మీకూ వాస్తు పిచ్చి ముదిరిందా?
వాస్తు అనేది అతి ప్రాధమికమైన నిర్మాణ మార్గదర్శకత్వం. ఒక వెయ్యి సంవత్సరాల క్రితం మీరు ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకుంటే ఆ గ్రామంలో ఒక వాస్తుశిల్పి(ఆర్కిటెక్ట్) ఉండే వాడు కాదు. అలాంటప్పుడు మీరు ఇల్లు కట్టుకోవటానికి ఏ మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుంటారు? ఏ కట్టడాన్ని నిర్మించాలన్నా కూడా ప్రధానమైన సవాలుగా ఉండేది పైకప్పు(రూఫ్) నిర్మాణమే. మీరు ఆ రూఫ్ ని ఎలా నిర్మిస్తారు? మీరు మీ పొలంలోకి వెళ్లి ఒక చెట్టును వెతికి దాన్నినరుకుతారు. ఎనిమిది అడుగుల ఎత్తు మాత్రమే పెరిగిన ఒక చెట్టు మాత్రమే ఉందనుకుందాము. కాని మీకు పది మంది పిల్లలున్నారు కనుక, మీరు ఒక 120 అడుగులు పొడవు ఉన్న ఇల్లు కడతారు అందరికీ సరిపోయేటట్లు. కానీ మీరు 8 అడుగుల వెడల్పు, 120 అడుగుల పొడవు ఉన్న ఇల్లు కడితే, మీరు ఒక సొరంగంలో నివసిస్తూ ఉంటారు. మీ శారీరిక, మానసిక ఆరోగ్యం కచ్చితంగా దెబ్బతింటుంది. కనుక మీరు ఇల్లు కట్టుకోవాలని అనుకుంటే ఒక కొలత ఇంత ఉంటే, మరొక కొలత ఇంత ఉండాలని వాళ్ళు మీకు చెప్పారు.
మీరు వాస్తు శాస్త్రాన్ని చదివితే, కొండలపైన ఉండే వాస్తుకి, చదరంగా ఉండే స్థలంలోని వాస్తుకి చాలా తేడా ఉంటుంది. కర్ణాటకలో ఉండే వాస్తుకీ, తమిళనాడులో ఉండే వాస్తుకీ తేడా ఉంటుంది. వాతావరణం, ఉష్ణోగ్రతను బట్టీ కొన్ని మార్గదర్శకాలను ఇచ్చారు, వీటిని ఉపయోగించుకుని మీరు వివేకంగా ఇల్లు కట్టుకుంటారని. ఎందుకంటే మీకు సహాయం చేయటానికి అప్పుడు వాస్తుశిల్పులు లేరు.
ఈ రోజుల్లో దాన్ని జనాలు ఎంత వరకూ సాగాదీసారంటే, దాని పేరుతో అన్నీ రకాల పిచ్చిపనులు జరుగుతున్నాయి. ఎందుకంటే భయం మిమల్ని శాశిస్తున్నప్పుడు, మీరు ప్రతీ దాన్నుంచి ఒక శాస్త్రాన్ని తయారు చేస్తారు. గత పది నుంచి ఇరవై సంవత్సరాలలో ఇది మొత్తం జనాల బుర్రలలోకి ఎక్కేసింది. దానికి ముందు ఎవరికీ వాస్తు గురించి తెలియదు, కానీ అందరూ బాగానే ఉండేవాళ్ళు. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒకరి ఇంట్లో ఉన్నాను. రాత్రి సమయంలో నా ఫోన్లు అన్నీ ఆన్లో ఉంటాయి. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ లో ఉండే వారు 10 గంటల తరువాత పని చేస్తారు. ఆ రోజు నేను వారితో ఫోన్లో మాట్లాడుతున్నాను. కాని నా సెల్ ఫోన్ సరిగ్గా పని చేయక, కనెక్ట్ అవ్వటం లేదు. నేను లోకల్ ల్యాండ్ ఫోన్ ఉపయోగించుకోవాలని అనుకున్నాను.
నేను ఆ వ్యక్తి కోసం చూస్తూ వెళ్ళాను. అప్పటికే రాత్రి 12:30 లేక 1 అయ్యింది. నేను అతన్ని నిద్రలేపదలచుకోలేదు. కానీ నేను అతన్ని ఒక 45 నిమిషాల ముందే చూశాను. నేను కొంచం తటపటాయిస్తూనే వెళ్లి బెడ్ రూమ్ దగ్గర తలుపు తట్టి చూశాను – ఏ జవాబు రాలేదు. అతను నిజంగానే నిద్రపోతున్నాడేమో అని మళ్ళీ తలుపు తట్టాను – మళ్ళీ ఏ జవాబు లేదు. అప్పుడు నేను ఆ హేండిల్ కదిలించాగానే అది తెరుచుకుంది. నేను లోపలకి చూశాను, అక్కడ బెడ్ రూమ్ లో ఎవరూ లేరు.అతను ఏమైనా గార్డెన్లో నడుస్తున్నాడేమో లేక వంట గదిలోనో లేక మరెక్కడైనా ఉన్నాడేమో అనుకున్నాను. నేను కిందికి వెళ్లి ఇల్లు మొత్తం తిరిగి చూశాను – ఎవరూ లేరు. అప్పుడు నేను ఆశ్రమానికి ఫోన్ చేసి చెప్పాను, “నాకు ఆతిధ్యం ఇచ్చేవాళ్ళు కనిపించటం లేదు. అతను ఎక్కడ ఉన్నాడు? అతను, అతని భార్య ఇద్దరూ లేరు”. వాళ్ళు అతని సెల్ నెంబర్కు ఫోన్ చేశారు, అది నా దగ్గర లేదు. అప్పుడు అతను వచ్చాడు. నేను అడిగాను, “ అసలు మీరు ఏమైపోయారు? స్టోర్ రూమ్ సహా నేను అన్ని చోట్లా వెతికాను.” అతను అన్నాడు, “నేను పడుకున్నాను.” “ఎక్కడ?” అని నేను అడిగాను. అతను ఇలా జవాబిచ్చాడు, “మీకు తెలుసా, నాకు వ్యాపారంలో నష్టాలు వచ్చాయి, అప్పుడు...” నేను అన్నాను, “అదంతా సరే, అసలు మీరు ఎక్కడ పడుకున్నారు?”. అతను బాత్ రూమ్ లో నిద్రపోతున్నాడు! అదొక్కటే నేను ఆలోచించలేకపోయింది. వాస్తు తెలిసన ఒక వ్యక్తి అతనికి చెప్పాడట, “మీ బెడ్ రూమ్ మంచి స్థానంలో లేదు కనుక మీరు బాత్ రూమ్ లో పడుకోండి. మీ వ్యాపారం బాగా సాగుతుంది.” అని. “బాత్ రూమ్ లో పడుకుని ఎక్కువ కాలం జీవించటం కంటే, బెడ్ రూములో కనీసం గౌరవంగా పడుకుని, చనిపోండి” అని నేను ఆ వ్యక్తికి చెప్పాను.