ఆత్మజ్ఞానం  అంటే  ఏమిటో వివరిస్తూ,అది మనం ఎంపిక చేసుకునే విషయం కాదనీ, ప్రతి వ్యక్తి జీవితానికీ ఎంతో అవసరమైందనీ సద్గురు చెప్తున్నారు.‌

ప్రశ్న: నేను ఈ రోజువారీ కార్యక్రమాలు వదిలివేసి, నిజమైన ‘నేను’ ఏమిటో తెలుసుకోవడానికే అంకితమైపోవాలనుకుంటున్నాను. కాని నా కుటుంబం గురించి తలచుకోగానే అదంతా వెనక్కెళ్లిపోతుంది. నేను ఈ రెండింటినీ సమతుల్యం చేసుకోవడమెలా?

సద్గురు : అయితే మీ కుటుంబం నకిలీ ‘మీరు’తో నివసిస్తోందన్న మాట. అది ఎంత ఘోరం! చాలా మందికి ఆత్మజ్ఞానం అన్నమాట వినగానే, వాళ్ల బుర్రల్లో ఏదో హిమాలయ గుహలు చిత్రాల్లా కనిపించడం మొదలుపెడతాయి. మీ అనుభవంలో లేని దేని గురించీ నేను మాట్లాడను, ఎందుకంటే నేనలా మాట్లాడగానే మీరు వాస్తవికతతో సంబంధం కోల్పోతారు. మీకింకా అనుభవంలోకి రాని వాస్తవికతలను విశ్వసించడం ప్రారంభిస్తే మీరు ఏ వాస్తవికతలో ఉన్నారో దాని ఉనికిని కోల్పోతారు.

మీకింకా అనుభవంలోకి రాని వాస్తవికతలను విశ్వసించడం ప్రారంభిస్తే మీరు ఏ వాస్తవికతలో ఉన్నారో దాని ఉనికిని కోల్పోతారు.

దురదృష్టవశాత్తూ, ఆధ్యాత్మికత, మతం పేరిట లోకంలో జరుగుతోంది ఇదే. దేవుడు మీ తిండి సంగతి, మీ ఆరోగ్యం సంగతి, మీ మనుగడ సంగతి, మీ వ్యాపారం సంగతి అన్నీ తానే చూసుకుంటాడని నమ్ముతున్నారు కాబట్టి చాలా మంది విషయంలో దేవుడు సామర్థ్యం కలిగించేవాడుగా కాక, సామర్థ్యం పోగొట్టేవాడుగా తయారయ్యాడు. అందువల్ల ఒక మార్మిక పద్ధతిలోనో, అటువంటి మరోకోణంలోనో మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అనే విషయం గురించి మనం మాట్లాడుకోవద్దు. మిమ్మల్ని గురించి మీరు అత్యంత ఆచరణాత్మక పద్ధతిలో తెలుసుకోవడం గురించి మాట్లాడదాం.

మీ గురించిన యూసర్ మాన్యువల్ చదవండి

మీరేదైనా పనిచేయాలనుకుంటే ఉదాహరణకు మీరేదైనా మోటారుసైకిలో, కారో నడపదలచుకున్నారనుకోండి. ఆ యంత్రంమీద మీకు ఎంత ఎక్కువ అవగాహన ఉంటే మీరు దానితో చేయదలచుకున్న పని విషయంలో దానిమీద మీకు అంత ఎక్కువ నియంత్రణ, స్వాతంత్ర్యం లభిస్తుంది. మీ కారు కానివ్వండి, కంప్యూటర్ కానివ్వండి, సెల్‌ఫోన్ కానివ్వండి దాని గురించి మీకెంత ఎక్కువ తెలిస్తే దాన్ని మీరంత మెరుగ్గా ఉపయోగించగలుగుతారు. అట్లాగే మనుషుల విషయంలోనూ, మీ చుట్టూ ఉన్న స్నేహితులు, బంధువులు, సహోద్యోగులు తదితర వ్యక్తుల గురించి మీకెంత బాగా తెలిస్తే వారితో మీరంత బాగా వ్యవహరించగలుగుతారు. మీరు దేనితో పనిచేయాలన్నా దాని గురించి మీకెంత బాగా తెలిస్తే దాన్ని మీరంత బాగా ఉపయోగించగలరు.

