సాధకుడు : నేను ఉదయం 6 గంటలకు లేస్తాను. గబగబా వంట చేస్తాను. పిల్లల్ని తయారు చేసి, 8-30 గంటల కల్లా ఆఫీస్ కి వెళ్తాను. 6-30 కి ఆఫీస్ నుంచి తిరిగి వస్తాను. మళ్ళీ పిల్లల్ని తయారు చెయ్యడం, ప్రార్థన, వంట, భోజనం, హోమ్ వర్క్, నిద్రపోవడం.. ఇంత కష్టంగా ఉన్న దినచర్యలో, నేను నా జీవితంలో యోగాని ఎప్పుడు చెయ్యగలను..?

సద్గురు : మీకు తినడానికీ, కబుర్లు చెప్పుకోవడానికీ, ఉద్యోగం చేసుకోవడానికీ, అన్నింటినీ సరి చూసుకోవడానికీ, సమయం ఉంది. కానీ మిమ్మల్ని గురించి మీరు సరి చూసుకోవడానికి, మీ దగ్గర సమయం లేదు. మీరు నాకు చెబుతున్న విషయం ఇదే..! ఈ ధోరణి ఎలాంటిదంటే, మీరు ఏదో త్యాగశీలి అన్నట్లుగా మీరు ప్రవర్తిస్తున్నారు. నాకు నా గురించి సమయం లేదు, నేను అందరికోసం జీవిస్తున్నాను - అన్నట్లు. మీరు, అందరికీ ఏమి ఇస్తున్నారు..? మీ చికాకులూ, కోపాలూ, ఆందోళనలూ, ఇవే మీ పిల్లలకి అందిస్తున్నారు.

మీకు నిజంగా మీ పిల్లలంటే శ్రద్ధ ఉన్నట్లైతే, వారికి ఎంతో ఆహ్లాదకరంగా, ప్రేమగా ఉన్న పరిసరాలని వారి ఎదుగుదలకి ఇవ్వడం ఎంతో ముఖ్యమైన విషయం. వారికి అందంగా ఉన్న బూట్లను ఇవ్వడమూ, బట్టలనివ్వడమూ, వీడియో గేమ్స్ కొనిపెట్టడమూ మరొకటో ముఖ్యమైన విషయం కాదు. వారి పరిసరాలు ఆహ్లాదంగా, ప్రేమతో నిండి ఉండేలా ప్రతీ రోజూ, ప్రతీ క్షణం ఉండడం ఎంతో ముఖ్యం. మీరు అందిస్తున్న మిగతా వాటన్నింటికటే ఇది ముఖ్యం.

మీరు, ఎంత చెయ్యగలరో అంత చెయ్యండి. ఇది ప్రతి వ్యక్తి నిర్ణయించుకోవలసినది. 

ప్రపంచంలో అన్నీ చేసేద్దాం అనుకుంటే, మీరు ఖచ్చితంగా పిచ్చివారైపోతారు. మీరు, ఎంత చెయ్యగలరో అంత చెయ్యండి. ఇది ప్రతి వ్యక్తి నిర్ణయించుకోవలసినది. ఎవరో ఒకరు ఉదయం 6 గంటలకి లేచి, ఈ పనులన్నీ ఆనందంగా చెయ్యగలరు. మరొకరు, ఆ విధంగా చేయలేకపోతారు. దానికి తగినట్లుగా వారు, వారి జీవితాన్ని సరి చూసుకోవాలి. మీరు విద్యావంతులయ్యి, ఒక ఉద్యోగాన్ని సంపాదించుకుని, పెళ్లి చేసుకుని, పిల్లల్ని కన్నారు. ఇదంతా ఎందుకు..? ఎందుకంటే; ఇదంతా మీ ఆనందానికి మూలం అవుతుందని, మీ శ్రేయస్సుకి మూలం అవుతుందని అనుకున్నారు కాబట్టి. కానీ, ఇప్పుడు అదే మీ జీవితాన్ని హరించేస్తోంది. మీకు దీనిని సమర్ధించే సామర్థ్యం లేకపోయి ఉండవచ్చు. అలాంటప్పుడు మీరు, మిమ్మల్నీ, మీ సామర్థ్యాన్నీ పెంపొందించుకోవాలి.

ఉదాహరణకు, ఇప్పుడు మీరు రోజుకు 30 నిమిషాలు యోగాకై వెచ్చించారనుకోండి, ఇది మీకు ఎన్నో లాభాలని తెచ్చి పెడుతుంది. మొట్టమొదటిగా ఏమి జరుగుతుందంటే,  ఇది మీ నిద్రావసరాలను తగ్గిస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు మీరు రోజుకి 8 గంటలు పడుకుంటున్నారంటే, దాని అర్థం - మీ జీవితంలో 3 వ వంతు మీరు నిద్ర పోతున్నారు. మీ శరీరం, మీ మనస్సు మరింత శక్తివంతంగా ఉన్నట్లైతే.. సహజంగానే మీకు అవసరమైన నిద్ర తగ్గిపోతుంది. రోజుకి 3-4 గంటలు మీకు ఈ విధంగా దొరికిందనుకోండి, అది ఒక పెద్ద విషయమే కదా? ప్రజలు సరళమైన యోగా చేసినా సరే 6 నుండి 8 వారాల్లో ఎంతోమదికి వారి సామర్థ్యం ఎంతగా పెరుగుతుందంటే, వారు అంతకు ముందు 8 గంటల్లో ఏ పనినైతే చేస్తూ ఉండేవారో, వారు దానిని ఎంతో తేలికగా 3-4 గంటలలో చెయ్యగలుగుతారు. మీకు తెలియకుండా మీరు ఒక రోజంతా ఏమి చేస్తున్నారూ అన్నది వీడియో తీశామనుకోండి, ఎన్ని అక్ఖర్లేని పనులు, ఎన్ని అక్ఖర్లేని మాటలు ఎన్ని అక్ఖర్లేని కదలికలూ మీ జీవితంలో జరుగుతున్నాయో - మీరు చూసుకోవచ్చు.

మీ మనస్సు కనుక మరింత క్రమబద్ధంగా ఉంటే, ఇలాంటి అక్ఖర్లేని మాటలూ, అక్ఖర్లేని పనులూ ఇవన్నీ కూడా వాటంతట అవే మాయమైపోతాయి. ఒక్కసారి ఇలాంటివన్నీ లేకపోయిన తరువాత, మీకు ఎంతో సమయం ఉంటుంది. జీవించడానికి మీకు 24 గంటలు ఉంటుంది. అందుకని మనం ఒక దృష్టి కలిగి ఉండి,  క్రమబద్ధం గా ఉంటే, మనం 24 గంటల్లో ఎన్నో పనులు చేయగలం. ఇదే కనుక మీ దృష్టి కేంద్రీకృతమై లేకపోతే  మీరు  మీకు సమయం లేదూ – అని అనుకుంటారు. మీలో చాలామంది బిజీగా లేరు. కేవలం మీరు వేటిగురించో ఆలోచిస్తూ ఉంటారు. మీరు రోజుకి ఒక అర గంట యోగా కోసం వెచ్చించండి. 5-30 కే లేవండి , మీరు ఒక్కసారిగా మీ జీవితం ఎంతో భిన్నంగా ఉండటం చూస్తారు. నా దగ్గర సమయం లేదూ - అని వాదిస్తూ పోకండి. మీరు దానికి సమయం చేసుకుని చూడండి. అది మీలో ఎంతో మార్పుని తీసుకుని వస్తుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

pixabay