ప్రశ్న: ఏదయినా జ్ఞాపకం పెట్టుకోవాలంటే నాకు చాలా కష్టమైపోతున్నది. ముఖాముఖి ఎవరైనా చెప్పిన విషయాలు చప్పున గ్రహించటం నాకొక పెద్ద సవాలుగా మారింది. దీని గురించి మీరేదయినా చెప్తారా?

సద్గురు: మీరు చూసిన విషయాలు గానీ, మీరు విన్నవి గానీ, స్పృశించి చూసినవి గానీ, రుచి చూసినవి గానీ, వాసన చూసినవి గానీ, మీ మెదడులో సంపూర్ణంగా నమోదైతీరతాయి. అవి బుర్రకు ఎక్కటంలో, వాటిని నమోదు చేసుకోవటంలో ఎలాంటి సమస్యా ఉండదు. ఇప్పుడు, ఈ నిమిషంలో, మిమ్మల్ని నేను ఏవో దుర్భాషలాడాననుకోండి, అది మీరు జీవితాంతం గుర్తుంచుకొంటారు. మీది అమోఘమైన జ్ఞాపక శక్తి. కాకపోతే, మీరు తిట్లూ, దూషణల వంటివి మాత్రమే గుర్తుంచుకొంటున్నారు, అంతే!

అసలు సమస్య ఏమిటంటే, మీకు అవసరమైనప్పుడు, అవసరమైన కొన్ని విషయాలను మీరు ఆ జ్ఞాపకాలలో నుంచి బయటకు లాగలేకపోవటం. మీరు మీకు కావలసినదేదో దాన్ని వెంటనే పట్టేసి, బయటకు తెచ్చుకోలేకుండా ఉన్నారు. ఇది జ్ఞాపక శక్తికి సంబంధించిన సమస్య కానే కాదు. స్పష్టత (clarity) కు సంబంధించిన విషయం.

ఒక ఫోనుకు ‘మెమరీ’ (memory) తక్కువ, అని మనం అంటున్నామంటే అర్థం, సమాచారాన్ని భద్రపరిచేందుకు దానికున్న సామర్థ్యం పరిమితం అని. కానీ, దాని మీద నేను ‘2’ సంఖ్యను నొక్కితే, అది ‘5’ సంఖ్యను చూపుతున్నదంటే, అది ‘మెమరీ’ కి సంబంధించిన సమస్య కానే కాదు. సంఖ్యలను నొక్కుతున్న ‘కీ బోర్డ్’ (key-board) సరిగా లేదని అర్థం. మీ సమస్య కూడా చెడిపోయిన ‘కీ బోర్డ్’ సమస్యే! ‘మెమరీ’ సామర్థ్యాన్ని సరి చేయాల్సిన పనేమీ లేదు. మీ అనుభవాలన్నీ సజావుగా, సంపూర్ణంగా నమోదవుతూనే ఉన్నాయి. ఆ నమోదయిన సమాచారంలో, మీకు కావలసిన దాన్ని కావలసిన సమయంలో వెతికి తెచ్చుకోలేక పోతున్నారు. సమస్యంతా అదే.

జీవనగతిలో మరింత నియమబద్ధత (precision) సాధించటమెలా?

స్పష్టతను సాధించేందుకు మనం కొంత కృషి చేయాలి. మన ఆలోచనలలో మరింత స్పష్టత ఎలా వస్తుంది? ఇందుకు మీరొక సులభమైన కిటుకును వాడచ్చు. మీరు చేసే పనులన్నీ అతివృష్టీ అనావృష్టీ కాకుండా, పద్ధతిగా నిర్వర్తించాలి. హఠ యోగం బోధించేది ఈ నియమబద్ధత (precision)నే. మీ కాళ్ళు ఎలా ఉంచాలి, చేతులు ఎలా ఉంచాలి, తలను స్థిరంగా ఎలా నిలపాలి, మీ కదలికలు ఎలా ఉండాలి, మీరు మీతో తెచ్చుకొన్న వస్తువులను ఎక్కడ ఉంచుకోవాలి – ఇలాంటి విషయాలన్నీ ఒక పద్ధతిగా, నియమబద్ధంగా నిర్వర్తించటం. శారీరకమైన చర్యలలో మీరు నియమబద్ధతను పాటిస్తే, మీ బుద్ధికూడా నియమబద్ధంగానే సాగుతుంది. ఈ నియమబద్ధతను మీరు మీ జీవితంలోని అన్ని పార్శ్వాలలోనూ అవలంబించాలి. మీ గదిని ఎలా సర్దుకొంటారు, నిద్రపోయేందుకు పడక ఎలా అమర్చుకొంటారు – ఇలా, ఒకటేమిటి, అన్ని పనులలోనూ.

