి నిశ్చలతలో గతం లేదు. అలాగే పరిపూర్ణ కదలికలో కూడా గతం లేదు. సృష్టికి, సృష్టి మూలానికి చేరడానికి, శివుడు మనకు అందించిన మూలమైన దారులు ఈ రెండే. అందుకే ఆయనను ఎప్పుడు ఆనంద తాండవం చేసే నటరాజుగా, లేక పూర్తి నిశ్చలంగా ఉండే తాపసిగా గాని చూపుతారు.

సతితో, శివుడు పెళ్లి జరపడానికి వేసిన ఎత్తుగడ

పురాణాలలో ఈ కథ ఇలా నడుస్తుంది, శివుడు నిశ్చలత నుండి నాట్యానికి, మళ్ళీ నాట్యం నుండి నిశ్చలతకూ మారుతున్నపుడు. గంధర్వులు, యక్షులు, దేవతలు వంటి మూడులోకాలకూ చెందిన మిగతా వారందరూ, ఆయనను ఎంతో ఆశ్చర్యంతోనూ, విస్మయంతోనూ గమనిస్తున్నారు. వారు పూర్తి కదలికలనూ, అలాగే పూర్తి నిశ్చలతనూ ఆస్వాదిస్తున్నారు. కానీ ఆయన పొందుతున్న అనుభూతి వారికి ఏమీ అర్థం కావట్లేదు. దాని రుచి తెలుసుకోవాలని వారికి అనిపించింది.

ఆయన అనుభవిస్తున్న అనుభూతిని తెలుసుకోవడానికి వారు ఒక ప్రణాళిక రచించడం మొదలెట్టారు.

వారు విస్మయం నుంచి ఆసక్తిలోకి వెళ్లారు. ఆ ఆసక్తితో వారు అతనికి మరింత సాన్నిహిత్యంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఆయన నాట్యంలోని తీవ్రతను, అదేవిధంగా ఆయన నిశ్చలతలోని తీవ్రతను వారు భరించ లేకపోయారు.

ఆయన అనుభవిస్తున్న అనుభూతిని తెలుసుకోవడానికి వారు ఒక ప్రణాళిక రచించడం మొదలెట్టారు. వారు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు, అదే మెల్లిగా ఒక ఎత్తుగడగా మారిపోయింది. వారు ఏదో విధంగా ఆయనకు పెళ్లి చేద్దామనుకున్నారు. ఆయన పొందుతున్న మహాదానందానికి, అదే సమయంలో ఆయన పరిపూర్ణ నిశ్చలత్వానికి, మూలం ఏమిటో తెలుసుకొని మనకు చెప్పగలిగిన వారు, మన ప్రక్క నుంచి ఆయన దగ్గర ఎవరో ఒకరు ఉండాలని వారు అనుకున్నారు. అతను ఎంతో బాగా అస్వాదిస్తున్నాడు, మనకు అది చెప్పగల సొంత మనిషి ఒకరు కావాలి అని వారు అనుకున్నారు. ఆ తర్వాత ఎన్నో జరిగాయి. ఆ ఎత్తుగడ గురించిన వివరాలలోకి నేను వెళ్ళను. అది ఎంతో పెద్ద ఎత్తుగడ. మీకు శివుని గురించిన అంతర చిత్రం కావాలి అనుకుంటే, మరి ఎంతో గొప్ప ఎత్తుగడ కావలసి వస్తుంది. దానిని వారు ఎంతో ప్రణాళికా బద్ధంగా రచించి, ఆచరించారు. ఆ విధంగా వారు శివుడికి సతికి పెళ్లి జరిపించారు. ఆయన దానికి సమ్మతించి, పూర్తిగా ఆమె ప్రేమలో పడ్డాడు.

సతీదేవి తండ్రి శివుడిని అవమాన పరిచాడు

శివుడు సతీదేవిని తన జీవితంలో ఒక భాగంగా కావటానికి సమ్మతించాడు. కానీ సతీదేవి తండ్రి దక్షుడికి, శివుడంటే ఇష్టం లేదు. ఎందువల్లనంటే, శివుడు ఒక రాజు కాదు, ఆయన సరిగా వస్త్రధారణ కూడా చేయడు, ఆయన వంటి నిండా బూడిద పూసుకుంటాడు. ఆయన మనిషి పుర్రెనే పాత్రగా చేసుకుని అందులోనుంచి తింటాడు. అంతేకాక ఆయన స్నేహితులందరూ రక రకాల పిశాచాలు, ప్రమదగణాలు. ఆయనెప్పుడూ పూర్తి మత్తులోనైనా ఉంటాడు, లేక కళ్ళు మూసుకొని ధ్యానంలోనైనా ఉంటాడు, లేక పిచ్చిగా నాట్యం చేస్తూ ఉంటాడు. తాను గర్వంగా చెప్పుకోదగ్గ వాడుగాని, లేక ఆయనతో గడపటానికి తగిన అల్లుడు గాని, శివుడు కాదు.

