మానసిక అస్వస్థతకు కారణాలేంటి??
ఈ రోజుల్లోని ప్రజలు శారీరికంగా కంటే కూడా మానసికంగానే ఎక్కువ అస్వస్థతకు గురౌతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మనస్సుకు సంబంధించిన వ్యధ సర్వ సాధారణం అయిపొయింది. మరి అసలు దీనికి కారణం ఏంటి, ఎందుకిలా జరుగతుంది అన్న ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తున్నారు.
ప్రశ్న: కొన్నేళ్ల కిందట ఒక సత్సంగంలో మనిషి బాధలకు పరాకాష్ఠ మానసిక అస్వస్థత అని మీరు అన్నారు. ఒక మనిషి ఆకస్మికంగా మానసిక అస్వస్థతకు గురికావడానికి కారణమేమిటి? వాళ్లు ఆ అస్వస్థత నుండి బయటపడడానికి మందులు తినవలసిన అవసరం లేని స్థితికి వచ్చే అవకాశమేదైనా ఉందా?
సద్గురు: మానవ మేధకు విస్తృత సామర్థ్యాలున్నాయి కాబట్టి మానసిక రుగ్మతల వంటివి కల్పించే బాధ తక్కిన బాధలన్నిటికంటే ఎక్కువ. ఈ సామర్థ్యాలు మీకు అనుకూలంగా పనిచేస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది. కాని అవి మీకు వ్యతిరేకంగా పనిచేస్తే దాని నుండి తప్పించుకునే మార్గం లేదు. ఎందుకంటే ఈ బాధను ప్రేరేపించేది వెలుపలి నుండి రావడం లేదు. ఈ బాధకు కారణం మీ పొరుగువారో, మీ అత్తగారో, మీ పై అధికారో అయితే వారి నుండి దూరంగా పారిపోవచ్చు. ఎవరూ మీకు మానసిక రుగ్మత కలిగించలేరు. వాళ్లేదో చేస్తారు, మీరెలాగో ప్రతిస్పందిస్తారు. కాని మీకు ఎవరూ ఏమీ చేయకుండా, బాధ కలుగుతూనే ఉన్నప్పుడు మీరు మానసిక అస్వస్థత పొందారని అర్థం.
దీని నుండి బయటపడటం ఎట్లా?? అది జరిగిన నష్టం స్థాయిని బట్టి ఉంటుంది. బయట పడగలిగిన వాళ్లు కొందరుంటారు. కాని కొన్ని కేసుల్లో అది భౌతిక రూపంలో మెదడులో వ్యక్తమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో వెలుపలి నుండి రసాయనిక ఔషధాల తోడ్పాటు అవసరం. సాధారణంగా చేసే చికిత్సలో మత్తు కలిగించే ఔషధాలు వాడతారు. కాని మీ మనస్సు, మెదడులలో ఒక భాగాన్ని మాత్రమే ఉపశమింపజేయలేం – మొత్తం వ్యవస్థ అంతా వీటివల్ల ప్రభావితమవుతుంది.
స్వస్థతకూ, ఉన్మాదానికి మధ్య ఉన్న గీత చాలా సన్నటిది. మీలో చాలామంది ఆ గీత దాటడాన్ని ఆనందిస్తారు. మీకెవరి మీదో కోపం వచ్చిందనుకోండి, వాళ్లమీద విరుచుకుపడ్డారనుకోండి. వాళ్లు భయపడిపోయి మీరు చెప్పినట్లు చేశారనుకోండి.. "మీకు తెలుసా? నాకు వాడిమీద పిచ్చికోపం వచ్చింది, వాడు వణికిపోయి నేను చెప్పినట్లు చేశాడు." అని మీరంటారు. మీకు పిచ్చికోపం వచ్చింది, మళ్లీ మామూలయ్యారు కాబట్టి ఇదంతా మీకు సంతోషం కలిగించినట్లే ఉంది. సరే మీకు పిచ్చికోపం వచ్చింది, అట్లాగే ఉండిపోయింది, అప్పుడది పూర్తిగా భిన్న విషయం అవుతుంది.
కోపం, అసహ్యం, అసూయ, మద్యం, మాదకద్రవ్యాలు – వీటన్నిటిని ఉపయోగించుకొని మీరు తరచుగా హద్దు దాటుతూనే ఉంటారు. స్వస్థత సరిహద్దును దాటి కాస్తో కూస్తో ఉన్మాదాన్ని ఆనందిస్తున్నారు, మళ్లీ వెనక్కు వస్తున్నారు. అలా స్వస్థతను కోల్పోయిన వాళ్లలో ఎక్కువ మంది మీలాగానే పూర్తిగా మామూలు మనుషులే. ఎదో ఒక్కరోజు ఆ హద్దు దాటిన తర్వాత తిరిగి స్వస్థత సరిహద్దులోకి రాలేక పోతారు. ఏదో ఫ్యూజు పోతుంది, అకస్మాత్తుగా వీథిన పడతారు.
ఇది మీ భౌతిక శరీరం జబ్బు పడినట్లే. ఇవ్వాళ మీరు బాగానే ఉంటరు కాని రేపు ఉదయం మీ డాక్టర్ ఏదో అయ్యిందని చెప్తాడు. ప్రజలకి ఇటువంటి సంఘటనలు రోజూ మామూలే. ఇటువంటివి మనస్సుకూ కలగవచ్చు. ఒకవేళ జబ్బు మీ శరీరానికే అయితే కనీసం సానుభూతి అయినా లభిస్తుంది. చుట్టూ ఉన్నవాళ్లు జాలిపడతారు. కాని అదే మీ మనస్సుకైతే మీకు సానుభూతి లభించదు. ఎవరూ మీ దగ్గరికి రారు. మీ దగ్గరికి రావడం చాలా కష్టమవుతుంది. మీరు అట్లా నటిస్తున్నారో, నిజంగా బాధ పడుతున్నారో వాళ్లు నిర్ణయించలేరు. మీరు నటిస్తున్నట్లయితే వాళ్లు కఠినంగా ప్రవర్తించాలనుకుంటారు, నిజమయితే మీ పట్ల వారు కరుణ చూపాలి. కష్టమైన నిర్ణయం; అంత తేలిక కాదు. ఆ వ్యక్తికి అది బాధాకరం, చుట్టూ ఉన్న వాళ్లకు మరింత బాధాకరం.
మానసిక అస్వస్థతకు ఏమాత్రం అవకాశం లేని సామాజిక నిర్మాణాలు మనకు అవసరం. నేను ఎప్పుడూ పూర్వకాలంలోని సంస్కృతి గురించి చెప్పడానికి కారణం ఏమిటంటే రెండు, మూడు వందల సంవత్సరాల కిందటి వరకు ఈ దేశంలో మానసిక అస్వస్థుల సంఖ్య దాదాపు శూన్యం. సమాజ నిర్మాణాలు అలా ఉండేవి. మెల్లగా, వాటి ప్రాధాన్యం తెలుసుకోకుండా మనం వాటిని కూల్చివేస్తున్నాం. ఇవ్వాళ గ్రామాలలో కూడా మానసికంగా దెబ్బతిన్న మనుషులున్నారు. ఒకప్పుడిలా ఉండేది కాదు. ఉన్నా కూడా అతి కొద్ది మంది మాత్రమే ఉండేవారు. ఇప్పుడు వీరి సంఖ్య పెరుగుతూ ఉంది. మీరు స్పష్టంగా చూడవచ్చు, సంపన్న సమాజాలనుకునే సమాజాలలో వీరి శాతం చాలా ఎక్కువవుతోంది. మనం భౌతిక పరిధులను అధిగమించడానికయినా ప్రయత్నించాలి లేదా మనకి, చేయూత నిచ్చే సమాజాన్నయినా సృష్టించుకోవాలి. ప్రస్తుతం మనం సృష్టించిన సామాజిక నిర్మాణాలు భయంకరంగా ఉన్నాయి.
ఇది భారతదేశ పట్టణాలలో జరుగుతూ ఉంది, పశ్చిమ దేశాల్లో ఇంకా ఎక్కువ జరిగింది. మనం అమెరికాలో నివసించేటట్లయితే మీరు నెల రోజులూ ఉపవాసమున్నప్పటికీ మీ ఖర్చు నెలకి 3,000 డాలర్లవుతుంది. ఆ సమాజాన్ని వ్యక్తి పైన చాలా భారాన్ని పెట్టేటట్లుగా నిర్మించడం జరిగింది. ఎవరూ పని మానుకుని కొంతకాలం విశ్రాంతి తీసుకోలేరు. కాని ప్రతి ఒక్కరూ విరామం లేకుండా నిరంతరం పనిచేయలేరు. ఎందరో ఇటువంటి పనిభారం నుండి విరామాలు తీసికోవలసిన అవసరం ఉంటుంది. వాళ్ల జీవితంలో తగినంత సాధన ఉన్నట్లయితే 24 గంటలు, 365 రోజులు పనిచేయగలుగుతారు. మనకున్న జీవితకాలం తక్కువ, అందువల్ల మనం విరామం కోరుకోము. కాని సాధన లేనట్లయితే ప్రజలకి విరామం చాలా అవసరం.