ప్రశ్న:తాంత్రిక సాంప్రదాయంలో గురు శిష్యుల మధ్య సంబంధం ఆత్మీయమైనదిగా ఇంకా పవిత్రమైనదిగా అయినప్పుడు, వారి మధ్య ఎంతటి సాన్నిహిత్యం ఉంటుంది అంటే, అది ఆఖరికి లైంగికపరమైనది కూడా కావచ్చు అని అంటూ ఉంటారు. గురుశిష్యుల మధ్య ఆకర్షణ - కృష్ణుడు, గోపికల మధ్యనున్నుఆకర్షణలా – శృంగార పరంగా కూడా అభివ్యక్తం అయ్యే అవకాశం ఉంది. మరి వాస్తవంగా తంత్ర అంటే ఏంటి? అది లైంగికతలాంటిదేనా?

సద్గురు: దురదృష్టవశాత్తు, పాశ్చాత్య దేశాల్లో, తంత్రాన్ని ఏ విధంగా చిత్రీకరిస్తున్నారు అంటే, ఇక దాని అర్థం, హద్దూ అదుపూ లేని శృంగారమే అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు. దాన్ని ఎంతో తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇలా ఎందుకంటే తమ పుస్తకాలను ఎక్కువగా అమ్మాలి అనుకునేవాళ్ళు తంత్రం మీద పుస్తకాలు రాశారు. అసలు వాళ్ళు ఏ విధంగానూ తాంత్రికులు కారు.

తంత్రం అంటే ఏమిటి?

తంత్రం అనే పదానికి అసలు అర్థం ఏమిటంటే, అది ఒకరకమైన సాంకేతిక పరిఙ్ఞానం లేక సాంకేతికత. ఇది అంతర్గత సాంకేతికత. ఇవి అంతర్గత విధానాలు, బాహ్య పద్ధతులు కాదు. కానీ ప్రస్తుత సమాజ అవగాహనలో, “తంత్రం” అనే పదం చాలా అనాగరికమైన లేదా సామాజికంగా ఆమోదయోగం కాని పద్ధతులను సూచించేదిగా అయ్యింది. విషయం ఏమిటంటే కొన్ని అంశాలను, కొన్ని పద్ధతులలోనే వాడతారు. అది యోగాకి ఏ మాత్రం భిన్నమైనది కాదు. అది యోగాలో, తంత్ర యోగం అనబడే ఒక శాఖ.

ప్రజలు, ‘నాకు లైంగికావసరాలు ఉన్నాయి కాబట్టి నేను తాంత్రిక మార్గాన్ని అనుసరిస్తాను” అనడం అనుచితం.

మనిషి అనేది మూడింటి సముదాయం, భౌతిక శరీరం - తిన్న ఆహారం యొక్క పోగు, మానసిక శరీరం - వ్యక్తులు ఒక రీతిలో పనిచేసేలా చేసే సాంకికత (సాఫ్ట్వేరు), జ్ఞాపకాలు ఉండే భాగం, ఇంకా శక్తి శరీరం. పై రెంటికీ ఈ శక్తి శరీరం ప్రాథమిక వేదిక. దీనికి అతీతమైన అంశాలు, అభౌతికమైనవి.

నిర్బంధమైన ఇంకా పునరావృతమయ్యే స్వభావం కలిగిన ఈ శరీరం, మనసు అనేవి, ఉన్నతమైన సంభావ్యతలకు ఒక అడ్డుగోడగా నిలుస్తాయి. తంత్రం అనేది వాటికి అతీతంగా వెళ్లడం కోసం, ఎందుకంటే అప్పుడు, ఈ శరీరం, మనస్సు యొక్క నిర్బంధతలు మనల్ని మన పరిమితులలో బందీలుగా ఉంచవు. ఇది దేని గురించి అంటే, తాను ఈ శరీరం అని కాకుండా, తనను (ఈ జీవిని) పరమోన్నత పార్స్వానికి చేరవేసే ఒక మెట్టుగా ఈ శరీరాన్ని ఉపయోగించుకోవడం ఎలాగో నేర్చుకోవడం కోసం.