మీరు యోగాసనాలు వేసేటప్పుడు ఎలాంటి నియమబద్ధతా, శ్రద్ధా చూపుతారో, అలాంటి శ్రద్ధ జీవితంలో అన్ని విషయాలలోనూ చూపాలి. అలా చేస్తే, నెమ్మదిగా మీ ఆలోచనలో కూడా స్పష్టత పెరుగుతుంది. మీ బుద్ధి అన్ని విషయాలలో శ్రద్ధగా, నియమబద్ధంగా పని చేస్తుంది.

ఇప్పటినించే - ఈ క్షణం నుంచే - మీరొక చిన్న చిట్కాను అభ్యాసం చేయచ్చు. మీరు లేచి నిల్చొనేటప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, నడిచేటప్పుడు కానీ, మరే పని చేసేటప్పుడయినా కానీ, ఆ చేసే పనిని పద్ధతిగా, నియమబద్ధత (precision)తో, శ్రద్ధతో చేయండి. మీ చుట్టూ ఉన్న ప్రదేశం వివరాలన్నీ ప్రయత్నపూర్వకంగా మనసుకెక్కించుకొంటూ ఉండండి. ఉదాహరణకు: ఇదిగో, ఇక్కడ అయిదు స్తంభాలున్నాయి, అక్కడ ఒక పెద్ద బండరాయి ఉంది. ఈ పక్క ఒక చిన్న కొలను ఉంది, అక్కడ ఒక పాత్ర ఉన్నది, అవతల మరో నాలుగు స్తంభాలున్నాయి. ఒక తలుపు కనిపిస్తున్నది. ఎంత ఎత్తు తలుపు? దాదాపు పన్నెండడుగులుంటుందేమో! ఇలా ప్రతి విషయంలోనూ అభ్యాసం చేయండి. ఇక్కడి నుంచి అక్కడికి ఎన్ని అడుగులు? ‘ఒకటి, రెండూ...’ అంటూ లెక్క పెట్టనక్కరలేదు. నడుస్తూనే గమనించండి. ‘ఇక్కడికి మూడడుగులు నడిచాననుకొంటాను...’ ఆ పైన మరో మూడు. అంతకు పైన మరో మూడడుగులు. కొన్నాళ్ళ తరవాత నాలుగడుగుల చొప్పున, తరవాత అయిదడుగులు, పదకొండడుగులు... నిదానంగా మీకు, ప్రత్యేకమైన ధ్యాస లేకుండానే, ‘పన్నెండడుగులు నడిచాను’ అన్న విషయం బుర్రకెక్కి పోవాలి. ‘యోగా’ అంటే అదే.

కొంత కాలం గడిచేటప్పటికి, మీరు కోరిన లక్ష్యం దానంతటదే మీకు లభిస్తుంది. మీ శరీరం విషయంలో మీరు సాధించగోరే ‘క్రమబద్ధత’ను, హెచ్చు తగ్గులు లేని నియమ పాలననూ, మీ బుద్ధికి కూడా సంక్రమింపజేయండి. మీ బుద్ధి మీ శరీరాన్ని అనుకరించి, అనుసరించేట్టు చూసుకోండి. స్పష్టత దానంతట అదే వస్తుందని మీరు గ్రహిస్తారు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు