ఆత్మ లేదు- గౌరవమూ లేదు
మార్మిక దృక్కోణం లో ‘ఆత్మగౌరవమనేది లక్ష్యం కాదు, అదో అడ్డంకి!’ అని సద్గురు చెబుతున్నారు.
“ఆత్మగౌరవం కోసం మీరు పోరాడుతూ ఉండాలా? ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న భక్తుడు ప్రత్యేకంగా ఉండాలని అనుకోడు, తను అతి సాధారణంగా ఉండాలని అనుకుంటాడు.” అని సద్గురు అంటున్నారు.
సద్గురు: “ఆత్మగౌరవం” అన్నమాట ఇప్పుడు సమాజంలో బాగా వినబడుతోంది. అది కొంత వరకు మానసిక స్థైర్యాన్ని ఇస్తుందేమో గాని, ఆధ్యాత్మిక గురువులు కూడా ఆ భావనను మనస్పూర్తిగా సమర్ధించడం దురదృష్టకరం. అస్తిత్వ దృక్కోణంలో చూసినప్పుడు ‘ఆత్మ’, ‘గౌరవం’ – ఈ రెండూ సమస్యలే! రెండూ పరిమితమైనవి, బలహీనమైనవి ఇంకా భద్రత లేనివి. మార్మిక దృక్కోణం నుండి చూస్తే మీకు గౌరవం లేకపోతే చాలా మంచిది, ఆత్మే లేదంటే మరీ మంచిది!
నిజమైన ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారెవరికైనా లక్ష్యం, తాము ప్రత్యేకులు కాకుండా ఉండడం. నిజానికి భక్తుడైన వాడు, సాధారణమైన - అతిసాధారణమైన వాడిగా అవ్వాలని కోరుకుంటాడు. భక్తి అనేది, జీవితపు అత్యంత మధురానుభవాన్ని భక్తుడికి అందిస్తుంది. భక్తి అంటే జీవితాన్ని విడదీసి చూడటం కాదు. అది జీవితాన్ని సంపూర్ణంగా హత్తుకోవటం. అందులో లేశమంత కూడా మంచి-చెడుల ఆలోచన ఉండదు, అందులో నుండి బయటపడే మార్గమే లేదు
భక్తి అంటే మీలోని ప్రతిబంధకాలాన్నీ సమస్తం కరిగిపోవటం, ఎంతగా అంటే, ఊపిరి తీసుకుంటున్నంత సహజంగా దివ్యత్వం మీలో ప్రవహించేలా. మీ జీవితంలో అనుక్షణమూ దివ్యత్వం అనేది మీలో సజీవశక్తిగా మారినట్లయితే, అది మాటల్లో వివరించలేని ఒక పారవశ్యంతో కూడిన అనుభూతి అవుతుంది. భక్తులు ప్రపంచానికి వారు పిచ్చివాళ్ళలా కనిపించవచ్చు. కాని వారు ఈ భూప్రపంచంలో అందరికన్నా పరమానందభరితమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అందుకే భక్తి అనేది ఒక లోతైన మేధస్సు అని నేను అంటూ ఉంటాను.
యోగ వాఙ్మయంలో ఒక అందమైన కథ ఉంది. కర్ణాటకలో 12వ శతాబ్దంలో వీరశైవ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న కాలంలో ‘అల్లమ ప్రభు’ అనే ఒక గొప్ప జ్ఞాని ఉండేవాడు. ఆధ్యాత్మిక చరిత్రలో క్రియాశీలమైన ఆ కాలానికి చెందిన ఎందరో గొప్ప గొప్ప మార్మికులకు ఆయన మార్గదర్శకత్వం వహించారు. ఆయన ఎంతో సూక్ష్మదృష్టి కలిగిన విశిష్టమైన వ్యక్తి. ఎంతో లోతైన మరియు ప్రగాఢమైన మార్మిక అంతర్దృష్టితో కూడిన వేలాది ద్విపదలను(పద్యాలను) ఆయన రచించారు.
ఒకరోజు గొప్ప మార్మికుడు, సాధువు, శివభక్తుడైన గోరక్ష అనే అతను అల్లమ ప్రభుకు తారసపడడం జరిగింది. ఆయన ‘కాయకల్ప’ మార్గానికి చెందిన గొప్ప యోగి. ‘కాయం’ అంటే శరీరం, ‘కల్పం’ అంటే పునరుజ్జీవింపచేసేది అని. ఇది అతి ప్రాచీనమైన యోగ విజ్ఞానం. ఈ విధానం ప్రాణశక్తిని, ఆయుష్షును పెంచి, ఆరోగ్యాన్ని చేకూర్చడమే కాక శరీరాన్ని మరొక స్థాయి చేతనలోకి తీసుకొని వెళ్ళే శక్తి కలది. గోరక్ష యొక్క యోగ శక్తి ఆయన శరీరాన్ని ఒక రాయిలాగా దృఢంగా, స్థిరంగా ఉండేలా చేసింది.
