సద్గురు : తెలివిగా ఉండటం, చురుకుగా ఉండటం అనేవి వేరు వేరు విషయాలు. పాతికేళ్ల క్రితం మీరు ఒకరిని తెలివిగలవారని అంటూ ఉండేవారు. కానీ ఈ రోజులలో ఆ పదాలు మారాయి. మీరు తెలివిగలవారయితే ఎవరూ పట్టించుకోరు. మీరు చురుకుగా ఉన్నారా లేదా అన్నదే ముఖ్యం. చురుకుగా ఉంటే ఈ ప్రపంచంలో మీ మార్గం మీరు కనుగొనగలరు - ప్రస్తుత ఆర్ధిక వ్యవస్థలో మీకో స్థానం ఏర్పరచుకోగలరు.

తెలివియొక్క స్వభావం వేరు. తెలివి మిమ్మల్ని పందెంలో గెలిపించ లేదు. నిజానికి, మిగిలిన వారికంటే మీరు తెలివిగలవారయితే, ఇతరులు చూడనివి మీరు చూసి మీరు అందరికంటే వెనుకపడవచ్చు. చురుకుగా ఉన్నవారు ఏదో ఒక చిన్న లక్ష్యం ఎంచుకుని, దానిని అతి తొందరగా చేరుకోవచ్చు - అందరి అభినందనలు పొందవచ్చు. కానీ మీ తెలివి వివిధ విషయాలను అవగాహనలోకి తేవడంతో, మీరు ఒక్క అడుగు ముందుకు వేయకపోయి ఉండవచ్చు. మీరు చురుకు వారయితే పరిస్థితిని ఏదోవిధంగా మీకు అనుగుణంగా మార్చుతారు. దేశ, కాల పరిస్థితులను, సాంఘిక వ్యవస్థను, చుట్టు ప్రక్కల ఉన్న మనుషులను బట్టి వివిధ సమయాలలో వేరు వేరు వ్యక్తులు చురుకుగల వారిగా పరిగణించబడతారు. ఈ రోజులలో న్యాయము, అన్యాయము అని ఆలోచించే మనిషిని తెలివిలేని వానిగాపరిగణిస్తారు. న్యాయాన్యాయలను పట్టంచుకోకుండాపరిస్థితిని తమకు అనుగుణంగా మలుచుకునేవారిని చురుకైన వారిగా పరిగణిస్తారు.

చురుకైన కుక్క

ఒక కథ చెబుతాను వినండి. ఒకప్పుడు ఒక చురుకైన కుక్క ఉండేది. ఎంత చురుకైనదంటే చుట్టు ప్రక్క ఊళ్లల్లో ఉన్న అన్ని కుక్కలకన్నా ఎంతో మెరుగైనది. ఒక రోజు, అది కాస్త సాహసం చేసింది. మీరు గమనిస్తే, ఊరి కుక్కలు ఎప్పుడూ అడవిలోకి వెళ్లవు. ఏ కుందేలునో వెంటాడుతూ అడవి అంచులవరకు వెళ్ళవచ్చు, కానీ ఎప్పుడూ గాఢమైన అడవులకి దూరంగా ఉంటాయి, తమకన్నా పెద్ద పెద్ద జంతువులు అక్కడ ఉంటాయని, అవి తమని వేటాడి అంతం చేస్తాయని వాటికి తెలుసు.

మరి ఇది అతి చురుకైన కుక్క కదా, అడవి లోపలికి వెళ్ళింది. ఒక పులి ఈ కుక్కని చూసింది, ఇంతకు మునుపెన్నడు ఇటువంటి జంతువుని చూడలేదు. కుక్కని చూసి ఇది నాకు మాంచి ఆహారం కాగలదు అని అనుకుంది. గుర్రుమంటూ కుక్క వైపుకు నడిచింది. కానీ ఇది చాల చురుకైన కుక్క. పరుగుతీయాలని అనుకుంది కానీ దానికి తెలుసు పరుగు తీస్తే పులి తనని ఇంతలోనే పట్టుకొని పలారం చేసుకోగలదని. దానికి దగ్గరలోనే ఒక బొమికల కుప్ప కనిపించింది, కుక్క దాని చుట్టు ఠీవిగా నడుస్తూ "ఓహోఁ, ఈ పులులు చక్కటి ఆహారం కాగలవు" అనింది. అది విని, పులి సందేహంతో వెనకడుగు వేసింది. ఇదేదో పులులను తినే జంతువు అని అనుకుంది.ఈ బొమికల కుప్ప కూడా ఉంది, అనుకుని వెనక్కు తిరిగి, వెళ్ళిపోయింది. చురుకైన కుక్క సంతోషించి మెల్లగా జారుకుంది.

