శ్వాస - ఇదే కూర్మనాడి
శ్వాస అంటే, అది కేవలం ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ ల మార్పిడి కాదు.
శ్వాస అంటే, అది కేవలం ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ ల మార్పిడి కాదు. మీరు ప్రస్తుతం ఇలా ఉండడానికి గల అనేక అంశాలను, మీరు శ్వాస ఎలా తీసుకుంటున్నారు అన్నదే నిర్ణయిస్తుంది. మీరు అనుభూతి చెందే వివిధ రకాల ఆలోచనలుకు, భావోద్వేగాలకు మీ శ్వాస క్రమంలో మార్పులు జరగడం మీరు గుర్తించారా? మీరు కోపంగా ఉంటే, మీ శ్వాస ఒక రకంగా ఉంటుంది. మీరు శాంతంగా ఉంటే, మీ శ్వాస మరొక రకంగా ఉంటుంది. మీరు చాలా సంతోషంగా ఉంటే మీరు వేరొక రకంగా శ్వాస తీసుకుంటారు. మీరు ఏ విధంగా ఊపిరి తీసుకుంటే అదే విధంగా మీరు ఆలోచిస్తారు. మీరు ఏ విధంగా ఆలోచిస్తే, అదే విధంగా శ్వాస తీసుకుంటారు.
ఈ శ్వాసను ఒక పరికరంలాగా ఎన్నో విధాలుగా వాడుకొని మనం శరీరం, మనస్సులతో అనేకం చేయవచ్చు. శాంభవీ మహాముద్ర చేసేటప్పుడు మనం ఓ సరళమైన శ్వాస ప్రక్రియను ఉపయోగిస్తాము, కాని శాంభవీ మహాముద్ర క్రియ కేవలం శ్వాస ప్రక్రియను మాత్రమే ఉపయోగించేది కాదు. ఇక్కడ శ్వాస ప్రేరణ కోసం కేవలం ఓ సాధనం మాత్రమే. కానీ జరిగేది శ్వాసకు సంబంధించినది కాదు. ప్రాణాయామం ఒక శాస్త్రం. ఈ శాస్త్రాన్ని ఉపయోగించి, ఎరుకతో ఒక ప్రత్యేకమైన విధానంలో శ్వాస తీసుకోవడం ద్వారా మీరు ఆలోచించే విధానం, మీ అనుభూతులు, మీ అవగాహన, జీవితాస్వాదనా విధానమే మార్చుకోవచ్చు.
ఈ రోజుల్లో సాధారణంగా అందరూ చెప్తునట్లు, ‘మీ శ్వాసను గమనించండి’ అని అన్నప్పుడు,, మీరు మీ శ్వాసను గమనిస్తున్నారనే అనుకుంటారు. కాని నిజానికి మీరుఅది చేయలేరు. గాలి కదలిక వల్ల కలిగే స్పందనలను మాత్రమే మీరు గుర్తించ గలుగుతున్నారు. ఇది ఎలాగంటే, ఎవరైనా మీ చేతిని స్పృశిస్తే, మీరు మీకు ఆ వ్యక్తి స్పర్శ తెలుసని అనుకుంటారు, కాని నిజానికి, వారు తాకడం ద్వారా మీ శరీరంలో జనించిన స్పందనలు మాత్రమే మీకు తెలుసు; అవతలి వ్యక్తిలో కలిగే స్పందనలు మీకు తెలియదు.
శ్వాస దివ్యత్వానికి (సృష్టి కర్తకు) చెయ్యివంటిది. మీరు దాన్ని అనుభూతి చెందలేరు. మీ అనుభూతికందని ఈ శ్వాసనే ‘కూర్మ నాడి’ అంటారు. నేను గాలి వల్ల కలిగే స్పందనలను గురించి మాట్లాడట్లేదు, నేను శ్వాసను మాత్రమే సూచిస్తున్నాను. ‘కూర్మ నాడి’ అనేది మిమ్మల్ని దేహానికి కట్టే ఒక సూత్రం (ధారం) వంటిది – ఈ సూత్రం ఎక్కడా తెగిపోకుండా అలా వెళ్తూనే ఉంటుంది. నేను మీ శ్వాసను తీసేస్తే, మీరూ, మీ శరీరం విడిపోతాయి. ఎందుకంటే ప్రాణి, శరీరం ‘కూర్మ నాడి’ తో బంధించబడి ఉంటాయి. ఇదొక పెద్ద వంచన. ఇక్కడ రెండు ఉన్నాయి (మీరు, మీ శరీరం), కాని అవి ఒక్కటిగా నటిస్తున్నాయి. ఇది పెళ్లి లాంటిది - వారు ఇద్దరు, కాని వారు బయటకు వచ్చినప్పుడు ఒక్కటిగా నటిస్తారు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, దేహం, ప్రాణి, రెండు భిన్న ధృవాలు, కాని అవి ఒకటే అన్నట్టుగా నటిస్తాయి.