కొంత కాలం తరవాత దక్షుడు ఒక యాగం చేయదలచుకున్నాడు. దానికి ఆయన అందరు రాజులను, దేవతలను, యక్షులనూ ఆహ్వానించాడు. కానీ శివుని ఆహ్వానించలేదు. శివుడు, సతీదేవి అరణ్యంలో కూర్చుని ఉన్నారు. సతీదేవి ఆయనకు ప్రేమగా పళ్ళను తినిపిస్తోంది. ఎందుకంటే అడవిలో వారు తినేది అవే. వారికి ఇల్లు గాని, వంట చేసుకోవడానికి తగిన వసతులు గాని లేవు. అందువల్ల వారు ఏవో పళ్ళను, లేక తమకు సమర్పణగా వచ్చిన వాటినే తింటూ ఉండేవారు. అప్పుడు వారు ఎంతోమంది అటుగా పోవడం చూశారు. గొప్ప గొప్ప రథాలలో దేవతలు, రాజులు బాగా అలంకరించుకొని ఎక్కడికో వెళ్తున్నారు. అప్పుడు ఆమె శివుడితో ‘‘ఇదంతా ఏమిటి? అందరూ ఎక్కడికి వెళ్తున్నారు?’’ అని అడిగింది. అప్పుడు శివుడు ‘‘ఇదేమీ పట్టించుకోనవసరం లేదు. మనం ఎక్కడికీ వెళ్ళనవసరం లేదు. వారు వెళుతున్నారు, వెళ్ళనీ!’’ అన్నాడు కానీ ఆమె ఎంతో ఉత్సాహంతో, ‘‘అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? చూడండి వాళ్ళు ఎంత అందంగా అలంకరించుకున్నరో, ఏమి జరుగుతోంది?’’ అని అడిగింది. దానికి ఆయన ‘‘నీవేమి పట్టించుకోనవసరం లేదు. మనం ఇక్కడ హాయిగానే ఉన్నాము. నువ్వు ఆనందంగా లేవా? ఉన్నావు కదా? నువ్వు ఆనందంగా ఉన్నావు, చాలు, వాళ్ల గురించి పట్టించుకోవద్దు’’ అన్నాడు. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు.

కానీ ఆడవారికి ఉన్న ఉత్సుకత, ఉత్సాహం ఆమెను ఊరుకోనివ్వలేదు. అలా అక్కడ కూర్చుని హాయిగా ఆ పళ్ళను తిందాం, అనుకుంటే ఆమెకు సరిపోదు. ఆవిడ కొంచెం ముందుకు వెళ్లి ఒక రథాన్ని ఆపి, వారిని ‘‘మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు?’’ అని అడిగింది. వాళ్ళు ‘‘నీకు తెలియదా? మీ నాన్నగారు ఒక పెద్ద యాగం చేస్తున్నారు, ఆయన మమ్మల్నందర్నీ ఆహ్వానించాడు. మీరు రావడం లేదా?’’ అని అడిగారు. ఆవిడ తనను, తన భర్తనూ ఆహ్వానించలేదు అని తెలుసుకుని చాలా బాధపడింది. తమను అవమాన పరిచినట్లు భావించింది. శివునికి ఇలా చేయటం సరైన పని కాదు అని ఆమె అనుకున్నది. ఆమె శివునితో, ‘‘నేను మా నాన్న గారి దగ్గరికి వెళ్తాను. ఇదంతా ఆయన ఎందుకు చేస్తున్నాడో? అన్నది. అప్పుడు శివుడు దాని వల్ల నాకు ఏమీ కాలేదు. అనవసరంగా నువ్వు ఎందుకు ఉద్వేగానికి లోనవుతావు. మనం ఇక్కడ హాయిగా ఉన్నాము. మనం ఆ యాగానికి ఎందుకు వెళ్ళాలి.’’ అన్నాడు.

కానీ ఆమె ఆ అవమానాన్ని సహించ లేకపోయింది. ఆమె ‘‘లేదు, నేను ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, ఎక్కడో తప్పిదం జరిగింది. బహుశా ఆహ్వానం తప్పిపోయిందేమో? అలా జరగటానికి వీల్లేదు. వారు మిమ్మల్ని, నన్ను ఆహ్వానించకుండా ఎలా ఉంటారు? నేను ఆయన కూతురినే కదా. ఎక్కడో తప్పు జరిగింది. నాకు తెలుసు ఇటువంటి పొరపాటు, ఆయన చేయడు. మా నాన్నగారు అటువంటివాడు కాదు.’’ అన్నది. శివుడు ‘‘వెళ్ళవద్దు’’ అని చెప్పాడు. కానీ, ఆమె వినలేదు. వెళ్ళిపోయింది.

సతీదేవి యజ్ఞకుండంలో తనను తాను దహించి వేసుకున్నది.