తంత్ర యోగం: పై నుండి ఊదడం

tantric-yoga

చాలా మంది అపోహ పడుతున్నట్టుగా తంత్రం అనేది హద్దూ అదుపూ లేని శృంగారం కాదు. శృంగారం అనేది, ఈ జాతి తనకై తాను కొనసాగించేలా చూడటం కోసం, మన శరీరాలలో నిక్షేపమైన ఒక ప్రాథమిక కోరిక. ఇది ఒక ప్రాథమిక అవసరం. అదే సమయంలో, ఒక పరిమితిదాటి, ఇది మనల్ని ముందుకు తీసుకు వెళ్ళ లేదు అనేది తెలుసుకోవాలి. ఈ పరిమితులను గుర్తించినప్పుడే, ఇతర పార్శ్వాలను తాకాలన్న కోరిక తలెత్తినప్పుడే, యోగ ఇంకా తంత్రం అనేవి సముచితం.

ప్రజలు, ”నాకు లైంగికావసరాలు ఉన్నాయి కాబట్టి నేను తాంత్రిక మార్గాన్ని అనుసరిస్తాను” అని అనడం, ఆలోచించడం అనుచితం. తంత్రంలో, మనిషి ఉన్నతికి కేవలం లైంగిక పద్ధతులే వాడుతున్నారు అని కాదు. వారు ఉన్నతికి ప్రతి అంశాన్నీ వాడుతున్నారు. దురదృష్ట వశాత్తూ, ఆ కారణాల వల్ల అటువంటి మార్గానికి ఆకర్షితులు అయ్యేవారు ఉండవచ్చు. తమ లైంగికావసరాలకు, వారు ఆధ్యాత్మికపరమైన ఆమోద ముద్రను కోరుకుంటున్నారు. ఆధ్యాత్మికత అంటూ మిమ్మల్ని మీరు ఎందుకు అంత నాశనం చేసుకోవాలనుకుంటున్నారు? మీ భౌతిక అంశాన్ని భౌతికంగానే తీసుకోండి, దానికి మీరు వేరే ఇతర పేర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు.

ఆధ్యాత్మికత అంటూ మిమ్మల్ని మీరు ఎందుకు అంత నాశనం చేసుకోవాలనుకుంటున్నారు? మీ భౌతిక అంశాన్ని భౌతికంగానే తీసుకోండి, దానికి మీరు వేరే ఇతర పేర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు.

లైంగికావసరాలను, పరస్పర సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా తీర్చుకోవచ్చు. అవి సాంప్రదాయబద్ధం కావొచ్చు, సాంప్రదాయబద్ధం కానివి కావొచ్చు. లైంగిక నిర్భందతలను తీర్చుకోవడానికి ఆధ్యాత్మికత ప్రక్రియను వాడడం అనేది, బాధ్యతారహితం ఇంకా గర్హనీయమైనది కూడా. అది అనేక స్థాయిలలో నష్టాన్ని కలిగించవచ్చు, ఎందుకంటే తాంత్రిక ప్రక్రియలు వాడేది కేవలం, వ్యతిగత ఆధ్యాత్మిక ప్రగతి కోసం మాత్రమే కాదు, ఎంతోమందికి శ్రేయస్సును చేకూర్చే ఇతర సంభావ్యతలకు మద్దతునిచ్చే, ఒక శక్తి ప్రదేశాన్ని సృష్టించడానికి కూడా.

శరీరంలో, శక్తి అనేకరకాలుగా వ్యక్తీకరణ అవుతుంది - వీటినే 14 చక్రాలు అంటారు- పై మూడు చక్రాల గుండా శక్తి చిందడం అనేది అత్యుత్తమమైనదిగా భావించబడుతుంది. మీరు ఈ స్థాయికి చేరుకోవాలంటే, లైంగిక కోరికలతో సహా, సహజమైన ప్రతి కోరికనీ, బావోద్వేగాన్నీ, వివేకాన్నీ ఇంకా మనుగడ ప్రక్రియనీ కూడా, శక్తి వ్యవస్థను నిర్మించుకోవడం కోసం, ఇంకా దాన్ని బలోపేతం చేయడం కోసమే ఉపయోగించాలి. ఇక్కడ ఉద్దేశ్యం ఏమిటంటే, అన్నిప్రాథమిక కోరికలకూ కేటాయించబడిన శక్తిని, దీనికే (శక్తి వ్యవస్థను నిర్మించుకోవడం కోసం, ఇంకా దాన్ని బలోపేతం చేయడం కోసమే) వినియోగించడం. ఒకరు లైంగిక ప్రక్రియలోకి వెళితే, అప్పుడు అసలు దాని ప్రయోజనమే ఉండదు. ఇది ఎంతో క్రమశిక్షణ అవసరమైన మార్గం. ఎటువంటి క్రమశిక్షణ అంటే, కనీసం దాన్ని ప్రయత్నించడం అనేది కూడా చాలామందికి సాధ్యపడదు.