మీరు శ్వాసతో పాటుగా ప్రయాణిస్తూ, మీ అంతర్ముఖంలోకి లోతుగా మీ శ్వాస మూలం దాకా చేరుకోగాలిగితే, మీరు మీ దేహంతో ఎక్కడ ముడి వేయబడ్డారో అక్కడకు చేరుస్తుంది. ఒకసారి మీ దేహంతో మీరు ఎక్కడ, ఎలా కట్టబడ్డారో తెలిస్తే, మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే దాన్ని విడిచి పెట్టవచ్చు. మీరు మీ శరీరంపైనున్న బట్టలు విడిచినంత సునాయాసంగా ఎరుకతో శరీరాన్ని కూడా విడిచి పెట్టవచ్చు.
మీ బట్టలు ఎక్కడ ముడి పెట్టారో మీకు తెలిస్తే, వాటిని వదిలెయ్యడం మీకు సులువు. అవి ఎక్కడ ముడిపెట్టబడ్డాయో, కట్టబడ్డాయో మీకు తెలియనప్పుడు, మీరు ఎలా లాగినా, అది ఊడి రాదు. శరీరానికీ ఇదే వర్తిస్తుంది.
మీ బట్టలు ఎక్కడ కట్టబడి ఉన్నాయో, మీకు తెలియనప్పుడు, వాటిని తీసెయ్యాలని మీరు అనుకుంటే, మీరు వాటిని చింపి వెయ్యాల్సిందే. అలాగే, మీ దేహం మీతో ఎక్కడ ముడిపెట్టబడి ఉందో మీకు తెలియకపోతే, మీరు దాన్ని విడిచిపెట్టాలనుకున్నప్పుడు, మీరు దేహానికి ఏదో విధంగా పగలగొట్టాలి లేదా ఎదో విధంగా దీన్ని విరిచి వేయాలి. అదే కనుక మీకు ఈ రెండూ ఎలా ముడిపెట్టబడ్డాయో తెలిస్తే, మీరు మీ దేహాన్ని మీ నుంచి కొంత ఎడంగా(దేహం నేను కాదు అన్న ధ్యాసతో) చూడగలుతారు. ఈ స్పష్టత మీకు వస్తుంది. మీకు దాన్ని విడిచిపెట్టాలని అనిపించినప్పుడు, మీరు ఎరుకతో దాన్ని తేలిగ్గా వదిలెయ్యగలరు. ఇలా ఉంటే అసలు జీవితం అనుభవించే విధానం చాలా మారిపోతుంది.
ఎవరైనా ఇచ్ఛానుసారం దేహాన్ని పూర్తిగా విడిస్తే, మనం దాన్నే ‘మహాసమాధి’ అంటాము. దీన్నే సాధారణంగా ‘ముక్తి’ లేక ‘మోక్షం’ అని కూడా సంభోదిస్తాము. మీరు దేహానికి వెలుపల, దేహానికి లోపల అన్న భేదం లేని ఒక గొప్ప సమన్వయస్థితి పొందితే, ఇంక ఈ ఆట ముగిసినట్లే.
ప్రతి యోగీ దీనికోసమే తపిస్తాడు. ఒక విధంగా చూస్తే ప్రతి మనిషీ కూడా ఇందుకే ప్రయత్నం చేస్తున్నాడు. దీని పట్ల వారికి ఎరుక ఉండచ్చు, లేక పొవచు. ఎదోఒక విధంగా, వాళ్ళు విస్తరించాలనుకుంటున్నారు. మరి ఇదే పరమోత్తమ విస్తరణ. ప్రస్తుతం వారు చేస్తున్నది అనంతం దిశగా వాయిదాలలో వెళ్ళటం, కాని ఇది చాలా సుదీర్ఘమైన, అసాధ్యమైన ప్రక్రియ. మీరు – 1,2,3,4 – అని లెక్కించడం మొదలు పెడితే, మీరు చేసేది అనంతమైన గణన అవుతుంది. అంతేకాని మీరు అనంతాన్నిచేరుకోలేరు. ఈ ప్రక్రియలోని నిరర్థకత్వాన్ని గుర్తించినప్పుడు, శరీరం నుంచి జీవన ప్రక్రియను విడదీస్తూ, సహజంగానే మనిషి అంతర్ముఖుడవుతాడు.