ప్రశ్న: ఓటమి గురించిన భయాన్ని మేము ఎలా జయించగలం?

సద్గురు: అసలు ఓటమి అనేదే లేదు. ఓటమి అనేది కేవలం ఒక భావన, ఎందుకంటే గెలుపు అనేది కూడా ఒక మూర్ఖపు భావన మాత్రమే. మీరు ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించే బదులు, ఈ ఆలోచనని మార్చుకోండి. ఈ ఒక్కటీ మారిస్తే, అంతా అద్భుతంగా ఉంటుంది. మీరు వీధిలో ఒక బిచ్చగాడయినట్లైతే, ఈరోజు, రెస్టారెంట్ కి వెళ్ళి ఒక దోశ తినడమే గొప్ప విజయం. అవును కదా?

మీలోని ప్రతి భావన, ఆలోచన, భావోద్వేగాలు, ఉద్దేశాలు, విలువలు అన్నీ కూడా ఎక్కడి నుంచో తెచ్చుకున్నవే. అవి లోపల్నుంచి మీ మీద అధికారం చెలాయిస్తున్నాయి. అసలు ‘విజయం’ అనే ఆలోచన మీది కానే కాదు. అది విజయం అంటే ఎవరో చెప్పిన నిర్వచనం. మీ మతమూ, సమాజమూ ఇంకా సంస్కృతీ ‘విజయం అంటే ఇది’ అని మీరు నమ్మేట్టుగా, మీకు శిక్షణ ఇచ్చాయి. ఎవరో చేసిన ఆలోచనకు మీరు బానిస కాకండి. అదే మీకు మొట్టమొదటి విజయం. విజయం అంటే జీవితంలో మీ దగ్గరకు చేరే డబ్బు కట్టలు కాదు. ఈ ప్రపంచంలో మీరు ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించారు అన్న దాని మీద కూడా గెలుపు, ఓటమి ఆధారపడి లేవు. మీరు నరకంలో కూడా ఆనందంగా నవ్వుతూ నడవగలిగితే, అప్పుడు మీరు జీవితంలో విజయం సాధించినట్టు.

ఓ మెట్టు

ఈ జీవితంలోని మామూలు విషయాలే తమ జీవిత లక్ష్యంగా చూసేవాళ్ళకి, గెలుపు ఓటములు ఉంటాయి. ఈ జీవితాన్ని, ఉన్నతికి ఒక గొప్ప అవకాశంగా, పైకి వెళ్లేందుకు మెట్టుగా భావించే వాళ్ళకి ఓటమి అనేది ఉండదు. మీకు సుఖాలు వచ్చినా లేక నష్టాలు వచ్చినా, ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే, అది చాలా ఉపయోగకరమైనదే – దాన్ని మీ శ్రేయస్సు కోసం మీరు ఉపయోగించుకోండి.

ఒకప్పుడు ఒక రైతు ఉండేవాడు, తన పంట దిగుబడి మీద ప్రభావం చూపించే సహజ వాతావరణ పరిస్థితుల పట్ల చాలా విసుగు చెంది ఉన్నాడు. ఒకరోజు అతను శివుడిని పిలిచి, "ఈ వాతావరణ మార్పులతో నాకు విసుగు వస్తోంది. నువ్వైతే రైతువు కాదు. నాకు తెలిసినంత మటుకు నువ్వు ఒక వేటగాడివి. వ్యవసాయం చేయడం నీకు ఎలాగూ తెలీదు కాబట్టి, ఈ వాతావరణాన్ని నాకు వదిలేయవచ్చు కదా? నేనైతే రైతుని. ఎప్పుడు వర్షం పడాలో, ఎప్పుడు ఎండ రావాలో, అన్నీ నాకు తెలుసు. నీకు తెలీదు ఎందుకంటే నువ్వు కేవలం వేటగాడివి, పైగా వెర్రి సన్యాసివి. నువ్వు అస్సలు సరైన రైతువే కావు. అన్నీ అస్తవ్యస్తంగా జరుగుతున్నాయి. ఇది నాకు వదిలేసెయ్యి" అన్నాడు.