ఆమె యజ్ఞానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆమె అక్కా చెల్లెళ్ళు అందరూ పూర్తిగా సింగారించుకుని ఉన్నారు. కానీ, ఈమె మాత్రం తాను కొండల్లో వేసుకునే మామూలు బట్టలతోనే అక్కడికి వచ్చింది. అందువల్ల అక్కడున్న వారందరూ ఆమె ఆమెను చూసి ఎగతాళిగా నవ్వారు. వాళ్లు ‘‘బూడిద పూసుకునే మీ ఆయన ఎక్కడున్నాడు? ఎంతో కాలంగా తన జుట్టు కూడా సరిగా దువ్వుకోని ఆ మనిషి ఎక్కడ ఉన్నాడు? అని గేలి చేశారు.

యజ్ఞం జరుగుతోంది ఆమె అక్కడకి నడుచుకుంటూ వెళ్లి తనని తాను దహించివేసుకుంది

ఆమె అదంతా పట్టించుకోకుండా, తన తండ్రిని కలుసుకోవడానికి వెళ్ళింది. ఇంకా ఏదో పొరపాటు జరిగింది అనే ఆమె అనుకుంటోంది. ఆమె దక్షుడిని చూసినప్పుడు, ఆయన చాలా కోపంగా ఉన్నాడు. కానీ ఆమె ‘‘మీరు శివుడిని ఎందుకు ఆహ్వానించలేదు’’ అని అడిగింది. అప్పుడు దక్షుడు శివుడిని అన్ని రకాలుగా దూషించాడు. ఇంకా, ‘‘నేను అతనిని ఇంక ఎప్పుడూ నా ఇంట్లోకి అడుగు పెట్టనివ్వను’’ అని అన్నాడు. ఆమె ఎంతో బాధపడింది యజ్ఞగుండం రగులుతోంది, ఆమె అందులోకి ప్రవేశించి తనని తాను దహించి వేసుకుంటుంది. ఆమెతో వచ్చిన నంది, మిగతా వారు, అక్కడ ఏం జరుగుతుందో చూసి, భయపడి, శివుని వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, శివుడితో “దక్షుడు ఆమెను అవమాన పరచడం వల్ల ఆమె అగ్నిగుండంలోకి దూకి తనను తాను దహించి వేసుకుంది’’ అని చెప్పారు.

శివుడు వీరభద్రుడుని సృష్టించాడు

శివుడు నిశ్చలంగా కొంతసేపు కూర్చున్నాడు. అప్పుడు ఇక ఆయన రుద్రుడిలా మారిపోయాడు. పైకి లేచి అల్లుకుపోయిన తన జటాజుటం లోనుంచి ఒక పాయ తీసి, తన పక్కనే ఉన్న ఒక ఒక రాయి మీద కొట్టాడు. ఆ దెబ్బ ఒక అతి శక్తివంతుడైన జీవిని సృష్టించింది. ఆయన పేరు వీరభద్రుడు. శివుడు వీరభద్రుడితో ‘‘నువ్వు వెళ్లి ఆ యజ్ఞాన్ని నాశనం చెయ్యి, దానివల్ల ఎవరూ ఏదీ పొంద కూడదు. దక్షుడు కూడా ఏమీ పొందకూడదు. దానిలో పాలు పంచుకుంటున్న వారందరిని నాశనం చెయ్యి’’ అని పంపాడు. వీరభద్రుడు ఎంతో కోపంతో వెళ్లి ఆ యజ్ఞాన్ని నాశనం చేశాడు. ప్రతి ఒక్కరినీ, తన దారిలోకి వచ్చిన అందరినీ నరికి వేశాడు. దక్షుని తల కూడా నరికి వేశాడు.

శక్తి స్థలాల పుట్టుక

అప్పుడు శివుడు వచ్చి, కాలిపోయిన సతి శరీరాన్ని తీసుకొని వెళ్ళాడు. అతని బాధ మాటల్లో చెప్పనలవి కాదు. ఆమె శవాన్ని తన భుజం మీద వేసుకొని ఆయన నడవటం మొదలెట్టాడు. ఆయన ఎంతో కోపంగా, బాధతో నడుస్తున్నాడు. అతడు ఆ శరీరాన్ని దింపడు, లేక ఆ శరీరాన్ని పూర్తిగా కాలనీయడు, లేక దానికి చేయవలసిన సంస్కారం చేయడు. ఆయన అలా నడుచుకుంటూ పోతున్నాడు. నడుస్తున్నప్పుడు సతీదేవి శరీరం కుళ్ళి పోవడం మొదలు పెట్టింది. ఆ శవం అవయవాలు విడిపోయి, చాలా భాగాలుగా 54 చోట్ల పడిపోయింది. ఈ 54 స్థలాలను భారతదేశంలో, శక్తి స్థలాలు అంటారు. ఆమె అవయవం పడిన ఒక్కో చోటు, శక్తి యొక్క ఒక్కో గుణం పొందింది. అవే భారతదేశంలోని ముఖ్య శక్తి పీఠాలు. అందులో మూడు మాత్రం గుప్తమైనవి, ఎవరికీ తెలియవు. అదొక రహస్యం. కానీ మిగతావి 51 ప్రజలకు తెలుసు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు