మహాభారత కథ : భీష్మ పితామహుడి జననం
మనం క్రిందటి వ్యాసంలో శాంతనవుడు, గంగాల కలయిక గురించి చదివాము. ఇప్పుడు మహారాజైన శాంతనవుడు, గంగాల కలయిక దేవవ్రతుడి (భీష్మ పితామహుడి) జననం గురించి చదువుదాం..
గంగ ప్రేమలో తలమునకలై ఉన్న శాంతనుడు ఇందుకు ఒప్పుకున్నాడు. అందమైన గంగ, శాంతనునికి అద్భుతమైన భార్య అయింది. గర్భవతి అయ్యి చక్కని కొడుకుని కన్నది. వెంటనే ఆ శిశువుని నదీతీరానికి తీసుకువెళ్ళి నదిలో ముంచివేసింది.
తనకు కలిగిన మొట్టమొదటి సంతానాన్ని గంగ నదిలో ముంచి వేసిందన్న విషయం శాంతనుడు నమ్మలేకపోతున్నాడు. అతని గుండె పగిలిపోతోంది, కాని గంగ పెట్టిన షరతు గుర్తుకు వచ్చి అడిగితే గంగ తనను వీడి వెళ్ళిపోతుందని తెలిసి మౌనంగా ఉండిపోయాడు. ఎంతో సంతోషంగా ఉన్న రాజు ఇప్పుడు శోకసముద్రంలో మునిగాడు. భార్య మీదున్న ఎనలేని ప్రేమతో ఇద్దరూ కలిసి ఉండటంతో అమె మరొక కొడుకుని కనింది. ఒక్క పలుకు పలకకుండా రెండో శిశువుని కూడా నదిలో ముంచివేసింది. శంతనునికి పిచ్చి పట్టినంత పని అయింది.
ఆయన ఇక దీనిని సహించలేని స్థితికి వచ్చాడు, కాని ఏమైనా అడిగితే ఆమె వెంటనే వెళ్ళపోతుందని ఆయనకు తెలుసు. రెండూ, మూడూ, నాలుగు ఇలా ఏడుగురు కన్న పిల్లల్ని నీటిలో ముంచిన గంగని చూసి శాంతనుడు పూర్తిగా దిగులు పెట్టుకుని భార్య వైపు భయంగా చూసాడు. ఎనిమిదవ శిశువు జన్మించాడు. నిస్సహాయంగా శాంతనుడు గంగతో నదీ తీరానికి వెళ్ళాడు. ఆమె ఎనిమిదవ శిశువుని ముంచే ప్రయత్నం చేస్తుండగా శాంతనుడు శిశువుని లాక్కుని "చాలు, ఈ అమానుష కార్యం ఎందుకు చేస్తున్నావు?" అని గంగని ప్రశ్నించాడు. "షరతును మర్చిపోయి మాట్లాడుతున్నావు, నేను వెళ్ళే సమయం వచ్చింది, కానీ మీకు కారణం చెప్పటం నా బాధ్యత కనుక ఎందుకు చేశానో వినండి" అంది గంగ.
వశిష్టుల శాపం
వశిష్ట ముని గురించి విని ఉంటారు మీరు. నందిని అనే దివ్య లక్షణాలు కల ఒక ఆవు ఆయన ఆశ్రమంలో ఉంది. ఒకరోజు ఎనిమిదిమంది వసు దేవతలు విమానాలలో తమ భార్యలతో కలిసి భూలోకానికి దిగారు. వారు విహారంలో ఉన్నారు. వారు వశిష్టుని ఆశ్రమంలో తిరుగుతూ ఆశ్రమంలోని దివ్యమైన నందినిని చూసి, ప్రభాసుడు అనే ఒక వసువు భార్య "నాకు ఇది కావాలి" అని అడిగింది. ప్రభాసుడు అలోచించకుండా "పద తెచ్చుకుందాము" అంటూ ఒప్పుకున్నాడు.