ఏకళనున్నాడో శివుడు, వెంటనే, "సరే, వాతావరణం నీ చేతిలోకి తీసుకో" అన్నాడు. సరే, ఇక రైతు తన పంటకి ప్రణాళిక వేసుకున్నాడు. అతనిలా "వర్షం" అనగానే వర్షం కురుస్తుంది. అతను భూమిలో వేలు గుచ్చి చూస్తాడు. "ఆరు అంగుళాల వరకూ నేల తడిసింది, ఫర్వాలేదు", "ఆగు!" అంటాడు. ఆ తర్వాత అతను దుక్కి దున్ని, జొన్న పంట వేసి, రెండు రోజులు ఆగాడు, "వర్షం" , తర్వాత "ఎండ". ఒకరోజు అతను తన పొలంలో పని చేస్తున్నాడు కాబట్టి నీడకోసం "మేఘాలు", సరిగ్గా అతనికి కావలసినట్టే అన్నీ జరుగుతున్నాయి. ఒక చక్కటి జొన్న చేను తయారైంది. రైతు సంతోషానికి అవధుల్లేవు.

పంట కోత సమయం వచ్చేప్పటికి పక్షులేవీ రాకూడదని రైతు కోరుకున్నాడు. అతను "పక్షులు రాకూడదు" అనగానే ఒక్క పక్షి కూడా రాకపోవడంతో, ఆశ్చర్యపోవడం అతని వంతయింది. జొన్న పంటను కోసుకోడానికి రైతు తన పొలానికి వెళ్ళాడు కానీ తీరా చూస్తే, ఏ కంకికీ గింజ లేదు. అతను "ఇదేంటి, ఇలా ఉంది? నేను ఎక్కడ ఏం తప్పు చేశాను?" అని అనుకున్నాడు. అతనికి ఏమీ అర్థం కాలేదు ఎందుకంటే అతను అన్నీ బాగానే చేసుకున్నాడు- వర్షము, నీళ్లు, ఎండ అన్నీ కూడా.

రైతు తిరిగి శివుడు దగ్గరికి వెళ్లి "నేను అన్నీ సరిగ్గానే చేశాను. అయినా గింజ రాలేదు. నా పంటపై నువ్వేమైనా కుట్ర చేశావా?" అని అడిగాడు. శివుడు ‘‘నేను అంతా చూస్తూనే ఉన్నాను. నువ్వు చూసుకుంటున్నావు కదా. అందుకని నేను మధ్యలో కలగజేసుకోదలచలేదు. వర్షం బాగా కురిసింది, ఎండ కూడా బాగా కాసింది , అంతా చాలా బాగుంది. కానీ, నువ్వు గాలిని ఆపేసావు. నేనెప్పుడూ చేను మీదికి విపరీతమైన గాలి పంపించే వాడిని. ఈదురు గాలికి భయపడి ఆ మొక్కలు, వాటి వేళ్ళని నేలలోకి లోతుగా దింపేసేవి. అందువల్ల కంకులు వచ్చేది. ఇప్పుడు నీ దగ్గర మంచి జొన్న చేను ఉంది కానీ, పంట లేదు" అన్నాడు.

ఒకే ఒక్క లక్ష్యం

ఆ జొన్న చేను ఎలాగైతే తాను బలంగా తయారవడానికి వీచే గాలిని ఉపయోగించుకుందో, అలాగే, మీరు మీ జీవితంలో ఎదురయ్యే వివిధ రకాల పరిస్థితులను, మిమ్మల్ని మరింత బలంగా, మెరుగ్గా చేసుకోడానికైనా మీరు ఉపయోగించు కోవచ్చు, లేకపోతే కూచుని ఏడవచ్చు. అది మీకున్న ఎంపిక. ప్రతి ఒక్కటి, అది ఏదైనా పర్వాలేదు, మీ జీవితంలో జరిగిన అతిభయంకరమైన సంఘటన కూడా మీ ఎదుగుదలకి, శ్రేయస్సుకి ఉపయోగించుకోవచ్చు. మీ జీవితంలో జరిగే చిన్న సంఘటనలు- మీ వ్యాపారం, మీ పెళ్ళి, మీ పిల్లలు- ఇవన్నీ కూడా పైకి వెళ్లేందుకు ఒక్కొక్క మెట్టు, అంతే. ఇది మీకేమీ కొత్త కాదు. భారతీయ సంస్కృతిలో లక్షల సంవత్సరాల నుంచి ఇది నేర్పిస్తూనే వచ్చారు. ‘‘మీ జీవితం ఉన్నది ముక్తి కోసమే. మీ పెళ్లి, ఈ వ్యాపారం, ఉద్యోగం, ఈ సామాజిక జీవనం, ఇవన్నీ కూడా ముక్తికి దారులే. మీరు ఆ దారిలో వెళ్ళినా లేక వేరే దారిలో వెళ్ళినా, మీరు సన్యాసి అయినా, సంసారి అయినా, మీ ఏకైక లక్ష్యం కేవలం ముక్తి మాత్రమే’’ అని వారు అన్నారు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు