మానవ శరీరంలో శక్తి జ్యామితి
మానవ శక్తి వ్యవస్థ జ్యామితి (Geometry) గురించీ, నిర్ధారణల నుండి సందిగ్ధతలకు, వాటినుండి చైతన్యానికి ప్రయాణం గురించీ సద్గురు మాట్లాడుతున్నారు.
మానవ శక్తి వ్యవస్థ జ్యామితి (Geometry) గురించీ, నిర్ధారణల నుండి సందిగ్ధతలకు, వాటినుండి చైతన్యానికి ప్రయాణం గురించీ సద్గురు మాట్లాడుతున్నారు.
మీ శక్తి వ్యవస్థా, మీ భావనాశక్తీ ఏ విధంగా అనుసంధానింపబడి ఉన్నాయి?
భౌతిక అస్తిత్వానికీ, శక్తి అస్తిత్వానికీ ఒక జ్యామితీయ(Geometry) సంబంధం ఉంది. విశ్వంలోని ప్రతిదీ అణువు నుండి బ్రహ్మాండం దాకా జ్యామితీయ సమగ్రత ఉండడం వల్లే పనిచేస్తున్నాయి. జ్యామితిలో అత్యాధారభూతమైన , అత్యంత స్థిరమైన రూపాలలో త్రిభుజం ముఖ్యమైంది. మానవ శక్తి వ్యవస్థలో రెండు సమాన త్రిభుజాలున్నాయి. ఊర్ధ్వముఖమైన కింది త్రిభుజం, అధోముఖమైన పై త్రిభుజం. సాధారణంగా ఈ రెండు త్రిభుజాలూ అనాహతానికి కొంచెం పైన కలుసుకుంటాయి. మీ బుద్ధి, భావనాశక్తులతో బాగా పనిచేయాలంటే ఈ రెండు త్రిభుజాల అమరికనూ కొంతవరకైనా సవరించుకోవలసి ఉంటుంది. వీటి ఉత్తమమైన అమరిక ఏదంటే రెండు త్రిభుజాలనూ ఒకదానిలోకి ఒకదాన్ని ఎంతవరకు తీసికొని రావాలంటే బయటివైపు ఆరు సమాన త్రిభుజాలతో నక్షత్రం లాంటి అమరిక ఏర్పడాలి.
సరైన అమరికను మీరు తీసుకు రాగలిగితే , మీరు మీలోపల దేన్నైనా ఎలా వ్యక్తమవ్వాలని అనుకుంటున్నారో, బాహ్యంగా అది అలానే వ్యక్తమయ్యే విధంగా మీ భావనాశక్తిని ఉపయోగించగలుగుతారు. మీ భావనాశక్తిని పెంపొందించుకోవడానికి మీ దేహంలోని ఊర్ధ్వముఖమైన త్రిభుజాన్ని పైకి జరప వలసి ఉంటుంది – శరీర జ్యామితి ప్రకారం ఇది శరీరానికి పునాది – దాన్ని ఎంతవరకు పైకి జరపాలంటే విశుద్ధి అందులో చేరిపోవాలి – విశుద్ధి మీ భావనాశక్తికి ఆధారం. దాన్ని పైకి జరపడానికి, ఎల్లపుడూ అక్కడే నిలపడానికి ఒక సాధన ఉంది. మీకటువంటి సాధన లేకపోతే , దీన్ని సాధించడానికి తేలికమార్గమేమిటంటే కొంత కలం పాటు తినకుండా ఉండడం. సాధారణంగా కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఊర్ధ్వముఖ త్రిభుజం దానంతటదే పైకి లేస్తుంది. మీరు తినగానే మళ్లీ అది కిందకు దిగుతుంది.
