శివుని త్రినేత్రం - దాని ప్రతీక
సద్గురు, శివుని మూడో కన్ను లేదా త్రినేత్రం ప్రతీకాత్మకతను, మూడో కన్ను తెరిచినప్పుడు స్పష్టత, అవగాహన ఎలా మొలకెత్తుతాయో వివరిస్తున్నారు. తన మూడో కన్నుతో శివుడు కామాన్ని ఎలా దహనం చేసాడు అనే కథను కూడా వివరించారు.
త్రినేత్రం తెరుచుకున్నప్పుడు
సద్గురు: శివుడు తన మూడో కన్ను తెరవడం గురించి ఒక కథ ఉంది. భారతదేశంలో, ప్రేమకు, కామానికి దేవుడు ‘కామదేవుడు’. కామం అంటే మోహం, వాంఛ. కామాన్ని నేరుగా ఎదుర్కోవడానికి చాలామంది ఇష్టడరు. మీకు దాని చుట్టూ కొంత సౌందర్యం కావాలి. కాబట్టి, మీరు దాన్ని ప్రేమ అన్నారు! ఆ కథ ఇలా ఉంది, కామదేవుడు చెట్టు వెనుక దాక్కుని శివుని హృదయంపై బాణం వేసినట్లు కథనం. శివుడు కొంచెం కలవరపడ్డాడు. తన మూడవ కన్ను తెరిచాడు, అది మండుతున్న కన్ను, అందువల్ల అది కామదేవుణ్ణి బూడిద చేసింది. ఇది సాధారణంగా అందరికీ చెప్పే కథ.అయితే, దయచేసి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ కామం మీలో పుడుతుందా లేదా చెట్టు వెనుక నుండి పుడుతుందా? అది మీలోనే పుడుతుంది. కామం కేవలం వ్యతిరేక లింగానికి సంబంధించినదే కాదు. ప్రతి కోరిక కామమే. లైంగికత, అధికారం లేదా పదవి కోసం కోరిక, ఏదైనా కావచ్చు. కామం అంటే మీలో అసంపూర్ణత అనే భావం ఉండటం. "నాకు అది లేకపోతే, నేను పూర్తి కాను" అని మీకు అనిపించే ఏదో ఒక వాంఛ.
త్రినేత్రం : యోగ దృష్టికోణంలో
దీన్ని ఆధారంగా చేసుకుని, శివుడు-కామదేవుల కథకు ఉన్న యోగపరమైన దృష్టికోణాన్ని చూద్దాం. శివుడు యోగసాధన చేస్తున్నాడు. అంటే, తను సంపూర్ణం అవ్వడం కోసం మాత్రమే కాదు, అపరిమితంగా ఉండటానికి కూడా కృషి చేస్తున్నాడు. అప్పుడు శివుడు తన మూడవ కన్ను తెరిచాడు, తన సొంత కామం పైకి రావడం చూసి, దాన్ని కాల్చాడు. బూడిద నెమ్మదిగా అతని శరీరం నుండి బయటకు వచ్చింది, అది లోపల ఉన్న ప్రతిదీ భస్మం అయిపోయిందని చూపిస్తోంది. మూడవ కన్ను తెరవడం ద్వారా, అతను భౌతికతని మించిన ఒక పార్శ్వాన్ని తనలో తాను గ్రహించాడు. ఇక భౌతిక నిర్బంధాలన్నీ దూరంగా వదలిపోయాయి.
శివుని మూడవ కన్ను ఏది?
మూడవ కన్ను, భౌతికం కాని దానిని చూడగలిగే కంటిని సూచిస్తుంది. మీరు మీ చేతి వైపు చూస్తే, అది కాంతిని అడ్డుకుని, తిరిగి ప్రతిబింబింప చేస్తుంది కాబట్టి, అది మీకు కనిపిస్తుంది. మీరు గాలిని చూడలేరు ఎందుకంటే అది కాంతిని ఆపదు. కానీ అదే గాలిలో కొంచెం పొగ ఉంటే, మీరు దానిని చూడగలుగుతారు, ఎందుకంటే మీరు కాంతిని ఆపే వాటిని మాత్రమే చూడగలరు. కాంతిని తన గుండా ప్రసరింపజేసే దేనినీ మీరు చూడలేరు. ఇది మనకి భౌతికంగా ఉన్న రెండు నేత్రేంద్రియాల స్వభావం.
