మాయ అనేది కర్మగా ఎలా పనిచేస్తుందో, మనల్ని కర్మ నుండి దూరం చేసి, సూక్ష్మ శరీరాన్ని దృఢపరచడంలో క్రియలు, ప్రాణాయామాలు ఎలా తోడ్పడతాయో సద్గురు చెబుతున్నారు.

కర్మ అన్నది ఎన్నో రకాల మాయ. మాయ అంటే సాధారణంగా భ్రమ, భ్రాంతి అని అనువదిస్తూ ఉంటాం. అయితే ఈ అర్థం ఈ పదానికి పూర్తి అర్థం కాదు. కాని మాయ అంటే భ్రమ అనే అందాం. చాలామందికి భ్రమే కర్మ పదార్థానికి పునాది అవుతుంది. మీరు ‘ఇది నేను, అది నీవు’ అన్న భావనలో కూరుకుపోయి ఉన్నంత కాలం కర్మ ఒక సుస్థిరమైన వాస్తవం. అదొక వాస్తవమైన ఇనుప నిర్మాణం వంటి దృఢమైన నిర్మాణం.

ఇద్దరి మధ్య కాస్త ఏకత్వం కారణంగా చాలామందిలోని మాయ గందరగోళంలో పడుతుంది, హటాత్తుగా కర్మ పునాది కూలిపోతుంది.

అయితే ‘ఏది నేను? ఏది నేను కాను?’ అన్న గందరగోళం మీలో ఏర్పడిందంటే ఆకస్మికంగా కర్మ తన పునాదిని  కోల్పోతుంది. మీరు మీ చుట్టూ చూసి ఎవరు మీరో, ఎవరు మీరు కాదో అన్న సందిగ్ధంలో పడిపోయినట్లయితే ఇక కర్మ పునాది నిలబడలేదు, అది కూలిపోతుంది. మీరెప్పుడన్నా గమనించారా, మీరెప్పుడైనా ఎవరితోనైనా ప్రేమలో పడ్డారా, మీ ఇష్టాలేమిటి, అయిష్టాలేమిటి, మీరెవరు అంతా కొంచెం గందరగోళంగా ఉంటుంది - కనీసం కొద్దిరోజులు. ఆ తర్వాత మళ్లీ మీకు గుర్తు రావచ్చు. మీరు కొంత గందరగోళంలో ఉన్నారు కాబట్టి మీరు చేయలేమనుకున్న పనులు కూడా చేయడం ప్రారంభిస్తారు. ఇద్దరి మధ్య కాస్త ఏకత్వం కారణంగా చాలామందిలోని మాయ గందరగోళంలో పడుతుంది, హటాత్తుగా కర్మ పునాది కూలిపోతుంది.

‘అతి’ సమస్య

ఇలా జరిగింది - 1944లో హిట్లర్ తన లాగే ఉన్నటువంటి ఒక ఎనిమిది మంది డూపులను భద్రమైన ఇంట్లో ఉంచారు. వీళ్లను బ్రహ్మాండంగా పోషించారు. మంచి తిండి, మంచి సౌకర్యాలు, చేయాల్సిన పని దాదాపు శూన్యం. హిట్లర్ లాగా ఉండడం వాళ్లకు నేర్పారు. హిట్లర్ లాగా దుస్తులు ధరించారు. హిట్లర్‌ లాగా భోంచేశారు - హిట్లర్ ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించడం, అతని అన్ని అలవాట్లూ వాళ్లకు నేర్పారు. హిట్లర్ స్థానంలో నటించవలసి వచ్చినప్పుడు వాళ్లనెవరూ హిట్లర్ కాదని గుర్తుపట్టకూడదు. అలా వీళ్లు బ్రహ్మాండంగా అనుభవిస్తున్నారు.

ఒకరోజు హిట్లర్‌కు విశ్వాసపాత్రుడైన అనుచరుడు హైన్రిష్ హిమ్లర్ వచ్చాడు. అతను రాగానే వాళ్లందరికీ సెల్యూట్ చేశాడు. ఎవరు వాళ్లదగ్గరికి వచ్చినా ముందు సెల్యూట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి అది అలవాటు కావాలి కదా. హిమ్లర్ రాగానే ‘‘హెయిల్ హిట్లర్’’ అన్నాడు. తర్వాత ‘‘ఒక శుభవార్త, ఒక దుర్వార్త’’ అని చెప్పాడు.

అందరూ ఒకేసారి ‘‘ముందు శుభవార్త చెప్పు’’ అన్నారు.

‘‘మన ఫ్యూరర్ జీవించే ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు.’’

‘‘దుర్వార్త...’’

‘‘దురదృష్టవశాత్తు ఆయన కన్నొకటిపోయింది’’, అంటూ అతను ఒక మొల(స్క్రూ)ని బయటికి తీశాడు.