వాళ్ళలో ఒకరిద్దరు వసులు "ఇది వశిష్టుని ఆవు, మనది కాదు మనం తీసుకు వెళ్ళడం సరికాదు" అంటూ అడ్డుచెప్పారు. ప్రభాసుని భార్య "పిరికివాళ్ళు వంకలు చెపుతారు. ఆవుని తేలేకనే ధర్మాలు చెపుతున్నారు” అంటూ వారిని ఎగతాళి చేసింది. ప్రభాసుడు గొప్ప వీరునిలాగా తన అనుచరులతో కలిసి ఆవుని దొంగిలించ బోయాడు. వశిష్టుడు తన ప్రియమైన ఆవుని తీసుకువెళ్తున్నారని గ్రహించి, వాళ్ళని పట్టుకుని "మీకెంత ధైర్యం? అతిధులుగా మా దగ్గరికి వచ్చారు, మీకు తగు ఆతిధ్యం ఇచ్చాము, ఇప్పుడు మీరు మా ఆవుని దొంగిలిస్తున్నారా? " అని కోపించి, వాళ్ళని "మీరు మానవులుగా జన్మించండి, భూమి మీద నడవండి, అందరిలాగా జీవించి అందరిలాగా మరణించండి” అంటూ శపించాడు. ఆ వసువులు నా వద్దకు వచ్చి, దేవలోకంలో నాకు మానవ జన్మ కలగాలని శపించబడటం తెలిసి "మమ్మల్ని నీ గర్భంలో పుట్టేటట్టు, మా జన్మను ఈ భూమిమీద వీలైనంత క్లుప్తంగా ఉండేటట్టు చూడు" అని నన్ను వేడుకున్నారు అన్నది గంగ
భీష్మ పితామహుడి బాల్యం
"నేను వారి కోరికను మన్నించి వారిని కని ఈ భూమిమీద వారి జీవితం తొందరగా ముగియడానికి తోడ్పడ్డాను. ఏడుగురిని రక్షించాను కానీ ఎనిమిదవ వాడైన ప్రభాసుడి ప్రాణం మీరు రక్షించారు. ప్రభాసుడే దొంగతనాన్ని రెచ్చగొట్టాడు కనుక బహుశా అతనికి ఈ భూమి మీద ఎక్కువ కాలం ఉండవలసి ఉంది. ఇప్పుడు చంటి బాలుడు కనుక నేను నాతో తీసుకువెళ్ళి పదహారు సంవత్సరాల వయసులో మీ దగ్గరికి తీసుకు వస్తాను, అప్పటికి మంచి రాజుకు ఉండవలసిన అర్హతలన్నీ అతనికి ఉండేటట్లు పెంచుతాను" అని గంగ తన వివరణ ఇచ్చింది. గంగ పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయింది. శాంతనుడు దుఃఖం రాజ్య కార్యకలాపాల్లో శ్రద్ధ కోల్పోయాడు. ఒకప్పుడు గొప్ప రాజైన శాంతనుడు ఇప్పుడు ఒంటరిగా, నిరుత్సాహంగా ఏమి చేయాలో తెలియక బాధలో మునిగాడు.
పదహారు సంవత్సరాలు గడిచాక. గంగ తమ కొడుకు దేవవ్రతుడిని తిరిగి తీసుకుని వచ్చి శాంతనుడికి అప్పగించింది. దేవవ్రతుడు విలువిద్యను పరశురాముడి నుండీ, వేదాలు బృహస్పతి నుండీ నేర్చుకున్నాడు. విద్యలన్నీ గొప్ప గురువుల దగ్గర నేర్చుకుని దేవవ్రతుడు రాజు కావడనికి సిద్ధంగా ఉన్నాడు. చక్కగా ఎదిగి బాధ్యతలకి సిద్ధంగా ఉన్న కొడుకుని చూసుకుని శాంతనుడు నిరుత్సాహాన్ని వదలి ఎంతో ఉత్సాహంతో ప్రేమతో కొడుకుని స్వీకరించాడు. యువరాజుగా నియమించి పట్టం కట్టాడు. సమర్ధుడైన దేవవ్రతుడు, శాంతనుని పర్యవేక్షణలో అతని ఉత్తరువులు తీసుకుని రాజ్యపాలన చూసుకోగా శాంతనుడు తిరిగి సంతోషంగా, నిశ్చింతగా ఉన్నాడు. తిరిగి వేటకు అడవికి వెళ్ళి శాంతనుడు మళ్ళీ ప్రేమలో పడ్డాడు.