ఇంద్రియ నేత్రాలు భౌతికమైన దానిని గ్రహించగలవు. అదే మీరు భౌతిక స్వభావం లేనిదాన్ని చూడాలనుకున్నప్పుడు, లోపలికి చూడడమొకటే మార్గం. మనం "మూడవ కన్ను" అన్నప్పుడు, రెండు భౌతిక నేత్రాలు చూడలేని దానిని చూడటం గురించి మనం ప్రతీకాత్మకంగా మాట్లాడుతున్నాము.
భౌతిక నేత్రాలు బయటి ప్రపంచం వైపు తిరిగి ఉన్నవి. మూడో కన్ను మీ అంతరంగాన్ని చూడడానికి - మీ సహజ తత్వాన్ని, మీ ఉనికిని చూడడానికి ఉన్నది. ఇది మీ నుదిటి మీద అతికించిన అదనపు అవయవమో, లేకపోతే ఏదో పగులు లాంటిదో కాదు. భౌతికాతీతమైన వాటిని గ్రహించగలిగే అవగాహనా పార్శ్వాన్ని, మూడవ కన్నుగా సూచిస్తారు.
మూడవ కన్ను ద్వారా జీవితాన్ని చూడటం
మరొక అంశం ఏమిటంటే, భౌతిక నేత్రాలు కర్మ వల్ల చాలా కలుషితం అయి ఉంటాయి. కర్మ అంటే గత చర్యల తాలూకు జ్ఞాపకాల అవశేషాలు. మీరు చూసే ప్రతిదీ ఈ కర్మ సంబంధమైన స్మృతులచే ప్రభావితమవుతుంది. మీరు దానిని ఆపలేరు. మీరు ఎవరినైనా చూస్తే, “వాడు మంచివాడు, మంచివాడు కాదు, మంచివాడు, చెడ్డవాడు” అని మీరు పలు రకాలుగా అనుకుంటారు. మీరు దేనినీ అది ఉన్న విధంగా చూడలేరు. ఎందుకంటే కర్మ స్మృతి మీ దృష్టిని, మీ చూసే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి. ఇది మీ కర్మ ఎలా ఉందో, మీ గత జ్ఞాపకాలు ఎలా ఉన్నాయో ప్రతీదాన్ని అలా మాత్రమే మీకు చూపుతుంది.
ప్రతి విషయాన్ని, వస్తువుని కేవలం అది ఉన్నది ఉన్నట్టుగా చూడాలంటే, మరింత లోతుగా వెళ్లి చూడగలిగే అంతర్ నేత్రం - జ్ఞాపకాల కల్మషం లేనిది - తెరుచుకోవాలి. భారతదేశంలో సాంప్రదాయకంగా, తెలుసుకోవడం అంటే పుస్తకాలు చదవడం, ఎవరైనా చెప్పే ప్రవచనాలు వినడం లేదా సమాచారాన్ని సేకరించడం కాదు. తెలుసుకోవడం అంటే జీవితాన్ని కొత్త దృష్టితో పరిశీలించడం, అంతర్దృష్టితో ఆవిష్కరించడం. ఎంత గాఢంగా ఆలోచించినా, తాత్విక చింతన చేసినా గానీ, అవి మీ మనస్సుకు స్పష్టతను తీసుకురాలేవు. మీరు తయారు చేసుకున్న తార్కిక స్పష్టతను చాలా సులభంగా తప్పుదారి పట్టించవచ్చు. క్లిష్ట పరిస్థితులు దాన్ని పూర్తిగా గందరగోళంలో పడవేస్తాయి.
మీ అంతర్గత దృష్టి తెరుచుకున్నప్పుడే పరిపూర్ణ స్పష్టత పుడుతుంది. ప్రపంచంలోని ఏ పరిస్థితి లేదా వ్యక్తి మీలోని ఈ స్పష్టతను వక్రీకరించలేరు. నిజమైన జ్ఞానం అంకురించాలి అంటే, మీ మూడవ కన్ను తెరచుకోవాలి.