దగ్గర చెట్టుమీదున్న కోతి ఇదంతా చూసి తన కోతి చేష్టలు చేయకుండా ఉండలేక పోయింది. పులి దగ్గరకు వెళ్లి " నిన్ను మూర్ఖుడ్ని చేసి వెళ్ళిపోయింది. అది ఒత్తి కుక్క మాత్రమే, నేను ఊళ్ళల్లో తిరిగేటప్పుడు ఎన్నో చూసాను. అది నిన్నేమీ చేయలేదు, నీ ఒక్క పంజాకున్న శక్తి కూడా దానికి లేదు" అని చెప్పింది. పులికి కుక్క తనను మోసం చేసిందని తెలుసుకుంది, కోపంతో గుర్రుమంటూ " నన్ను మోసం చేసింది, పద దానిని పట్టుకుందాము" అని పరిగెత్తింది. కోతి పులి వీపుపైకి దూకగా, ఇద్దరూ కుక్క వైపుకు దూసుకు వెళ్లారు.

తనవైపుకు వస్తున్న పులిని, దాని మీద కూర్చున్న కోతిని చూసింది కుక్క. జరిగింది ఏమిటో గ్రహించింది. కానీ ఇది చురుకైన కుక్క. ఆవలిస్తూ " ఆ పనికిమాలిన కోతి ఎటు పోయింది? గంటకు పైగా అయ్యింది ఒక పులిని తీసుకురమ్మని, ఎక్కడకు పోయిందో, ఏమిటో"? అనింది. ప్రపంచాన్ని మీరు ఈ విధంగా మభ్య పెట్టగలరు, కానీ మీ అంతర్గత స్వభావాన్ని ఈ విధంగా నిర్వహించలేరు. సృష్టితో వ్యవహరించడం ఒక రకం, సృష్టి మూలంతో, వ్యవహరించడం పూర్తిగా వేరొక రకం. ఇక్కడ మీ చురుకుతనం ఎందుకూ పనికిరాదు. మీరు, మరొకరు ఉంటే చురుకుదనం మంచిదే. కానీ ఇంకెవరూ లేక మీరొక్కరే ఉన్నప్పుడు, మీరెంత చురుకు అని భావిస్తారో, అంత తెలివి తక్కువ వారవుతారు.

మీరెంత తెలివితక్కువ వారో తెలుసుకోవటం

జ్ఞానోదయం ఒక విజయం సాధించడం లాంటిది కాదు. అజ్ఞానాన్ని ఛేదించడమే జ్ఞానోదయం.. - అంటే మీరెంత తెలివితక్కువవారో మీరు తెలుసుకోవడం, అదే జ్ఞానోదయం. అది ఎప్పుడూఉన్నదే, కానీ ఆ సంగతి మీకు ఈ రోజే అవగాహనకు వచ్చింది. మీరెంత తెలివితక్కువవారో తెలుసుకోవడానికి మీకు ఎంతో తెలివి ఉండాలి. ఎంతో మందికి ఇది తెలియనే తెలియదు. ఇతరులకన్నా చురుకుగా ఉండాలని, వారికి మించి ఉండాలన్న కోరిక మీలో పూర్తిగా మాయమైన తరువాతే మీకిది అవగాహనకు వస్తుంది.

అప్పుడే అజ్ఞానాన్ని ఛేదించగల తెలివి మీ సొంతం కాగలదు. ఆధ్యాత్మిక ప్రక్రియలతో మీరు మరింత చురుకైన వారయితే మీ అజ్ఞానం అనేక రూపాలు తీసుకుంటుంది.ఒక స్థాయి నుండి మరొక స్థాయి అజ్ఞానం లోకి తిరగుతుండడమే మిగులుతుంది.

చురుకుగా ఉండటం తప్పని నేను అనడంలేదు. ఇంకెవరినో మించే నేర్పరితనాన్ని అభ్యసించి మీరు సంపాదించుకోగలరు. కానీ అది పరిమితం. దీనిని మీరు మీ అంతరంగంలోకి తీసుకువెళ్లి, మిమ్మల్ని చురుకైనవారిగా చేసుకోవడం అసాధ్యం, తెవితక్కువతనం. ఎందుకంటే నువ్వు ,నేను అని ఇద్దరున్నప్పుడు నేను మీకన్నా చురుకుగా ఉండవచ్చు, కానీ నేనొక్కడినే ఉన్నప్పుడు, నేను నా కన్నా చురుకుగా ఉండడం అనేది అర్థంలేనిది.

ప్రేమాశీస్సులతో,

సద్గురు