చక్రాలు కదిలేటట్లు ఉంచుకోవడం ప్రాధాన్యం
శరీరంలో నూట పధ్నాలుగు చక్రాలుంటాయి. 72 నాడులు లేదా శక్తి మార్గాలున్నాయి మన వ్యవస్థలో, నూట పధ్నాలుగు సంధి ప్రదేశాలుంటాయి. ఈ సంధులలో బహుళ సంఖ్యలో నాడులు కలుసుకొని మళ్లీ భిన్న మార్గాల్లో ప్రయాణిస్తాయి. సాధారణంగా ఈ సంధుల్ని చక్రాలంటారు. చక్రం అంటే వృత్తాకారమైనప్పటికీ ఇవి త్రిభుజాకారంలో ఉంటాయి. అవి ముందుకు కదులుతుంటాయి కాబట్టి ఆ కదలికను సూచిస్తూ వాటిని చక్రాలంటారు. ఈ నూట పధ్నాలుగులో రెండు శారీరక పరిధికి వెలుపల ఉంటాయి. బహుళ సంఖ్యాకులకు తగినంత సాధన చేయకపోతే ఇవి చాలా బలహీనంగా ఉంటాయి. తక్కిన నూటపన్నెండు చక్రాలలో కొన్ని శారీరక స్థాయిలో వివిధ శరీరావయవాలలో ఉంటాయి. మిగిలిన చక్రాలు కొంతవరకు కదులుతూ ఉంటాయి.
మీరు మీతో ఏం చేస్తున్నారన్న దాన్నిబట్టి ఈ చక్రాలు కదిలే పద్ధతి ఉంటుంది. వివిధ రకాల కార్యకలాపాలు చేయడానికి శక్తిని పొందడానికి, భిన్న పరిస్థితులకు మిమ్మల్ని అనుకూల పరచుకోవడానికీ, చక్ర శారీరికతను తగిన విధంగా సర్దుబాటు చేసుకోవలసి ఉంటుంది. చక్రాలు కదిలేటట్లు ఉంచుకోవడానికి అనుగుణమైన కృషి చేయడం ముఖ్యం. భిన్న పరిస్థితులలో మీరు సమర్థంగా, చురుకుగా ఉండాలంటే చక్రాల కదలిక చాలా ముఖ్యం. భిన్న అవసరాలకనుగుణంగా మీరు పనిచేయాలంటే ఇది అవసరం. చాలా మంది మనుషుల్లో సమస్య ఏమిటంటే వాళ్లు ఒక పరిస్థితిలో చక్కగా పనిచేస్తారు, మరో పరిస్థితిలో చతికిలబడతారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే, వాళ్లు కేవలం ఒకే పద్ధతిలో మాత్రమే ఆలోచించగలగడం, అనుభూతి చెందగలగడం, పనిచేయగలగడం వల్ల.
మీరు కొద్ది అభ్యాసంతో ఏ పనినైనా చక్కగా నిర్వహించగలగాలి. మీ శక్తి వ్యవస్థ బిగుసుకుపోయి ఉంటే ఇది సాధ్యం కాదు. అందువల్ల మీ వ్యవస్థను చైతన్యవంతంగా ఉంచుకోవాలి. ఇది కేవలం మీరు ప్రపంచంలో భిన్నభిన్న కార్యకలాపాలు నిర్వర్తించడం కోసమే కాదు అది మీకు కొంత అనుభవ సౌలభ్యాన్నిస్తుంది, ఎటువంటి పరిస్థితుల్లో నైనా మీరు సౌకర్యంగా ఉండగలరు. మీలో ఒక హాయి ఉండాలంటే, మీ శక్తులు అనువుగా ఉండాలి. పరమోన్నత స్వభావాన్ని గ్రహించడానికి నూట పన్నెండు ద్వారాలుగా ఈ నూట పన్నెండు చక్రాలు ఉపయోగపడతాయి. అందుకే ముక్తి సాధనకు ఆదియోగి నూటపన్నెండు మార్గాలు చెప్పారు.
