ప్రశ్న: సద్గురు జీవితానికి అర్థం ఏమిటి?

సద్గురు: జీవితమంటే, మీకంటే ‘అది వేరే’ అన్నట్లు మీరు మాట్లాడుతున్నారు. కానీ, జీవితమంటే మీరే! మీ ఆలోచనలు, ఉద్వేగాలు, భావాలు, ఆదర్శాలు, సిద్ధాంతాలు, మతాలు, ఇష్టాయిష్టాలు అనే మబ్బులు, మీ జీవన ప్రక్రియను చాలావరకు కప్పివేశాయి. ఇవాళ ఎవరైనా వారి జీవితం గూర్చి మాట్లాడుతున్నారంటే, దాని అర్థం వారు వారి ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, కారు, సంపద, వారి రాజకీయ సంబంధాల గురించి మాట్లాడుతున్నారన్నమాట! వారు తామే అయిన జీవితం గూర్చి మాట్లాడటం లేదు.

మీరు ఒక జీవం అయినందున, మీరు జీవించి ఉన్నందున ఈ అదనపు హంగులకు ఏదో కొంత విలువ, వాటికి కొంత అర్థం ఉంది. మీరు జీవించి ఉన్నారు కనుక మీ ఉద్యోగం, మీ కారు, మీ ఇల్లు,మీ బంధుత్వాలకు ఒక అర్థం ఉంది. మీరేమి కట్టుకుంటున్నారు, మీరేమి మాట్లాడుతున్నారు, మీకు దేనితో సంబంధం ఉంది - వీటన్నింటికి మీరు జీవించి ఉన్నందునే ఒక విలువ ఉంది. అందుచేత ప్రాథమికమైన విషయం ఏమిటంటే మీరే జీవం. కాని మీ మానసిక నాటకం ఉందే - అది మీ జీవిత ప్రక్రియకన్నా పెద్దదై పోయింది. ఐరోపా ఖండం ఈ పెద్ద తప్పును చేసింది, ప్రపంచమంతా దాన్నే ఆదర్శంగా తీసుకుని అనుసరిస్తోంది. ఎందుకనో మనం జీవితానికంటే మన ఆలోచనలనే గొప్పగా భావిస్తున్నాం. చివరకు ఆ విషయంలో ‘నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను’ – అనే స్థితికి మనం చేరాము.

మీ ఆలోచన ఒక సాఫ్ట్ వేర్ లాంటిది. మీరు ఏరకమైన డేటాను లోపలికి పంపుతారో ఆరకమైన ఆలోచనలు మీకు కలుగుతాయి.ఆ సాఫ్ట్వేర్ ను కలిగి ఉండే జీవి మీరు, అంతేకాని మీరు ఆ సాఫ్ట్వేర్ ఉత్పత్తి కాదు. కాని ఇప్పుడు అన్నింటి కంటే మీ సాఫ్ట్వేర్ పెద్దదైంది. అందుకని మీరు “జీవితం అంటే ఏమిటి?” అని నన్ను అడుగుతున్నారు. మీరే జీవితం అని నేను గుర్తు చేస్తున్నాను. మీరు భారతదేశంలో వాతావరణం ఎలా ఉంది? అని అడిగితే దానికి అర్థం ఉంది. మనం ఆవిషయంపై చర్చించవచ్చు. ఆ చర్చకు సందర్భశుద్ధి ఉంది. కానీ మీరే జీవితమైనప్పుడు “జీవితానికి అర్థం ఏమిటి” అని అడిగితే అప్పుడు నేనొక కథను చెప్పాలి - నేను దాన్ని కథ అని ఎందుకు అంటున్నానంటే, మీ అనుభవంలో లేనిదాన్ని గూర్చి నేను మాట్లాడితే అది మీకు సంబంధించినంత వరకు అది కథే మరి! మీకు కథ నచ్చితే, దాన్ని నమ్ముతారు. నచ్చకపోతే నమ్మరు. మీరు నమ్మితే అది నిజమౌతుందా? మీరు నమ్మకపోతే నిజమౌతుందా? రెండు రకాలుగానూ మీకు సత్యం దొరకదు.

ఏదో ఒక అభిప్రాయానికి రావటమెందుకు?

మీకు తెలిసింది తెలుసునని, తెలియనిది తెలియదని ఒప్పుకోవటానికి అభ్యంతరం ఏమిటి? మనకు తెలియని విషయాన్ని మనం ఊహిస్తాం. ఎందుకంటే “నాకు తెలియదు” అనే ఒప్పుదలకున్న మహత్తరశక్తి మనకు తెలియదు. మీరు సంతోషంగా, సుముఖంగా “నాకు తెలియదు” అనే స్పృహతో ఉన్నప్పుడు తెలుసుకోవటం అనేది ఎంతో దూరంలో లేదు. మానవుని స్వభావం ఎలాంటిదంటే, ‘నాకు తెలియదు’ అనే స్థితిలో ఉండలేడు. తెలుసుకోవాలన్న తపన, నిరంతరం మీలో ఉండనే ఉంటుంది. తెలుసుకోగలిగినంత తెలుసుకోవటానికి మీ తెలివి తన దారుల్ని తాను ఏర్పరచుకుంటుంది.