వామాచార తంత్ర యోగ, సదాచార తంత్ర యోగ

ఏదేమైనా, దీనిని వామాచార తంత్రం అని పిలుస్తారు, ఇది మొరటైన సాంకేతికత. ఇందులో ఎన్నో క్రతువులు ఉంటాయి. చాలా శుద్ధమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సదాచార మార్గం కూడా ఉంది. ఈ రెండూ స్వభావరీత్యా పూర్తిగా భిన్నమైనవి. సదాచార మార్గం పూర్తిగా అంతర్గత మైనది ఇంకా శక్తికి సంబంధించినది అది పూర్తిగా మీ గురించినది. అందులో ఎటువంటి క్రతువుగాని లేదా బయటి నుంచి చేసే పని కానీ ఉండదు. అది తంత్రమేనా? ఒక విధంగా అది తంత్రమే, కానీ యోగాలో ఇవన్నీ ఉంటాయి. మనం యోగా అన్నప్పుడు మనం ఏ విషయాన్నీ విడిచి పెట్టడం లేదు - అందులో ప్రతిదీ ఉంది. అసలు విషయం ఏమిటంటే, కొందరు వక్ర బుద్ధులు, శరీరాన్ని ఉపయోగించి చేసే వామాచార తంత్రంలోని ఒక ప్రక్రియని చూశారు. వాళ్లు కేవలం ఆ భాగాన్ని మాత్రమే చూసి, దాన్నే పెద్దదిగా చేసి, అన్నిరకాల వికృత శృంగార చేష్టలతో కలిపి, దాని మీద పుస్తకాలను రాశారు. అది తంత్ర శాస్త్రం కాదు.

 

తంత్రం అంటే, మీ శక్తులను ఉపయోగించి మీరు కొన్ని పనులు చేయగలరు అని. ప్రతి దానిలోకీ చొచ్చుకు వెళ్ళేలా, మీరు మీ మనసుని ఎంతో పదునైనదిగా చేయగలిగితే, ఇది కూడా ఒక విధమైన తంత్రమే. ప్రతి ఒక్కరినీ ముంచెత్తే అపారమైన ప్రేమ మూర్తులగా మీరు మారడానికి, మీరు మీ శక్తులను హృదయంపై పనిచేయిస్తే, ఇది కూడా ఒక రకమైన తంత్రమే. నమ్మశక్యం కాని విన్యాసాలు చేసేలా మీరు మీ భౌతిక శరీరాన్ని ఎంతో శక్తివంతం చేస్తే, ఇది కూడా తంత్రమే. అలాగే మీరు మీ శక్తులను, శరీరం మనస్సు లేదా భావోద్వేగాలను వినియోగించ కుండా, శరీరంతో పనిలేకుండా కేవలం శక్తులతోనే చేయగగలిగితే, అది కూడా తంత్రమే.

ఇది అగస్త్యముని మనకు అందజేసిన ఒక అద్భుతమైన కానుక, నూటికి నూరు శాతం శరీరంతో మాత్రమే ముడిపడి ఉండే ఒక తాంత్రిక ప్రక్రియ అది. బయట నుండి ఇంకేమీ గ్రహించనక్కరలేదు. తంత్రంలోని విభిన్నమైన పార్శ్వాలను చేయడానికి, కనీసం ఒక్క బియ్యపు గింజను లేదా ఇసుక రేణువును కూడా వాడరు. ప్రతిదీ కూడా వ్యవస్థ లోపలే అంతర్గతంగా చేయబడింది. ఇది ఆయన మనకు ఇచ్చిన అద్భుత కానుక. మానవ యాంత్రిక పరంగా చూస్తే, ఇప్పటివరకూ ఒకవ్యక్తి నుంచి, మనకి అందజేయబడిన అత్యుత్తమమైన వాటిలో ఇది ఒకటి. ఇది మనకి అగస్త్యముని ఇచ్చిన కానుక.

తంత్రం లేని గురువే ఉండరు

తంత్రం అనేది ఒక అర్థం లేని విషయం కాదు, అది ఒక విధమైన సామర్థ్యం. అది లేనిదే ఎటువంటి సంభావ్యతా లేదు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, “మీ తంత్రం సాంకేతికంగా ఎంత వృద్ధిచెందింది?” మీ శక్తులను కదిలించాలంటే మీరు పదివేల క్రతువులు చేయాలా లేదా మీరు ఊరికే ఇక్కడ కూర్చుని చేయగలరా? వ్యత్యాసం ఇదే. తక్కువ స్థాయి సాంకేతికతా లేదా ఎక్కువ స్థాయి సాంకేతికతా అన్నదే ఇక్కడ ప్రశ్న, కానీ తంత్రం లేకుండా ఎటువంటి ఆధ్యాత్మిక ప్రక్రియా ఉండదు.

