ఈర్ష్య, అసూయ, ద్వేషాలు లేకుండా జీవించేదెలా??
మీకు అసూయగా ఉందా..? మీలో ఉండే అసూయ, కోపం, ద్వేషం ఇంకా ఇలాంటి ఎన్నో మనోవికారాలని మన పురోగమనానికి ఎలా ఉపయోగించుకోవచ్చో సద్గురు తెలియజేస్తున్నారు.
ప్రశ్న: నాలో కలుగుతున్న అసూయ నుంచి విముక్తి పొందడం ఎలా..?
సద్గురు: మీలో మీరు అసంపూర్ణత్వం అనుభూతి చెందుతున్నపుడు లేదా వేరొకరి దగ్గర మీకన్నా ఎక్కువ ఉందని మీకు అనిపించినప్పుడు, మీకు అసూయ కలుగుతుంది. ఒకవేళ, మీరు ఎంతో ఆనందంగా ఉన్నారనుకోండి, మీకు అసూయ కలుగుతుందా..? లేదు. విచారంగా ఉన్నప్పుడు, సంతోషంగా లేనప్పుడు మాత్రమే మీకు అసూయ కలుగుతుంది. అసూయ గురించి చింతించకండి. మీ జీవితంలో ప్రతీక్షణం మీలో ఆనందం, పారవశ్యం పొంగిపోరలుతూ ఉన్నట్లయితే, ఇక అసూయ అన్నది ఎక్కడి నుంచి వస్తుంది..? అసూయతో పోరాడటం మానేసి, మీరు మీ అనుభూతిని సంపూర్ణం చేసుకునేందుకు కృషి చెయ్యండి. అసూయ అన్నది మీ స్వభావం కాదు.
మీకు విముక్తి దేనినో త్యజించడం వల్ల వచ్చేది కాదు. ఎందుకంటే, దేనినైనా వదిలిపెట్టడానికి..అసలు ఉన్నది ఏది..?? ప్రస్తుతం, మీకు అసూయగా ఉందా..? అసూయ అన్నది, మీ స్వభావంలో భాగం కాదు. అప్పుడప్పుడు మీరు దానిని సృష్టించుకుంటూ ఉంటారు. ఒకవేళ మీరు, అది కావాలనే సృష్టించుకున్నారనుకోండి, అప్పుడు అది మీకు సంతోషకరమే. మీరు కోపంలో, భయంలో లేదా అసూయలో సంతోషాన్ని పొందుతున్నట్లయితే, అది మీకు ఆనందానుభూతిని కలిగించినట్లైతే, మీరు వాటిని సృష్టించుకోండి. కానీ అది మీకు ఆనందాన్ని కలిగించడం లేదు. అలాంటప్పుడు, వాటిని మీరు ఎందుకు సృష్టించుకుంటున్నారు..?? మీలో తగినంత ఎరుక లేకపోవడం వల్లే మీరు వాటిని సృజించుకుంటున్నారు.
ఈ మనోవికారాలేమిటీ..?
మీరు ఒక మనిషి పట్ల అసూయలో, కోపంలో, ద్వేషంలో, భయంలో ఉన్నప్పుడు - అది ఒక పెద్ద వికారం. ఈరోజుల్లో, ప్రజలు ఆర్గానిక్ కూరగాయల గురించి మాట్లాడుతున్నారు, కదా..? దాని అర్థం ఏమిటంటే, మీ కూరగాయలు పేడతో పండించినవని. ఏవో ఒక సంచిలోనుంచి తీసి వేసిన ఎరువులతో కాకుండా, పేడవేసి పండించినవి - అని అర్థం. అంటే, ఒక విషయం మీకు ఎక్కడో అర్థం అయ్యింది. అందమైన పండ్లను, పూలను, కూరగాయలను పండించడానికి పేడ అన్నిటికంటే ఉత్తమమైన ఎరువని. జీవితానికి సంబంధించిన తర్కం కూడా ఇదే.
