జీవితంలో సంతోషంగా ఉండడం ఎలా?
మీ జీవితంలో సంతోషం ఎప్పుడో ఒకసారి మాత్రమే దొరికే ద్రాక్షపండా? ఆనందాన్వేషణలో మనిషి పడే తాపత్రయాన్ని త్రోసిపుచ్చుతూ, సంతోషంగా ఉండడం ఎలా అనేది సద్గురు మనకు వివరిస్తున్నారు.
సద్గురు: సంతోషంగా ఉండడమా, లేదా అనేది కేవలం మీ ఎంపిక మాత్రమే. మనుషులు దుఃఖాన్ని కావాలని ఎంచుకుంటారు. అలా దుఃఖంగా ఉంటే తమకేదో దక్కుతుందని వారి నమ్మకం. మీరు దుఃఖపడితే మీరు స్వర్గానికి వెళతారని వారికి ఎవరో చెప్పారు. మీరు బాధపడే రకమైతే మీరు స్వర్గానికి వెళ్ళినా ఏమి చేస్తారు, చెప్పండి? అలాంటప్పుడు నరకంలోనే మీరు హాయిగా ఉంటారు. మీరు సంతోషం లేకుండా ఉంటే, మీకు ఏమి లభించినా, ప్రయోజనం ఏముంది? అలాకాక, మీరు సంతోషంగానే ఉంటే, మీకేమీ దక్కకపోయినా, మీకొచ్చిన నష్టమేముంటుంది? ఇది ఒక సిద్ధాంతం కాదు, ఇది మీ నిజస్వభావం. సహజంగా మనం సంతోషంగానే ఉండగోరతాం. మీకు నేను ఏదో ప్రవచనం ఇవ్వట్లేదు, “సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండండి” అని. ఏజీవైనా సంతోషంగా ఉండగోరుతుంది. మీరు చేసే ప్రతి పనీ సంతోషాన్నికోరి చేసేదే.
మనిషి ఏపని చేసినా, ఏపనైనాగానీ, చివరకు తన జీవితం ఒకరికి అర్పిస్తున్నాగానీ, అది కేవలం తనకు సంతోషాన్నిస్తుంది కాబట్టే చేస్తున్నాడు. మీరు ఎవరికైనా సేవ ఎందుకు చేస్తున్నారు? మీకది ఆనందాన్నిస్తుంది కాబట్టి. కొందరు మంచి బట్టలు వేసుకోజూస్తారు. కొందరు డబ్బుసంపాదించజూస్తారు. ఎందుకంటే అవి వారికి సంతోషాన్నిస్తాయి కాబట్టి. ఈ భూమి మీద మనిషి ఏ పనిచేసినా కానీ, తన జీవితం ఒకరికి అర్పిస్తున్నాగానీ, అది కేవలం తనకు ఆనందాన్నిస్తుంది కాబట్టే చేస్తున్నాడు. సంతోషం అనేది జీవిత పరమార్థం. మీరు స్వర్గానికి ఎందుకు పోఁజూస్తున్నారు? అక్కడికి వెళితే సంతోషమే, సంతోషమని మీకు ఎవరో చెప్పారు.
సంతోషం లేకపోవడానికి మూలం
అంతా చేసినా, ఇంకా మీకు సంతోషం లేదంటే, ఎక్కడో మీరు జీవితం యొక్క మూలాలు కోల్పోయారు. మీ చిన్నప్పుడు ఎంత సంతోషంగా ఉండేవారు? ఏమీ చేయకుండానే సంతోషంగా ఉండేవారు. కానీ దారిలో ఎక్కడో మీరు దాన్ని పోగోట్టుకున్నారు. ఎందుకని? మీరు మధ్యలో ఎన్నో ఇతర వస్తువులను - మీ శరీరం, మీ మనస్సులను - మీరుగా భావించడం మొదలుపెట్టారు. మీరు నా మనస్సు అనుకునేది, కేవలం అక్కడా, ఇక్కడా వివిధ సామాజిక పరిస్థితుల్లో ఏరుకొచ్చినదే. మీరు ఎలాంటి సంఘాన్ని చూసారో దానిని బట్టే మనస్సుని పోగేసుకున్నారు.
ఈ బాధకంతటికీ మూలం ఏమిటంటే, మీరు కాని వాటితో మీరు గుర్తింపు ఏర్పరచుకున్నారు.
ప్రస్తుతం మీ మనస్సులోని అన్ని విషయాలూ, మీరు ఎక్కడో పోగేసుకున్నవే. ఈ చెత్తంతా మీరు జన్మతః తెచ్చుకున్నది కాదు. అక్కడా, ఇక్కడా పోగేసుకున్న చెత్తని “ఇదే నేను” అని భావించడం మొదలు పెట్టారు. ఈ అపోహ బాగా ముదిరి మీకు చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. “ఇదే నేను” అని మీరు అనుకోనంత వరకూ, మీరు ఏ చెత్తను పోగేసుకున్నా పరవాలేదు. ఈ శరీరం మీరు కాదు, దీన్ని మట్టినుండి పోగేసుకున్నారు. మీరు ఓ చిన్న శరీరంతో పుట్టారు, మీ తల్లిదండ్రులు మీకిచ్చినది. మీరు మొక్కలూ, జంతువులూ తిని ఇలా పెరిగారు. మీరు దీన్ని మట్టినుండి అరువుదెచ్చుకున్నారు, ఇది మీది కాదు. మీరు దీన్ని కొన్నాళ్లు వాడుకోగలరు, కాబట్టి అనుభవించి పొండి. కానీ “ఈ శరీరం నేనే” అనే అపోహలో మీరు ఎంత మునిగిపోయారంటే, మీరిలా దుఃఖపడడంలో ఆశ్చర్యం లేదు. మీ దుఃఖాలకు మూలం మీరు అసత్యంలో నాటుకుపోవడం. మీరు కాని దానితో, మీరు చాలా గాఢంగా గుర్తింపు ఏర్పరచుకున్నారు.
మీరు కానిదాన్ని తీసివేయడం
ఆధ్యాత్మిక ప్రక్రియ మొత్తం, మీరు కాని దాని నుంచి మీ గుర్తింపు రద్దు చేసుకోవడమే. అసలు మీరేమిటో మీకు తెలియనప్పుడు, దానిని మీరు ఎలా వెతకగలరు? ఒకవేళ మీరు వెతికే ప్రయత్నం చేస్తే, మీ ఊహలు గుర్రాల్లా పరుగెడతాయంతే. “నేనెవరు?” అని మీరు ఆలోచించడం మొదలు పెడితే, ఎవరో వచ్చి మీరు దేవుని బిడ్డనో, దెయ్యం బిడ్డనో, చెప్పిబోతారు. ఇంకెవరో వచ్చి ఇంకేదో చెప్పి పోతారు. ఆలా అంతంలేని మూఢనమ్మకాలూ, దానితో వూహలకు పగ్గాలు ఉండవు. మీరు చేయగలిగినది ఒక్కటే, మీరు ఏది కాదో దాన్ని “ఇది నేను కాదు” అని గుర్తించడం. అలా మీరు కాని వటన్నిటినీ మీరు తీసివేస్తే, చివరకు మీరు తీసివేయలేనిది మిగులుతుంది. మీరు ఆ స్థితికి చేరుకున్నప్పుడు, ఈ లోకంలో దుఃఖానికి తావులేదని తెలుసుకుంటారు.
ప్రేమాశీస్సులతో,