మీరు మీ కళ్లు మూసుకుంటే....
In this week’s Spot, a seeker asks about seeing visions when one's eyes are closed. Sadhguru stresses the importance of maintaining balance and stability. “If your mind becomes that stable, then if you see something beyond what your two eyes can see, that is called a vision; otherwise it will become madness.” Enjoy!
ప్రశ్నకారుడు: సద్గురూ! చాలా సంవత్సరాల నుండి నాకు అనేక అద్భుత ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతున్నాయి. నేను కళ్లు మూసుకున్నప్పుడు నాకు కొన్ని కనిపిస్తాయి.
సద్గురు: దేవతలు వస్తున్నారా (నవ్వు)?
ప్రశ్నకారుడు: లేదు, అలాంటిదేమీ లేదు...
సద్గురు: కేవలం దయ్యాలేనా (నవ్వు)?
ప్రశ్నకారుడు: లేదు, వస్తువుల శక్తి రేఖాచిత్రాలు, ముఖాలు. నేను చూసే వాటిమీద నాకు నియంత్రణ లేదు.
సద్గురు: లేదు, మీ మనస్సు స్వభావమే అలాంటిది, అది మీరు కోరుకున్న దాన్ని చూపిస్తుంది. అదొక అద్భుతమైన సాధనం, అందులో ఎన్నో పొరలున్నాయి. మీరు మీ జాగృతావస్థలో ఊహించలేని వాటిని కూడా చూసేటట్లు చేయగలదు. కారణం వాటి ముద్రలు మీలో ఉంటాయి కనుక. అందువల్ల మీరేదైనా అనుభవకోణంలోకి వెళ్లేముందు – అది మన చుట్టూ ఉన్న భౌతికతను దాటి వెళుతుంది కాబట్టి – మీ మనస్సు కోసం మీరు మంచి పునాది వేయడం అవసరం, మీ మనస్సు తార్కిక కోణం ఇంకా మీ బుద్ధి ఒక స్థిరమైన పునాదిపై నిలవాలి.
మీరు అనుభవాలు కోరుకున్నప్పుడు మీ బుద్ధి స్థిరమైన పునాదిపై నిలబడిలేకపోతే, మీరు మానసిక సమతౌల్యాన్ని కోల్పోతారు, ఇక మిమ్మల్నెవరూ ఆపలేరు. మీరు దేన్నైనా ఊహించుకోవచ్చు. ఊహ అనేది వాస్తవం కంటే చాలా శక్తిమంతమైనదని మీకు తెలుసా? మీరెవరైనా జబ్బుపడిన మనిషిని చూస్తే అతని ఊహ సజీవ వాస్తవానికంటే ఎంతో బలవత్తరంగా ఉంటుంది. మీరు కళ్లు తెరచి చూస్తే కనిపించేది మీరు కళ్లు మూసుకొని ఉన్నప్పుడు కనిపించే దాని అంత స్పష్టంగానూ, కాంతి మంతంగానూ ఉండదు.
ప్రాథమికంగా, మీకు కనురెప్పలున్నాయి అంటే అర్ధం మీరు కళ్లు మూసుకుంటే ఏమీ చూడకూడదు. నేను కళ్లు మూసుకుంటే ఇక నాకు ప్రపంచమే ఉండదు. మీరు కళ్లు మూసుకొని కూడా ఈ ప్రపంచాన్ని కాని, మరో ప్రపంచాన్ని గాని చూస్తున్నారంటే మీ మనస్సు అనే సంక్లిష్ట యంత్రాంగంలో ఏదో జరుగుతున్నదన్నమాట. అంటే చేయవలసిన మొదటి సాధన మీ కళ్లు మూసుకున్నప్పుడు ఏమీ చూడకుండా ఉండడం. మీ మనస్సు అంత స్థిరమైనప్పుడు, మీరు మీ రెండు కళ్లూ చూడగలిగినదాన్ని దాటి చూడగలిగితే అది ఒక దర్శనమవుతుంది, లేకపోతే కేవలం అదొక పిచ్చితనం.