సున్నితమైన మల్లె పువ్వులా ఉండి, ప్రజలను ఆశీర్వదించే సాధువులూ తమదైన రీతిలో చాల సౌమ్యులు, కాని జ్ఞానోదయం కోసం తపించే వ్యక్తులకు వారు సరైనవారు కాదు.

ఒక తంత్రం లేనిదే ఏ గురువూ ఉండడు. అతనికి సాంకేతికత లేకపోతే అతను గురువే కాడు. అతను కేవలం అందరినీ దీవించే ఒక సౌమ్య సాధువు మాత్రమే కాగలడు. వారి ఆశీర్వాదానికి విచక్షణ ఉండదు. మీరు ఒక దొంగగా ఆ సాధువుని కలిస్తే, ఈరోజు మీ పని మీరు బాగా చేయడం కోసం, మీరు అతని ఆశీర్వాదాన్ని కోరుకుంటే, అలాగే అతను ఆశీర్వదిస్తాడు, ఎందుకంటే అతని ఆశీర్వాదానికి విచక్షణ ఉండదు. దానికి విచక్షణ ఎందుకు ఉండదు అంటే, అది అతని నియంత్రణలో ఉండదు. ఆఖరికి బందిపోటు తెగలు అయిన పిండారీలకు కూడా తమ సొంత దేవుళ్ళు, దేవతలు ఉండేవారు. వాళ్లకు తమ సొంత సాధువు ఉండేవాళ్ళు. ఈరోజు ఎవరి ఇంటిని దోచేయాలి అన్న విషయంలో వారి దేవుళ్ళు వాళ్లకి ఎప్పుడూ సూచనలు ఇస్తూ ఉండేవాళ్ళు. బందిపోటు దొంగతనాలు చేయటం వారి వృత్తి, అలాగే వారు కొన్ని శతాబ్దాల పాటు వాళ్ళ వృత్తిని విజయవంతంగా కొనసాగించారు.

సున్నితమైన మల్లె పువ్వులా ఉండి, ప్రజలను ఆశీర్వదించే సాధువులూ తమదైన రీతిలో చాల సౌమ్యులు, కాని జ్ఞానోదయం కోసం తపించే వ్యక్తులకు వారు సరైనవారు కాదు. వారు కేవలం జీవితంలో చిన్నపాటి వృద్ధి కోరుకునే వారి కోసం మాత్రమే. మీరు ఒక షాపింగ్ స్టోర్ లోకి వెళితే, మీ జీవితంలో కొంత వృద్ధి తీసుకురావచ్చు. “నేను ఇప్పుడే ఈ పరుపు కొన్నాను, దానితో నా జీవితం మొత్తం మారిపోయింది, ఇది ఎంతో అద్భుతంగా ఉంది!” అని టీవీలో ప్రకటనలు నేను చూస్తూ ఉంటాను. ఒక పరుపు లేదా దిండు అలా చేయగలదని నాకు తెలీదు! కాబట్టి మీరు ఒక స్టోర్ లోకి వెళ్ళి అంతకు ముందు మీ దగ్గర లేనిది దేనినైనా తీసుకుని బయటకు వస్తే, మీరు మీ జీవితాన్ని కొద్దిగా మార్చుకోవచ్చు. మీ జీవితంలో ఎంత భాగాన్ని అది మారుస్తుంది అనేది ఎన్నో విషయాలపై ఆధారపడి ఉంటుంది.

ఇప్పుడు మీకు చలిగా ఉండి ఎవరైనా మీకు ఒక వెచ్చని కోటు ఇస్తే, అది జీవితాన్ని మార్చేసే విషయమే. కానీ మనం ఇక్కడ మాట్లాడుతున్నది అటువంటి మార్పు గురించా? అటువంటి మార్పు గురించి అయితే పర్వాలేదు, మీరు వారి ఆశీస్సులు పొందితే సరిపోతుంది. కానీ మీరు ఆధ్యాత్మికత పురోగతి గురించి ఇంకా అనంతాన్ని చేరుకోవటం గురించి మాట్లాడుతున్నట్లయితే, అప్పుడు సామర్థ్యతలేని గురువు ఎలా పనికొస్తాడు? మీరు అతన్ని ఒక గురువు అనలేరు. సామర్థ్యం అంటే, ప్రజలు తమకు తాముగా చేసుకోలేని వాటిని చేయగలిగే సామర్థ్యం. ఆ కోణంలో చూస్తే, తంత్రం లేకుండా, అసలు గురువు ఉండడు. నేను తంత్రం అన్నప్పుడు, అది కేవలం సాంకేతికతకు సంస్కృత పదం మాత్రమే. నేను ఆ నేపథ్యంలో ఆ పదాన్ని వాడుతున్నాను, అంతేగాని ప్రజలకు తెలిసిన విధంగా కాదు.