మరి మీ విషయంలోనూ అంతేనని మీరెందుకు తెలుసుకోలేరు? ‘నేను’ అనే ఈ జీవిని గురించి మీరు ఎంత ఎక్కువగా తెలుసుకుంటే దాన్ని మీరంత బాగా ఉపయోగించగలరు. దానిమీద మీకెక్కువ నియంత్రణ, స్వాధీనత లభిస్తుంది. మరోవిధంగా చెప్పాలంటే ఆత్మజ్ఞానమనేది మీరిప్పుడు మీ గురించి తెలుసుకొని ఉన్నదానికంటే ఎక్కువగా తెలుసుకునే మార్గం. మీ ఆలోచనా ప్రక్రియ గురించీ, మీ వ్యక్తిత్వం, మీ భావోద్వేగాల గురించీ – మీరిప్పటికే మానసిక విశ్లేషణ చేసుకొని ఉండవచ్చు – మీకు కొంత తెలిసి ఉండవచ్చు. కాని ఈ జీవితం ఎలా ఏర్పడిందన్న విషయం గురించి – అంటే ప్రాణి ఎలా పుడుతుంది, ఎక్కడినుండి వస్తుంది, ఎక్కడికి పోతుంది, దాని స్వభావమేమిటి? మొదలైన విషయాలు గురించి మీకేమీ తెలియదు. మీరు నడుపుతున్న యంత్రం గురించి మీకేమీ తెలియనట్లయితే మీరు దాన్ని యాదృచ్ఛికంగా నడుపుతున్నారన్నమాట.

హిమాలయ గుహల్లో ఎక్కడో ఎవరో యోగి పొందే వింత సంఘటన ఈ ఆత్మజ్ఞానం అని మీరనుకుంటే మీరు పొరపడినట్లే.

ఇది జాగ్రత్తగా పరిశీలించి చూడండి. ఈ జీవి గురించి మీకు ఏం తెలుసు? మీ అస్థిత్వం యాదృచ్ఛికమూ, మీ జీవితం యాదృచ్ఛికమూ అయినప్పుడు మీరు ఒక పెద్ద దుర్ఘటన అవుతారు. మీరు నిజంగా ఇప్పటికే ఒక దుర్ఘటన కాకపోయినా, అలా అయ్యే అవకాశం మాత్రం ఉంటుంది. మీరలా ఇక్కడ ఒక సంభావ్య దుర్ఘటనగా జీవితం గడిపేటట్లయితే మీరు చాలా ఆందోళన చెందడమూ, భీతి చెందడమూ సహజం. ఇప్పుడు చాలా మందికి  జీవితం నడిచేది ఇలానే.

హిమాలయ గుహల్లో ఎక్కడో ఎవరో యోగి పొందే వింత సంఘటన ఈ ఆత్మజ్ఞానం అని మీరనుకుంటే మీరు పొరపడినట్లే. అది కాదిది. మీరు మీ జీవితాన్ని మరింత సులువుగా నడపడం కోసం మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి. మీరు దీన్ని అన్వేషించి తెలుసుకోకపోతే మీ జీవితం సులువుగా ఎలా నడుస్తుంది? సౌలభ్యమే లేకపోతే ఆనందమూ ఉండదు. మీ జీవితంలో సౌలభ్యమూ, ఆనందమూ రెండూ లేకపోతే ‘ఉండడమా, ఉండక పోవడమా’ వంటి ప్రశ్నలు తలెత్తుతాయి. జనం ఇది చాలా తెలివైన ప్రశ్న అనుకుంటారు. మిమ్మల్ని మీరు అడగగలిగే అతి మూర్ఖమైన ప్రశ్న ఇది. జీవన ప్రక్రియ ఒక అద్భుతమైన ప్రక్రియ, కాని మీరేమడుగుతున్నారు ‘ఉండడమా, ఉండకపోవడమా?’ మానవుడిగా ఉండడంలోని గొప్పతనాన్ని తెలుసుకోలేని మనుషుల బుర్రల్లో ఇటువంటి తెలివితక్కువ ప్రశ్నలు పుడతాయి. ఆత్మజ్ఞానమన్నది మనం చేసుకోవాలా...వద్దా...అని చేసుకునే ఎంపికల్లో ఒకటికాదు; అది తప్పనిసరిగా అందరు శోధించవలసింది.

ప్రేమాశిస్సులతో,
సద్గురు