ఆర్థికరంగంలో మహిళల పాత్ర ఏమిటి? భవిష్యత్తును రూపుదిద్దడం కేవలం పురుషుల  బాధ్యత మాత్రమే కాదని , నాయకత్వంలోనూ, ఆర్థికరంగంలోనూ స్త్రీల పాత్రను సద్గురు వివరిస్తున్నారు .

ప్రశ్న: నేనొక వస్తువుల తయారీ (manufacturing) యూనిట్ ను నిర్వహిస్తున్నాను. వస్తూత్పత్తి రంగంలో మహిళలకు మరింత అవకాశం లభించాలని నా కోరిక. కాని ఇది కష్టంగా . ఓ సవాలు గా కన్పిస్తున్నది. దేనికి మీ సలహా ఏమిటి?

సద్గురు: ఒక మనిషిని సృష్టించడంలో పురుషుడికంటే స్త్రీకే ఎక్కువ బాధ్యత నివ్వడానికి ప్రకృతి నిశ్చయించుకుంది. అంటే ఉత్పత్తిరంగంలో వాళ్లు బాగా రాణించ గలరనే అర్థం కదా...! పురుషులు సృజించినదానికంటే స్త్రీలే ఎక్కువ సృజించారు. నేనేదో ఇది చమత్కారం గా అనడం లేదు,  నిజంగానే, గౌరవంతో చెప్తున్నాను. ఈ రోజుల్లో మనం వస్తువులను కూర్చడం, ఉత్పత్తి సౌకర్యాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాం. కాని ఉత్పత్తి విషయంలో సృజనాత్మకతాభాగం కూడా ఉంది. ఇక్కడ మహిళలు చాలా ప్రధానమైన పాత్ర నిర్వహించగలరు.

 ఒక మనిషిని సృష్టించడంలో పురుషుడికంటే స్త్రీకే ఎక్కువ బాధ్యత నివ్వడానికి ప్రకృతి నిశ్చయించుకుంది.

విడిభాగాలను కలిపి కూర్చి యంత్రాలుగా తయారుచేయడం(Assembling) వంటి పని ముఖ్యంగా పురుషుల పని. ఈ రకమైన పనికి రోజూ కర్మాగారానికి వెళ్లవలసి వస్తుంది, ఇది మహిళలకు సాధ్యంకాకపోవచ్చు. ఆమె కర్మాగారంలో ఈ విధంగా పనిచేయాలంటే తన జీవితానికి సంబంధించి, ఇంట్లో కుటుంబ సంబంధంగా తన బాధ్యతలనిర్వహణలో అడ్డంకులు ఏర్పడవచ్చు. స్త్రీలు కర్మాగారాల్లో యంత్రాల కూర్పులవంటి పనులకు తగరని నా ఉద్దేశం కాదు, కాని వాళ్లు నిర్దిష్ట సమయాలలో విరామం తీసికోవలసి ఉంటుంది. ఉత్పత్తి రంగంలో ఇది ఆటంకం కలిగించవచ్చు. ఆమెను కర్మాగారంలో కూర్చోబెట్టే బదులు డిజైనింగు, డెవలప్‌మెంటు, మార్కెటింగు రంగాల్లో ఆమె సృజనాత్మకతను మరింత క్రియాశీలంగా, మెరుగ్గా ఉపయోగించుకోవచ్చునని నా ఉద్దేశం.

మహిళలు – ఆర్థికరంగం

ప్రస్తుతం ఈ భూగోళం మీద, ఆర్థిక కార్యకలాపం ప్రధాన స్థానాన్నాక్రమిస్తున్న దశలో ఉన్నాం. జనాభాలో 50% లేదా అంతకుపైన ఉన్న స్త్రీలు – ఈ గణనీయమైన కార్యకలాపంలో న్యాయబద్ధమైన స్థానాన్ని పొందాలి. రాబోయే దశాబ్దంలో ఆర్థికరంగ నాయకత్వం ఒక నూతన ప్రముఖస్థానాన్ని పొందబోతోంది. వాణిజ్యం రంగంలో నైనా, మరొక రంగంలో నైనా నాయకత్వస్థానంలో ఉన్నవారికి దర్శనీయకత ఉండడం చాలా అవసరం. ఇతరులు చూడలేనిదాన్ని చూడగలిగిన వ్యక్తే నాయకుడు లేదా నాయకురాలు. అలాంటి సామర్ధ్యం లేని నాయకులు  అభాసుపాలవుతారు. సాధారణంగా, అనునిత్యం పోటీ తత్త్వంలో పరిగెడుతూ ఉండే పురుషుడికి పెద్దగా గమనించే సామర్ధ్యం ఉండదు. కాని మహిళ ఏం జరుగుతున్నదో విశ్రాంతంగా కూర్చుని గమనించే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంది.

ఆర్థిక కార్యకలాపాన్ని సున్నితంగా మర్చండంలో మహిళలు చాలా ముఖ్యమైన పాత్ర పోషించగలరు.

