సద్గురు: ఆధునిక శాస్త్రం, ఆకాషిక్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉందని గుర్తించడం ప్రారంభించింది. అంటే, ఖాళీ స్థలానికి ఒక విధమైన మేధస్సు ఉంటుందని గుర్తిస్తున్నారు. ఈ ఆకాషిక్ ఇంటెలిజెన్స్ మీతో ఎలా ప్రవర్తిస్తుంది? - ఈ మేథస్సు మీకు అనుకూలంగా పనిచేస్తుందా లేదా మీకు ప్రతికూలంగా పనిచేస్తుందా - అన్నది మీ జీవితం ఎలా ఉంటుంది అన్నదాన్ని నిర్ణయిస్తుంది. మీ జీవితం అనుగ్రహంతో నడుస్తుందా, లేక జీవితమంతా ఎప్పుడూ ప్రయాసతో నిండినదై ఉంటుందా? అన్నది - స్పృహతో పొందినా, లేదా తెలియకుండానే పొందినా- మొత్తానికీ అది, ఇక్కడ పనిచేస్తూ ఉన్నఈ మరింత పెద్దదైన మేథస్సు సహకారాన్ని పొందగలిగే మీ సామర్ధ్యం మీద ఆధారపడి ఉంటుంది.

సూర్యోదయం తరువాత, సూర్యుడు 30 డిగ్రీలకు చేరుకోక మునుపు, ఒకసారి ఆకాశం వైపుకు చూసి ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ పట్టి ఉంచినందుకు నమస్కారం చేయండి.

‘ఆకాష్’ లేదా ‘స్పేస్’ ని ఐదవ మూలకం అని పిలవడం సరికాదు, ఎందుకంటే అదే అసలైన మూలకం. మిగతా నాలుగు - భూమి, నీరు, అగ్ని ఇంకా గాలి - దానిపై ఆడుతూ ఉంటాయి అంతే; ప్రాథమిక మూలకం మాత్రం ‘ఆకాష్’. ఈ అనంతమైన శూన్యం ఒడిలోనే, ఈ నాలుగు మూలకాలు ఆట ఆడతాయి. సౌర వ్యవస్థలోని ఒక గుండ్రని, తిరిగే గ్రహం మీద మనం ఇక్కడ కూర్చుని ఉన్నాము. ఆకాశమే, అన్నింటినీ వాటి వాటి స్థానాలలో పట్టి ఉంచుతున్నది. మీరు మీ స్థానంలో కూర్చోగలుగుతున్నది మీ వల్ల కాదు. మీరు ఒక స్థలంలో కూర్చోగలగడానికి కారణం, ఆకాశం మిమ్మల్ని ఆ విధంగా పట్టి ఉంచుతోంది కాబట్టి. ఆకాశమే, ఈ భూమిని, ఈ సౌర మండలాన్ని, ఈ పాలపుంతని, ఇంకా ఈ యావత్ విశ్వాన్ని వాటి వాటి స్థానాలలో పట్టి ఉంచుతుంది. పైగా వాటికి ఎటువంటి తాళ్ళు కట్టి లేవు. గమనించి చూడండి. ఊరికే ఇలా పట్టి ఉంచుతోంది.

ఈ ఆకాశ సహకారాన్ని మీ జీవితంలోకి ఎలా తీసుకురావాలో మీకు తెలిస్తే, మీ జీవితం అనుగ్రహ భరితంగా ఉంటుంది. ఇందుకోసం మీరు చేయగల ఒక సరళమైన ప్రక్రియ ఏమిటంటే, సూర్యోదయం తరువాత, సూర్యుడు 30 డిగ్రీలకు చేరుకోక మునుపు, ఒకసారి ఆకాశం వైపుకు చూసి, ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ పట్టి ఉంచినందుకు నమస్కారం చేయండి. సూర్యుడు 30 డిగ్రీలు దాటిన తరువాత, రోజులో ఏదో ఒక సమయంలో మళ్లీ ఒకసారి పైకి చూసి, నమస్కారం చేయండి. సూర్యాస్తమయం తరువాత, మళ్ళీ మరొకసారి పైకి చూసి నమస్కారం చేయండి, పైన అక్కడ ఉన్న ఏదో దేవుడికి కాదు. కేవలం ఆ శూన్యానికి. ఈరోజు మిమ్మల్ని మీ స్థానంలో పట్టి ఉంచినందుకు. ఇలా చేసి చూడండి. జీవితం ఒక్కసారిగా మార్పు చెందుతుంది.

మీకు ఆకాష్ సహకారం లభిస్తే...జీవితం ఒక మ్యాజిక్ లా సాగుతుంది

మీరు గమనించారా, టెండూల్కర్ కూడా పైకి చూస్తాడు. కేవలం అతను మాత్రమే కాదు, ఎంతో ప్రాచీన కాలం నుండి మనుషులు ఏదైనా సాధించినప్పుడు, విజయం సాధించిన గొప్ప క్షణాల్లో, పైకి చూస్తారు, ఎందుకంటే తెలియకుండానే, ఒక విధమైన అవగాహన కలుగుతుంది. వారిలో కొంత మంది పై వాడి కోసం చూస్తూ ఉండి ఉండొచ్చు, కానీ చాలా వరకూ, మీకు ఏదైనా ఒక శిఖర స్థాయి అనుభూతి కలిగినప్పుడు, మీరు గమనించారా, మీకు తెలియకుండానే మీ శరీరం కృతజ్ఞతతో పైకి చూస్తుంది. మీలో ఎక్కడో దాని గురించి ఒక గుర్తింపు కలుగుతుంది. ఇక్కడ ఉన్న మేథస్సు దాన్ని గుర్తిస్తుంది..

ప్రతిరోజు దీన్ని ఎరుకతో మూడు సార్లు చేయండి. మీకు ఆకాష్ సహకారం లభిస్తే...జీవితం ఒక మ్యాజిక్ లా సాగుతుంది. మీరు కనీసం సాధ్యపడుతుందని, ఊహించను కూడా ఊహించని మేథస్సు మీది అవుతుంది.

ప్రేమాశీస్సులతో,

సద్గురు


Editor's Note: This article was published in the New Indian Express on 17 November 2013.