దయచేసి అర్థం చేసుకోండి. సరైన స్థితికి పిచ్చితనానికి మధ్య ఉన్న సరిహద్దు రేఖ చాలా సూక్ష్మమైనది. ఎంతో స్థిరంగా ఉన్న మనిషి కూడా మూడురోజులు పాటు ఆ దిశగా కృషి చేస్తే పిచ్చివాడవుతాడు. అందుకే ఎప్పుడూ కూడా ఎవరైనా తమకేవో అనుభవాలు కలిగాయని చెప్పినప్పుడు మేం దాన్నంతగా పట్టించుకోం. అది నిజమని నాకు తెలిసినప్పటికీ దాన్ని పరిగణించను. ఎందుకంటే అది ఏమీ సాధించలేదు. ఉదాహరణకు చెట్టుకొమ్మకు ఏదో వేలాడుతూ ఉండడం మీరు చూశారనుకోండి. అది వింతగా ఉండవచ్చు, కాని దానివల్ల జరిగేదేమిటి? మీ వృద్ధికి కాని, సంక్షేమానికి కాని అది ఉపయోగపడదు.
అందువల్ల అనుభవాల కోసం ప్రయత్నించకండి. అన్నిటికంటే ముఖ్యమైంది ఈ శరీరాన్ని, మనస్సునూ స్థిరపరచుకోవడం. అది స్థిరంగా ఉన్నట్లయితే దేవుడు వచ్చినా మీరు మామూలుగానే చూడవచ్చు. దేవత వచ్చినా, దయ్యమొచ్చినా మీరు మామూలుగానే చూడగలరు. అప్సరసలు, దేవతలు, రాక్షసులు, పిశాచాలు ఎవరు వచ్చినా లెక్కచేయని స్థిరస్థితికి మీరు చేరుకున్నట్లయితే వాటిని చూసినా పరవాలేదు. లేనట్లయితే మీ రెండు కళ్లతో మీరు చూడగలిగినవి మాత్రమే చూడడం మంచిది. మీరేమైనా చూశారా లేదా అని నేను వివాదంలోకి దిగదలచుకోలేదు, మీరు కళ్లు మూసుకున్నప్పుడు ప్రపంచం అదృశ్యం అయ్యేట్లు మీ శరీరం, మనస్సు స్థిరపడాలని మాత్రమే నేను చెప్పేది. ఆ స్థాయికి చేరుకోకపోతే మీరు ఏమీ చూడకపోవడం మంచిది. ముందు మీ కనురెప్పల్ని ఉపయోగించుకోండి. కనురెప్ప ప్రయోజనమేమంటే మీరు దాన్ని మూసినప్పుడు ముందున్న ప్రపంచం అదృశ్యమవడమే. మీ చెవుల్లో బిరడాలు పెట్టుకుంటే ఏమీ వినిపించకూడదు కదా!
మీరు కళ్లు మూసుకొని వస్తువులను చూడగలితే దాన్ని ఆధ్యాత్మిక ఎదుగుదల అనుకోకూడదు, చెవులు మూసుకొని వినగలిగినా, నోరు మూసుకొని మాట్లాడగలిగినా అంతే. అంటే మీ మనస్సు అనే అద్భుతమైన దానిపై నియంత్రణ కోల్పోయారన్నమాట. అది నియంత్రణలో నుండి పోవడం అతి ప్రమాదకరం.
మీ అంతర్గత అనుభవాలు, దృశ్యాలు, ముఖ్యంగా దృశ్యాలను నాకు వదిలేయండి. నాకు వదిలేయడమంటే మీరు వాటిని విశ్లేషించడంకాని, అంచనా వేయడం కాని, ఇతరులతో పంచుకోవడంకాని, కనీసం వాటి గురించి ఆలోచించడం కాని చేయకూడదు. కేవలం నాకు వదిలేయండి. నా ఏకైక లక్ష్యం మీరు వికసించడం, వృద్ధి చెందడం. మీరు కేవలం అనుభవం పొందడం కాక అన్వేషించదలచుకుంటే మీరు నాతో సన్నిహితంగా పనిచేయాలి. మీరు మీ ఇష్టాయిష్టాలను పక్కనపెట్టినప్పుడే అది సంభావ్యమవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీ సమతుల్యత, స్థిరత్వాల కోసం కృషి చేయాలి.