ఆర్థిక కార్యకలాపాన్ని సున్నితంగా మర్చండంలో మహిళలు చాలా ముఖ్యమైన పాత్ర పోషించగలరు. ఆ ఆర్థిక కార్యకలాపం స్థిరత్వం పొంది, దీర్ఘకాలం మానవుల శ్రేయస్సుపై కేంద్రీకరింపబడేటట్లు చేయగలరు. ఇవ్వాళ ప్రపంచంలో సాగుతున్న ఆర్థిక నమూనాను సమూలంగా మార్చవలసిన అవసరం ఉంది. వాణిజ్యం మానవుడికి సేవ చేసేలా ఉండాలి కానీ మానవుడు వాణిజ్యానికి బానిస కాకూడదు. మానవజాతిని రూపుదిద్దడం కేవలం పురుషులకు మాత్రమే ఉన్న అవకాశం కాదు. వాణిజ్య, రాజకీయ నాయకత్వాలు రెండింటిలోను స్త్రీల పాత్ర తప్పకఉండాలి, ఎందుకంటే మానవజాతిలో సున్నిత స్వభావులు మహిళలే.

స్త్రీ – పురుష సమతుల్యత

సుదీర్ఘకాలంగా మానవాజాతి పురుషత్వానికి అతి ప్రాధాన్యతనిస్తూ ఉంది. ఎందుకుకంటే, బ్రతుకు తెరువు అన్నదే  అతి ప్రబలమైన అంశంగా భావించారు  కాబట్టి. సమాజాలు తమ అస్తిత్వ సమస్యను పరిష్కరించుకొని ఒక నిర్దిష్ట స్థాయిలో స్థిరమైన సంస్కృతీ, నాగరికతల దశకు చేరుకున్నప్పుడు మాత్రమే స్త్రీలకు తగినస్థానం లభిస్తుంది. సమాజాలు ఈనాడు అటువంటి స్థితికి చేరుకున్నాయి. కానీ బ్రతుకుతెరువు మీద దృష్టిని మరింత కేంద్రీకరిస్తున్నాము. ఒకప్పుడు బతకడమంటే ఆ రోజుకు కావాల్సిన ఆహారసేకరణ మాత్రమే . కానీ ఈ రోజుల్లో, బతకడమంటే మెర్సిడెసో లేకేపోతే బిఎండబ్ల్యు. మనం ఈ దారిలోనే ముందుకు సాగేటట్లయితే మహిళలకు సమాజంలో స్థానమే ఉండదు. ఈ రకమైన స్వభావం కొంచెం సడలించుకుంటే, సహజంగానే స్త్రీ పాత్ర చాలా ముఖ్యమవుతుంది.

స్త్రీ-పురుషులు అన్నప్పుడు  శారీరకంగా స్త్రీ అనో, పురుషుడనో అర్ధం కాదు. స్త్రీత్వం స్త్రీలో ఎంత సజీవంగా ఉంటుందో పురుషుడిలోనూ అంత సజీవచైతన్యంతో ఉంటుంది. ఇవి రెండు లక్షణాలు. ఈ రెండు లక్షణాలూ సమతుల్యంగా కలిసి ఉన్నప్పుడే మనిషి జీవితం  సంపూర్ణమైన తృప్తికలిగి ఉంటుంది. ఒక పోలిక చెప్పాలంటే వేర్లు పురుషుడైతే పూలు, పండ్లు స్త్రీ. వేరు లక్షణమే, ప్రయోజనమే పూలూ, పండ్లూ పుట్టించడం. అదే జరక్కపోతే వేరు వ్యర్థమైపోతుంది. బతికి ఉండడమే సర్వస్వం కాదు. జీవనోపాధి చూసుకున్న తర్వాత జీవితంలో అంతకంటే విలువైన ఉదాత్త విషయాలు మీకు జరుగుతాయి.

ఇవ్వాళ సాఫల్యం అన్న ఆలోచనను నడిపిస్తున్నది వ్యక్తి వ్యక్తిగత ఆకాంక్ష. అది చాలా మూర్ఖమైన పద్ధతి. తీవ్రమైన ఆకాంక్ష లేకుండానే మనం సాఫల్యం సాధించే మార్గం ఉంది. మీ చుట్టూ ఉన్న వాటిని గురించి మీరు నిజంగా పట్టించుకుంటు, మీలో కలుపుకుంటూ పనిచేయడం స్త్రీ లక్షణం. లోకంలో పనిచేయడంలో ఇంతకంటే మంచి మార్గం మరొకటి లేదు.

ఇక్కడ, ఇప్పుడు ఏముంది అని చూసుకోకుండా దానిపట్ల సరైన శ్రద్ధ లేకుండా పనిచేయడం పురుషుడి పద్ధతి. స్త్రీత్వం ఉన్నది ఉన్నచోటే సంతోషంగా ఉంటుంది. ఈ రెండు లక్షణాలు సమతుల్యంగా ఉన్నట్లయితే మనం ముందుకూ నడుస్తాము, దానితోపాటు మనం ఇప్పుడు ఉన్నచోట కూడా ఆనందంగా ఉంటాం. ప్రపంచంలో ఇప్పుడు జరగవలసింది ఇదే.

ప్రేమాశిస్సులతో,
సద్గురు