మీ శరీరతత్త్వంలోని ఈ సంక్లిష్ట త్రిభుజాన్ని మీరు కోరిన విధంగా కదిలించగలగాలంటే ఒక విభిన్నస్థాయి సాధన అవసరం. అయితే అతి ముఖ్యమైన విషయం ఈ రెండు త్రిభుజాలూ ఒకదాన్నొకటి ఖండించుకోవడం. సాధారణంగా ఊర్ధ్వముఖమైన త్రిభుజం కింద ఉంటుంది, అధోముఖమైన త్రిభుజం పైన ఉంటుంది. ఈ రెండింటినీ ఒక దానిపైకొక దాన్ని తీసికొని రావడం వల్ల చుట్టూ ఆరు సమాన త్రిభుజాలు ఏర్పడి నక్షత్రరూపం తీసికొంటాయి. ఇలా చేయగలిగితే వ్యవస్థ చక్కగా సమతుల్యతను పొంది గ్రహణ శీలమవుతుంది. నేను మీకు అందిస్తున్నదంతా కూడా సాన్నిధ్యంలో ప్రసరణ చేయడం ద్వారానే. దానికి మీలో గ్రహణసామర్థ్యం ఉండాలి. నా మాటలు మీకు జ్ఞానాన్ని ఇవ్వలేవు. మీరు గందరగోళ పడడానికే నా మాటలు. మాట్లాడడం ద్వారా ఎవరూ ఎవరికీ జ్ఞానం ప్రసాదించలేరు. సాన్నిధ్యానికి పరివర్తన కలిగించ గల శక్తి ఉంటుంది.
నిర్ధారణ నుండి సందిగ్ధతలకు, సందిగ్ధతలనుండి చైతన్యానికి
అందరూ చేసిన తెలివి తక్కువ నిర్ధారణలను నాశనం చేయడానికే మాటలు మంచి సాధనంగా ఉపయోగపడతాయి. నిర్ధారణలను ధ్వంసం చేసినప్పుడు గందరగోళం ఏర్పడుతుంది. విశ్వంలోని ప్రతిదాని విషయంలోనూ ఆనందదాయకమైన గందరగోళ పరిస్థితి , ఒక మంచి స్థితే. దీని అర్ధం ఏంటంటే మీరు నిరంతరం ప్రతిదాని పట్లా శ్రద్ధ చూపిస్తున్నారన్నమాట. ఒక విషయం మీకు తెలియదని మీరు తెలుసుకున్నప్పుడు మీలో గ్రహణశీలత ఏర్పడుతుంది. ప్రతి దాని గురించి మీకు నిర్ధారణలున్నట్లయితే ఇక సంభావ్యత కానీ, గ్రహణశీలత కాని ఉండదు. మీకు నిర్ధారణలుంటే శ్రద్ధ అవసరం ఉండదు – ప్రాణం లేనట్టుగా జీవితం కొనసాగించవచ్చు. మీలో నిర్ధారణలు ఎంత ఎక్కువగా ఉంటే మీ బుద్ధీ, శరీరమూ కూడా మృతశరీరంలా అంతగా బిగుసుకు పోతుంది.
మీరు రోజూ హఠయోగం చేస్తున్నట్లయితే, మీ ధోరణి బిగుసుకుపోయి ఉన్నప్పుడు మీ శరీరం వంగకపోవడం మీరు గమనిస్తారు. మరొకరోజు మీరు సంతోషంగా, మానసికంగా హాయిగాఉన్నప్పుడు మెరుగ్గా వంగ గల్గుతారు. మీ చైతన్యం, స్వభావం మీ శరీరంలోని ప్రతి అణువులో, మీ జీవితంలోని ప్రతి క్షణంలో వ్యక్తమవుతుంది. అందుకే ఇవ్వాళ ప్రపంచంలో తెచ్చిపెట్టుకున్న రోగాలెన్నో కనిపిస్తున్నాయి. ఇంతకు ముందెన్నడూ ప్రజలకు ఇప్పుడు మనకున్నంతగా ఆహారపదార్థాల ఎంపికకు అవకాశం లేదు. పూర్వం స్థానికంగా ఏది లభ్యమైతే జనం అదే తిన్నారు. ఇవ్వాళ ఇంత వైవిధ్య పూరితమైన ఆహారం లభిస్తున్నా రోగగ్రస్తత ఎక్కువయింది. వాస్తవానికి ఆహారంలో మనుషులకు ఎంత ఎంచుకునే అవకాశం ఉంటుందో వాళ్లంత జబ్బు పడుతున్నారు.