మానవుని శరీరంలో ఉన్న పంచ భూతాలను శుద్ధి చేసి, వాటిపై ఆధిపత్యాన్ని సంపాదించగల యోగాభ్యాసాలున్నాయి. ఉన్నత స్థాయి సాధనల ద్వారా మానవుడు భూత సిద్ధిని- అంటే పంచ భూతాలపై సంపూర్ణ ఆధిపత్యాన్ని పొందగలడు. వారు సాధారణ జీవితకాలం కంటే ఎక్కువ కాలం జీవించగలరు. సిద్ధి పొందిన వారు వేలాది సంవత్సరాలు జీవించారని యోగ వాఙ్మయంలో చెప్పుకునే కథలకు ఈ విద్యే మూలం.
అప్పటికే ‘గోరక్ష’ షుమారు 280 సంవత్సరాల వయసు వాడని చెప్పుకునేవారు. అయన అల్లమను సవాలు చేశాడు. “మిమ్మల్ని ఒక గొప్ప యోగి, శివ భక్తుడు అంటారు. మీ శక్తి సామర్థ్యాలేమిటో చూడాలని ఉంది ” - అని వజ్రంలాంటి పదునైన అంచుగల ఒక కత్తిని ఒరనుండి బయటకు లాగి, “దీన్ని తీసుకుని నా తలమీద మీ బలంకొద్దీ గట్టిగా కొట్టి, ఏమి జరుగుతుందో చూడండి!” అన్నాడు.
అల్లమ నవ్వుకున్నాడు. రెండు చేతులతో కత్తిని తీసుకొని, తన శక్తి కొద్దీ గోరక్ష తలమీద కొట్టాడు. గోరక్ష ఒక రాయిలా, అభేద్యంగా అలానే నిలబడి ఉన్నాడు. కత్తి అతని తలని తాకి వెనక్కి తిరిగి వచ్చేసింది.
అప్పుడు గోరక్ష “నువ్వు నామీద కత్తిని ప్రయోగించావు కాబట్టి నేను కూడా నీపై ప్రయోగించవచ్చు” అన్నాడు.
అల్లమ అంగీకరించాడు. గోరక్ష కత్తిని ఎత్తి అల్లమపై ప్రయోగించాడు. ఆశ్చర్యంగా ఆ కత్తి అల్లమ శరీరంలో నుండి ఏ హానీ కలిగించకుండా అటునుంచి ఇటు బయటకు వచ్చేసింది. అల్లమ అలాగే నిలబడి ఉన్నాడు. అతనికి ఏమీ కాలేదు. గోరక్ష యోగాభ్యాసం అతన్ని రాతిలా కఠినం చేస్తే, అల్లమ యోగం అతని శరీరాన్ని గాలిలా తేలిక చేసింది.
గోరక్ష తన కత్తిని ఇష్టం వచ్చినట్లు అటు ఇటూ ఊపాడు, ఎన్ని సార్లు అలా చేసినా, అది గాలిలో తిప్పినట్లు అల్లమ శరీరం నుండి తిరిగి బయటకు వచ్చింది. అప్పుడు గోరక్ష వినయంగా తన ఓటమిని ఒప్పుకున్నాడు. “నాకు శక్తిని ప్రసాదించే యోగం తెలుసు, కాని ఇలా కరిగిపోయే పోయే యోగం తెలియదు” అని ఆ అనుభవ శాలియైన యోగి అన్నాడు. అతను అల్లమకు శిష్యుడయ్యాడు.
గ్రంథస్తం కాని ఈ కథ మనకు ఒక ముఖ్య విషయాన్ని తెలియజేస్తోంది. ఒక భక్తుడికి దౌర్బల్యంతో ఉండటం అనేది బలమే కానీ బలహీనత కాదు. శి-వ అంటే “ఏది లేదో, అది” లేదా “లేనిది” అని అర్థం. శివభక్తుడైన అల్లముడు తన శివ భక్తిలో కరిగిపోయాడు.శూన్యంలో లయం కాగలిగే అతని సన్నద్ధతతో, ఆయన అజేయుడయ్యాడు. దుర్బలం కావటానికి సిద్ధపడటం వల్ల, అతను బలోపేతం అయాడు. ఆత్మను, గౌరవాన్ని వదులుకోవటం వల్ల అతను అన్ని పరిమితుల నుండీ ముక్తి పొందాడు. ఇచ్ఛానుసారం దుర్బలత్వాన్ని ఎంచుకోవడంలో ఉండే శక్తి ఇది.
Editor’s Note: Download the ebook “Inner Management”, where Sadhguru reveals effective tools to enhance capabilities, change your life, and open up a new dimension that frees us from external influences. Set “0” in the price field to download for free. Download Inner Management.