కర్మ అలా ఉంటుంది. అందువల్ల మొదటిది, దాన్ని సృష్టించడం ఆపండి - జీవితం తన పని తాను చేస్తుంది. లేదా మీ కర్మనంతా ఒక్కసారే వదిలేసుకోవాలంటే అది కూడా చేయవచ్చు. అయితే కర్మ అనేది కేవలం ఒక బంధం మాత్రమే కాదని, అది ఒక రక్షణ కూడా అని మీరు అర్థం చేసుకోవాలి. అది మిమ్మల్ని శరీరానికి కట్టివేసే సిమెంటు. మీ కర్మ అంతా తొలగిపోతే మిమ్మల్నిక ఈ శరీరానికి కట్టివేసేదేదీ ఉండదు - మీరు శరీరాన్ని వదిలేయాల్సిందే. చాలామందికి జ్ఞానోదయ క్షణమూ, శరీరాన్ని విడిచే క్షణమూ ఒక్కటే అని మీకు తెలియదేమో. క్రియా మార్గంలో ఉన్నవారు మాత్రమే, శరీరపు పని తీరు, దాని నట్లూ, బోల్టులూ తెలిసినవారు మాత్రమే దాన్ని పట్టుకొని ఆపగలుగుతారు.

సూక్ష్మశరీరానికి వ్యాయామం

యోగలో మానవ శరీరానికి ఐదు పొరలుంటాయంటాం. వాటిలో మూడు - శారీరిక, మానసిక, శక్తి శరీరాలు - భౌతిక వాస్తవాలు; ఉదాత్తమైనవే కావచ్చు కాని భౌతికమైనవి. తక్కిన రెండు - విజ్ఞానమయ, ఆనంద శరీరాలు - వేరే స్థాయికి చెందినవి. భౌతిక నుండి అభౌతికానికి పరివర్తన దశ విజ్ఞానమయ శరీరం. ఆనంద శరీరం పూర్తిగా అభౌతికం. శారీరక, మానసిక, శక్తి దేహాలు కర్మను కలిగి ఉంటాయి. కాని విజ్ఞానమయ, ఆనంద శరీరాలు అభౌతికాలు కాబట్టి వాటిలో కర్మ పదార్థమేమీ ఉండదు. భౌతిక కోణం కర్యాకారణల నడుమ ఉంటుంది. కాని అభౌతికమైనది కర్యాకారణల నడుమ ఉండదు. అందువల్ల మీరు దివ్యత్వాన్ని రుచిచూడడం ప్రారంభించగానే మీ వద్ద కర్మ ఎన్ని గుట్టలుగా పడి ఉన్నప్పటికీ మీమీద ఎటువంటి ప్రభావమూ చూపించలేదు, ఎందుకంటే ఎటువంటి కర్మ పదార్థమూ లేని అభౌతిక స్తరంలో అడుగు పెట్టడం మీరు ప్రారంభిస్తున్నారు కాబట్టి.

దివ్యత్వం అన్నది మీ జీవితంలో ఒక భావన, ఒక విశ్వాసం కాదని అది మీ జీవితంలో సజీవ అస్తిత్వమని మీరు తెలుసుకోవాలి.

క్రియలు, ప్రాణాయామాలు వంటి స్పృహతో కూడిన శ్వాస ప్రక్రియలను ప్రయత్నం చేస్తున్నారంటే అర్ధం మీరు ఆకాశ శరీరాన్ని (భౌతిక అంశం ఉన్న అభౌతికం) దృఢపరిచే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. ఎందుకంటే మీరు దాన్ని మీ అసలు స్వరూపమైన అభౌతికతకు ప్రయాణించడానికి ఒక మార్గంగా చూస్తున్నారు తప్ప ఒక అడ్డంకిగా కాదు. దానికనేక ఇతర శారీరిక, మానసిక ప్రయోజనాలూ ఉండవచ్చు, దానికొక ఆధ్యాత్మిక కోణం కూడా ఉండవచ్చు. కాని దానికి అత్యంత సాధారణమైన ప్రయోజన మేమిటో తెలుసా, భౌతిక - అభౌతిక స్తరాల మధ్య అనుసంధానంగా ఉండే సృష్టి మూల కోణం, బలమైన శక్తి అవుతుంది. అప్పడు మీ శారీరిక నిర్మాణం, ‘నేను’ అని పిలచుకునే మీ మానసిక నిర్మాణం, వీటన్నిటికీ మూలమైన కోణం సహజంగానే ఎల్లప్పుడూ అనుసంధానమై ఉంటుంది. దివ్యత్వం అన్నది మీ జీవితంలో ఒక భావన, ఒక విశ్వాసం కాదని అది మీ జీవితంలో సజీవ అస్తిత్వమని మీరు తెలుసుకోవాలి. సాధనకు ఆధారం అది. నిరంతరమూ ఈ మూడూ చక్కగా సమ్మిళితమై ఉండడమే సాధనకు ప్రయోజనం. ఒక్కసారి పరాకాష్ఠకు వెళ్లడమో, అప్పుడప్పుడు కలిగే అనుభవమో మనకవసరం లేదు, ఆ కోణంతో నిరంతర అనుసంధానం మనకు కావాలి. అప్పుడు మాత్రమే అది మీరు జీవించే విధానంలో, మీ అస్తిత్వం తీరులో, మీరు పనిచేసే విధానంలో - ప్రతిదానిలోనూ అన్నింటా వ్యక్తమవుతుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

pixabay