అమెరికా సంయుక్త రాష్ట్రాలు ప్రపంచంలోనే ఆహారంలో అత్యధికంగా ఎంపికలకు అవకాశం ఉన్న దేశం. కాని ఆరోగ్యం మీద వాళ్లు ఖర్చు పెట్టే ధనం కూడా ఎంతో ఎక్కువ – సంవత్సరానికి మూడు ట్రిలియన్ల డాలర్లు ఖర్చుపెడతారు. అది మానవ సమాజానికి వారు చేస్తున్న దారుణం. తగిన పోషకాహారం లభించక మనుషులు జబ్బు పడితే అర్థం చేసుకోవచ్చు. కాని బాగా తినేవాళ్లే జబ్బు పడుతుంటే, ఎదో మోలికమైన తప్పు ఉంది. మీ శరీరంలోని ప్రతి అణువూ మీ చైతన్యస్వభావం సృష్టించినదేనని మనం అర్థం చేసుకోవడం లేదు. మీ చైతన్యస్వభావాన్ని చక్కగా ఎలా ఉంచుకోవాలో మీకు తెలియనప్పుడు, మీ వ్యవస్థను చక్కగా ఉంచుకోవడం మీకు తెలియదు. అప్పుడు మీరు యాదృచ్ఛికంగా వ్యవహరిస్తారు,కానీ అలా ఉండకర్లేదు.
మనుషులుగా మనం తక్కిన ప్రాణులన్నీ చేసే పనులన్నీ చేస్తాం – తింటాం, నిద్రపోతాం, పునరుత్పత్తి చేస్తాం, చస్తాం. మనం ఆ ప్రాణులన్నిటికీ భిన్నంగా చేసేదేమిటంటే ఈ అన్ని విషయాల్లోనూ చాలా గందరగోళం చేస్తాం. మనుషుల విషయంలో ముఖ్యమైన భేదమేటంటే మనమీ పనులన్నీ పూర్తి చైతన్యంతో చేయవచ్చు. ఉదాహరణకు మీరు పూర్తి స్పృహతో తినవచ్చు. మీరు ఆకలిగా ఉన్నారనుకోండి. మీరొక ఇతర ప్రాణి అయితే మీకు పనికొచ్చేదేదో తీసికొని తినేస్తారు. కాని మనిషిగా, మీరు భోజన సమయం వరకు ఎదురు చూస్తారు, బల్లవద్ద కూర్చుంటారు, ప్రార్థన చేస్తారు, రెండు చేతులతో నోటినిండా, ముఖంనిండా కుక్కుకోకుండా, మీ కుడిచేత్తో తింటారు. స్పృహతో ఉండడమిది. మీ శరీరం చెప్పినట్లు వినేటట్లయితే మీరు తక్షణమే తినడం మొదలుపెడతారు. శరీరపు అనివార్యతలను అణచిపెట్టే స్పృహ, దానికవసరమైన తెలివి మీకుంది కాబట్టి పరిస్థితికి స్పృహతో ప్రతిస్పందించ గలుగుతున్నారు. ఎవరైనా అత్యనివార్యంగా ప్రవర్తిస్తే పశువులా ప్రవర్తిస్తున్నాడంటాం. అందువల్ల ఇది అనివార్యత నుండి చైతన్యంవైపు ప్రయాణం.
చైతన్యం మీరు మీ అనివార్యతా ధోరణుల నుండి విముక్తమయ్యే అవకాశాన్నిస్తుంది. మీరు ఈ క్షణం వరకు అన్నిరకాల అనివార్య ధోరణుల ఆధిపత్యంలో కూరుకుపోయినప్పటికీ, ఇప్పుడు పూర్తిగా చైతన్యవంతులయితే, మీరు బహుకాలంగా సంపాదించుకుని గుట్టపోసుకున్న ధోరణులనుండి దూరంగా జరగగలుగుతారు. జీవితంలోని ప్రతికోణాన్నీ మీరు చైతన్యవంతం చేసుకుంటే- కార్యాచరణలోనే కాదు, ఆలోచనలు, భావోద్వేగాలు, శక్తి విషయంలో కూడా – మీరు ప్రపంచపు పైశిఖరం మీద ఉంటారు.