యంత్రాలను ఉపయోగించి హీలింగ్(Healing) చేయడం..సరైన పనేనా?
యంత్రాలతో హీలింగ్ చేసి మీ వెన్ను నొప్పి లేదా ఇతర రోగాలను నయం చేస్తాము అని చెప్పినప్పుడు మీరు వాటికోసం సిద్ధపడవచ్చు. కాని సద్గురు "ఏదో ఒకటి ఆ పరిస్థితికి పనిచేసినంత మాత్రాన, దానినే సరైన చికిత్స పద్ధతి అనుకోకూడదు" అని హెచ్చరిస్తున్నారు.
ప్రశ్న : ఆరోగ్యానికి సంబంధించి కొన్ని శక్తిపరమైన పరిష్కారాలు ఉన్నాయి, ఉదాహరణకి టెన్సార్స్ ఇంకా ఫ్రీక్వెన్సీ జనరేటర్స్ వంటివి. ఇవి నెగటివ్ పోలారిటిని శరీరానికి పంపించగలవు. ఈ విధమైన చికిత్స మంచిదేనా ,దీనివల్ల ఎటువంటి కర్మ కలుగుతుంది ?
సద్గురు: నేను చెప్పేది ఆర్థిక వ్యవస్థకు అంత మంచిది కాకపోవచ్చు, కానీ ఈ మాట నేను చెప్పకుండా ఉండలేను. ప్రకంపనలు లేదా బయో-ఎనెర్జీ వంటి వాటితో వ్యవహరిస్తున్నప్పుడు ఎంతో జాగ్రత్తతో ఆచి తూచి నడచుకోవాలి. లేదంటే ఇటువంటివి ప్రోత్సహించేవారికి ఎంతో హాని కలగడం నేను స్వయానా చూశాను. ఇటువంటి వారిలో ఇప్పుడు కొంతమంది అసలు జీవించిలేరు, మరెందరికో చాలా హాని జరిగింది.
కానీ ప్రతిరోజూ ఇటువంటి కొత్త ఉపకరణం ఏదో ఒకటి పుడుతూనే ఉంటుంది. ఉదాహరణకి మీకు నడుంనొప్పి ఉందనుకుందాం. మీరు ఒక ఎలక్ట్రిక్ జనరేటర్ పక్కన కూర్చుంటే, దాని ప్రకంపన వలన మీకు నడుం నొప్పి నయమయ్యి ఉండవచ్చు. దీని అర్థం మీరు ఎలక్ట్రిక్ జనరేటర్ ను నడుం నొప్పి తగ్గించే సాధనంగా పరిగణించి, మరొకరికి అమ్మడం మొదలు పెట్టవచ్చని కాదు, దాని వల్ల కలిగే ఇతర ప్రభావాలు మీకు తెలీదు.
తేలు లేదా పాముకాటు వల్ల ఎంతో మంది ప్రజలకు, వారికి అంతకుమునుపు ఉన్న ఆరోగ్య సమస్యలు నయమైన సంఘటనలు ఉన్నాయి. ఎందుకంటే వాటి విషంలో ఈ శక్తి ఉంది. ఈ రోజున ఈ విషాన్ని మందుగా ఎలా వాడాలో తెలుసుకోవడానికి సైన్స్ కృషిచేస్తోంది. మర్మికులు తాచు పాము విషాన్ని తమ అవగాహనను పెంపొందించుకునేందుకు ఉపయోగిస్తారు, కానీ ఇది ఎంతో జాగ్రత్తతో ఆచితూచి చేయవలసి ఉంటుంది. ఇవి వినోదం కోసం ప్రదర్శించే విషయాలు కాదు. వీటిని ఒక నిర్దిష్టమైన విధానంలో ఉపయోగించినప్పుడు, అవి ఎంతో శక్తివంతమైన సాధనాలుగా పనిచేస్తాయి.
ఇదేవిధంగా, కొన్ని ప్రకంపనలకు కొన్ని ప్రభావాలు ఉండవచ్చు కానీ ఇవి అన్నిటిని నయం చేయగలవన్న నిర్ధారణకు వచ్చి వీటితో ఒక యంత్రాన్ని తయారు చేసి అమ్మడం అనేది సరైన పని కాదు. ఈ యంత్రాలను తగినంతగా పరీక్షించడం జరగదు - అవి నిజంగా పని చేస్తాయా లేదా వాటి వలన ఇతర ప్రభావాలు ఏమైనా ఉన్నాయా అని.
ఇటువంటివారు, దానివల్ల డబ్బు చేసుకోవాలన్న హడావిడిలో ఉన్నరు. వీరికి ఏదైనా కొద్దిగా ఉపయోగకరంగా కనిపిస్తే, దానిని మీకు అమ్మాలని అనుకుంటారు. ఒకానొక సమయంలో, మీరు ఒక విధంగా ఉండడం వల్ల ఏదైనా మీకు ఉపయోగం కలిగించి ఉండవచ్చు. దానికి అర్థం, అది సరైన చికిత్స పద్ధతని కాదు. వీటిని సరిగ్గా పరీక్షించి ఉంటే తప్ప ఇలాంటివి ఉపయోగించమని నేను సూచించను.
ఎటువంటి మెషిన్ అయినా సరే, మహా అయితే అది కేవలం కొంత భౌతికపరమైన శక్తిని సృజించగలదు - దీనినే కొంతమంది బయో-ఎనెర్జీ అని అంటున్నారు. కాని శక్తికి భౌతికపరమైన ఇంకా అభౌతిక పరమైన పార్శ్వాలు ఉన్నాయి. ఒక మానవుడు అభౌతికంలో వేళ్ళూనుకొని ఉన్నప్పుడే, అతను భౌతికపరమైన శక్తిని ఉపయోగించవచ్చు. అందుకే, మేము హీలింగ్ వంటివి ప్రోత్సహించము. మీరు భౌతిక పరమైన శక్తిని ఎలా ఉపయోగించాలో కొద్దిగా నేర్చుకున్నంత మాత్రాన, దానిని వాడకూడదు. ఎందుకంటే, దీనికి ఎన్నో ఆవశ్యకతలు, పరిమితులు ఇంకా దానివల్ల కలిగే ఎన్నో సమస్యలు ఉన్నాయి.
మీరు అభౌతికంలో మునిగిపోగలిగితే, అప్పుడు వీటితో కొద్దిగా ఆడుకోవచ్చు. అలా లేనప్పుడు, ఇటువంటివి ప్రయత్నం కూడా చేయకూడదు. నేను చెబుతున్నది కేవలం మానవుల గురించి కాదు, ఇది మెషిన్ లకు కూడా వర్తిస్తుంది.