అటువంటప్పుడు “నాకు తెలియదు” అని ఒప్పుకోవటంలో సమస్య ఏమిటి? ఇలా ఎందుకు జరుగుతుందంటే మీరున్న సమాజంలో తెలిసిన వారికి ఉన్నంత విలువ, తెలుసుకోవాలన్న జిజ్ఞాసువుకు లేదు. పరిజ్ఞానం అంటే కొన్ని విషయాల సేకరణ, అందులో ఎక్కువ శాతం మీరు ఏర్పరచుకొన్న అభిప్రాయాలు. శాస్త్రం పేరిట చలామణి అయ్యే జ్ఞానం కూడా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతోందంటే మీరు నిరంతరం ఒక నిర్ధారణ వదిలి వేరొక నిర్ధారణకి వస్తున్నారు. మతాన్ని అనుసరించే వారు ఒక నిర్ధారణలతో నిలిచి ఉంటున్నారు. శాస్త్రవేత్తలు ఒక నిర్ధారణ నుండి మరో నిర్ధారణకు తమ అభిప్రాయాలను మార్చుకుంటూ ఉంటారు. అదేదో కొంత పరిణామం లాగా ఉంటుంది, కొంతవరకు అది అంతే.

ప్రతిదాని గూర్చి ఒక నిశ్చితాభిప్రాయానికి రావలసిన అవసరం ఏముంది? “ఈ జీవితానికి అర్థం ఏమిటి?” అని మీరు అడిగినప్పుడు జీవితం గూర్చి ఎదో ఒక అభి ప్రాయానికి రావాలనే మీ ఉద్దేశం కనిపిస్తోంది. జీవితానికి ముగింపు, మీది - నాది అందరిదీ ఒకటే! మీరు ఎదో ఒక ముగింపుకి రావాలని అనుకుంటే మీకు తెలియకుండానే మీరు మరణాన్ని కోరుతున్నారు అని. మీ బాల్యం నుండి మీకు ఇదే జరుగుతోంది. మీకు ఏ అభిప్రాయాలు లేనప్పుడు, మీరు అన్నింటిని గొప్ప ఆశ్చర్యంతోనూ, ఆసక్తితోనూ చూశారు. కాని ఇవాళ మీవద్ద అభిప్రాయాలు ఉన్నాయి. “అది చెట్టు, అది సీతాకోక చిలుక, అది ఇది. ఇది అది” . అంటూ ప్రతిదాన్ని కొట్టి పడేస్తారు.

జీవితానుభూతి:

మీరు జీవితానికి అర్థం ఏమిటి అని ప్రశ్నించినప్పుడు, మీరు ఒక అభిప్రాయానికి వచ్చి, ఈ రాత్రికి నిశ్చింతగా నిద్రపోవాలని ప్రయత్నిస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏదో ఒక అభిప్రాయం లేకుండా ఉంటే మీ తెలివి మిమ్ములను బాధిస్తుంది. ఆనందంగా తికమక పడటం గనక మీకు వస్తే, అదే బాగుంటుంది, ఎందుకంటే అక్కడ మీ తెలివి పదునుగా ఉంటుంది. మీరొక అభిప్రాయానికి వచ్చిన మరుక్షణం, మీరు ఒకదాన్ని నమ్మిన మరుక్షణం, మీ తెలివి నిద్రపోతుంది. మీకు ఏమి తెలియనప్పుడు మీరు సంపూర్ణమైన ఆసక్తితో ప్రతి విషయాన్ని పరిశీలిస్తారు.

మీరు జీవితంతో నిమగ్నం కావడం అవసరం కాదంటారా? జీవితాన్ని తెలుసుకునేందుకు అంతకంటే మరో మార్గం ఉన్నదా? మీరు తినే ఆహారం పట్ల మీకు ఆసక్తి లేకపోతే అదే ఎలా ఉందో నిజంగా మీరెలా చెప్పగలరు? చాలామంది మొదటి ముద్ద నోట్లో పెట్టుకొనే వరకే దానిపట్ల ఆసక్తితో ఉంటారు. ఆ తర్వాత రుచి చూడకుండా మింగటం మొదలు పెడతారు. అందువల్ల జీవితపు మొదటి దశ అయిన బాల్యంలోనే అందరూ జీవితాన్ని ఆనందిస్తారు. ఆ తర్వాత ప్రతిదానికి వారికి ఒక కారణం, ఒక అభిప్రాయం ఉంటాయి.

మీరెంత ఎక్కువగా అభిప్రాయాలను ఏర్పరచుకుంటారో, అంత తక్కువగా అనుభావాన్ని పొందుతారు. మనకు అన్నీ తెలుసు, అంతేకాని మనం దేన్నీ అనుభవించం. మీ మానసిక నిర్మాణానికి మాత్రమే ఇటువంటి అర్థాలకు అర్థం ఉంటుంది. మీ మనసుకు అర్థం కావాలి. కాని, జీవితపు స్వభావం ఏమిటంటే, మీరిక్కడ లక్షలాది సంవత్సరాలు జీవించినా అది ఇంకా మిమ్మల్ని ఉత్తేజపరుస్తూనే ఉంటుంది. మీకు ఇంకా ఆసక్తి మిగిలే ఉంటుంది. దాన్ని మీరు ఎంత దగ్గరగా గమనిస్తే అంతగా అది మిమ్మల్ని కౌగలించుకుంటుంది. మీలోని జీవం అర్థం కోసం వెతకటం లేదు. అది అనుభవ మహదానందాన్ని కోరుతోంది. ముందుగా మీరు దాన్ని సృష్టించుకోండి. అప్పుడు మీ ప్రశ్నలన్నీ మటుమాయం అవుతాయి. అలా చేయకపోతే, ఎప్పుడూ అర్థాన్ని అన్వేషించే మనసుతో మీరు ప్రశ్నలను అడుగుతూనే ఉంటారు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు