సద్గురు ఈ మధ్యన ఒక ప్రాణాంతకమైన వైద్య పరిస్థితిని ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఆయన బాగా కోలుకుంటున్నారు.
గత నాలుగు వారాల నుండి సద్గురుకు తీవ్రమైన తలనొప్పి రావడం జరిగింది. నొప్పి తీవ్రంగా ఉన్నప్పటికీ, ఆయన తన ప్రణాళికలను ఇంకా కార్యక్రమాలను కొనసాగించారు, మార్చి 8 2024న మహాశివరాత్రి వేడుకను కూడా నిర్వహించారు.
మార్చి 15 2024 మధ్యాహ్నానికి, ఆయన ఢిల్లీ చేరుకునే సమయానికి తలనొప్పి చాలా తీవ్రంగా మారింది. ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్ లో సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అయిన డాక్టర్ వినీత్ సూరి గారి సలహా మేరకు, అదే రోజున సాయంత్రం నాలుగున్నరకు సద్గురు ఎమ్మారై తీయించుకోవడం జరిగింది. అది మెదడులో భారీగా రక్తస్రావం అయినట్లు తెలిపింది. గత మూడు నాలుగు వారాలుగా తీవ్రమైన రక్తస్రావం జరిగినట్టు, అలాగే ఎమ్మారై తీసే ముందరి 24 - 48 గంటల్లో మరోసారి రక్తస్రావం జరిగినట్టు తెలిపింది.
వెంటనే హాస్పటల్లో చేరాల్సిందిగా సూచన ఇచ్చినప్పటికీ, సద్గురు డాక్టర్లతో, “గత 40 ఏళ్లలో నేను ఒక్క మీటింగ్ కు కూడా మిస్ కాలేదు (I have never missed a single meeting in my last 40 years)” అన్నారు. తీవ్రమైన ఇంకా బాధాకరమైన లక్షణాలు ఉన్నా సరే, అధిక మోతాదులో పెయిన్ కిల్లర్స్‌తో, షెడ్యూల్ చేయబడిన విధంగా 15 సాయంత్రం 6 గంటలకు మీటింగును, అలాగే 16న ఇండియా టుడే కాంక్లేవ్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
మార్చి 17 2024న, సద్గురు నాడీ వ్యవస్థ బలహీన పడసాగింది, ఎడమ కాలులో బలహీనత చోటు చేసుకుంది; పదేపదే వాంతులు కావడంతో తలనొప్పి ఇంకా ఘోరమైంది. దాంతో హాస్పిటల్లో చేరారు. సీటీ స్కాన్, మెదడులోని వాపు పెరిగినట్టు, అలాగే మెదడు ప్రాణాంతకమయ్యేలా ఒక వైపుకి కదిలినట్టు తెలిపింది.
డాక్టర్ల బృందం (డాక్టర్ వినిత్ సూరి, డాక్టర్ ప్రణవ్ కుమార్, డాక్టర్ సుధీర్ త్యాగి మరియు డాక్టర్ ఎస్ ఛటర్జీ) ఆధ్వర్యంలో, హాస్పిటల్లో చేరిన కొద్ది గంటల్లోనే, తలలోని రక్తస్రావాన్ని కట్టడి చేయడం కోసం, ఆయన ఒక అత్యవసర బ్రెయిన్ సర్జరీ చేయించుకోవడం జరిగింది. సర్జరీ అయిపోయిన తర్వాత క్రమంగా వెంటిలేటర్ సపోర్టు తీసేయడం జరిగింది.
సద్గురు స్థిరంగా కోలుకుంటూ వచ్చారు; అలాగే ఆయన మెదడు, శరీరం ఇంకా ముఖ్య పారామితులు మెరుగై సాధారణ స్థాయికి వచ్చాయి. ఆయన కోలుకోవడం అనేది అనుకున్న దానికంటే మెరుగ్గా ఉంది; అలాగే డాక్టర్ వినిత్ సూరి గారి ప్రకారం “అపోలో వైద్య బృందం అందించిన అత్యుత్తమ వైద్య చికిత్సతో పాటుగా, సద్గురు స్వయంగా తనకు తాను స్వస్థత చేకూర్చుకుంటున్నారు”.