ఇది, మీరు అర్థం చేసుకోవాలి. మీ మనస్సుకు ఉన్న సామాన్యమైన తర్కం ఏమి చెపుతుందంటే, మీ తోటలో మంచి పూలు పూయాలంటే, ఎరువుగా ఎన్నో అందమైన పూలను అందించాలి, అప్పుడే ఆ చెట్టు ఎన్నో అందమైన పూలు పూస్తుందని. కానీ, సృష్టి పనిచేసేది ఈ తీరులో కాదు. ఇది తర్కమే..! కానీ, సృష్టి ఈ విధమైన తర్కంలో లేదు. మట్టి కోరుకునేదల్లా, మీకు ఏదైతే అక్ఖర్లేని పదార్ధం ఉందో, దానినే.. అంతేగానీ, సువాసనగల పూలను కాదు. దుర్వావాసన వచ్చే చెత్తను. చెత్త ఎదో ప్రత్యామ్నాయం కాదు, మట్టి కోరుకుంటోంది చేత్తనే. చెత్తను కనుక, మీరు చెట్టు వేరుకి అందిస్తే అది అందమైన, సువాసనగల పూలను పూస్తుంది.
సృష్టి ఈ విధంగానే పని చేస్తుంది. మీ స్వభావంతో మీరు అనుసంధానంలో ఉండండి. ఈ మనోవికారాలన్నీ - మీ కోపం, ద్వేషం, అసూయ ఇవన్నీ మీలో ఒకరిపట్ల నిర్ణయాలు - ఇవన్నీ కూడా చూడండీ మీలో ఎంత తీవ్రతతో జరుగుతున్నాయో..!! మీ ధ్యానం కూడా ఇంత తీవ్రంగా జరిగిందంటే, ఎంత అద్భుతంగా ఉంటుందీ..? మీరు, ఎక్కడికో చేరుకుంటారు. ఖచ్చితంగా మీరు ఎక్కడికో చేరుకుంటారు. ఏవైతే, ఒక మానవుడిని వికారంగా కనబడేలా చేస్తున్నాయో, అవన్నీ కూడా తీవ్రతకు గొప్ప సాధనాలు. మీ కోపం, భయం, అసూయ - ఒకవేళ వాటికంత బలం లేనట్లయితే, అప్పుడు అసలు మీకు అవేమీ పట్టవు. కానీ, అవి మీలో రగులుతున్నాయి. అందుకే వాటిగురించి మీరు ఆలోచిస్తున్నారు. అవి, ఎప్పుడూ మీలో ఎంతో తీవ్రతతో రగులుతున్నాయి. అంటే, ఆధ్యాత్మికత అంశం మీలో ఉంది. అయితే, దీనిని ఎలా ఉపయోగించుకోవాలన్నదే - మీరు తెలుసుకోవాలి.
మీ అనుభూతి జేరిగేది మీలోనే అయినప్పుడు, మీరిక్కడ “ఎలా జీవించాలీ, ఎంత బాగా జీవించాలీ” అన్నది మీరే నిర్ణయించుకోవాలి. అందుకని ముందు మీరు అంతర్ముఖులై, మీ స్వభావం ఏమిటో తెలుసుకోండి. అలా చేయకపోతే మీ శ్రేయస్సు అన్నది, యాదృచ్చికం అవుతుంది. మనం దేనినైనా రగిల్చితే పొగ వచ్చినట్లుగానే - మీ శ్రేయస్సు యాదృచ్చికం అయినప్పుడు అసూయ, ద్వేషం, కోపం ఇవన్నీ కూడా మీ జీవితంలో సహజమైన భాగాలుగా మారిపోతాయి...!! మీరు, ఈ పొగతో యుద్ధం చెయ్యాలని ప్రయత్నించకండి. మీరు ఆ జ్వాలతోనే పోరాటం చెయ్యాలి.