తంత్ర యోగం: అది నానా తంటాలు పడే విషయం కాదు

గురు శిష్య సంబంధం అనేది, శిష్యుణ్ణి చైతన్యం యొక్క ఒక ఉన్నతమైన పార్శ్వానికి తీసుకువెళ్లడం కోసం, అంతేకాని లైంగికతలో చిక్కుకునేలా చేయడం కోసం కాదు. అన్నింటినీ మించి, ఈ పవిత్రమైన బంధం, ఖచ్చితంగా తాపం కలిగించేది, కానీ లైంగిక పరమైనది కాదు. నేను మీ సాంకేతికత స్థాయిని పెంచడం గురించి మాట్లాడుతున్నాను. తాపంతో భావప్రాప్తి స్థితికి చేరుకోవడానికి మీరు నానా తంటాలు పడాల్సిన అవసరం ఉండదు. మీరు కళ్ళు మూసుకుని కూర్చుంటే, మీ శరీరంలోని ప్రతి కణంలో కూడా భావప్రాప్తితో మునిగిపోవచ్చు. ఎవరైతే బావప్రాప్తి స్థితికి చేరడంలో విఫలమవుతారో, వారే ఈ పారవశ్య స్థితిని, లైంగికతతో ముడి పెడతారు, ఎందుకంటే, బహుశా వారికి తెలిసిన అత్యంత ఉన్నత స్థాయి అనుభూతి అదే అయ్యుండొచ్చు.

ప్రాథమికంగా గురువు ఇక్కడ ఉన్నది, మిమ్మల్ని మాటల్లో చెప్పలేని పారవశ్యంలో ముంచెత్తాడానికే.

ప్రజలు ఎప్పుడూ కూడా కృష్ణుడు-గోపిక సంబంధాన్ని అడ్డు పెట్టుకుంటూ ఉంటారు. ఆ పురాణ కథలలో చెప్పబడిన విధంగానే కృష్ణుడు ఒకేసారి 16,000 మంది స్త్రీలకు భావప్రాప్తి అనుభవాన్నిఇచ్చాడు. ఇది లైంగికంగా జరిగే పనికాదు. ఒక శిష్యుడు గురువుతో సన్నిహితమైన సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు. సాధారణంగా సాన్నిహిత్యం అంటే రెండు శరీరాలు తాకడంగా అర్థం చేసుకుంటారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారికి శరీరం అనేది అంత సన్నిహితమైంది కాదు. శరీరం అనేది బయట నుంచి పోగు చేసుకున్నది. అందువల్లే తాంత్రిక వ్యవస్థల్లో ఇంకా యోగిక వ్యవస్థల్లో, శరీరం ఎప్పుడూ కూడా మీ సన్నిహిత భాగంగా చూడబడదు. శక్తులు కలిసి ఒకటిగా అయినప్పుడే, అంటే గురువు యొక్క శక్తులు శిష్యుని శక్తులను ముంచెత్తినప్పుడే, అది ఒక భావప్రాప్తి అనుభూతికి తీసుకు వెళుతుంది. ఇది ఒక కలయిక, కానీ లైంగికపరమైన కలయిక కాదు.

మీకు కావలసినది కేవలం ధ్యానం చేయడమో లేదా ఓ ఆధ్యాత్మిక ప్రక్రియో అయితే, అప్పుడు మీకు నిజంగా ఒక గురువు అవసరం ఉండదు. ప్రాథమికంగా గురువు ఇక్కడ ఉన్నది, మాటల్లో చెప్పలేని పారవశ్యంలో మిమ్మల్ని ముంచెత్తాడానికే. తంత్రం అనేది ముక్తికి సాంకేతికత, అంతేగాని బానిసత్వానికి కాదు.

Editor's Note: The often misunderstood word - “Tantra” - has fired the imagination of many a human being. But only a few have known it by experience. Hear all about it from Sadhguru, only on Sadhguru Exclusive! Register today.

sadhguru-exclusive-tantra-series-banner